'భగ్‌వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?

భగ్‌వా లవ్ ట్రాప్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం మహిళలను వేధిస్తున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.
    • రచయిత, శృతి మీనన్
    • హోదా, బీబీసీ వెరిఫై, దిల్లీ

'లవ్ జిహాద్' - హిందుత్వ వాదులు చెప్పే ఈ వివాదాస్పద సిద్ధాంతానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఏళ్లుగా దేశంలో దీనిపై చర్చ జరుగుతోంది.

ఇప్పుడు దీనికి పోటీగా లేదా వ్యతిరేకంగా మరో వివాదాస్పద సిద్ధాంతం ఆన్‌లైన్ వేదికగా చర్చనీయాంశమైంది. అదే 'భగ్‌వా లవ్ ట్రాప్’.

ఈ సిద్ధాంతానికి సంబంధించి కూడా సరైన ఆధారాలు దొరకనప్పటికీ, ఇది కూడా నిజజీవితంలో ఘర్షణలకు తావిచ్చే మరో సిద్ధాంతంగా మారనుంది.

“ఇది చాలా నీచంగా ఉంది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను” అంటూ ఉత్తర భారతదేశానికి చెందిన మర్యమ్ (పేరు మార్చాం). తనకు ఎదురైన చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు.

ఆమె డాక్సింగ్‌(వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడం)కు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టారు. మర్యమ్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి, హిందువులైన తన స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను సేకరించి, ఆమె మతాంతర సంబంధాలు పెట్టుకుందని ఆరోపించారు. దీంతో ఆమెకు అసభ్యకరమైన సందేశాలతో వేధింపులు మొదలై, బాధితురాలిగా మారారు.

వాస్తవానికి ఆ ఆరోపణలు నిజం కాదు. ఆ ఫొటోల్లో ఉన్న వారు తన స్నేహితులు మాత్రమే అని, మరెలాంటి సంబంధమూ లేదని చెప్పినా సరే, ఆ తప్పుడు ఆరోపణలు మాత్రం ఆగలేదు.

“వారంతా నేను హిందువులతో సంబంధం పెట్టుకున్నాని అన్నారు. నా తల్లిదండ్రులని, నా వ్యక్తిత్వాన్ని దారుణంగా దూషించారు” అన్నారు.

తనను వేధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించాక, తాను 'భగ్‌వా లవ్ ట్రాప్'‌కు బలయ్యానన్న వాదనలను వ్యాప్తి చేయడం వెనుక ముస్లిం పురుషుల ప్రమేయం ఉందని మర్యమ్‌ నమ్ముతోంది.

సాంప్రదాయిక భారతీయ కుటుంబాల్లో మతాంతర వివాహాలు ఇప్పటికీ నిషిద్ధమే.

భగ్‌వా లవ్ ట్రాప్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్‌లో విద్యార్థులపై ముస్లింల బృందం వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఏంటి ఈ 'భగ్‌వా లవ్ ట్రాప్'?

‘భగ్‌వా’ అంటే కాషాయ రంగు అన్న అర్థం వస్తుంది. ఇది హిందుత్వానికి సంబంధించినది. హిందుత్వాన్ని సూచించేలా ఈ ‘భగ్‌వా’ అన్న పదాన్ని వాడుతున్నారు.

ఈ 'భగ్‌వా లవ్ ట్రాప్'ను ముస్లిం మహిళలను వారి మతం నుంచి దూరం చేసేందుకు హిందుత్వవాదులు చేస్తున్న కుట్రగా చెబుతున్నారు. తొలుత ముస్లిం పురుషుల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సిద్ధాంతం నిజమని, అలా జరుగుతోందని వారిలో చాలామంది భయపడుతున్నారు.

ఈ ‘భగ్‌వా లవ్ ట్రాప్’ సిద్ధాంతాన్ని నిజమని నమ్మి, దీని గురించి మాట్లాడుతున్న కొంతమంది సోషల్ మీడియా అకౌంట్ యజమానులను బీబీసీ సంప్రదించింది. ఈ సిద్ధాంతానికి ఉదాహరణలుగా పేర్కొంటూ వారు షేర్ చేసిన సమాచారాన్ని కూడా పరిశీలించింది. అయితే, నిజంగానే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పడానికి ఆధారాలేవీ వాటిలో కనిపించలేదు. కానీ, దీనిపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఈ ఏడాది మార్చి నుంచి ఈ ‘భగ్‌వా లవ్ ట్రాప్’ అన్న పదాన్ని 2 లక్షలసార్లు వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఈ ‘సిద్ధాంత ప్రభావం ఆన్‌లైన్‌కే పరిమితం కాక, వాస్తవంపై కూడా ప్రభావం చూపుతోంది.

ఈ ఏడాది మే నెలలో, మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

అందులో ఇద్దరు వైద్య విద్యార్థులైన ముస్లిం యువతి, హిందూ యువకుడు స్కూటీపై యూనివర్సిటీ నుంచి తిరిగి వెళ్తున్నారు.

ముస్లింలుగా కనిపిస్తోన్న కొంత మంది యువకులు వారిని చుట్టుముట్టారు. తమ మతానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తోందని ఆ యువతిని మందలిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

“నువ్వు ఇస్లాంను తలదించుకునేలా చేయడాన్ని ఎవరూ అనుమతించరు అని వారిలో ఒకరు అరిచారు. అదేసమయంలో మరికొంత మంది హిందూ యువకుడిని దూషిస్తున్నట్లుగా కనిపించింది.

దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన, ఇలాంటి పదిహేనుకు పైగా ఘర్షణల వీడియోలను దేశంలోని బీబీసీ పరిశీలించింది. ఆ వీడియోలు, ఇతర సంఘటనలు ఆ సిద్ధాంతమే నిజమని ఆరోపించేలా ఉన్నాయి. #BhagwaLoveTrap అనే హ్యాష్‌ట్యాగ్‌తో యూట్యూబ్, ఇన్‌స్టా గ్రాం, ఎక్స్‌లలో 10 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు ఉన్నాయి.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Youtube

ఫొటో క్యాప్షన్, 'భగ్‌వా లవ్ ట్రాప్' హ్యాష్ ట్యాగ్‌తో చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి

'లవ్ జిహాద్'

ఈ సిద్ధాంతం 'లవ్ జిహాద్' అని చెప్పే సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది.

ముస్లిం పురుషులు హిందూ మహిళలను ప్రలోభపెట్టి, మత మార్పిడికి పాల్పడుతున్నారని చెప్పేందుకు ఈ 'లవ్ జిహాద్' అనే సిద్ధాంతాన్ని, కొన్నేళ్లుగా హిందూ జాతీయవాదులు ఆన్‌లైన్ వేదికగా వ్యాప్తి చేస్తున్నారు.

అయితే, ఆ సిద్ధాంతం మాదిరిగానే ఇప్పటి 'భగ్‌వా లవ్ ట్రాప్'‌లానే ఈ 'లవ్ జిహాద్' సిద్ధాంతానికి కూడా సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా, వాస్తవంలో మాత్రం ఘర్షణలకు దారి తీశాయి.

భారతదేశంలో మతాంతర వివాహాలు ఇప్పటికీ చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎక్కువశాతం పెద్దలు కుదిర్చిన వివాహాలకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు.

రెండు భారతీయ వార్తా సంస్థలు నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో ఈ 'లవ్ జిహాద్' సిద్ధాంతం నిజంగా ఉందని తెలిపే ఆధారాలేవీ లభించలేదు.

అయినప్పటికీ, 'లవ్ జిహాద్' మాత్రం రాజకీయ చర్చల్లో భాగమైంది. బీజేపీ పార్టీ నుంచి మొదలుకొని, హిందుత్వ భావజాలం ఉన్నవారు కూడా దీని గురించి చర్చించారు.

యోగి ఆధిత్యనాథ్

ఫొటో సోర్స్, HINDUTVA WATCH

ఫొటో క్యాప్షన్, 2007లో ర్యాలీ సమయంలో యోగి ఆధిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల వీడియోలోని దృశ్యం

ఇందులో నిజమెంత?

‘'భగ్‌వా లవ్ ట్రాప్'’ సిద్ధాంతం ఎక్కువగా సోషల్ మీడియాలో, గుర్తింపు లేని అకౌంట్ల నుంచే వ్యాప్తి చేశారు. కానీ, ఉన్నత స్థానాల్లో ఉన్న కొంతమంది ముస్లింలు కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు.

ఇస్లామిక్ స్కాలర్, భారతీయ వార్తా ఛానెల్‌లలో తరచుగా కనిపించే వ్యాఖ్యాత షోయబ్ జమయ్ ఈ ఆలోచనను జాతీయ మీడియాలో ప్రాచుర్యంలోకి తెచ్చింది తానేనని చెప్పుకున్నారు. అయితే, ఈ ఫలితంగా భౌతికంగా చోటుచేసుకుంటున్న దాడులను మాత్రం తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.

"చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులకు నేను మద్దతు ఇవ్వను. ఈ దేశం చట్టాలకు లోబడి నడుస్తుంది" అని ఆయన అన్నారు.

ఈ సిద్ధాంతం నిజమేనని జమయ్ నిస్సందేహంగా నమ్ముతున్నారు. ముస్లిం యువతులను ఉచ్చులోకి దించేలా హిందూ యువకులకు హిందుత్వ బ్రిగేడ్ బ్రెయిన్ వాష్ చేస్తోందని ఆయన ఆరోపించారు.

హిందుత్వ నేతలు ముస్లిం యువతులవైపు వెళ్లాలని హిందూ యువకులను ప్రోత్సహించేలా ఉన్న వీడియోలను ఈ సిద్ధాంతానికి ఆధారంగా చూపిస్తున్నారు జమయ్‌తోపాటు మరికొంత మంది మద్దతుదారులు.

వాటిలో ఒక వీడియోలో బీజేపీ నాయకులు యోగి ఆధిత్యనాథ్ ఉన్నారు.

2007లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, “ఒకవేళ ముస్లింలు ఒక హిందూ యువతిని తీసుకెళ్తే, మనం 100 మంది ముస్లిం యువతులను తీసుకురావాలి” అన్నారు. అందుకు అక్కడున్న వారి నుంచి స్పందన లభించినట్లుగా ఆ వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి ఆధిత్యనాథ్‌ను బీబీసీ బృందం సంప్రదించింది. ఆయన ఇప్పుడు కూడా ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆయన స్పందించలేదు.

బీబీసీ పరిశీలనలో ఏం తేలింది?

షోయబ్ జమయ్‌తోపాటు 'భగ్‌వా లవ్ ట్రాప్'‌ నిజమని నమ్ముతున్న వారిని ఉదాహరణలుగా చూపిస్తూ షేర్ చేసిన 10 వీడియోలను బీబీసీ బృందం పరిశీలించింది.

వాటిలో హిందూ యువకులు ముస్లిం స్త్రీలను మతం మార్పిడి కోసం, వారికి హాని చేయడానికి ఉద్దేశపూర్వకంగా వారితో సంబంధాలు లేదా వివాహ బంధాలు ఏర్పరచుకున్నట్లుగా, వారి సిద్ధాంతాన్ని నిజమని నమ్మేలా ఉన్నాయని వారు భావిస్తున్నారు.

బీబీసీ పరిశీలనలో ఆ పది ఘటనల్లోనూ హిందూ పురుషులు, ముస్లిం మహిళల మధ్య సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు ఘటనల్లో మాత్రం ముస్లిం మహిళలు మతం మార్చుకోలేదని తెలిసింది.

హిందూ పురుషులు మతపరమైన విభేధాల వల్లే తమ భాగస్వాములను హత్య చేశారని పేర్కొన్న ఆరు సంఘటనలు ఉన్నాయి.

ఆర్థిక లేదా గృహ వివాదాలకు సంబంధించినవి నాలుగు కేసులు ఉన్నాయి. ఈ కారణాలే హత్యలకు దారితీశాయని పోలీసు ప్రకటనలు చెబుతున్నాయి.

మరో నాలుగు కేసుల్లో ఆ హింసకు గల కారణాలను వార్తలు లేదా పోలీసు నివేదికల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాలేదు.

అయితే 'భగ్‌వా లవ్ ట్రాప్' సిద్ధాంతానికి ఈ సంఘటనలకు సంబంధం ఉందనడానికి ఆధారాలు లేవు.

'భగ్‌వా లవ్ ట్రాప్' అంటూ ఆరోపిస్తున్న మరికొన్ని వీడియోలను పరిశీలించి, అవి నిజం కాదని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ బూమ్‌లైవ్ తెలిపింది.

హిందుత్వ సంస్థలు కూడా ఈ లవ్ ట్రాప్‌ను కల్పితమని కొట్టిపారేశాయి.

విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్, “ఇలాంటి ట్రాప్‌ను హిందువులు నడిపిస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు” అన్నారు.

జమయ్‌ వంటి స్కాలర్స్ చేస్తున్న ఆరోపణలపై, “వారు ఏం మాట్లాడుతున్నారో, వాటి పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వారికి తెలియదు” అన్నారు.

అయితే, 'లవ్ జిహాద్' ఉందని మాత్రం అలోక్ కుమార్ నమ్ముతున్నారు. “హిందూ యువతులను ఉచ్చులోకి దింపుతున్న పెద్ద ముస్లిం సమూహమే ఉంది” అన్నారు.

రాజకీయ అంశంగా..

ఈ రెండు సిద్ధాంతాలను సమాన ప్రత్యర్థులుగా చూసి, వాటిపై నియంత్రణ కోసం పోరాడుతున్న వారు మాత్రం మరోలా స్పందిస్తున్నారు.

'భగ్‌వా లవ్ ట్రాప్' గురించి రాసిన తొలి జర్నలిస్ట్ ఆమె ఫాతిమా ఖాన్ మాట్లాడుతూ, “'లవ్ జిహాద్'‌కు బలమైన రాజకీయ మద్దతు ఉంది” అన్నారు. దేశంలోని అధికార పార్టీలో ఉన్న కొంతమంది నేతలు 'లవ్ జిహాద్'‌ సిద్ధాంతంపై మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ, “'భగ్‌వా లవ్ ట్రాప్'‌ కొత్తదైన కుట్ర సిద్ధాంతం. ప్రస్తుతానికి రాజకీయ మద్దతు లేదు ” అన్నారు.

దేశంలో చాలా అంశాల మాదిరిగానే ఇది కూడా రాజకీయ ఉద్దేశాలతో కూడుకుని ఉంది. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మతపరమైన విభజనలతో ఇలాంటి సిద్ధాంతాలు ఆన్‌లైన్‌లో ఊపిరిపోసుకుని, వాస్తవ ప్రపంచానికి ముప్పు తెచ్చే విధంగా మారుతున్నాయి.

వేధింపులకు గురైన ముస్లిం మహిళ మర్యమ్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

డాక్సింగ్‌ వలన మర్యమ్ మానసికంగా కుంగుబాటుకు లోనయ్యారు.

ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాను చేస్తున్న పని నుంచి కొన్నాళ్లపాటు విరామం తీసుకున్నారు మర్యమ్.

“నా జీవితంలో మొదటిసారి, నా చుట్టూ ఉన్న పరిసరాలు సురక్షితం కాదని అనిపించింది. కలవరపాటుకు గురై, ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డాను” అన్నారు.

ఆ ట్రోల్స్‌పై ఆమె స్పందిస్తూ, “వారు మహిళల జీవితాలను రక్షిస్తున్నట్లు భావిస్తున్నారు. నిజానికి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు” అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)