ముంబయి 26/11 దాడులు: కసబ్‌ను కోర్టులో గుర్తించిన తొమ్మిదేళ్ళ బాలిక దేవిక జీవితం ఇప్పుడు ఎలా ఉంది?

2009లో కసబ్‌ను గుర్తించేందుకు కోర్టుకు వచ్చిన సమయంలోని తన ఫొటోను చూపిస్తున్న దేవిక రొటావన్

ఫొటో సోర్స్, SANKHADEEP BANERJEE

ఫొటో క్యాప్షన్, 2009లో కసబ్‌ను గుర్తించేందుకు కోర్టుకు వచ్చిన సమయంలోని తన ఫోటోను చూపిస్తున్న దేవిక రొటావన్
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ఇండియా కరస్పాండెంట్

26 నవంబర్ 2008లో జరిగిన ముంబయి దాడుల్లో ప్రాణాలతో బయటపడిన సమయంలో దేవిక రొటావన్ వయసు తొమ్మిదేళ్లు.

ఈ దాడులకు పాల్పడిన వారిలో ప్రాణాలతో పట్టుబడిన మొహమ్మద్ అజ్మల్ కసబ్‌ను ఆమె కోర్టు సమక్షంలో గుర్తించింది.

పదిహేనేళ్ల తరువాత ఆమె జీవితం ఎలా ఉందో, ఈ దాడులు ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చాయో తెలుసుకున్నారు బీబీసీ ఇండియా కరస్పాండెంట్ సౌతిక్ బిస్వాస్. ఆయన అందిస్తున్న కథనం..

ముంబయిలోని మురికివాడలో నివసిస్తున్న దేవిక రొటావన్‌ను తొలిసారిగా నేను 2010లో కలిశాను. 26/11 దాడుల నుంచి బయటపడి రెండేళ్లవుతున్న సందర్భంలో ఆమెను కలుసుకుని మాట్లాడాను.

మరో నెలలో తన 10వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న దేవిక, 26వ తేదీ నవంబర్ 2008లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో ఉన్న సమయంలో కసబ్ చేతిలో దాడికి గురైంది. అతడు దేవిక కాలిపై కాల్చాడు.

ఈ స్టేషన్‌లో కసబ్ కురిపించిన బుల్లెట్ల వర్షానికి ఏకంగా 50 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది గాయపడ్డారు.

కోర్టు రూంలో జరిగిన ట్రయల్‌లో కసబ్‌ను గుర్తించిన అతిపిన్న వయస్కురాలు దేవిక.

న్యాయస్థానంలో ప్రమాణం చేశాక, వారు అడిగిన ప్రశ్నలకు కలవరపాటుకు గురవకుండా సమాధానాలు చెప్పింది.

‘కసబ్‌ను గుర్తించి బాలిక’ అంటూ మీడియా దేవికపై కథనాలు రాసింది.(2010లో కసబ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. రెండేళ్ల తరువాత పుణెలో కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేశారు)

కసబ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముంబయి దాడులకు పాల్పడిన వారిలో ప్రాణాలతో పట్టుబడిన కసబ్

2010లో నేను దేవికను కలిసినప్పుడు ఎక్కువ నవ్వు, తక్కువగా మాట్లాడే సిగ్గరిగా నాకు కనిపించింది. కర్ర సాయంతో నడుస్తోంది. ఆమె సోదరుడు జయేష్ ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. మంచంపై పడుకుని ఉన్నాడు. ఆమె తండ్రి నట్వర్‌లాల్ డ్రైఫ్రూట్ వ్యాపారి. కానీ, అంతా కోల్పోయి, భవిష్యత్తుపై ఆందోళనతో కనిపించాడు. వారుండే ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ, ట్రంకుపెట్టే, కొన్ని వస్తువులు తప్ప మరేం లేవు.

“నేను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్‌నవుతా” అని దేవిక నాతో చెప్పింది.

13 ఏళ్ల తర్వాత, దేవిక 25 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సమయంలో మరోసారి ఆమెను సంప్రదించాను.

ఇప్పుడు కూడా అదే నవ్వుతో కనిపించింది. అప్పుడు సిగ్గరిగా అనిపిస్తే, ఇప్పుడు ఆత్మవిశ్వాసం నిండిన యువతిగా కనిపించింది.

ప్రస్తుతం దేవిక కుటుంబం ముంబయిలోని చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.

ఇన్నేళ్లూ ఆమె విరామమే లేకుండా తన జీవితాన్ని రిపోర్టర్లు, టీవీ కార్యక్రమాలు, పోడ్‌కాస్ట్, సమావేశాల్లో వివరిస్తూనే ఉంది.

మరోసారి తనకు ఎదురైన ఆ గతాన్ని గుర్తుచేసుకుంది.

“ఆరోజు రాత్రి మేం పుణెకు వెళ్లే రైలు కోసం స్టేషన్‌లో ఎదురుచూస్తున్నాం. కాల్పుల శబ్దం విని, అటువైపు చూశాను. భయమే లేని ఓ యువకుడు పెద్ద తుపాకీ పట్టుకుని అన్నిదిశల్లోనూ కాల్పులు జరుపుతున్నాడు. అప్పుడు నేను పరిగెత్తాను. ఓ బుల్లెట్ నా కుడి కాలికి తగిలింది” అని చెప్పింది దేవిక.

దాడిలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 65 రోజులు ఆసుపత్రిలో ఉన్న దేవికకు ఆరు సర్జరీలు చేశారు.

ఈ దాడి తరువాత, తన 11వ ఏట స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం మొదలైంది. స్కూల్ అడ్మిషన్ కూడా అంత సులభంగా దొరకలేదు. దేవికకు అడ్మిషన్ ఇస్తే, ఇతర విద్యార్థులకు ముప్పు ఏర్పడొచ్చని భావించిన స్కూల్ యాజమాన్యం తొలుత ముందుకు రాలేదు.

2009 జూన్‌లో స్పెషల్ కోర్టు ఎదుట ముంబయి దాడులకు పాల్పడిన వారిలో ఒకరైన కసబ్‌ను గుర్తించింది దేవిక.

“నా వేలుని అతడి వైపు చూపించాను. అతడు నన్ను చూసి, తలదించుకున్నాడు” అని చెప్పారు.

దేవిక జీవితంలోని గతం, భవిష్యత్ రెండూ 26/11 దాడులతోనే ప్రభావితమయ్యాయి.

దేవిక రొటావన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తుపాకీ కాల్పుల్లో గాయపడిన దేవికకు ఆరు ఆపరేషన్లు జరిగాయి. 65 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నారు.

ముంబయి నగరం క్రమంగా ఆ దాడుల నుంచి బయటపడినా, ఆ ఛాయలు అలానే ఉన్నాయి.

దేవిక తన ఇన్‌స్టాగ్రాం, ట్విటర్ ఖాతాలను దేవిక రొటావన్ 26/11 అన్న హ్యాండిల్ పేరును పెట్టుకున్నారు.

ఫేస్‌బుక్‌లో తనని తాను ముంబయి దాడి బాధితుల్లో అతిపిన్న వయస్కురాలిగా చెప్పుకుంది. ఇన్‌స్టా రీల్స్‌లో రహత్ ఫతె అలీ ఖాన్ పాటలకు డ్యాన్స్ వేస్తున్నవి, తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. కార్యక్రమాలకు హాజరైన ఫొటోలను కూడా పంచుకుంది.

ఆమె ఇంట్లో 26/11కు సంబంధించినవి కొన్ని జ్ఞాపకాలు గోడపై ఉన్నాయి. వాటిలో కొన్ని ఆమె ధైర్యసాహసాలను ప్రశంసించే సర్టిఫికెట్లను ఫ్రేమ్ కట్టించుకుని గోడకు తగలించి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ గతేడాది ముంబయికి వచ్చిన సమయంలో ఆయనతో కలిసి దిగిన ఫొటో కూడా ఉంది.

లివింగ్ రూంలో తనకు వచ్చిన ట్రోఫీలన్ని వరుసగా పేర్చి ఉన్నాయి. ఇతర బహుమతులు కూడా ఉన్నాయి.

అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి 26/11 సర్‌వైవర్‌గా అతిథిగా పాల్గొన్న సమయంలో తీయించుకున్న ఫొటో కూడా ఉంది.

భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి మీడియా దేవికను స్పందించాల్సిందింగా కోరుతుందని దేవిక చెప్పింది.

“కొన్ని సందర్భాల్లో నన్ను స్పందించమని కోరినప్పుడు వింతగా ఉంటుంది” అని చెప్పింది. అయినప్పటికీ వీటిపై అవసరం మేరకు స్పందిస్తుంది.

“మీ జీవితంలో మీరేం చేసినా, చివరికి సంతోషంగా ఉండేలా చూసుకోండి” అని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో రాసుకుంది దేవిక.

కానీ, దేవిక కుటుంబంలో సంతోషాలు అంత సులభంగా దక్కడం లేదు. ఇతరుల లాగానే, వేగంగా మారుతున్న ముంబయి లాంటి పెద్ద నగరంలో సవాళ్లతో కూడిన జీవితం గడుపుతోంది దేవిక కుటుంబం.

దేవిక రొటావన్

ఫొటో సోర్స్, SANKHADEEP BANERJEE

ఫొటో క్యాప్షన్, దేవిక పోలీసు శాఖలో చేరాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

12 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది దేవిక కుటుంబం. రెండుకోట్లకు పైగా జనాభా ఉన్న ముంబయి లాంటి నగరంలో జనసాంద్రత అధికంగా ఉంది. ఖర్చులు వేగంగా పెరుగుతున్న తరుణంలో దేవిక కుటుంబం ఆరు నెలల క్రితమే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది.

270 చదరపు అడుగులు ఉన్న ప్లాట్‌లో నెలకు రూ.19 వేల అద్దె చెల్లిస్తున్న తమకు ఆర్థిక వనరులన్ని వేగంగా ఖర్చయిపోతున్నాయని దేవిక చెప్పింది.

తనకు వచ్చిన సెలబ్రెటీ స్టేటస్ నిజానికి ఆమె జీవితంలో పెద్ద మార్పేమీ తీసుకురాలేదు.

60 ఏళ్ల నట్వర్‌లాల్ చేస్తున్న డ్రైఫ్రూట్ వ్యాపారం 26/11 దాడుల తర్వాత మూతబడింది. అప్పుడు అనారోగ్యంతో ఉన్న సోదరుడు జయేష్ ఇప్పుడు పనిచేయగలుగుతున్నాడు. కొన్ని నెలల క్రితమే ఆఫీస్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించాడు 28 ఏళ్ల జయేష్.

ప్రభుత్వం ప్రకటించిన రూ. 13 లక్షల సాయాన్ని ఎనిమిదేళ్లలో రెండు విడతల్లో పొందింది దేవిక.

స్కూల్ చదువు పూర్తయ్యాక టీబీ బారిన పడి, చదువు కొనసాగించడానికి ఆటంకం కలిగింది.

ఇల్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నుంచి ఆ సాయం కోసం కోర్టుల్లో పోరాడుతోంది దేవిక. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి సాయం చేస్తున్న ప్రైవేట్ సంస్థ దేవిక కాలేజీ ఫీజులను చెల్లించింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తన తండ్రితో కలిసి రాహుల్ గాంధీ జోడోయాత్రలో పాల్గొన్న దేవిక

రాహుల్ గాంధీ వెంట నడిచిన దేవిక

ఈ ఏడాది జనవరిలో, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు జోడో యాత్రలో పాల్గొంది దేవిక. తన స్వస్థలమైన రాజస్థాన్‌లో తన తండ్రితో కలిసి రాహుల్ గాంధీ వెంట నడిచింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేవికకు చిన్న ప్లాట్ కూడా కేటాయించింది.

వచ్చే ఏడాదిలో పొలిటికల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో బ్యాచ్‌లర్ డిగ్రీని పూర్తిచేసుకుంటున్న దేవిక, పోలీసుశాఖలో చేరాలనుకుంటున్న తన కలను నెరవేర్చుకోనే ప్రయత్నంలో పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పింది.

“కొన్ని నెలలుగా ఉద్యోగం కోసం కూడా ప్రయత్నిస్తున్నాను కానీ సరైనది దొరకలేదు. ముంబయి లాంటి ఖరీదైన నగరంలో జీవించాలంటే ఆందోళనగా ఉంది” అన్నారు.

ముంబయి మారణకాండ జరిగిన పదిహేనేళ్ల తరువాత కూడా దేవిక కుటుంబానికి చిన్న మొత్తంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంస్థల నుంచి సాయం అందుతోంది.

“దేవికను ఆహ్వానించి, ఆమె ప్రసంగం తరువాత సర్టిఫికెట్లు, కొన్నిసార్లు నగదు సాయం చేసే వారు కూడా ఉన్నారు” అని ఆమె తండ్రి తెలిపారు.

“అలాంటి కార్యక్రమాలు వందల కొద్దీ జరిగాయి. అందువల్లే మేం ఇలా జీవిస్తున్నాం” అని చెప్పారు.

“ఈ కార్యక్రమాలు ఎప్పటివరకూ కొనసాగుతాయి? కసబ్‌ను గుర్తించిన బాలిక అన్న ఐడెంటిటీతో జీవితం కొనసాగించడాన్ని ఎలా చూస్తున్నావు?” అన్న ప్రశ్నకు- “ఆ గుర్తింపు నాపై అనుకోకుండా పడింది. అందుకని నేను దాని నుంచి దూరంగా పారిపోలేదు. ఆ గుర్తింపును స్వీకరించాను” అని సమాధానం ఇచ్చింది.

“ఇది కాకుండా నేను మరో గుర్తింపును కోరుకుంటున్నాను. తీవ్రవాదుల నుంచి భారతదేశాన్ని కాపాడే పోలీసు అధికారిణిగా నన్ను చూసుకోవాలని అనుకుంటున్నాను” అని చెప్పింది.

ఆమె ముఖంలో చిరునవ్వు పోలేదు.

ఆమె కలలు కూడా సజీవంగానే ఉన్నాయి, ఆమె నవ్వులానే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)