తలకు తుపాకీ గురి పెట్టే డ్రగ్స్ మాఫియాను లెక్కచేయని మహిళా ట్రక్కు డ్రైవర్ కథ

ఫొటో సోర్స్, LEIRE VENTAS
- రచయిత, లైర్ వెంటాస్
- హోదా, బీబీసీ 100 ఉమెన్
మహిళలు జాగ్రత్తగా వాహనాలు నడుపుతారని యజమానులు భావిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రక్కు డ్రైవర్లలో మహిళల సంఖ్య కేవలం మూడు శాతమే.
మెక్సికోలో ఆడవాళ్లపై హింస, తలకు తుపాకీ గురిపెట్టి దోపిడీలు చేయడం వంటి ఘటనలు సర్వసాధారణం. వీటి కారణంగా మహిళలు ఈ వృత్తిని ఎంచుకోవడం చాలా కష్టమని నిరూపితం అయింది కూడా.
అలాంటి ప్రమాదాలనూ లెక్కచేయకుండా దేశంలోనే అత్యంత ప్రమాదకర రహదారుల్లో ట్రక్కులు నడుపుతున్న మహిళలతో ‘బీబీసీ 100 వుమెన్’ టీం కలిసి ప్రయాణించింది. వీరిలో ఒకరైన క్లారా ఫ్రాగొసో, ఈ ఏడాది బీబీసీ రూపొందించిన 100 వుమెన్ జాబితాలో ఉన్నారు.
ఒకసారి ఇలా ఊహించుకోండి అని బీబీసీ బృందానికి చెబుతూ, రద్దీగా ఉన్న రహదారి పక్కన పొదల మాటున తలదాచుకున్నారు క్లారా. ''ఇప్పుడు వాళ్లు నన్ను మూడుసార్లు కాల్చేస్తారు. దుప్పట్లో చుట్టేసి పారేస్తారు. ఎవరికీ కనీసం కనపడను కూడా'' అన్నారు.
అది అర్ధరాత్రి. మరికొద్ది గంటల్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని టక్స్‌పాన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, ఒక వ్యక్తి తుపాకీతో వచ్చి వారిని ట్రక్కు నుంచి బలవంతంగా బయటకు దింపేశాడు.
వస్తున్నప్పుడు దారిలో ఆగిపోవాలన్నట్టుగా ఒక కారు లైట్లు ఆర్పుతూ సిగ్నల్ ఇచ్చింది. అది చూడడానికి పోలీస్ కారులా ఉంది కానీ, పోలీస్ కారు కాదు.
ముసుగు ధరించిన ఒక వ్యక్తి ట్రక్కుపైకి ఎక్కి క్లారాని కిందకి దిగి, రోడ్డుపై పడుకోవాలని హెచ్చరించాడు. ఆ తర్వాత వెనక ఉన్న ట్రక్కును పరిశీలించాడు.
‘‘ఇక అయిపోయింది. ఈ ప్రపంచానికి గుడ్‌బై అని నాలో నేను అనుకున్నా’’ అని 57 ఏళ్ల క్లారా చెప్పారు.
ఇంట్లో వేధింపులు, ట్రక్కు డ్రైవింగ్

ఫొటో సోర్స్, ÁLVARO ÁLVAREZ
అయితే, అతనితో మాట్లాడిన తర్వాత క్లారా భయపడినట్లు ఏదీ జరగలేదు.
''తుపాకీతో వచ్చిన వ్యక్తి నా వయసెంత అని అడిగాడు. అతని తల్లి వయసు కూడా నా అంతే ఉంటుందని చెప్పాడు. ఈ ట్రక్కు డ్రైవర్ వృత్తిలోకి ఎందుకొచ్చావని అడిగాడు'' అని ఆమె అన్నారు.
17 ఏళ్ల వయసులో ఒక నీచుడిని పెళ్లి చేసుకున్నానని, దాదాపు 15 ఏళ్ల తర్వాత అతని నుంచి విముక్తి పొందానని క్లారా అతనితో చెప్పారు.
కానీ, జీవితం కొత్తగా ప్రారంభించడం అంత తేలిక కాదని ఆమె అన్నారు. వెయిట్రెస్‌గా పనిచేస్తూ వారానికి వచ్చే 50 డాలర్లతో పిల్లలను పోషించడం ఆమెకి కష్టంగా మారింది.
అప్పుడు కొంత మంది కస్టమర్లు ట్రక్కు డ్రైవర్ అయితే మంచి ఆదాయం ఉంటుందని చెప్పారు. దీంతో ఆమె ట్రక్కు డ్రైవర్ కావాలని అనుకున్నారు.
అలా ఆమె 18 ఏళ్ల కిందట ట్రాలెరా అయ్యారు. ట్రక్కులు నడిపే మహిళలను మెక్సికోలో ట్రాలెరాగా పిలుస్తారు.
తుపాకీతో బెదిరించి రోడ్డుపై పడుకోబెట్టినట్టుగా ఈ వృత్తి ప్రమాదకరమైనదని తెలిసినప్పటికీ, జీవితం సాఫీగా సాగేందుకు ఇదే బెటర్ అని ఆమెకు అనిపించింది.
అదృష్టవశాత్తూ ఆ తుపాకీ పట్టుకున్న వ్యక్తికి హృదయం ఉంది. అతను కూడా గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘మా నాన్న కూడా మా అమ్మను కొట్టేవాడు. ఆ తర్వాత కుటుంబాన్ని వదిలేశాడు’’ అని చెప్పాడు.
తన తల్లికి సాయంగా ఉండేందుకు ఒక గ్యాంగ్‌లో చేరినట్లు అతను చెప్పాడు.
''అలా మా ఇద్దరి మధ్య ఓ భావోద్వేగం కలిసింది. గంటల పాటు మాట్లాడుకున్నాం. ఇలా నేరాలు చేయడం మానేయాలని అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించా'' అని క్లారా చెప్పారు.
చివరికి అతను క్లారాని విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నాడు. కానీ ట్రక్కును, అందులోని వస్తువులను దొంగిలించాడు.

ఫొటో సోర్స్, ÁLVARO ÁLVAREZ
ఇప్పటికీ ట్రక్కు డ్రైవర్ల కొరత
''నేరస్థుల్లోనూ కొంత మంది మంచోళ్లు, కొంత మంది చెడ్డోళ్లు ఉంటారని మా లాంటి ట్రక్కు డ్రైవర్లం ఎప్పుడూ చెబుతుంటాం. అదృష్టమేంటంటే నాకు అందరూ మంచివాళ్లే తారసపడ్డారు'' అని క్లారా అన్నారు.
మెక్సికోలోని మొత్తం 5 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లలో మహిళలు కేవలం 2 శాతమే. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి.
''ప్రపంచవ్యాప్తంగా మహిళా ట్రక్కు డ్రైవర్ల సంఖ్య 3 శాతాని కంటే తక్కువే. అయితే, చైనాలో 5 శాతం, అమెరికాలో 8 శాతం మంది ఉన్నారు'' అని అంతర్జాతీయ రోడ్డు రవాణా సంస్థ (ఇంటర్నేషనల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) చెబుతోంది.
నైపుణ్యం కలిగిన డ్రైవర్ల కొరతతో ఈ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
మహిళలను ప్రోత్సహించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించొచ్చని క్లారా, ఇంకా ఆమె సహోద్యోగులు విశ్వసిస్తున్నారు.
లిజీ ఐడ్ గొంజాలెజ్ అలియాస్ లిజీ కథ కూడా దాదాపు అలాంటిదే.
ఇంట్లో వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఆమెకి అంతగా ఇష్టం లేకపోయినా డ్రైవర్ కావాల్సి వచ్చింది.
తన ఎరుపు రంగు ట్రక్కు డయావోలోతో బయలుదేరేందుకు సిద్ధమవుతూ, ''నేను ట్రక్కు డ్రైవర్ కావాలని అనుకోలేదు'' అని 45 ఏళ్ల లిజీ అన్నారు.
''నా ఆర్థిక సమస్యలకు ఇదే పరిష్కారంగా భావించా. ఎరుపు రంగు కారులో రయ్యిన దూసుకెళ్లాలని నాకొక కల ఉండేది. కనీసం ఎరుపు రంగు ట్రక్కులో అయినా వెళ్తున్నా'' అన్నారామె.

ఫొటో సోర్స్, LEIRE VENTAS
మృత్యు రహదారి
చీకటి పడకముందే సరిహద్దు పట్టణమైన న్యువో లారెడో చేరుకోవాలంటే తన ఊరు క్వెరటారో నుంచి గొంజాలెజ్ ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది.
మెక్సికో నుంచి అమెరికాకు ప్రధాన రవాణా కేంద్రం ఇది. అక్కడ రోజూ 800 మిలియన్ డాలర్ల(సుమారు 6,665 కోట్ల రూపాయలు) విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయి.
క్వెరటారో నుంచి న్యువో లారెడోకి వెయ్యి కిలోమీటర్లు. అత్యంత ప్రమాదకరమైన మాంటెరె మీదుగా మూడు గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. దానిని స్థానికంగా ‘మృత్యు రహదారి (హైవే ఆఫ్ డెత్), ‘బెర్ముడా ట్రయాంగిల్’ అని పిలుచుకుంటారు.
మెక్సికోలో అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఇదొకటి. ఇక్కడ దేశంలోనే శక్తిమంతమైన డ్రగ్ మాఫియా పాలన సాగుతుంది.
''నేను వాళ్లకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తున్నానో కూడా తెలుసు'' అని గొంజాలెజ్ అన్నారు. రహదారిపై ప్రభుత్వం కంటే వాళ్ల ఏర్పాట్లు ఎక్కువగా ఉంటాయి.
ఆ రహదారిపై పోలీస్ చెక్‌పోస్టులు ఉంటాయని, పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయని, అయినా భద్రతకు గ్యారంటీ లేదని డ్రైవర్లు, భద్రతా నిపుణులు బీబీసీతో చెప్పారు.
క్లారా తరహాలోనే లిజీ గొంజాలెజ్‌ను కూడా ఒక సాయుధుడు ఆపాడు. ట్రక్కు నుంచి ఆమెను దూరంగా తీసుకెళ్లాడు. అయితే, వాళ్లేమీ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
''వాళ్లు దేనికోసం వెతికారో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నన్ను విడిచిపెట్టేటప్పుడు మాత్రం ప్రధాన రహదారి ఎక్కే వరకూ లైన్ (కమ్యూనికేషన్) ఆన్ చేయొద్దని చెప్పారు'' అని ఆమె చెప్పారు.

హైవేపై దోపిడీలు
2023 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మెక్సికోలో 7,028 చోరీలు జరిగినట్లు రిపోర్టులు ఉన్నాయి. 2022తో పోలిస్తే ఇవి పది శాతం ఎక్కువ.
అయితే, నేషనల్ పబ్లిక్ సెక్యూరిటీ సిస్టమ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియట్ అధికారిక లెక్కల ప్రకారం, 6,030 హింసాత్మక ఘటనలు జరిగాయి.
అత్యధికంగా కార్గో పైరసీ (ట్రక్కులను దోచుకోవడం) జరిగిన ఐదు రాష్ట్రాల్లో మెక్సికో స్టేట్, ప్వేబ్లా, మిసొనాక్, శాన్ లూయిస్ పొటొసి, హలీస్‌కో ఉన్నాయి.

ఫొటో సోర్స్, LEIRE VENTAS
‘దొంగల బారిన 12% వాహనాలు’
ఏటా తమ వాహనాల్లో 12 శాతం వాహనాలు దోపిడీ దొంగల బారిన పడుతున్నాయని క్లారా ఫ్రాగొసో పనిచేస్తున్న ఎస్టీఐ కంపెనీ తెలిపింది.
అలాగే, కార్గో వాహనాలపై జరుగుతున్న దోపిడీలతో ఏడాదికి దాదాపు 137 మిలియన్ డాలర్ల (1,141 కోట్ల రూపాయల) నష్టం వాటిల్లుతోందని మెక్సికోకి చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టర్స్ అంచనా.
కొన్నిసార్లు ఇంధనం దొంగిలిస్తారని, మరికొన్నిసార్లు ఆ ప్రాంతంలో బలంగా ఉండే గ్యాంగ్‌లకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
వీటన్నింటనీ అడ్డుకోవాల్సిన బాధ్యత 2019లో మెక్సికన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ గార్డులపై ఉంది. ఈ విభాగంలో లక్ష మంది అధికారులు ఉన్నారని నిరుడు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ప్రకటించారు.
నేరాలను నియంత్రించేందుకు అన్ని రహదారుల్లోనూ నేషనల్ గార్డులు ఉంటారని ఆయన ప్రకటించారు.
అయితే, క్లారా, ఆమె సహచరులు వాటితో పాటు మరికొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, LEIRE VENTAS
‘షార్క్‌ల మధ్య ఈత కొట్టే నేర్పు ఉండాలి’
గొంజాలెజ్ తన క్యాబిన్‌లోనే అన్ని పనులూ (జుట్టు దువ్వుకోవడం, మిగిలిన పనులు) చేసుకోవాల్సి ఉంటుంది. సీటు వెనక మడుచుకునేందుకు వీలుగా ఉండే బెడ్ కారణంగా ఆ కొద్ది ప్రదేశాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.
అలాగే, వాళ్లకు వేధింపుల ప్రమాదం కూడా ఉంటుంది.
''మగవాళ్ల ఆధిపత్యం ఉండే ఈ రంగంలో, షార్క్‌ల మధ్య ఈతకొట్టేలా నేర్పు సాధించాల్సి ఉంటుంది'' అన్నారు గొంజాలెజ్.
''పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అలాగే, ధైర్యంగానూ ఉండాలి. ప్రతి దానికీ ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటేందుకు ప్రయత్నించొద్దని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించకూడదు'' అన్నారామె.
తన సహచరులపై అత్యాచార ఘటనల గురించి, లైంగిక సంబంధాల కోసం మగవారి నుంచి వచ్చే ఒత్తిళ్ల గురించి ఆమెకు తెలుసు.
మహిళా ట్రక్కు డ్రైవర్ల జీవితాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మహిళలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, ÁLVARO ÁLVAREZ
‘మహిళా డ్రైవర్లు పెరిగితే రవాణా రంగంలో మంచి మార్పులు’
ఇటీవల మరో 9 మంది మహిళలు క్లారా పనిచేస్తున్న కంపెనీలో చేరారు. వారిలో 37 ఏళ్ల మార్థ పట్రిసియా ట్రెజో కూడా ఒకరు. ఆమెకు ఇద్దరు పిల్లలు. క్లారా వారికి సాయంగా ఉంటారు. వారితో ఫోన్‌లో మాట్లాడుతుంటారు.
''పరధ్యానం వద్దు. ఆహార జాగ్రత్తలు తీసుకో. జీపీఎస్ చెక్ చేసుకో. అనవసర విషయాల జోలికెళ్లొద్దు. మీ సహోద్యోగులతో సరదాగా ఉండొచ్చు'' అంటూ క్లారా వాట్సాప్ కాల్‌లో ట్రెజోకి చెబుతుంటారు.
ఈ ఉద్యోగంలో ఎదురయ్యే ప్రమాదాల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలని ట్రెజోకు ఆమె సలహా ఇస్టుంటారు. అలాగే, డ్రైవర్లు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని, అప్రమత్తంగా ఉండాలని క్లారా చెబుతారు.
''రవాణా వ్యాపారంలో బయటకు మాట్లాడని చాలా విషయాలు ఉన్నాయి'' అని క్లారా అన్నారు. చెడు అలవాట్ల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, వాటిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆమె అన్నారు.
మహిళలు ఈ వృత్తిని ఎంచుకోవడం వల్ల కార్మికుల కొరత తగ్గడం ఒక్కటే కాదు, ఈ రవాణా రంగంలో గుణాత్మకమైన మార్పులు కూడా ఆశించొచ్చని ఆమె విశ్వసిస్తున్నారు.
ట్రక్కు డ్రైవర్లు కావాలనుకుంటున్న మహిళలకు గొంజాలెజ్ కూడా సోషల్ మీడియా ద్వారా సూచనలు ఇస్తుంటారు.
''నేనొక భార్యను, పిల్లలను పెంచి పెద్ద చేశాను, ఇంకా చాలా పనులు చేశాను, ఇప్పుడు నా కలలు నిర్మించుకుంటున్నా'' అని ఆమె అన్నారు.
అనంతరం ఆమె మరో ట్రిప్ వేసేందుకు మాంటెరె పార్కింగ్‌లో ఉన్న తన డయావోలో క్యాబిన్‌లోకి ఎక్కారు. మృత్యు రహదారి మీదుగా అమెరికా సరిహద్దు వైపు సాగే ప్రయాణమిది.
అడిషనల్ రిపోర్టింగ్: అల్వారో అల్వారోజ్, మాంట్‌సెరట్ బస్టోస్
(బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 వుమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ కథనం అందిస్తున్నాం.)

ఇవి కూడా చదవండి:
- గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
- విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
- ఇజ్రాయెల్: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు
- ‘రెండేళ్లుగా పీరియడ్స్ రావట్లేదు. సెక్స్‌లో పాల్గొంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఎందుకిలా?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














