కిమ్ జోంగ్ ఉన్: గూఢచార ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయ్యిందంటూ సైంటిస్టులు, కుటుంబ సభ్యులకు పార్టీ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఇసీ గోక్సేదేఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గూఢచార ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ ప్రయోగం అంతరిక్ష శక్తిలో కొత్త శకంగా అభివర్ణించారు. అంతేకాదు ఈ మిషన్ "ఆత్మ రక్షణలో భాగంగా చేసిన ఎక్సర్‌సైజ్" అని తెలిపారు కిమ్.
గూఢచార ఉపగ్రహంగా భావిస్తున్న రాకెట్‌ను ఉత్తర కొరియా మంగళవారం ప్రయోగించింది. అనంతరం అది విజయవంతమైందని ప్రకటించింది.
అయితే గతంలో చేసిన రెండు ప్రయోగాలు విఫలమయ్యాయని, ఇపుడు ఈ ఉపగ్రహం పనితీరుపై ముందుగానే వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యేనని దక్షిణ కొరియా పేర్కొంది.
అంతరిక్షంలోకి గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత కిమ్ అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఇచ్చిన విందులో పాల్గొన్నారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది.
ఈ కార్యక్రమానికి కిమ్ భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్ జు ఏ కూడా హాజరైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రయోగం ఉత్తర కొరియాను అంతరిక్ష సామర్థ్యాలలో కొత్త శకానికి నడిపించిందని కిమ్ చెప్పినట్లు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నిఘా ఉపగ్రహం ఉండటం దేశం తనను తాను రక్షించుకోవడంలో ఒక మార్గమని కూడా ఆయన చెప్పారని తెలిపింది.
ఈ ఉపగ్రహం తమ సైన్యానికి ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యాన్ని ఇస్తుందని ఉత్తర కొరియా ప్రధాని కిమ్ టోక్ హున్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
అమెరికా, దక్షిణ కొరియాలే లక్ష్యమా?
గూఢచార ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడం ఉత్తర కొరియా ఐదేళ్ల సైనిక ప్రణాళికలో ప్రధాన భాగం.
కొరియన్ ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా దళాలు, ఆయుధాల కదలికలను పర్యవేక్షించడానికి కిమ్ ప్రభుత్వానికి ఇది సాయపడగలదు.
అంతేకాదు ఇది తమపైకి వచ్చే ఆపదలనూ గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.
గ్వామ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను ఇప్పటికే గమనిస్తున్నామని ఉపగ్రహం ప్రయోగించిన కొద్ది గంటల తర్వాత ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
అయితే, ఈ ప్రయోగాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా, జపాన్ సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతేకాదు ఈ ప్రయోగం దక్షిణ కొరియాతో వివాదం మరింత పెరిగేలా చేసింది.
రష్యా నుంచి ఉత్తరకొరియాకు సహాయం అందినట్లు తాము భావిస్తున్నామని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యాలో పర్యటించారు. కొరియాలో ఉపగ్రహాలను రూపొందించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయం అందించిన అనంతరం ఈ ప్రయోగం జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
మూడోసారి సక్సెస్
'మల్లిగ్యోంగ్-1' అనే ఈ ఉపగ్రహాన్ని మూడోసారి ప్రయోగించింది ఉత్తర కొరియా. ఈ ఏడాది మే, ఆగస్టు నెలల్లో రెండు సార్లు ప్రయోగించినా విఫలమయ్యాయి.
తాజా ప్రయోగం విజయవంతమైందని దక్షిణ కొరియా కూడా ఒప్పుకుంది. అయితే ఆ దేశం చెప్పుకుంటున్నట్లుగా ఉపగ్రహం పనిచేస్తుందో లేదో ఇప్పుడే నిర్ధరించడం తొందరపాటు అవుతుందని తెలిపింది.
మంగళవారం ఉత్తరకొరియా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత, ఆ దేశంతో ఐదేళ్ల నాటి సైనిక ఒప్పందాన్ని దక్షిణ కొరియా పాక్షికంగా నిలిపివేసింది. అసలు ఆ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ప్యాంగాంగ్ హెచ్చరించింది. మళ్లీ అలాంటి ఒప్పందానికి కట్టుబడి ఉండబోమని తెలిపింది.
ఇవి కూడా చదవండి
- రైతుబంధు పథకానికి, ఎన్నికల సంఘానికి ఏమిటీ సంబంధం? ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏం చేయచ్చు, ఏం చేయకూడదు...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














