విశాఖ: చివరి ఓవర్లో వరుసగా 3 వికెట్లు పడ్డా ఆస్ట్రేలియాపై భారత్ ఎలా గెలిచింది?

ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలో గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడటం ఇదే మొదటిసారి.
ఐదు మ్యాచుల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. చివరి ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడిపోయినా, భారత్ ఒత్తిడిని అధిగమించి, విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వన్ డౌన్లో వచ్చిన జోస్ ఇంగ్లిస్ చెలరేగిపోయాడు. 50 బంతుల్లో ఏకంగా 110 పరుగులు చేశాడు. 220 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.
ఓపెనర్ స్టీవ్ స్మిత్ 52 పరుగులతో రాణించాడు.
ఆసీస్ ఇన్న్సింగ్ చివరి ఓవర్లో భారత పేసర్ ముకేశ్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ఐదే పరుగులు ఇచ్చాడు. లేకపోతే, ఆసీస్ ఇంకా పెద్ద లక్ష్యాన్నే భారత్‌కు నిర్దేశించగలిగేది.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష్య ఛేదనలో తడబడ్డ భారత్
209 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. ఎనిమిది బంతుల్లో 21 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ధాటిగానే ఆడినా, త్వరగా ఔటయ్యాడు.
ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చారు.
42 బంతుల్లో 80 పరుగులు చేసిన సూర్య, 39 బంతుల్లో 58 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ల సమయోచిత బ్యాటింగ్, చివర్లో రింకూ సింగ్ (14 బంతుల్లో 22 పరుగులు) మెరుపులతో భారత్ విజయాన్ని అందుకుంది.
సూర్య ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లు; ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చివరి ఓవర్లో ఏం జరిగింది?
19వ ఓవర్ ముగిసే వరకు భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 19వ ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు. అప్పటికే కుదురుకున్న రింకూ సింగ్ ఒకవైపు, అక్సర్ పటేల్ మరోవైపు ఉన్నారు. భారత్ విజయానికి ఏడు పరుగులు కావాలి.
ఆరు బంతులు, ఐదు వికెట్లు చేతిలో ఉన్నప్పుడు టీ20ల్లో ఇది అంత కష్టమైనదేం కాదు. భారత్‌కు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నా, అనుకోనిది జరిగి, అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. వరుసగా మూడు వికెట్లు పడటమే దీనికి కారణం.
చివరి ఓవర్ వేయడానికి సీన్ అబాట్ బంతి అందుకున్నాడు. అతడు వేసిన మొదటి బంతికి రింకూ సింగ్ ఫోర్ కొట్టాడు. తర్వాత బంతికి బై రూపంలో ఒక పరుగు వచ్చింది. రింకూ సింగ్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ వైపు వెళ్లాడు.
ఇంకా నాలుగు బంతుల్లో రెండే పరుగులు కావాలి.
మూడో బంతికి అక్సర్ పటేల్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
నాల్గో బంతికి రవి బిష్ణోయ్ రనౌట్ అయ్యాడు.
అయితే రింకూ సింగ్ మళ్లీ స్ట్రైకింగ్‌కు రావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
ఐదో బంతికి రింకూ సింగ్ కొట్టిన షాట్‌కు ఒక పరుగు వచ్చింది, కానీ రెండో పరుగు తీసే ప్రయత్నంలో నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. స్కోర్లు సమమయ్యాయి.
ఇండియా గెలవాలంటే చివరి బంతికి ఒక పరుగు కావాలి. స్ట్రైకింగ్ ఎండ్‌లో రింకూ సింగే ఉన్నాడు.
ఆ దశలో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్తుందా అనే సందేహాలు ప్రేక్షకులకు కలిగాయి. కానీ చివరి బంతికి ‘సిక్స్’ కొట్టాడు రింకూ సింగ్. అయితే అది ‘నోబాల్’ అని ప్రకటించాడు అంపైర్.
భారత్ విజయానికి కావాల్సిన ఆ ఒక్క పరుగు ఇలా ఎక్స్‌ట్రా రూపంలో వచ్చేసింది. దీంతో రింకూ సింగ్ సిక్స్ లెక్కలోకి రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సూర్య కుమార్ యాదవ్ ఏమన్నాడు?
భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూర్య, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ- ఆసీస్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ తర్వాత తమ ముగ్గురు పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ చక్కగా బౌలింగ్ చేశారని, వాళ్లే జట్టును తిరిగి పోటీలోకి తెచ్చారని కితాబిచ్చాడు.
బ్యాటర్లు ఇషాన్ కిషన్, రింకూ సింగ్ ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేశారని కెప్టెన్ ప్రశంసించాడు.
సిరీస్‌లో రెండో మ్యాచ్ నవంబరు 26న ఆదివారం తిరువనంతపురంలో జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?
- ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయని మీకు తెలుసా... ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














