దేశానికి పెళ్లికళ, ఏకంగా 38 లక్షల వివాహాలు.. ఈ సీజన్‌లో ఖర్చు ఎంతో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమితాబ్ భట్టాశాలి
- హోదా, బీబీసీ న్యూస్, కోల్‌కతా
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దేశంలోని వివిధ నగరాల నుంచి అందిన సమాచారం ప్రకారం, రానున్న కొన్ని రోజుల్లో 38 లక్షలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. వీటి కోసం 4.74 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు.
వ్యాపారుల జాతీయ సమాఖ్య ఈ గణాంకాలను విడుదల చేసింది. కోటి రూపాయలకు పైగా ఖర్చుతో అయ్యే పెళ్లిళ్లు 50 వేలు ఉన్నాయని వెల్లడించింది.
అంతేకాకుండా, మరో 50 వేల పెళ్లిళ్లకు ఒక్కోదానికి 50 లక్షలు ఖర్చు అవుతుండగా, 3 లక్షల రూపాయల్లోపు ఖర్చు చేసే పెళ్లిళ్లు 7 లక్షలు ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లిలోని ఒక కుటుంబం తమ కూతురి పెళ్లి కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేస్తోంది.
కోల్‌కతాలోని ఒక బెంగాలీ కుటుంబం తమ ఏకైక కూతురికి రూ. 20 లక్షల ఖర్చుతో పెళ్లి చేసేందుకు సిద్ధమైంది.
ఇందుకు భిన్నంగా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల్లోపే ఖర్చు చేస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి.
ఒక్క దిల్లీలోనే నాలుగు లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, అందుకు 1.25 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య వెల్లడించింది.
దిల్లీ, ముంబయి, కోల్‌కతా సహా 30 నగరాల్లోని వ్యాపారుల నుంచి ఈ సమాఖ్య పెళ్లి ఖర్చుల డేటాను సేకరించింది.
నిరుడు ఇదే సమయంలో వచ్చిన పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో 32 లక్షల వివాహాలు జరుగగా, సుమారు 4.4 లక్షల కోట్లు ఖర్చు చేశారు.

ఫొటో సోర్స్, NILANJANA SEN
రికార్డు స్థాయిలో పెళ్లి ఖర్చులు
కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కొన్ని నెలల క్రితమే ప్రోత్సాహకాలు, బోనస్‌లు లభించాయని బీబీసీతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో వారి వద్ద పెళ్లి ఖర్చులకు సరిపడా డబ్బు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కోవిడ్ కారణంగా కొన్నేళ్ల పాటు ఆడంబరంగా వివాహాలు చేయలేకపోయారు. ఈ ఏడాది దీపావళికి ప్రజలు రికార్డు స్థాయిలో ఖర్చు చేసినట్లే, ఈ సీజన్‌లో పెళ్లిళ్ల ఖర్చు కూడా రికార్డు నెలకొల్పుతుంది. దీపావళి సందర్భంగా దేశం మొత్తమ్మీద రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ రికార్డు బద్ధలు అవుతుంది’’ అని ఆయన అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేనికి ఎంత ఖర్చు?
భారత్‌లో అత్యంత వైభవంగా జరిగే వివాహాలను ‘‘ది బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్’’ అని పిలుస్తారు.
చీరలు, లెహంగాలు వంటి పెళ్లి షాపింగ్ కోసం మొత్తం ఖర్చులో 10 శాతం వెచ్చిస్తారని ప్రవీణ్ చెప్పారు. నగల మీద 15 శాతం, విద్యుత్ ఉపకరణాల మీద 5 శాతం ఖర్చు ఉంటుందని తెలిపారు.
మొత్తం పెళ్లి ఖర్చులో సగం కొనుగోళ్లపై, మిగతా సగం వివిధ సేవలపై వెచ్చిస్తారు. పెళ్లి వేడుక కోసం వెడ్డింగ్ ప్లానర్‌లను ఏర్పాటు చేసుకునే సంస్కృతి కూడా పెరిగింది.
దిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజర్, వెడ్డింగ్ ప్లానర్ సీరత్ గిల్, ఈ సీజన్ మొదట్లో ఒక పెళ్లి వేడుక కోసం పనిచేశారు.
పెళ్లి రోజు ఖర్చులో 50 శాతం వేదిక, అద్దె, కేటరింగ్ కోసం ఖర్చు చేస్తారని బీబీసీతో సీరత్ గిల్ చెప్పారు.
‘‘పెళ్లి వేదిక, అద్దె, భోజనాలకు 50 శాతం ఖర్చు అవుతుంది. వీడియోగ్రఫీ కోసం 10 శాతం, మద్యానికి 7 శాతం, వినోదం కోసం 5 శాతం ఖర్చు చేస్తారు. వధువు, కుటుంబ సభ్యుల అలంకరణ కోసం 3 శాతం ఖర్చు ఉంటుంది. ఇవేకాకుండా వెడ్డింగ్ ప్లానర్ ఫీజు, ఇతర సేవల కోసం 10 శాతం వెచ్చిస్తారు’’ అని సీరత్ తెలిపారు.

ఫొటో సోర్స్, DEEPIKA PADUKONE/INSTAGRAM
ఒకే తరహాలో పెళ్లి వేడుకలు
సినిమాలు, సీరియళ్లలో నిర్వహించే పెళ్లి వేడుకల తరహాలో తమ పెళ్లి కూడా జరగాలని చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కోరుకుంటారు.
భారతీయ పెళ్లిళ్లు దాదాపు ఒకే విధంగా కనిపించడానికి ఇదే కారణం.
సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వేడుకలను చూసి చాలా మంది తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకుంటారని వెడ్డింగ్ ప్లానర్ సీరత్ గిల్ చెప్పారు.
‘‘చాలా మంది అమ్మాయిలు ఆ సీజన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న వేడుకల తరహాలో తమ పెళ్లిని ప్లాన్ చేసుకుంటారు. అందుకే దేశంలో జరిగే పెళ్లిళ్లన్నీ దాదాపు ఒకేలా కనిపిస్తాయి.
చాలా మంది వైభవంగా జరిగే పెళ్లిళ్లకు ఆకర్షితులు అవుతారు. పెద్దగా ఖర్చు లేకుండా తమకు నచ్చినట్లుగా జరిగే వివాహాల సంఖ్య కూడా కోవిడ్ తర్వాత బాగా పెరిగింది’’ అని సీరత్ వివరించారు.

ఫొటో సోర్స్, RAJESWARI PUTHALAPATTU
ఉత్తరాది వారి తరహాలో తెలుగువారి పెళ్లిళ్లు
ఈ రోజుల్లో తెలుగు వారి పెళ్లిళ్లు కూడా ఉత్తర భారతీయుల తరహాలో జరుగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు తెలుగువారీ పెళ్లిళ్లలో కూడా భాగంగా మారాయి.
చాలా పెళ్లిళ్లలో వివాహ వేదిక అలంకరణ కూడా ఉత్తర భారతీయుల పెళ్లి అలంకరణను పోలి ఉంటుంది.
అయితే, తెలుగు సంప్రదాయం ప్రకారం, ఆచారాలను అనుసరించి జరిగే పెళ్లిళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు.
పెద్దపల్లికి చెందిన వ్యాపారి రఘు తన కూతురికి నవంబర్ 24న సంప్రదాయబద్ధంగా వివాహం చేశారు.
‘‘మా కుటుంబ సంప్రదాయం ప్రకారమే మా అమ్మాయి పెళ్లి చేశాం. పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించాం. అయిదు రోజుల పెళ్లి వేడుకకు మా బంధువులంతా వచ్చారు. పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలుపెట్టి తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి, రిసెప్షన్, 16 రోజుల పండగ ఇలా పెళ్లి తంతును పూర్తి చేస్తాం. ఇంటిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాం. సంప్రదాయ పద్ధతిలో ఘనంగా పెళ్లి వేడుక చేశాం. బంధువులు అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెట్టింపైన ఖర్చులు
ప్రజల చేతికి డబ్బు వచ్చిందని, అందుకే అందరూ పెళ్లిళ్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని వ్యాపార సమాఖ్య తెలిపింది.
చాలా తక్కువ బడ్జెట్‌లో తమ పిల్లల పెళ్లి చేసిన తల్లిదండ్రులతో కూడా బీబీసీ మాట్లాడింది.
‘‘అబ్బాయి పెళ్లికి దాదాపు 70, 80 వేలు ఖర్చు అవుతాయి. పదేళ్ల క్రితం నేనే స్వయంగా మా బావమరిది పెళ్లి చేశాను. ఇప్పుడు బంగారం కావొచ్చు లేదా ఇతర వస్తువులు కావొచ్చు. అన్నింటి ధరలు రెట్టింపు అయ్యాయి. నాకు ఒకే అబ్బాయి. కాబట్టి ధరలు ఎంత పెరిగినా పెళ్లి చేయాల్సి ఉంటుంది’’ అని వివరాలు బహిర్గతం చేయకూడదనే షరతు మీద ఒక తండ్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
- మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్తానీపై ప్రశంసల జల్లు ఎందుకు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














