జ్యులియా సికెట్టిన్: ఈ అమ్మాయి దారుణ హత్య ఇటలీని కుదిపేస్తోంది, ఎందుకు?

జ్యులియా సికెట్టిన్

ఫొటో సోర్స్, GIULIA CECCHETTIN

ఫొటో క్యాప్షన్, జ్యులియా సికెట్టిన్ మృతదేహాన్ని ఒక గుంతలో పోలీసులు గుర్తించారు
    • రచయిత, సోఫియా బెటిజా
    • హోదా, బీబీసీ న్యూస్

ఇటలీలో మాజీ ప్రియుడి చేతిలో ఒక యువతి హత్యకు గురికావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది దేశంలో మహిళలపై పెరిగిపోతున్న హింసకు నిదర్శనంగా నిలిచింది.

బయోమెడికల్ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన 22 ఏళ్ల జ్యులియా సికెట్టిన్ గ్రాడ్యుయేషన్ డే కోసం డ్రెస్ కొనుక్కునేందుకు నవంబర్ 11న తన మాజీ ప్రియుడు ఫిలిప్పో ట్యురెట్టాతో కలిసి బయటికి వెళ్లింది.

ఆ తర్వాత, ఆ జంట అదృశ్యమైంది.

కొద్ది రోజుల తర్వాత ఆమె జీవితంలోని ఆఖరి క్షణాలను చూపించే సీసీటీవీ ఫుటేజీ బయటపడింది.

దర్యాప్తు జరిపిన జడ్జి తెలిపిన వివరాల ప్రకారం, 22 ఏళ్ల ట్యురెట్టా విగనొవో పట్టణంలో ఆమె ఇంటికి దగ్గర్లో పార్కింగ్ చేసి ఉన్న కారులోనే ఆమెను కొడుతున్న దృశ్యాలు కనిపించాయి.

ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు ఆమె మూతికి ప్లాస్టర్ వేసి, బలవంతంగా కారులో ఎక్కించుకుని ఇండస్ట్రియల్ ఏరియాకి తీసుకెళ్లాడని, అక్కడ మళ్లీ ఆమెపై దాడి చేసినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు.

వారం రోజుల గాలింపు తర్వాత, ఒక గుంతలో నల్లని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టిపడేసిన ఆమె మృతదేహం లభించింది.

ఆమె మృతదేహంపై, క్రూరంగా హత్య చేసిన ఆనవాళ్లున్నాయి. ఆమె తల, మెడపై కనీసం 20 కత్తిపోట్లు, లోతుగా ఉన్నాయి. జ్యులియా నవంబర్ 11 రాత్రి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని కారు ఉత్తర ఇటలీ మీదుగా ఆస్ట్రియా, అక్కడి నుంచి జర్మనీ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

రోడ్డుపై లైట్లు ఆపేసి పార్కింగ్ చేసి ఉన్న కారు గురించి ఒక డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వారం తర్వాత జర్మనీలోని లీప్‌జిగ్‌లో ట్యురెట్టాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతను ఒక మర్డర్ కేసులో నిందితుడని ఆ కాల్ చేసిన డ్రైవర్‌కు తెలియదు.

ఫిలిప్పో ట్యురెట్టాపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి అభియోగాలూ నమోదు చేయలేదు.

జ్యులియా సికెట్టిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జ్యులియా హత్యతో ఇటలీలో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి

ఇటలీలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 106 మంది మహిళలు హత్యకు గురైనట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ డేటా చెబుతోంది. అందులో 55 మంది తమ పార్టనర్, లేదా మాజీ పార్టనర్ చేతిలో హత్యకు గురయ్యారు.

పితృస్వామ్య ధోరణులు పాతుకుపోయాయని చాలా మంది మహిళలు భావించే ఇటలీలో జ్యులిన్ సికెట్టిన్ హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇటలీ వార్తా పత్రికల్లో ఇదే ప్రధానాంశంగా మారింది.

గత రెండు రోజుల్లో ఫోన్ కాల్స్ రెండు రెట్లు అధికంగా వచ్చాయని నేరాలు, పోకిరీల గురించి ఫిర్యాదులు స్వీకరించే విభాగం యాంటీ వయలెన్స్ అండ్ స్టాకింగ్ హాట్‌లైన్ తెలిపింది.

''మహిళలను అత్యంత క్రూరంగా హత్య చేసిన కేసులను పరిశీలిస్తే, దారుణంగా హింసించిన తర్వాత చివరగా చేసే పని ప్రాణం తీయడం'' అని మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వేతర సంస్థ 'డిఫరెంజా డొన్నా' డైరెక్టర్ ఎలీసా ఎర్కోలీ అన్నారు.

''ఇటలీలో ప్రతి మూడు రోజులకు ఒక మహిళ హత్యకు గురవుతోంది'' అన్నారామె.

స్వతంత్రంగా ఉండాలనుకోవడం వారి భాగస్వాములకు కోపం తెప్పిస్తోందని, అదే ఎక్కువ మంది మహిళలపై హింసకు కారణమని ఆమె అన్నారు.

''ఇద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా లేనప్పుడు, మహిళలు వారి కంటే మెరుగ్గా ఉండడాన్ని హింసాత్మక ప్రవర్తన కలిగిన మగవారు భరించలేకపోతున్నారు'' అని ఎర్కోలీ చెప్పారు.

ఫిలిప్పో ట్యురెట్టా కూడా జ్యులియా చేసిన కోర్సే చేస్తున్నారు. అయితే, అతని కంటే ముందే ఆమె పట్టా అందుకోబోతున్నారు.

''ఆమె డిప్లొమా తీసుకోవాల్సిన రోజే ఈ దారుణ ఘటన జరిగింది'' అన్నారు ఎర్కోలీ.

యూనివర్సిటీలో జ్యులియా, ఫిలిప్పో ట్యురెట్టాలకు పరిచయం ఏర్పడింది. ఆగస్టులో అతని నుంచి విడిపోవడానికి ముందు ఏడాదిన్నర పాటు ఇద్దరూ కలిసి ఉన్నారు.

''అందరిలాగే అతను కూడా ఒక సాధారణ వ్యక్తే. ప్రాక్టికల్‌గా ఉంటాడు'' అని ఇటలీ పత్రిక లా రిపబ్లికాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్యురెట్టా తండ్రి నికోలా ట్యురెట్టా అన్నారు.

''బాగా చదివేవాడు. తన క్లాస్‌మేట్స్‌తో కానీ, టీచర్లతో కానీ ఎలాంటి గొడవలూ లేవు. ఎవరితోనూ గొడవపడేవాడు కాదు'' అన్నారు.

ఫిలిప్పో ట్యురెట్టా ‘పొసెసివ్‌నెస్’ గురించి జ్యులియా ఆందోళన చెందేదని ఆమె సోదరి ఎలీనా చెప్పారు. అయితే, అది ఆమెకు హాని కలిగిస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

పితృస్వామ్య సంస్కృతి, మహిళలపై ఆధిపత్య ధోరణి మగవారి ప్రమాదకర ప్రవర్తనను సాధారణమైనవిగా చూపెడుతున్నాయని ఎలీనా ఆవేదన వ్యక్తంచేశారు.

పితృస్వామ్యం, రేప్ కల్చర్ వల్ల ఫిలిప్పో లాంటి వారు తయారవుతారని ఆమె ఇటలీ మీడియాతో అన్నారు.

జార్జియా మెలోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని

ప్రధాని జార్జియా మెలోని ఆగ్రహం

దేశంలో సుదీర్ఘ కాలంగా మహిళలు ఎదుర్కొంటున్న హింస, ముఖ్యంగా భాగస్వాములు లేదా మాజీ భాగస్వాముల చేతిలో ఎదురవుతున్న హింసపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇటలీకి తొలి మహిళా ప్రధాని.

ఇటలీలో వ్యాపించిన మహిళలపై ద్వేషపూరిత హింసకు వ్యతిరేకంగా పాఠశాల స్థాయి నుంచే ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని జార్జియా మెలోనీ హామీ ఇచ్చారు.

''పితృస్వామ్య మూలాలు బలంగా ఉన్న దేశం ఇటలీ'' అని ఎర్కోలీ అన్నారు. ''ఇది వెనకబడిన సమాజం. ఇక్కడ మహిళలు ఇంకా పురుషుల నియంత్రణలోనే ఉన్నారు'' అన్నారామె.

ఇటలీలో 30 నుంచి 69 ఏళ్లలోపు మహిళల్లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఎలాంటి పనీ చేయడం లేదని ఇటాలియన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్(ఐఎస్‌టీఏటీ) గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఎక్కువ మంది ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

''మహిళలు ఎంత పురోగమించినా, తమ హక్కులపై వారికి అవగాహన ఉన్నప్పటికీ, పురుషులు ఇంకా పితృస్వామ్య పోకడలను బలంగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు'' అని ఎర్కోలీ చెప్పారు.

జ్యులియా సికెట్టిన్ హత్యతో పెల్లుబికిన ఆగ్రహం ఇటలీ సమాజంలో మార్పు తీసుకొస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

లింగ భేదంతో జరిగే హింసను అరికట్టేందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ తెచ్చిన కొత్త చట్టాన్ని ఇటలీ సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మహిళలపై హింసకు పాల్పడే పురుషులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, వారిపై నిరంతరం నిఘా ఉండేలా కొత్త చట్టాన్ని తెచ్చింది ఇటలీ ప్రభుత్వం.

అయితే, దేశంలో వేళ్లూనుకుపోయిన ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన మేర చర్యలు చేపట్టడం లేదని విమర్శకులు అంటున్నారు.

''అది అందరి మగాళ్ల గురించి కాదు. కానీ, అలా హింసకు పాల్పడుతున్న వాళ్లు కూడా మగాళ్లే కదా'' అని జ్యులియా సోదరి అన్నారు.

''ఈ పితృస్వామ్య సమాజంలో తోటి స్నేహితులు, సహోద్యోగులకు అవసరమైన విషయాలు చెప్పడం కూడా పురుషుల బాధ్యతే. మీ స్నేహితుడు తన ప్రియురాలిపై పెత్తనం చేస్తుంటే అలా చేయకూడదని చెప్పండి. రోడ్డుపై వెళ్లేవారితో ఇబ్బందికరంగా ప్రవర్తించే మీ సహోద్యోగికి అది సరికాదని చెప్పండి. ఇలాంటి ప్రవర్తనలను అంగీకరిస్తే తర్వాత అది మహిళల హత్యలకు దారితీయొచ్చు'' అని ఆమె అన్నారు.

ఆమె మాటలను ఎంతో మంది ఇటలీ మహిళలు షేర్ చేశారు. రీపోస్టులు చేశారు.

ఈ వారం మొదట్లో జ్యులియా సికెట్టిన్‌ మృతికి సంతాపంగా స్కూళ్లలో ఒక నిమిషం మౌనం పాటించారు.

కానీ, ఆమె చదువుకున్న పజువా యూనివర్సిటీలో విద్యార్థులు ఒక నిమిషం మౌనానికి బదులు శబ్దాలు చేయడం, కవితలు చదవడం, పాటలు పాడడం వంటివి చేశారు. ఎందుకంటే, ఇలాంటి ఘటనలపై మౌనంగా ఉండేందుకు వారు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)