ఉత్తరకాశీ: సొరంగంలో ఎక్కువ రోజులు ఉంటే మానసికంగా, శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయి 12 రోజులు గడవడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాక కార్మికుల ఆరోగ్యం కోసం ఏం చేయాలి? వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి? వంటి అంశాలను తెలుసుకునేందుకు డాక్టర్ సంజయ్ కుమార్ ముండా, డాక్టర్ మనోజ్ కుమార్‌లతో బీబీసీ మాట్లాడింది.
రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సంజయ్ కుమార్ పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వ కంపెనీ మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో మనోజ్ కుమార్ వైద్యునిగా సేవలు అందిస్తున్నారు.
‘‘సొరంగంలో చాలాకాలం పాటు చిక్కుకొని బయటకొచ్చిన వారిలో నిస్పృహ, గందరగోళం, కంగారు వంటివి ఉంటాయి. అందుకే వారి మానసిక స్థితిని పూర్తిగా తెలుసుకొని తగిన చికిత్సను అందించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో వచ్చే మానసిక సమస్యల్ని నివారించవచ్చు’’ అని డాక్టర్ సంజయ్ కుమార్ ముండా చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
సొరంగాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో చూడటం, వాసన, వినికిడి వంటి ఇంద్రియ జ్ఞానం తగ్గిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారని ఆయన తెలిపారు.
‘‘మొదట బెంగ పెట్టుకుంటారు. సమయం గడుస్తున్నకొద్దీ చింత పెరుగుతుంది. కనీసం వారిలో వారు మాట్లాడుకోవడం కెమెరాల్లో కనిపించింది. ఇది మంచి విషయం.
బయటకు రావాలనే ఆరాటం, సొరంగం లోపల భయంతో బతుకుతున్న వారిలో నిరాశ నిస్పృహలు ఆవరించే అవకాశం ఉంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కావట్లేదు. ఈ విషయం లోపల ఉన్నవారికి కూడా తెలిసి ఉంటుంది. దీంతో వారు మరింత నిరాశకు లోనై ఉంటారు. వారి మనసులో ఎలాంటి భయాలు ఉన్నాయో మనం ఊహించడం చాలా కష్టం’’ అని అన్నారు.
ఆందోళన, నిరాశ కంటే కూడా మనిషిలో పుట్టే మానసిక గందరగోళం మరింత తీవ్రమైనదని సంజయ్ అన్నారు.
‘‘ఇప్పుడు వారిలో ఇలాంటి మానసిక గందరగోళమే ఏర్పడి ఉంటుంది. అక్కడ అసలు లేనివి చూస్తున్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురవుతారు. తమ ఇంట్లోవారు లేదా స్నేహితులుగా పిలుస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంటుంది. తమ ప్రియమైన వారి గొంతు వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. మెదడులో భయం కలిగించే ఆకారాలు, ధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయి. ఇలా అందరికీ జరుగుతుందని చెప్పలేం. కానీ, కొందరికి ఇలాంటివి జరుగవచ్చు’’ అని ఆయన వివరించారు.
శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని సంజయ్ తెలిపారు.
తాము బయటపడే మార్గం లేదని తెలిసినప్పుడు వారు ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని అన్నారు.

షాక్ తగ్గిపోయాక దీర్ఘకాల రుగ్మతలు
సొరంగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయా?
ఈ ప్రశ్నకు సంజయ్ కుమార్ బదులిస్తూ, ఇప్పటివరకు మాట్లాడుకున్నవి కేవలం షార్ట్ టర్మ్ రియాక్షన్లు అని అన్నారు.
సొరంగంలో చిక్కుకుపోయామనే షాక్ మనసులో తగ్గిపోయిన తర్వాత ‘పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ)’ అనే దీర్ఘకాల లక్షణం కనిపిస్తుందని చెప్పారు.
‘‘ఈ స్థితిలో వారు గతంలోకి వెళ్తుంటారు. అందరి మధ్యా ఉన్నప్పటికీ, సొరంగంలో చిక్కుకుపోయిన అనుభూతికి లోనవుతారు. వారు అలాంటి స్థితిని అనుభవించడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు తీవ్రమైన యాంగ్జైటీకి గురవుతారు’’ అని సంజయ్ తెలిపారు.
కార్మికులను బయటకు తీసుకువచ్చిన వెంటనే వారికి మానసిక చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందా? అని ప్రశ్నించగా సంజయ్ కుమార్ సమాధానం చెప్పారు.
‘‘ప్రస్తుతం ఇది ఒక అత్యవసర పరిస్థితి. ఉపశమనం, ఒత్తిడి తగ్గడానికి మందులు ఇవ్వాల్సిన అవసరం రావొచ్చు. ఆందోళన తగ్గి నిద్ర పట్టడానికి సహాయపడే మందులు ఇవ్వాలి. పీటీఎస్‌డీ గురించి తెలుసుకోవడానికి సమగ్ర మానసిక మూల్యాంకనం చేయాలి. ఈ ఘటనతో వారి మెదడు ఏ విధంగా ప్రభావితమైందో తెలుసుకోవాలి. ఈ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. సమగ్ర మూల్యాంకనం తర్వాతే ఎవరికి ఏ రకమైన చికిత్స చేయాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది’’ అని వివరించారు.

శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
సొరంగం నుంచి కార్మికులు బయటకు రాగానే వారి మూత్ర నమూనాల నుంచి రక్తం, బీపీతో పాటు ఇతర అంశాలను పరీక్షించాలని ఒక ప్రభుత్వ కంపెనీలో మైనింగ్ విభాగంలో వైద్యునిగా పనిచేసే డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
కార్మికులు బయటకు వచ్చినప్పుడు వారిలో ఏయే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అడిగినప్పుడు మనోజ్ కుమార్ ఇలా చెప్పారు.
‘‘లోపల ఉన్నవారు ఇప్పటికే బీపీ లేదా షుగర్ వంటి ఏదో ఒక వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం మందులు తీసుకోకపోవడం వల్ల ఆ వ్యాధులతో వచ్చే ఇబ్బందులు పెరుగుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. నీరు తాగకపోవడంతో మైకం రావడం, మూత్రవిసర్జన తగ్గడంతో కిడ్నీలు పాడవుతాయి. ఆహారం లేకపోవడంతో శరీరం బలహీనపడుతుంది. చాలా విపరీత పర్యావసనాలు ఎదురవుతాయి’’ అని ఆయన వివరించారు.
రోగులను ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యమని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముండా అన్నారు.
యోగాను ఒక పరిష్కారంగా చూడొచ్చని చెప్పారు.

‘‘ఘటనకు సంబంధించి ఎలాంటి స్థిరమైన నమ్మకం ఏర్పడకుండా చూడటం కూడా చికిత్సలో భాగమే. ఈ విధానంలో ఘటన జరిగినప్పటి విషయాలన్నీ చెప్పేలా బాధితులను ప్రేరేపిస్తారు. ఈక్రమంలో డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు.
ఏదైనా జరిగినప్పుడు కొందరు చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారికి వైద్యులు, మందులను సిఫార్సు చేస్తారు. భయం గూడుకట్టుకుపోయిన వారికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
లోపల చిక్కుకున్నవారితో కుటుంబీకులు, బయట ఉన్నవారు మాట్లాడుతుండటం చాలా ముఖ్యం. సహాయక చర్యల గురించి కూడా వారికి చెబుతుండాలి. వీటితో పాటు వారికి ఆహారం, నీరు అందుతున్నాయో లేదో కూడా చూడాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘అనిశ్చితి చాలా ప్రమాదకరం’’
లోపల చిక్కుకున్నవారికి నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మానసికంగా కూడా కుంగిపోవచ్చు.
వివిధ రకాల పరిస్థితుల్లో ప్రజలపై వివిధ రకాల ప్రభావాలు కలుగుతాయని డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు.
‘‘వ్యక్తులు గనుల్లో లేదా సొరంగాల్లో చిక్కుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇది చాలా పెద్ద సమస్య. దీనివల్ల ఆందోళన, భయం కలుగుతాయి. చివరకు ఇవి శరీరంపై కూడా ప్రభావం చూపుతాయి. నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఒకవేళ మురికి ప్రదేశంలో ఇరుక్కుపోతే అక్కడ ఆక్సీజన్ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్వాస సమస్యలు వస్తాయి. ఇవి ప్రాథమిక లక్షణాలు.
వివిధ పరిస్థితుల్లో వ్యక్తులపై వివిధ ప్రభావాలు కలుగుతాయి.
చలి కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆక్సీజన్ కొరత వల్ల ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి. శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది గుండెపై ప్రభావం చూపొచ్చు. ఈ కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు ప్రభావితం అవుతాయి. రక్త ప్రసరణ తగ్గిపోతే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- నిజామాబాద్ అర్బన్: పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
- మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్తానీపై ప్రశంసల జల్లు ఎందుకు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














