ప్రపంచంలో ఖరీదైన మసాలా దినుసు ఇది...ఇంట్లోనే ఎలా సాగు చేసుకోవచ్చంటే...

కుంకుమ పువ్వు సాగు
    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ఒక సీజన్‌లో రూ. 5 లక్షలు సంపాదించాలంటే.. కుంకుమపువ్వు గింజలు, ఖాళీ గది, కొన్నిర్యాక్‌లు, కొన్ని ప్లాస్టిక్ కంటైనర్లు ఉంటే చాలు'

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లోని పఖర్‌పురా గ్రామంలో నివసిస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ రషీద్ ఖాన్ చెప్పిన మాట ఇది.

కుంకుమపువ్వు సాగు చేయడం రషీద్ కుటుంబ వృత్తి కాదు, పఖర్‌పురాలోని భూమి కూడా ఆ సాగుకు తగినది కాదు.

పాలు, కాఫీలలో కుంకుమ పువ్వు ఉపయోగిస్తారు. ఇది కాకుండా సౌందర్య ఉత్పత్తులు, అనేక రకాల ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు.

భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లోని పుల్వామాలో పాంపూర్ పట్టణంలోని పీఠభూమిలో కుంకుమ పువ్వు ఎక్కువగా పండిస్తారు.

అయితే గత కొన్నేళ్లుగా కుంకుమపువ్వు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి, చాలామంది రైతుల పొలాలు బీడుగా మారాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దినుసుగా పిలిచే కుంకుమపువ్వు సాగు తగ్గిపోవడం గమనించారు రషీద్ ఖాన్. దీంతో తన ఇంట్లో విజయవంతంగా పంట సాగు చేశారు.

''కుంకుమపువ్వు పరిశ్రమ అంతరించిపోతోందని రోజూ టీవీల్లో చూసేవాడిని, వార్తాపత్రికల్లో చదివేవాడిని. దీంతో ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నిపుణులను సంప్రదించి విత్తనాలు కొనుగోలు చేశాను, గదిలో పెంచాను. ఈ రోజు కుంకుమపువ్వు పంటను మీరు చూస్తున్నారు" అని రషీద్ అన్నారు.

ఇండోర్‌లో కుంకుమపువ్వు సాగు చేయడం వల్ల మంచి అదనపు ఆదాయం లభిస్తుందని, పెద్ద విస్తీర్ణంలో పొలాలు అవసరం లేదని రషీద్ చెబుతున్నారు.

''దీని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఉష్ణోగ్రతను మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి, తేమ తగ్గితే గోడపై నీళ్లు చల్లి తేమను కాపాడుకోవాలి. ఇపుడు మన అతి ముఖ్యమైన పంట అంతరించి పోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా చేస్తే డబ్బు కూడా వస్తుందనేది సంతృప్తినిస్తోంది" అని అంటున్నారు రషీద్.

కుంకుమ పువ్వు సాగు

ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు?

పాంపూర్ నివాసి అబ్దుల్ మజీద్ కుటుంబం మూడు శతాబ్దాలుగా కుంకుమ పువ్వు పంట సాగు చేస్తోంది.

అయితే గత కొన్నేళ్లుగా వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా కుంకుమ పువ్వు పంటకు మునుపటి శోభ లేదు.

గత రెండు దశాబ్దాల్లో కుంకుమపువ్వు ఉత్పత్తిలో 60 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు చెబుతున్నారు.

అబ్దుల్ మజీద్ 'ఇండోర్ ఫార్మింగ్' పద్దతిలో కుంకుమ పువ్వు పెంచుతున్నారు, ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారు.

"వాతావరణం మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మేం ఇండోర్ వ్యవసాయం ప్రయత్నించాం. అయితే, ప్రారంభంలో లక్షల రూపాయల విలువైన విత్తనాలు పాడైపోయాయి" అని గుర్తుచేసుకున్నారు మజీద్.

"అప్పుడు మేం అగ్రికల్చర్ యూనివర్సిటీ నిపుణులను సంప్రదించాం, వారు మాకు శిక్షణ ఇచ్చారు, సాయం చేశారు. ఇప్పుడు ఏ రైతు అయినా గదిలో రెండు కిలోల వరకు కుంకుమ పువ్వును పండించవచ్చు, దీని ధర రూ. 6 లక్షల వరకు ఉంటుంది" అన్నారు మజీద్

పంట సాగు కోసం కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వారు చెప్పారు.

"మేం భూమిని ఇస్తాం, వారు పెద్ద గ్రీన్‌హౌస్‌లను సిద్ధం చేస్తారు, అప్పుడు వాతావరణం ఎలా ఉన్నా, పంట దెబ్బతినదు. కొంత సమయం పడుతుంది, కానీ అప్పటి వరకు రైతులు ఇంటి వద్ద వ్యవసాయం చేసుకోవచ్చు" అని మజీద్ అంటున్నారు.

కుంకుమ పువ్వు సాగు

నిపుణులు సూచించిన సలహాలివీ..

అప్పట్లో అంతటా శరదృతువు ప్రారంభమైన వెంటనే పాంపూర్ పొలాల్లో మాత్రం వసంతకాలం మాదిరి కనిపిస్తుండేది. అక్కడక్కడ కుంకుమ పువ్వులు వికసిస్తుండేవి.

కానీ ఇప్పుడు ఆ పొలాలకు మునుపటిలా శోభ లేదు, ఎందుకంటే కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల పంట చాలా తక్కువగా అవుతోంది.

"మేం పొలాల్లో కుంకుమ పువ్వును వదిలేయడం లేదు." అని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బషీర్ అహ్మద్ ఎలాహి చెప్పారు.

"కాలానుగుణ మార్పులను ఎదుర్కోవటానికి ఒక మార్గాన్ని అందించాం, రైతులు ఇండోర్ వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్నారు" అని తెలిపారు.

కుంకుమ పువ్వు విత్తనం (మొక్క) చాలా ఏళ్లు పంటను ఇస్తుందన్నారు బషీర్.

అయితే పంట నుంచి కుంకుమ పువ్వును తీసిన తర్వాత, దాన్ని భూమిలోనే ఉంచాలని, అది మరుసటి ఏడాది కూడా పంటనిస్తుందని ఆయన సూచించారు.

కుంకుమ పువ్వు సాగు

"ఇప్పుడు మనం ఇండోర్ ఫార్మింగ్ ద్వారా విత్తనాలను పండించవచ్చు, వాటిని సంరక్షించగల మరొక ప్రయోగం చేయబోతున్నాం. ఇది విజయవంతమైతే, అప్పుడు భూమి పాత్ర ఎక్కువగా ఉండదు. ఇంటి గదిలోనే కుంకుమ పువ్వు పండించొచ్చు." అని బషీర్ అంటున్నారు.

భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఇండోర్ ఫార్మింగ్ సాధ్యాసాధ్యాలపై పరిశోధనలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

"కానీ, కశ్మీర్ లాంటి వాతావరణం అన్ని చోట్లా ఉండదు. ముంబయి లేదా దిల్లీలో ఇలా చేయాలంటే, గది ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చాలా యంత్రాలను అమర్చాలి" అని బషీర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)