వాయు కాలుష్యం నియంత్రణలో బీజింగ్ కన్నా దిల్లీ ఎందుకు వెనుకబడింది?

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియాలో జన సాంద్రత అత్యంత ఎక్కువగా ఉండే రెండు రాజధాని ప్రాంతాలను విషపూరిత పొగ కమ్మేస్తోంది. ఇది ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది.

జనాభా రెండు కోట్లకు పైగా ఉండే దిల్లీ, బీజింగ్‌లలో ప్రజలు పొగనే పీల్చుకుంటున్న దుస్థితి.

ప్రాణాంతక పొగమంచు విపత్తుకు బీజింగ్ వాసులు ‘ఎయిర్‌పోకలిప్స్’ అనే పేరు కూడా పెట్టారు.

దిల్లీ నగరంలో ఇప్పుడు పొగమంచు కాలం వచ్చేసింది. అయితే, దిల్లీతో పోలిస్తే బీజింగ్ ప్రజలు కాస్త మెరుగైన గాలిని పీల్చుకోగలుగుతున్నారు.

గతంలో ఇదే స్థాయిలో గాలి కాలుష్యాన్ని ఎదుర్కొన్న బీజింగ్ నగరం ఇప్పుడు మెరుగుపడింది. దిల్లీ మాత్రం ఆ స్థాయిలో కాలుష్యాన్ని కట్టడి చేయలేకపోయింది.

మరి, చైనా రాజధాని బీజింగ్‌లో కాలుష్య నివారణ చర్యలు సత్ఫలితాలనివ్వడానికి కారణమేంటి? దిల్లీలో ఎదురవుతున్న సమస్యలేంటి?

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత కాలుష్య నగరంగా మారిన దిల్లీ

వాతావరణంలో సూక్ష్మ పరిమాణంలో ఉండే పీఎం 2.5 అంటే- పార్టికులేట్ మ్యాటర్ కాలుష్య కణాలు నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. దీనికితోడు వాతావరణంలోకి విడుదలయ్యే ఇతర వాయు ఉద్గారాల ప్రభావం దిల్లీపై తీవ్రంగా పడుతోంది.

ఈ కారణాల వల్ల దిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా మారిపోయింది.

తక్కువ వేగంతో వీస్తున్న గాలులు కాలుష్య కణాలను దిగువ వాతావరణ పొరల్లో నిలిచేలా చేస్తున్నాయి. దీని వల్ల కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారుతోంది. దీనిపై దిల్లీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

కొన్నిరోజులపాటు స్కూళ్లకు తాత్కాలిక సెలవులను ప్రకటించారు. ప్రస్తుతం రోడ్ల మీద తిరిగేందుకు డీజిల్ వాహనాలకు అనుమతులు నిషేధించారు. మరోవైపు భవన నిర్మాణాలను నిలిపేశారు. ఉద్యోగులు చాలా మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. బాణాసంచాను నిషేధించారు. అయితే, ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడం కొన్నిసార్లు కష్టంగా మారొచ్చు.

వాయు కాలుష్యం వలన దిల్లీ ప్రజలు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల వలన వారిలో ఆగ్రహం కూడా ఉంది.

దీపావళి పండుగ రోజైన ఆదివారం రోజున బాణాసంచా నిషేధాన్ని లెక్కచేయకుండా క్రాకర్స్ కాల్చారు.

దీంతో తర్వాతి రోజున, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా దిల్లీ వార్తల్లో నిలిచింది.

గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని చూపించే ఒక ప్రభుత్వ యాప్‌లో, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 520గా నమోదైంది.

ఏక్యూఐ సంఖ్య 50కన్నా తక్కువ ఉంటేనే, గాలి నాణ్యత బాగున్నట్లుగా పరిగణిస్తారు. ఆ లెక్కన దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత పదిరెట్లు కన్నా దిగజారింది.

అదే రోజున బీజింగ్‌లో పరిస్థితి చూస్తే, వివిధ దశల్లో కమాండ్ అండ్ కంట్రోల్ చర్యల ఫలితంగా వాయు కాలుష్యం దిల్లీ ఏక్యూఐలో ఐదో వంతు ఉంది.

బీజింగ్‌‌కు ఎలా సాధ్యమైంది?

బీజింగ్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించే కార్యచరణ ప్రణాళికలో భాగంగా, నూతన బొగ్గు ఆధారిత ప్రాజెక్టుల నిషేధం, నివాస భవనాల్లో బొగ్గు ఆధారిత ఉష్ణ సౌక్యర్య పరికరాల నిలిపివేత, మెరుగైన ఇంధన నాణ్యత, ఇంజన్ ప్రమాణాలతో డీజిల్ ట్రక్కుల వినియోగాన్ని పెంచడం, పాతబడిన వాహనాల నుంచి కాలుష్యాన్ని అదుపు చేయడం వంటి చర్యలు చేపట్టారు.

మరోవైపు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ దూర ప్రయాణాల కోసం ప్రజలు సైకిళ్లను వినియోగించాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.

బీజింగ్ నగరంలో గాలి నాణ్యత మెరుగుపడేందుకు అధికారులు చాలా కష్టపడి పని చేశారని, అయితే దశాబ్ద కాలంగా కేవలం బీజింగ్ నగరానికే ఈ చర్యలు పరిమితం కాకుండా, ఆ పరిధిని దాటి అమలుచేయడంతోనే, ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుని, మంచి ఫలితాలు వచ్చాయని హెల్సింకీ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్‌ సంస్థలోని ఎనలిస్ట్‌ లారీ మైలివిర్టా చెబుతున్నారు.

బీజింగ్‌లో అమలైన ప్రణాళికల గురించి మాట్లాడుతూ, "పార్రిశ్రామిక వాడలు, నగర పరిసరాల్లో వాయు ఉద్గారాల విడుదలకు కారణమయ్యే ప్రధాన కేంద్రాలను కలిపి 'కీ కంట్రోల్ రీజియన్‌'గా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవడం వలన మరింత ప్రభావవంతమైన ఫలితాలను సాధించారు" అన్నారు. దీనితోపాటు వాయు కాలుష్యంపై పోరాటంలో బీజీంగ్ బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. 2013లో 43 కోట్ల డాలర్ల నుంచి 2017లో 2.6 బిలియన్ డాలర్లకు ఈ బడ్జెట్ కేటాయింపు పెరిగింది.

యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎనర్జీ పొల్యుషన్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసే - ద ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లెక్కల ప్రకారం, చైనా మెరుగైన ఫలితాలను సాధించింది. బీజింగ్‌లో వాయు కాలుష్య స్థాయి దాదాపుగా యాభై శాతం తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల్లో 2013 నుంచి పోల్చిచూస్తూ, దాదాపుగా 40 శాతం తగ్గుదల కనిపించింది.

"2013 సమయంలో వాయు కాలుష్య సూచీల్లో బీజింగ్ అత్యధిక కాలుష్య స్థాయిలను నమోదు చేసేది. కానీ అక్కడ పరిస్థితిలో గణనీయ మార్పులొచ్చాయి. బొగ్గు వినియోగాల నుంచి గ్యాస్, గ్యాస్ నుంచి పునరుత్పాదక విద్యుదుద్పత్తికి మారేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. అక్కడ పెట్రోలు వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడం తేలిక" అని ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో పని చేస్తున్న చైనా ఎనలిస్ట్ చిమ్ లీ చెప్పారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో కొంతమేర ఫలితాలు..

వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో రెండు దశాబ్దాల దిల్లీ ప్రయత్నాలు కూడా కొంతమేర ఫలితాలనిచ్చాయని నిపుణులు అంటున్నారు.

కాలుష్యకారక పరిశ్రమలను తరలించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసేశారు. నేచురల్ గ్యాస్‌తో నడిచే ప్రజా రవాణా వ్యవస్థను మొదలుపెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రవాణా వ్యవస్థల్లో ఒకటి.

పాత కమర్షియల్ వాహనాలను రోడ్లమీదకు రాకుండా నిలిపేశారు. ఉద్గారాలను అదుపు చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అత్యంత సమర్థవంతంగా పనిచేసే మెట్రో వ్యవస్థను అభివృద్ధి చేశారు.

అయితే, ఈ చర్యలతో నగరంలోని గాలి నాణ్యత మెరుగుపడిందా అన్న ప్రశ్న వస్తే?, అవును అంటున్నారు అనుమితా రాయ్ చౌధురి. ఈమె దిల్లీ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పని చేస్తున్న వాయు కాలుష్య నిపుణురాలు.

ఆమె మాట్లాడుతూ, "దిల్లీలో సుదీర్ఘకాల గాలి నాణ్యత సూచీలను పరిశీలిస్తే, ఒక్కో ఏడాది కాలుష్య స్థాయి పెరుగుదల తగ్గుతోంది. అంటే ఈ సమస్యను పెరగనివ్వకుండా దిల్లీ నిలువరించింది. అలానే పీఎం 2.5 స్థాయిని కూడా దిల్లీ మరో 60 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నగరంలో నాణ్యమైన గాలి ప్రమాణాలను అందుకోగలరు" అని అనుమితా అంటున్నారు.

అయితే, సమగ్ర ప్రణాళికలో లోపాలు, విధాన రూపకల్పనలో తప్పిదాలు, పక్షపాత రాజకీయాల కారణంగానే వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో దిల్లీ తడబడుతోందని నిపుణులు అంటున్నారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

వాయు కాలుష్యానికి ఇవే కారణాలు..

అయితే దిల్లీ కాలుష్యంలో వాహనాలు విడుదల చేసే ఉద్గారాల శాతమే సగం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో బొగ్గు వినియోగ పరిశ్రమలున్నాయి. తర్వాత భవన నిర్మాణ పనుల నుంచి వచ్చే వ్యర్ధాలు, దుమ్ము కారణాలుగా ఉన్నాయి.

శీతాకాలంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట కోతల సమయంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం కూడా పావుశాతం దిల్లీ కాలుష్యానికి కారణం. అయితే, అది కూడా గాలి వేగం, దిశల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది.

పాత వాహనాలను నిషేధించడంతో దిల్లీ రోడ్లమీద మొత్తంగా కార్ల సంఖ్య తగ్గి 80 లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య 2015తో పోలిస్తే, మూడో వంతు కన్నా ఎక్కువ తగ్గింది.

అయినా కూడా వాహన ఉద్గారాలే దిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉంది. దిల్లీ అర్బన్ డిజైన్, పాదచారులకు, సైక్లింగ్ చేసే వారి కన్నా కూడా, కార్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.

దాదాపుగా 400 కిలోమీటర్ల పొడవుండే దిల్లీ మెట్రో నెట్‌వర్క్, ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే మెట్రో నెట్‌వర్క్‌. కానీ, చిట్టచివరి ప్రాంతాలకు , పని ప్రాంతాలకు చేరడంలోనూ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.

అయితే, దిల్లీలోని 7,000 బస్సుల్లో దాదాపు 14 శాతం బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలే. కానీ, అసౌకర్యాల వలన ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతోంది.

దిల్లీలో 80 శాతం మోటారు వాహనాల ప్రయాణాలను ప్రజా రవాణా వ్యవస్థలోకి తీసుకురావాలని దిల్లీ మాస్టర్ ప్లాన్ లక్ష్యంగా పెట్టుకున్నా, మెట్రో, బస్సు వ్యవస్థల మధ్య సరైన సమన్వయం లేక ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, AFP

ఒక్క దిల్లీ నగరమే కాదు.. బిహార్ కూడా..

"మీ దగ్గర పరిష్కారం ఉన్నప్పటికీ, అమలు సాధ్యపడటం లేదంటే, రూపకల్పన సరిగా జరగలేదు" అని రాయ్ చౌధురి అన్నారు.

ప్రాంతీయ ప్రణాళిక కూడా కొంతమేర అడ్డంకిగా మారుతోంది. దిల్లీలో కాలుష్యంపై అంతటా చర్చ జరుగుతున్నప్పటికీ, గంగా నదీ పరీవాహక నగరాలు, ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా పొగ కమ్మేస్తోంది.

తరచుగా దిల్లీ కంటే బిహార్‌‌ వాయు కాలుష్యపు స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ, చర్చ మాత్రం పరిమితంగానే ఉంది.

ఈ విషయంపై అనుమితా మాట్లాడుతూ, "కేవలం దిల్లీ గురించి మాత్రమే కాదు. అన్ని ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యంపై చర్చ జరగాలి" అన్నారు.

సరిగ్గా ఈ అంశంలోనే బీజింగ్ సరైన దిశగా అడుగులు వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2017 నాటికి పావుశాతం కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా. అందుకు తగ్గ ప్రాంతీయ ప్రణాళికను అమలు చేసింది. బీజింగ్ సరిహద్దు ప్రాంతాలూ ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

అయితే 2013 నుంచి 2017 మధ్య కాలంలో బీజింగ్‌లోని కాలుష్యంలో 35 శాతం తగ్గుదల నమోదైంది. బీజింగ్ సరిహద్దు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలో 25 శాతం తగ్గుదల నమోదైంది. ప్రపంచంలో మరే ప్రాంతం కూడా కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఇంత గణనీయ స్థాయిలో ఫలితాలను సాధించలేదని ఐక్యరాజ్య సమితి సమీక్ష పేర్కొంది.

బొగ్గు, డీజిల్ వినియోగంలో దిల్లీ కన్నా బీజింగ్ చాలా వేగంగా దూరం జరిగింది.

"బీజింగ్ అమలు చేసిన నిర్ణయాలు భారత్ లాంటి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో తీసుకోవడం అంత సులభం కాదని రాయ్ చౌధురి" అంటున్నారు.

అమెరికా, యూరోపియన్ నగరాలు ఏవిధంగా వాయుకాలుష్యాన్ని తగ్గించుకున్నాయో గమనించాలను ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే, కాలుష్య నియంత్రణలో బీజింగ్ మంచి పురోగతి సాధించినప్పటికీ, లాస్ ఏంజిల్స్‌తో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువగానే ఉంది. లాస్ ఏంజిల్స్‌ నగరం అమెరికాలోని అత్యధిక కాలుష్య నగరంగా ఉంది .

‘’దిల్లీకి సమయం లేదు. మరో ఐదేళ్లలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. దిల్లీ, ఇండియా, కాలుష్య విఘాత చర్యలకు సిద్ధం కావాలి ’’ అని రాయ్ చౌధురి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)