‘ఒకసారి హత్య చేసి చూద్దాం’ అనే ఉత్సుకతతో ఆన్‌లైన్‌లో మనిషిని వెతుక్కొని చంపేసిన కొరియా యువతి

ఫొటో సోర్స్, BUSAN POLICE
- రచయిత, ఫ్రాన్సిస్ మవో
- హోదా, బీబీసీ న్యూస్
ఎవరినైనా హత్య చేస్తే ఎలా ఉంటుందోనన్న ఉత్సుకతతో ఒక అపరిచితురాలిని చంపేశానని పోలీసు విచారణలో దక్షిణ కొరియా యువతి ఒకరు చెప్పారు. ఆమెకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
క్రైమ్ షోలు, నవలలకు బానిసైన 23 ఏళ్ల జంగ్ యూ జంగ్‌కి నిర్వహించిన సైకోపాత్ పరీక్షలలో అత్యధిక స్కోరు వచ్చిందని పోలీసులు తెలిపారు.
‘‘ఒక హత్య ఎలా చేయాలో ట్రై చేద్దాం’’ అని నిర్ణయించుకున్న జంగ్ యూ, ఆన్‌లైన్ యాప్ ద్వారా ఒక ఇంగ్లిష్ టీచర్‌ను కలిశారు. మే నెలలో ఆమె ఇంట్లోనే ఆమెను దారుణంగా చంపేశారు
ఆ దారుణ హత్య దక్షిణ కొరియాను కుదిపేసింది.
ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. చాలా తీవ్రమైన నేరాల్లోనే ఇలాంటి అభ్యర్థన చేస్తారు.
నిరుద్యోగి అయిన జంగ్, తన తాతతో కలిసి ఉంటున్నారు. హత్య చేసేందుకు మనిషిని వెతుక్కునేందుకు ఆమె ఒక ఆన్‌లైన్ ట్యూటర్ యాప్‌ను వాడినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
తాను హత్య చేయడానికి మనిషి కోసం ఆమె యాప్‌లో ఆరు నెలల పాటు వెతికారు.
ఆమె సుమారు 50 మంది మహిళలను సంప్రదించారు. ఇంట్లో పాఠాలు చెబుతారా అని అడిగారు.
గత మే నెలలో జంగ్ యూ బూసాన్ నగరానికి చెందిన 26 ఏళ్ల టీచర్‌ను ఆమె సంప్రదించారు. తాను ఒక హైస్కూల్ విద్యార్థికి తల్లినని, తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు బోధించాలని కోరారు.
ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఒక స్కూల్ డ్రెస్సు కొని, తానే వేసుకుని ఆమె టీచర్ ఇంటికి వెళ్లారని ప్రాసిక్యూటర్లు చెప్పారు.
టీచర్ తనను లోపలికి పిలిచిన తర్వాత ఒక్కసారిగా ఆమెపై జంగ్ యూ దాడి చేశారు. కత్తితో వందసార్లకు పైగా పొడిచారు. టీచర్ చనిపోయిన తర్వాత కూడా కత్తితో ఆమెను పొడుస్తూనే ఉన్నారు జంగ్ యూ.
ఆ తర్వాత టీచర్ శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని బూసాన్ నగరానికి ఉత్తరం వైపున ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేసేందుకు ఆమె ట్యాక్సీలో వెళ్లారు.
రక్తంతో తడిసిన సూట్‌కేసుతో ఒక మహిళ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ట్యాక్సీ డ్రైవర్ సమాచారం అందించడంతో పోలీసులు జంగ్ యూని అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్య ఎలా చేయాలి, ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలి అని జంగ్ యూ కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌లో వెతుకుతున్నట్లు ఆమె బ్రౌజింగ్ హిస్టరీలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఆమెకు ఎలాంటి భయమూ లేదని, సీసీటీవీ కెమెరాల్లో పడకుండా ఉండేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని పోలీసులు అన్నారు. ట్యూటర్ ఇంట్లోకి, బయటికి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని చెప్పారు.
ఈ హత్య ''ఏమీ చేయకపోయినా ఎవరైనా బాధితులుగా మారొచ్చు అనే భయాన్ని సమాజంలో వ్యాప్తి చేసింది. అభద్రతాభావాన్ని సృష్టించింది'' అని శుక్రవారం తీర్పు సందర్భంగా బూసాన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు.
జంగ్ యూ జూన్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నారు. అప్పట్లో తాను హాలూసినేషన్స్ (భ్రమలు), భౌతిక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నానని, తనకు శిక్ష తగ్గించాలని ఆమె అభ్యర్థించారు.
అయితే, ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ''ఈ నేరం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. భౌతిక, మానసిక రుగ్మతల కారణంగానే అలా జరిగిందన్న వాదనలను అంగీకరించలేం'' అని తెలిపింది.
పోలీసు విచారణలోనూ ఆమె పొంతనలేని వాదనలు చేశారు. ఆ టీచర్‌ను తాను హత్య చేయలేదని, కేవలం ఆమె మృతదేహాన్ని మాత్రమే బయటికి తీసుకెళ్లి పడేశానని మొదట చెప్పారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెను హత్య చేసినట్లు ఆ తర్వాత మాటమార్చారు.
చివరికి, క్రైమ్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత తనకు హత్య చేయాలని అనిపించిందని ఒప్పుకున్నారు.
దక్షిణ కొరియాలో మరణ శిక్ష అమల్లో ఉన్నప్పటికీ 1997 నుంచి ఎవరికీ మరణ శిక్ష అమలు చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- ట్యూషన్ టీచర్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని బడా వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేశారు... మతం రంగు పులిమిన ఈ కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు?
- ఖరీదైన స్కూల్లో యువతి హత్య... బాత్రూమ్లో శవమైన కనిపించిన పోలో కోచ్
- బంగారం దోచుకొచ్చి గొయ్యితీసి దాచే కొడుకులు, బ్యాంకులో కుదువ పెట్టే తల్లి.. పోలీసులకు ఎలా దొరికారు?
- మరణ శిక్షలో వాడే విషానికి కొరత, రహస్యంగా వెతుకుతున్న అమెరికా
- తండ్రి చావుకు కారణమని అత్తారింటిపై ప్రతీకారం... అయిదుగురికి విషం పెట్టి చంపిన కోడలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














