‘ఒక్క సిగరెట్ ముక్క 48 బోట్లను తగులబెట్టింది’...విశాఖ హార్బర్ ప్రమాదం కేసును ఛేదించామన్న పోలీసులు

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల అగ్నిప్రమాదం కేసులో ఘటనకు అసలు కారణాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
వాసుపల్లి నాని, సత్యం(అతని మామ) ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ విలేఖరుల సమావేశంలో తెలిపారు.
సీపీ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం..
''విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్లలో వాసుపల్లి నాని వంట మనిషిగా, అల్లిపిల్లి సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇరువురు మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారు. అల్లిపిల్లి వెంకటేశ్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి, ఫిష్ ప్రై చేసుకొని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరెట్ తాగి పక్కనే ఉన్న 815 నంబర్ బోటుపై సిగరెట్ ముక్కను పడేశారు. బోటులో పొగలు రావడం గమనించిన ఇరువురు, భయపడి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మంటలు ఇతర బోట్లకు వ్యాపించాయి.
ఇరువురిపై ఐపీసీ 437,438, 285 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Vizag police
సీసీ కెమెరాలు పరిశీలించాం
''ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించాం. అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు యూట్యూబర్ నానిని కూడా తీసుకొచ్చి విచారణ చేశాం.
ఆయన ప్రమేయం లేదని తేలితే ప్రొసీజర్ ప్రకారం విడిచిపెట్టే వాళ్లం. కానీ ఈ లోపే వాళ్లు హైకోర్టును అశ్రయించారు. ఈ కేసును ఛేదించడానికి సుమారు 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించాం. ఘటన జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో సెల్ సిగ్నల్స్ ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించాం, విచారణ జరిపాం. ఇన్నిరోజులు ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నాం. నిందితులు సిగరెట్ విసిరేయడంతో నైలాన్ వలలకు నిప్పు అంటుకుంది, మొదట పొగలు మాత్రమే వచ్చాయి. ఆ సమయంలో గాలులు కూడా బాగా వీచడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.
నిందితులు ఆ రోజు ఉదయం నుంచి తాగుతూనే ఉన్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి'' అని తెలిపారు కమిషనర్.

ఫొటో సోర్స్, UGC
ప్రమాదం వల్ల రూ. 8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీపీ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, కమాండ్ కంట్రోల్ ద్వారా హర్బర్ మానిటరింగ్ చేస్తామని హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, UGC
'అన్యాయంగా ఇరికించారు'
బోట్ల దగ్ధం కేసులో నాని, సత్యంలను అన్యాయంగా ఇరికించారని విశాఖ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొందరు మత్స్యకార మహిళలు ఆందోళన చేపట్టారు.
పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు.
వాసుపల్లి నాని, సత్యంలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, UGC
ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే....
వేటకు వెళ్లేందుకు సిద్ధమైన బోట్లు, అలాగే ఇప్పటికే వేటకు వెళ్లి చేపలు, రొయ్యలతో హార్బర్ చేరుకున్న బోట్లు అన్ని లంగరు వేసి ఉన్నాయి.
750 బోట్లు ఉండే విశాఖ హార్బర్ లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 250 వరకు బోట్లు లంగరు వేసి హార్బర్‌లో ఉన్నాయని మత్స్యకారులు చెప్పారు.
అంతకు మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి.
“అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో వేటకు వెళ్లి తీసుకుని వచ్చిన రూ.లక్షల విలువ చేసే చేపలు, రొయ్యలు ఉన్నాయి. ఉదయం వాటిని వేలం వేస్తాం. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందని నాకు రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. పది నిమిషాల్లో నేనిక్కడకు వచ్చాను. అప్పటికే 40 నుంచి 50 బోట్లు కాలిపోతూ కనిపించాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించలేకపోయాం. ఎందుకంటే బోట్లలో వంట కోసం ఉంచుకునే గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో భయం వేసి దగ్గరకు కూడా వెళ్లలేకపోయాం” అని ప్రమాదంలో తన బోటును కోల్పోయిన మత్స్యకారుడు రాజేష్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి
- రైతుబంధు పథకానికి, ఎన్నికల సంఘానికి ఏమిటీ సంబంధం? ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















