తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు

తెలంగాణ ఎన్నికలు
    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రేవంత్ రెడ్డి మొన్న అచ్చంపేట నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడుతున్నారు... జనం వేదిక ముందుకొచ్చి సీటీలు కొడుతూ ‘సీఎం సీఎం’ అని నినాదాలు చేస్తూ గంతులేస్తున్నారు.

జనం రెస్పాన్స్ చూసి రేవంత్ రెడ్డి మురిసిపోతూనే.. కొంచెం సేపు ఓపికపడితే తన ప్రసంగం పూర్తవుతుంది అంటూ వారిని బతిమాలుతున్నారు.. అయినా, వేదిక ముందు జనం జోరు తగ్గలేదు.. రేవంత్ తన ప్రసంగం కొనసాగించే ప్రయత్నం ఆపేసి ‘ఒక పాటైన పెట్టుర్రే.. ఈళ్లు జరసేపు ఎగురతరట.. ఎవరున్నారా మైక్ కాడ.. గా పాట పెట్టు’ అంటూ సాంగ్ ప్లే చేయమని సూచించారు.

అంతే... అర నిమిషంలో పాట మొదలైంది.

‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు.. ఒక్కడూ కాంగ్రెస్ సూరీడు.. మన రేవంతన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు’ అంటూ హుషారైన పాట వినిపించింది.

‘ఎగురుర్రి.. ఎగురుర్రి..’ అంటూ రేవంత్ వారిని ఉత్సాహపరిచారు.

జనం కేరింతలు కొడుతూ పాటకు డ్యాన్స్ చేశారు. రేవంత్ మాటలు ఆపేసి వాళ్లను చూస్తూ ఉండిపోయారు.

కొమ్ము లక్ష్మమ్మ

ఫొటో సోర్స్, BRS Party

ఫొటో క్యాప్షన్, కొమ్ము లక్ష్మమ్మ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నాయకుల ఉపన్యాసాలతో పాటు పాటలూ ఊపు తెస్తున్నాయి. జనం ఓటేయడానికి ఇంకా టైమున్నప్పటికీ పాటలకు డ్యాన్సులు మాత్రం వేస్తున్నారు.

తెలంగాణ అంటేనే మధుర స్వరాల జానపదాలకు, ఖడ్గధారలాంటి ఉద్యమ గీతాలకు పెట్టింది పేరు.

అలాంటి తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ఉద్ధృతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో పాటలు మాంచి జోష్ నింపుతున్నాయి.

రాజకీయ పార్టీలు తమ గుర్తులను, తమ హామీలను, తాము చేసిన పనులను పదాలలో గుచ్చి పాటలల్లించిగా.. ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా తమ గురించి తాము చెప్పుకొంటూ పాటలు రూపొందిస్తున్నారు.

పెద్ద నాయకుల కోసం అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేకంగా పాటలు తయారుచేయిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్న పాటలలో కొన్ని పూర్తిగా కొత్తవి కాగా మరికొన్ని ఒకటి ఒకటిరెండేళ్ల కిందటే వినిపించి ఇప్పుడు మళ్లీ ఎన్నికల సందర్భంగా జనంలోకి వచ్చినవి.

ఎన్నికల నేపథ్యంలో పాటలు రాసేవారికి, పాడేవారికి, రికార్డింగ్ స్టూడియోలకు మంచి గిరాకీ ఏర్పడింది.

కొందరు గాయకులైతే అన్ని పార్టీలకూ తమ గొంతు అరువిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరికీ ఒకే గాయకుడు పాడిన సందర్భాలూ ఈ ఎన్నికలలో కనిపిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీఆర్ఎస్: ‘గులాబీల జెండలే రామక్క’

ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు మూడూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ సందర్భంగా రోడ్ షోలలో, ర్యాలీలలో, బహిరంగ సభలలో పాటలు హోరెత్తుతున్నాయి. నాయకులు, కార్యకర్తల రింగ్‌టోన్లలో కూడా ఎలక్షన్ సాంగ్సే వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త పాటలను జనంలోకి తీసుకొస్తోంది. తమ పథకాలను ప్రచారం చేస్తూ, తమ నాయకుడిని కీర్తిస్తూ పాటలు రూపొందిస్తోంది.

ఆ పాటలను తమ పార్టీ సోషల్ మీడియా హ్యాండిళ్లలో పోస్ట్ చేస్తుండగా అక్కడ వేలు, మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.

అలాంటి పాటల్లో ఒకటి ‘గులాబీల జెండలే రామక్క’ సాంగ్. సుమారు నెల రోజుల కిందట అక్టోబర్ 13 ఈ పాటను బీఆర్ఎస్ పార్టీ తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. గత అయిదారు వారాలలో ఈ పాటను ఒక్క బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ చానల్‌లోనే 30 లక్షల మందికిపైగా వీక్షించారు.

రాజకీయ పార్టీ పాట కావడం, ఎలాంటి కాపీరైట్ పరిమితులు లేకపోవడంతో ప్రధాన స్రవంతి మీడియా చానళ్లు, వందలాది యూట్యూబ్ చానళ్లు ఈ పాటను తమతమ అకౌంట్లలో తిరిగి పోస్ట్ చేసుకున్నాయి. అక్కడా కొన్ని మిలియన్ల మంది వీక్షించారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ ఈ పాట పాడగా బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ అనే మరో నలుగురు గ్రామీణ మహిళలు కోరస్ అందించారు.

‘నడువు నడువు నడవవే రామక్క’ అంటూ బతుకమ్మ పాటల తరహాలో ఉన్న దీన్ని గుణశేఖర్, మైత్రేయ తదితరులు బీఆర్ఎస్ పార్టీ కోసం రాశారు. పాట పాడిన గాయనులను, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను చూపుతూ వీడియో రూపొందించింది బీఆర్ఎస్ పార్టీ.

KCR

ఫొటో సోర్స్, BRS Party

కేసీఆర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని.. నీటి పారుదల ప్రాజెక్టులు కట్టారని.. మంచి పనులు చేశారని చెబుతూ సాగిపోతుంది ఈ పాట. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తును గుర్తుంచుకోమంటూ ప్రతి చరణంలో చెప్తారు ఈ పాటలో.

పల్లె గొంతులు, తేలికైన పదాలు, ఆకట్టుకునే ట్యూన్ కావడంతో ఈ పాట చాలా తొందరగా జనంలోకి వెళ్లిపోయింది.

ఈ పాట లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారమే సాగడం లేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ పాట మార్మోగుతోంది.

బీఆర్ఎస్ ఈ పాట సక్సెస్ తరువాత మరో అయిదారు పాటలను గత నెలరోజులలో విడుదల చేసింది. కానీ, అవేవీ ఈ పాట స్థాయిలో ప్రాచుర్యం పొందలేదు.

సినీ దర్శకుడు ఎన్.శంకర్ పర్యవేక్షలో ‘జయహో కేసీఆర్’ అనే హిందీ పాట కూడా రూపొందించారు.

‘సారే కావాలంటున్నరే’.. ‘దేఖ్‌లేంగే.. దేఖ్‌లేంగే’ అనే పాటలూ ఆకట్టుకున్నాయి. తాజాగా నవంబర్ 24న బీఆర్ఎస్ పార్టీ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌తో పాడించి ‘తెలంగాణ గట్టు మీద చందమామయ్యో’ అనే పాటను విడుదల చేసింది.

Revanth Reddy

ఫొటో సోర్స్, Revanth Reddy

కాంగ్రెస్: ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు’

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పాల్గొనే సభల్లో, ఆయన వర్గం నాయకుల సభలు, ర్యాలీలలో వినిపిస్తున్న పాట ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు.. ఒక్కడూ కాంగ్రెస్ సూరీడు.. మన రేవంతన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు’.

ఈ పాట పూర్తిగా రేవంత్ రెడ్డిని కీర్తిస్తూ సాగే పాట. నల్గొండ గద్దర్‌గా అందరూ పిలిచే కాసాల నర్సన్న ఈ పాట పాడారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ‘జనులందరి పార్టీ కాంగ్రెస్.. జగమంతా మెచ్చిన నేత సోనియా’ అంటూ మరో పాట విడుదల చేసింది. ‘పట్టుకో కాంగ్రెస్ జెండా.. ఎత్తుకో నీ గుండెల నిండా’ అంటూ సాగే ఈ పాట పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఆకట్టుకుంటోంది.

‘బై బై కేసీఆర్.. గుడ్ బై కేసీఆర్’ అంటూ మరో పాటనూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకొచ్చింది.

ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మార్మోగుతున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

బీజేపీ: ‘అన్నా! వాడు జనం తయారుచేసిన నాయకుడన్నా’

బీజేపీ తెలంగాణ శాఖ కూడా ఈ ఎన్నికల కోసం కొన్ని పాటలను రూపొందించింది.

‘మన మోదీ.. మనతోనే మోదీ’ అంటూ ప్రధాని మోదీ పేరుతో ఒక పాటను విడుదల చేసింది బీజేపీ.

‘భారతి భారతి ఉయ్యాలో.. బంగారు భారతి ఉయ్యాలో..’ అంటూ బతుకమ్మ పాటను పోలిన పాట ఒకటి తన ప్రచారాలలో విరివిగా ఉపయోగిస్తోంది బీజేపీ.

తాజాగా ఆ పార్టీ ఒకప్పుడు బాగా పాపులర్ అయిన ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహా పురం’ పాట ట్యూన్లో ‘క అంటే కాంగ్రెస్.. కా అంటే కారు బాస్..’ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను విమర్శిస్తూ ఒక పాటను తీసుకొచ్చింది.

అయితే... ఆ పార్టీలో వీటన్నిటికంటే బండి సంజయ్‌పై ఏడాది కిందట వచ్చిన పాట బాగా వినిపిస్తోంది. సంజయ్ వర్గం నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆ పాటను ప్రచారంలో పెద్ద ఎత్తున వాడుతున్నారు.

‘‘ఆట కాదురా .. అది వేట.. అన్నా వాడు జనం తయారు చేసిన నాయకుడన్నా.. రాముడు వదిలి బాణమన్నా’ అంటూ సంజయ్ నాయకత్వ తీరును కొనియాడుతూ సాగే ఆ పాట బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో తప్పనిసరి పాటగా మారింది.

‘రామక్కకు ఓటేస్తాం’

బీఆర్ఎస్ పాట ‘గులాబీల జెండలే రామక్క’ బాగా పాపులర్ కావడంతో దానికి కౌంటర్‌గా అదే ట్యూన్లో పాటలు తీసుకొచ్చారు కాంగ్రెస్, బీజేపీ అభిమానులు, నాయకులు.

‘కల్వకుంట్ల దొంగలే రామక్క’ అంటూ కేసీఆర కుటుంబాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పాటను ఉఫయోగిస్తుండగా బీజేపీ వర్గాలు కూడా ఇదే ట్యూన్లో బీఆర్ఎస్‌ను విమర్శిస్తూ పాటలు తీసుకొచ్చాయి.

మరోవైపు అన్ని పార్టీల పాటల్లోనూ ‘రామక్క’ అని వినిపిస్తుండడంతో ‘ఈసారి మేం రామక్కకు ఓటేస్తాం’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అంతాగా పాపులర్ అయింది ఈ పాట.

Bhatti Vikramarka Mallu

ఫొటో సోర్స్, Bhatti Vikramarka Mallu

ఫొటో క్యాప్షన్, మల్లు భట్టి విక్రమార్క

నాయకులు, అభ్యర్థుల సొంత పాటలు

పార్టీలే కాకుండా నాయకులు కూడా తమపై పాటలు రాయించుకుంటున్నారు. పెద్ద నాయకుల కోసం వారి అనుచరులు పాటలు సిద్ధం చేయిస్తున్నారు. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉండగా ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలోని అభ్యర్థుల పేరుతో పాటలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్, రేవంత్, భట్టి విక్రమార్క, బండి సంజయ్, కిషణ్ రెడ్డి, లక్ష్మణ్ వంటి ప్రధాన పార్టీలకు చెందిన పెద్ద నాయకులే కాకుండా నియోజకవర్గాలలోని అభ్యర్థుల పేర్లతోనూ పాటలు వస్తున్నాయి.

నల్గొండ గద్దర్

ఫొటో సోర్స్, @NalgondaG

ఫొటో క్యాప్షన్, నల్గొండ గద్దర్

అందరికీ ఆయన పాటే..

ఎలక్షన్ల పాటల విషయం వచ్చేసరికి ఎక్కువగా వినిపిస్తున్న గొంతు నల్గొండ గద్దర్‌ది. చాలామంది నాయకులు ఆయనతో పాటలు పాడించుకుంటున్నారు.

కాంగ్రెస్ సభల్లో మార్మోగుతున్న రేవంత్ రెడ్డి పాట నల్గొండ గద్దర్ పాడిందే. బీఆర్ఎస్ తాజా పాట ‘సారే కావాలంటున్నరే’ అనేదీ నల్గొండ గద్దర్ పాడిందే.

టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్, కవిత, పుట్ట మధు, సబిత ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, భట్టి విక్రమార్క, పుట్టమధు, బీజేపీ నేతలు రఘునందన్, కిషన్ రెడ్డి వంటి అందరికోసం ఆయన పాటలు పాడారు.

దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇద్దరి ప్రచారంలోనూ నల్గొండ గద్దర్ పాటలు వినిపిస్తున్నాయి.

కొన్ని ఇతర నియోజకవర్గాలలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)