హరియాణా ప్రభుత్వ పాఠశాలలో 60 మంది బాలికలపై ‘లైంగిక వేధింపులు’.. నల్లద్దాల క్యాబిన్‌లో అసలేం జరిగింది?

లైంగిక హింస

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

ఒక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఉదంతం రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, మహిళా కమిషన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులకు లేఖలు రాశారు.

విద్యార్థులను లైంగికంగా వేధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మీదే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో గత వారం పాఠశాల ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను విచారిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆ పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయి.

హరియాణా రాష్ట్రం జీంద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

పాఠశాల వాతావరణం ఎలా ఉంది?

చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన నలుగురు సభ్యులు, పిల్లలకు పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ తదితర అంశాల గురించి చెప్పడానికి ఉదయం 11 గంటలప్పుడు పాఠశాలకు వచ్చారు.

బాలికల పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన జరిగింది. ఈ బడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బాలికలు చదువుకునేందుకు వస్తుంటారు.

పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య 40. ఇందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. 1,200 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు.

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

ఆరేళ్లుగా బదిలీ చేయలేదేం?

బయట నుంచి వస్తున్న ఎవరితోనూ మాట్లాడేందుకు విద్యార్థినులకు అనుమతి ఇవ్వట్లేదు.

బయట నుంచి ఎవరైనా వస్తున్నట్లు గమనించగానే, తరగతి నుంచి బయటకు రావొద్దంటూ విద్యార్థినులకు టీచర్లు సైగ చేయడం కనిపించింది.

పాఠశాల మొత్తం సీసీ కెమెరాలు అమర్చారు. ప్రిన్సిపల్ గదిలో కూడా ఒక కెమెరాతో పాటు మానిటరింగ్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్‌ను ఆరేళ్లుగా బదిలీ చేయకుండా ఒకే స్కూల్‌లో ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అదే సమయంలో ఇతర సిబ్బందికి పలుమార్లు బదిలీలు జరిగాయి.

అయితే, నిందితుడు ఒక రాజకీయ కుటుంబానికి చెందినవారని, అందుకే ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రిన్సిపల్ చర్యల కారణంగా చాలా మంది బాలికలు పాఠశాల నుంచి వెళ్లిపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

ప్రధానికి, సీజేఐకు అజ్ఞాత లేఖ

ఆగస్టు 31న భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మహిళా కమిషన్, హరియాణా మహిళా కమిషన్, హరియాణా విద్యాశాఖ మంత్రికి అయిదు పేజీల అజ్ఞాత లేఖను పంపారు.

ఈ లేఖలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థినులను నల్లటి అద్దంతో కూడిన క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని లేఖలో ఆరోపించారు.

అభ్యంతరకర రీతిలో తాకడం గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ప్రాక్టికల్స్, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరించినట్లు లేఖలో రాశారు.

పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

నల్లద్దాల క్యాబిన్

ఈ నల్లటి అద్దాల క్యాబిన్‌లో బయటి నుంచి చూస్తే ఏమీ కనిపించదని, అయితే లోపలి నుంచి బయటి దృశ్యాలు కనిపిస్తాయని లేఖలో రాశారు.

పాఠశాలలో కాకుండా బయట ఎక్కడైనా అధికారులు మాట్లాడితే ప్రిన్సిపల్‌ చేస్తున్న పనులన్నింటినీ చెబుతామని విద్యార్థులను ఉటంకిస్తూ లేఖలో పేర్కొన్నారు.

బదిలీ అయిన ఒక మహిళా టీచర్ గురించి కూడా లేఖలో ప్రస్తావించారు.

ప్రిన్సిపల్ సూచనల మేరకు ఆమె విద్యార్థినులను క్యాబిన్‌లోకి పంపేదని లేఖలో ఆరోపించారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో, నల్లద్దాల క్యాబిన్‌ను ఇప్పుడు తొలగించారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

ప్రిన్సిపల్ అరెస్ట్

ఈ లేఖ అందిన తర్వాత, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 14న హరియాణా పోలీసులను మహిళా కమిషన్ కోరింది.

అయితే ఈ కేసులో పోలీసులు ఆలస్యం చేశారని, నెల రోజుల తర్వాత ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి.

గత వారమే ఈ కేసులో ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు.

ప్రిన్సిపల్‌పై ఐపీసీ సెక్షన్లు 354 (లైంగిక వేధింపులు), 341, 342, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జీంద్ పోలీసులు తెలిపారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

పాఠశాల సిబ్బంది ఏం చెప్పారు?

ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రిన్సిపల్ మీదనే ఉన్నాయని బీబీసీతో పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు అన్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో బాలికల పట్ల తప్పు జరుగుతుంటే, ఇతర సిబ్బందికి దీని గురించి తెలియకపోవడం ఆశ్చర్యకర విషయమని చెప్పారు.

ఈ కేసుపై దర్యాప్తు కోసం విద్యాశాఖ బృందం పాఠశాలకు చేరుకున్నప్పుడే తమకు ఈ విషయం తెలిసిందన్నారు.

‘‘పాఠశాలలో కూడా ముగ్గురు సభ్యులతో కూడిన లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉంది. కానీ, ఈ విషయం గురించి వారికి కూడా తెలియదు. నేరుగా ఉన్నతాధికారులకే లేఖలు వెళ్లాయి.

ఈ కేసు విచారణలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఎవరూ పాఠశాల సిబ్బందితో మాట్లాడలేదు. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులందరూ షాక్‌లో ఉన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగింది. దీని గురించి ఎవరికీ తెలియదు’’ అని ఆయన వివరించారు.

నిరుడు బదిలీ మీద చాలా మంది సిబ్బంది ఈ పాఠశాకు వచ్చారని ఆయన చెప్పారు. అప్పటికే పాఠశాలలో నల్లద్దాలతో కూడిన క్యాబిన్ ఉండటంతో వారికేమీ కొత్తగా అనిపించలేదని చెప్పారు.

ఈ పాఠశాలలో 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు చాలా బాగున్నాయని అన్నారు. ఫలితాల్లో ఇరవై, ముప్పై మంది బాలికలు మెరిట్‌లో ఉంటారని తెలిపారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

తీవ్ర భయంలో బాధిత బాలికలు

చైల్డ్ వెల్ఫేర్ టీమ్‌తో వచ్చిన జీంద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ... బాధితులతో పాటు ఇతర బాలికలు చాలా షాక్‌లో ఉన్నారని చెప్పారు.

బాలికలు బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తున్నారని, వారి తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం మాట్లాడటం లేదని అన్నారు.

సుజాత చెప్పినదాని ప్రకారం, వారితో మాట్లాడి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధిత బాలికల సంఖ్య 60కి పైగా ఉండొచ్చు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సిలర్ మమతా శర్మ మాట్లాడుతూ, విద్యార్థినులు చాలా భయపడుతున్నారన్నారు. వారి మనసులో చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయని, కానీ పరిస్థితులు వారికి వ్యతిరేకంగా మారాయని అంటున్నారు.

ఈ ఘటన బాలికల మనసులపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. భవిష్యత్తులో కొన్ని కొత్త విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందని మమతా శర్మ అంచనా వేశారు.

నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఇతర సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

కొనసాగుతున్న విచారణ

తమకు వాట్సాప్‌లో లేఖ వచ్చిందని, దానిపై చర్యలు తీసుకున్నట్లు జీంద్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ ఎ రజా తెలిపారు. దీంతోపాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఆయనను విచారిస్తున్నామని చెప్పారు.

పంచకుల స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. హరియాణా ప్రభుత్వం కూడా లైంగిక వేధింపుల కింద కేసు దర్యాప్తు చేస్తోంది.

మహిళా కమిషన్ కూడా విచారిస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)