బ్యూటీ ఇండస్ట్రీని ‘సెక్సిస్ట్’ అని కాస్మెటిక్స్ వ్యాపారి హుడా కట్టన్ ఎందుకు విమర్శిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమేలియా బటర్లీ
- హోదా, బీబీసీ 100 విమెన్
హుడా కట్టన్ బయటకు వచ్చినప్పుడు హాలీవుడ్ తారల తరహాలో ఆమెను అభిమానులు చుట్టుముడుతుంటారు.
తన కాస్మెటిక్ బ్రాండ్ ‘హుడా బ్యూటీ’ పదో వార్షికోత్సవంలో భాగంగా పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు దగ్గరల్లో ఒక భవనాన్ని ఆమె అద్దెకు తీసుకున్నారు. లోపల మొత్తానికి ఆమె గులాబీ రంగు అద్దారు.
ఎటు చూసినా తన బ్రాండ్ ప్రొడక్టులతో మేకప్ స్టేషన్లు, అందమైన అమ్మాయిలే కనిపిస్తున్నారు.
హుడా వచ్చిన వెంటనే గట్టిగా అరిచేందుకు అభిమానులు వీధిలో ఎదురుచూస్తున్నారు. భవనం లోపల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, మేకప్ ప్రొఫెషనల్స్ ‘‘హు-డా, హు-డా, హు-డా’’ అని ఆమె పేరును జపిస్తున్నారు.
ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రజలు వరుసకట్టారు. ఆమె హత్తుకున్న వెంటనే కొందరు సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు.
మొదట్నుంచీ చివరి వరకూ హుడా మొహంపై చిరునవ్వు వికసిస్తూనే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి నింపే, ప్రభావవంతమైన మహిళల పేర్లతో ఈ ఏడాది బీబీసీ సిద్ధంచేసిన 100 విమెన్ జాబితాలో హుడా కట్టన్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, HUDA KATTAN
రూ.8,331 కోట్ల విలువైన కాస్మెటిక్ బిజినెస్
బిలియన్ డాలర్ల (రూ.8,331 కోట్ల) విలువైన కాస్మెటిక్ బిజినెస్‌ను హుడా నడిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది అతిపెద్ద మేకప్ బ్రాండ్. సంస్థ పేజీకి 50 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.
అయితే, బ్యూటీ ఇండస్ట్రీ, సోషల్ మీడియాను హుడా అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు.
‘‘బ్యూటీ ఇండస్ట్రీని సెక్సిస్ట్‌గా నేను భావిస్తున్నాను. మహిళలను చాలాసార్లు ఇది కించపరుస్తుంది. మహిళలకు కేవలం వారి అందాన్ని బట్టే గౌరవం ఇస్తుంది’’ అని హుడా అన్నారు.
‘‘అందంగా తయారయ్యేందుకు నేను ఇష్టపడతాను. అయితే, కేవలం ఎలా ఉన్నామో చూసి మనపై ఒక అంచనాకు వస్తే, చాలా చిరాకుగా అనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.
‘‘తొలి పరిచయంలోనే ఎవరెలాంటివారో వెంటనే ఒక అవగాహనకు వచ్చేయడం చాలా తప్పు. ఈ విషయంలో నేను కూడా చాలా మారాలి’’ అని ఆమె అన్నారు.
మొదట్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు, తనను ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకోదని ఆమె భావించారు.
‘‘నేను చాలా కష్టపడ్డాను’’ అని ఆమె చెప్పారు.
‘‘కొన్నిసార్లు మీటింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది నా కళ్లలోకి చూడకుండా మా ఆయన వైపు చూస్తారు. అసలు నన్ను పట్టించుకోరు’’ అని ఆమె తెలిపారు.
‘‘నాతో మాట్లాడొద్దు. ఆమెతో మాట్లాడండి’’ అని తన భర్త చెబుతుంటారని, కానీ ఆయనతోనే ఎక్కువ మంది మళ్లీ మాట్లాడుతుంటారని హుడా చెప్పారు.
అందరినీ కలుపుకుంటూపోవడం, బలహీన సముదాయాలకూ ప్రాతినిధ్యం కల్పించడంలో బ్యూటీ ఇండస్ట్రీలో పురోగతి చాలా నెమ్మదిగా ఉందని ఆమె అన్నారు.
ఇరాక్ నుంచి అమెరికాలోని టెనెస్సీకి వలస వచ్చిన కుటుంబంలో హుడా పెరిగారు. చిన్నప్పుడు తనంత అందంగా ఉండేదాన్ని కాదని ఆమె భావించేవారు.
భిన్న రకాల చర్మం రంగులకు సరిపోలేలా ముదురు రంగులోని ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురావడం తన తొలి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నానని ఆమె చెప్పారు. ఇండస్ట్రీ కూడా ఇదే బాటలో వెళ్తున్నప్పటికీ, పురోగతి మాత్రం నత్త నడకన సాగుతోందన్నారు.
‘‘తయారీదారులను ల్యాబ్‌లలో కలిసినప్పుడు, ‘కాస్త ముదురు రంగులకు సరిపోయే ప్రొడక్టులు కావాలి. దీని కోసం నల్ల రంగును కలపండి. ఎందుకంటే ప్రజల్లో చాలా రంగుల వారుంటారు’ అని చెప్పేదాన్ని’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
‘‘ఈ విషయంలో ఇంకా అవగాహన లోపం ఉంది. కొంత మంది తయారీదారులు, కొన్ని బ్రాండ్లు దీన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హుడా విజయానికి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఒక కారణం. తన అకౌంట్‌లో మేకప్ ట్యుటోరియల్స్, రివ్యూలతోపాటు దుబయ్‌లోని ఇంట్లో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన క్షణాలను కూడా ఆమె పోస్ట్ చేస్తుంటారు.
బ్యూటీ బ్లాగర్‌గా మొదలైన ఆమె ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. మొదట్లో ఆమె సోషల్ మీడియాను చాలా ఇష్టపడేవారు.
‘‘నా జీవితంలో అదే బెస్ట్ అనుకునేదాన్ని. ఎందుకంటే అందరూ స్పందించేందుకు అది వీలు కల్పించేలా అనిపించేది. ఒకరితో ఒకరిని కలిపేలా అది ఉండేది’’ అని ఆమె చెప్పారు.
కానీ, ఇప్పుడు స్క్రీన్‌కు కళ్లను అతికించే ఒక జిగురులా సోషల్ మీడియాను ఆమె చూస్తున్నారు. ఒక్కోసారి సోషల్ మీడియాపై ఆమెకు విరక్తి కూడా వస్తుంటుంది.
‘‘సోషల్ మీడియాలో జనాలు చెప్పేవాటితో నేను ఏకీభవిస్తానా? లేదు. భవిష్యత్తుకు అది మేలు చేస్తుందా? లేదు...’’ అని ఆమె అన్నారు.
‘మహిళలపై అన్యాయమైన అంచనాలు’
హుడా చెబుతున్న సమస్యల్లో ప్రధానమైనది ఏమిటంటే.. అన్నింటా మహిళలు సంపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడి.
‘‘మహిళలపై సమాజం చాలా ఒత్తిడి చేస్తోంది. నేడు అది సోషల్ మీడియాకూ విస్తరించింది. ఆ అంచనాలు చాలా అన్యాయమైనవి’’ అని ఆమె అన్నారు.
‘‘నేను సోషల్ మీడియాలో తెరచినప్పుడు, ఒక్కోసారి నేను అందంగా లేననే భావన కలుగుతుంది. అసలు ఎప్పటికీ నేను అందంగా మారనా? అనే సందేహం కూడా వస్తుంది’’ అని ఆమె చెప్పారు.
ఈ సమస్యకు తన ఆలోచనా విధానం కూడా ఒక కారణమని చెబుతూనే, ఇదే సమస్యకు తను బాధితురాలినని కూడా ఆమె అంటున్నారు.
‘‘అందం వల్లే మీకు గుర్తింపు వచ్చేటప్పుడు, మీ అందానికి మీరు బానిస అవుతారు’’ అని ఆమె అన్నారు.
తన గోళ్లు, జుట్టు, ముఖంపై రంగు అంతా అద్భుతంగా ఉండాలని ప్రజలు భావిస్తుంటారు. కానీ, ఒక్కోసారి వాస్తవం దీనికి భిన్నంగానూ ఉండొచ్చని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో తనకు ఎక్కువ మంది అభిమానులు ఉండటంతో, ఒక్కోసారి హుడా ఏం చెప్పినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటారు.
‘‘మన గళం ఎక్కువ మందికి చేరువ అవుతున్నప్పుడు, కొన్ని అంశాలపై గట్టిగా మాట్లాడాలని భావించడం మొదలుపెడతాం’’ అని ఆమె చెప్పారు.
‘‘మహిళలను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడటమంటే నాకు ఇష్టం. ముఖ్యంగా మా కమ్యూనిటీని బాధించే అంశాలపైనా నేను మాట్లాడతాను’’ అని ఆమె వివరించారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ముందుగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 14,500 మందికిపైగా మరణించారు.
ఈ యుద్ధం నానాటికీ తీవ్రం కావడంతో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా హుడా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో ఆమెకు కొన్ని పాజిటివ్ కామెంట్లతోపాటు విమర్శలు వచ్చాయి.
‘‘కొన్ని రాజకీయ అంశాలపై నేను మాట్లాడుతుంటాను. కానీ, నన్ను నేను రాజకీయ విశ్లేషకురాలిగా భావించను’’ అని జులైలో బీబీసీ 100 విమెన్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ‘‘కానీ, ఏదైనా నా దృష్టిని ఆకర్షిస్తే, కచ్చితంగా దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాను’’ అని తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ తాజా ఘర్షణకు ముందు కూడా పశ్చిమాసియా సమస్యలపై ఆమె తరచూ మాట్లాడేవారు. ఇక్కడి అంశాలపై ఎవరూ ఎక్కువ మాట్లాడటంలేదని ఆమె భావిస్తుంటారు.
‘‘కొన్ని విషయాలు చూసినప్పుడు నేను బాధపడుతుంటాను. కొన్నిసార్లు నేను దీన్ని పోస్ట్ చేయొచ్చా, నేను ఒక కోణంలోనే చూస్తున్నానా అని కూడా ఆలోచిస్తుంటాను. కానీ, వీలైనంతవరకూ నేను చేయాల్సింది చేస్తాను’’ అని ఆమె చెప్పారు.
మీ జీవితం ఇంత సంపూర్ణంగా (పర్ఫెక్ట్‌గా) ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే, అలా ఏమీలేదని హుడా సమాధానం ఇస్తుంటారు.
సోషల్ మీడియాలో బలహీన సముదాయాల గొంతు కూడా వినిపించాలని ఆమె భావిస్తున్నారు.
‘‘అసలు ఎక్కడి నుంచి, ఎలా ఇది మొదలుకావాలో తెలియదు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటిది ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ లేకపోతే మనమే వారికి అవకాశం ఇవ్వాలి’’ అని హుడా అన్నారు.
అయితే, తరచూ తన స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకొనేందుకు తాను ప్రయత్నిస్తుంటానని ఆమె చెప్పారు. తన 12 ఏళ్ల పాపను సోషల్ మీడియాకు దూరంగా ఆమె పెంచుతున్నారు.
‘‘కొన్నిసార్లు నా కూతురు నాకు తెలియకుండా సోషల్ మీడియా చూస్తుంది. అయితే, అప్పుడు తనలో పెరిగే ఆందోళనను నేను గమనించగలను’’ అని హుడా చెప్పారు.
తనకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు ప్రజలకు తెలిస్తున్నప్పటికీ, కొన్ని విషయాలను ఆమె ప్రైవేటుగానే ఉంచాలని భావిస్తారు. వీటిలో ఆమె మత విశ్వాసాలు కూడా ఉన్నాయి.
చిన్నప్పుడు మతం గురించి అంత పట్టించుకునేదాన్ని కాదని, కానీ, కాస్త పెద్దయ్యాక తన అభిప్రాయాలు మారాయని ఆమె అన్నారు. ప్రార్థనను అత్యంత అందమైన అనుభూతిగా ఆమె అభివర్ణిస్తున్నారు.
‘‘నేను మతం గురించి ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే దానిపై వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేను’’ అని ఆమె చెప్పారు.
హుడా సంస్థకు ఇప్పుడు పదేళ్లు. దీని ద్వారా ముదురు రంగులోని మహిళల్లోనూ తను స్ఫూర్తి నింపాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
‘‘కొన్నిసార్లు టెనెస్సీలో పెరిగిన ఆ పశ్చిమాసియా ముదురు రంగు అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఆమె లాంటి చాలా మంది ఉన్నారు. నన్ను చూసినప్పుడు తమ లాంటి వారికీ ఈ పరిశ్రమలో చోటు ఉంటుందని చాలా మంది భావించొచ్చు’’ అని ఆమె అన్నారు.
ఇంటర్వ్యూ: నౌరమ్ సల్లాం
వీడియో: మెహెర్ నఖ్లా
ఎడిట్: రెబెకా థార్న్
(బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ కథనం అందిస్తున్నాం.)

ఇవి కూడా చదవండి:
- రైతుబంధు పథకానికి, ఎన్నికల సంఘానికి ఏమిటీ సంబంధం? ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















