తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు

ఫొటో సోర్స్, BSR PARTY
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘100 మంది కేసీయార్లు వచ్చినా నన్ను ఓడించలేరు’ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఈ దళిత నేత శాసనసభలోనూ అనేక సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీటుగా ప్రతిపక్షం వాదనను సమర్థంగా వినిపించిన సందర్భాలున్నాయి.
కేసీఆర్, భట్టి విక్రమార్కల మాటల యుద్ధం అసెంబ్లీని దాటి ఈసారి మధిర నియోజకవర్గానికి చేరింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన మధిరలో 2009 నుంచి భట్టి విక్రమార్కే వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్‌రాజ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. 2009 నుంచీ కమల్‌రాజే భట్టికి సమీప ప్రత్యర్థి.
2009, 2014లో ఆయన సీపీఎం నుంచి 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈసారి ఎలాగైనా మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అక్కడ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగానే భట్టి అలా ప్రతిస్పందించారు.
కేసీఆర్, భట్టిల మాటకుమాట ఎలా ఉన్నా తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ గెలవలేకపోవడం ఆ పార్టీని బాధిస్తోంది.
119 నియోజకవర్గాలున్న తెలంగాణలో ఇప్పటికి రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ మూడోసారి కూడా అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ ప్రయత్నంలో ఆ పార్టీ ఇప్పటివరకు గెలవని 17 నియోజకవర్గాలపై దృష్టి సారించింది.
ఇంతకీ ఆ 17 నియోజకవర్గాలు ఏవి? అక్కడ ఎవరు గెలుస్తున్నారు?

ఫొటో సోర్స్, BRS PARTY
ఇవీ ఆ 17 నియోజకవర్గాలు
గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 నియోజకవర్గాలపై బీఆర్ఎస్‌కు ఇంతవరకు పట్టుచిక్కలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి, భద్రాచలం, మధిర నియోజకవర్గాలను బీఆర్ఎస్ ఎన్నడూ గెలవలేదు.
దీంతో ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్ పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, బహదూర్‌పుర, నాంపల్లి నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ ఇంతవరకు విజయం సాధించలేదు.
రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలదీ అదే పరిస్థితి.

ఫొటో సోర్స్, Getty Images
అక్కడ ఎంఐఎంతో ఫ్రెండ్లీ ఫైట్
బీఆర్ఎస్ ఇప్పటివరకు గెలవని జాబితాలో హైదరాబాద్‌లో ఉన్న నియోజకవర్గాలలో కొన్ని ఎంఐఎం గెలుస్తున్న స్థానాలు ఉన్నాయి.
ఎంఐఎంతో ఉన్న రాజకీయ మైత్రి, అవగాహన నేపథ్యంలో బీఆర్ఎస్ అక్కడ ఫ్రెండ్లీ పోటీకి మాత్రమే పరిమితమవుతోంది. కేసీఆర్ టికెట్ల కేటాయింపు సందర్భంలో, ఆ తరువాత వివిధ సందర్భాలలోనూ అదే విషయం చెప్పుకొచ్చారు.
అలాంటి 7 నియోజకవర్గాలను మినహాయించినా బీఆర్ఎస్ బోణీ చేయని నియోజకవర్గాలు ఇంకా 10 ఉన్నాయి.
పినపాక: గెలిచేవరకు ఒక పార్టీ.. గెలిచాక మరో పార్టీ
ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి రేగ కాంతారావు విజయం సాధించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు గెలిచారు.
అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018 ఎన్నికలలో పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నుంచి రేగ కాంతారావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా కాంతారావుకు విజయం దక్కింది.
అయితే, ఎన్నికల అనంతరం కాంతారావు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. పాయం వెంకటేశ్వర్లు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి రేగ కాంతారావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి పొడియం బాలరాజు పోటీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, BRS PARTY
ఇల్లందు: గెలుపు కాంగ్రెస్ నుంచి.. ఫిరాయింపు బీఆర్ఎస్‌లోకి
ఇది కూడా ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమే. బీఆర్ఎస్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయింది.
2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బానోత్ హరిప్రియ అనంతర కాలంలో బీఆర్ఎస్‌లో చేరడంతో ప్రస్తుతం ఆమెకే బీఆర్ఎస్ టికెట్ దక్కింది.
2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోరం కనకయ్య ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అంతకుముందు 2014లో కోరం కనయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో తెలుగుదేశం నుంచి ఊకే అబ్బయ్య గెలిచారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత గుమ్మడి నర్సయ్య అత్యధికంగా అయిదు సార్లు ఈ నియోజవర్గం నుంచి గెలిచారు.
అశ్వరావుపేట: ఏ పార్టీ నుంచి గెలిచినా బీఆర్ఎస్‌లోకే
ఎస్టీ నియోజకవర్గమైన అశ్వారావుపేటలో బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేకపోయింది.
2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆ ఏడాది ఎన్నికలలో కాంగ్రెస్ నేత మిత్రసేన గెలవగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలిచారు.
గెలిచిన తరువాత ఆయన పాలక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2018లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే, ఆ పార్టీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వర రావు అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మెచ్చా నాగేశ్వరరావే అభ్యర్థిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి జారె ఆదినారాయణ పోటీ చేస్తున్నారు.
ఇక్కడ బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి ఉమాదేవి పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి పిట్టల అర్జున రావు బరిలో ఉన్నారు.
వైరా: 2018లో స్వతంత్ర అభ్యర్థి విజయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ ఎస్టీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు ఇంతవరకు పట్టు చిక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన లావుడ్యా రాములు ఇక్కడ విజయం సాధించారు.
ప్రస్తుత 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి బానోత్ మదన్ లాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాలోత్ రాందాస్, జనసేన నుంచి సంపత్ నాయక్ పోటీ చేస్తున్నారు.
మదన్‌లాల్ 2014లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
అంతకుముందు 2009లో బానోత్ చంద్రావతి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, రెండు సందర్భాలలోనూ గెలిచిన అభ్యర్థులు ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరిపోయారు.
సత్తుపల్లి: కాంగ్రెస్, టీడీపీలదే ఆధిపత్యం
ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, తెలుగుదేశం(టీడీపీ) పార్టీలే గెలుస్తూ వచ్చాయి. 2009 నుంచి వరుసగా మూడు ఎన్నికలలోనూ సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తున్నారు.
2018లో ఆయన టీడీపీ నుంచి గెలిచిన తరువాత బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి, బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గం 2009 డీలిమిటేషన్లో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు.
అనంతర కాలంలో ఆయన కుమారు జలగం వెంకటరావు, ప్రసాదరావు కూడా ఇక్కడ గెలిచారు. తుమ్మల నాగేశ్వరరావు మూడు సార్లు ఇక్కడ గెలిచారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ సండ్ర వెంకట వీరయ్యనే విజయం వరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భద్రాచలం: కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోట
ఈ ఎస్టీ నియోజకవర్గంలో ఇంతవరకు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ తప్ప ఇంకే పార్టీ గెలవలేదు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొడెం వీరయ్య గెలిచారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరినా వీరయ్య కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకటరావు, బీజేపీ నుంచి కుంజ ధర్మారావు పోటీలో ఉన్నారు.
2014లో ఇక్కడ సీపీఎం నేత సున్నం రాజయ్య, 2009లో కాంగ్రెస్ నేత కుంజా సత్యవతి గెలిచారు.

ఫొటో సోర్స్, BHATTI VIKRAMARKA MALLU
మధిర: మూడుసార్లు మల్లుకే
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన మధిరలో 2009 నుంచి కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క గెలుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ పోటీ చేస్తున్నారు.
బీజేపీ నుంచి విజయరాజు, సీపీఎం నుంచి పాలడుగు భాస్కర్ రంగంలో ఉన్నారు.
ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజ్ 2018లో బీఆర్ఎస్ నుంచి... 2009, 2014లో సీపీఎం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, FACEBOOK/RAJASINGH
గోషామహల్: బీజేపీ ప్రాబల్యం
ఉత్తర భారత ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలలో గోషా మహల్ ఒకటి. 2009 డీలిమిటేషన్‌కు ముందు మహరాజ్‌గంజ్‌గా ఉనికిలో ఉన్న ఇక్కడ అప్పటి నుంచి చూస్తే బీజేపీ ప్రభావమే ఎక్కువ.
1989 నుంచి 1999 ఎన్నికల వరకు మహరాజ్‌గంజ్ నియోజకవర్గంలో బీజేపీ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలుస్తూ వచ్చారు. 2004లో మహరాజ్‌గంజ్‌లో, ఆ తరువాత 2009లో గోషా మహల్ నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేశ్ గౌడ్ గెలిచారు.
అయితే, 2014 నుంచి ఈ నియోజకవర్గంలో రాజాసింగ్ గెలుస్తున్నారు. 2018 ఎన్నికలలోనూ ఆయన ఇక్కడ విజయం సాధించారు.
2018లో బీజేపీ విజయం సాధించిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఇదే.
ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ నుంచి రాజాసింగ్ మరోసారి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి నందకిశోర్ వ్యాస్, కాంగ్రెస్ నుంచి మొగిలి సునీత బరిలో ఉన్నారు.
ఎల్బీ నగర్: కాంగ్రెస్, టీడీపీల హవా
రంగారెడ్డి జిల్లాలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ నుంచి ఆర్.కృష్ణయ్య గెలిచారు. 2018లో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే, గెలిచాక ఇద్దరూ బీఆర్ఎస్‌లో చేరారు.
అంతకుముందు 2009లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సుధీర్ రెడ్డి ఇక్కడ గెలిచారు.
ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ గౌడ్, బీజేపీ నుంచి సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు.
మహేశ్వరం: కాంగ్రెస్ కోట
ఇది కూడా బీఆర్ఎస్‌కు కొరుకుడుపడని నియోజకవర్గమే. బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది.
2018లో సబిత ఇంద్రారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి అందుకున్నారు.
ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో ఉన్నారు.
సబిత ఇక్కడ 2009, 2018లో కాంగ్రెస్ నుంచి గెలవగా.. 2014లో టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి గెలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కాకుండా హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, బహదూర్ పుర, నాంపల్లిలోనూ బీఆర్ఎస్ ఎన్నడూ గెలవలేదు.
ఈ ఏడు ఏఐఎంఐఎంకు పట్టున్న నియోజకవర్గాలు. ఇందులో చాంద్రాయణగుట్టలో 1999 నుంచి ఇప్పటివరకు 5 సార్లు అక్బరుద్దీన్ ఒవైసీ గెలిచారు. ప్రస్తుత ఎన్నికలలోనూ ఏఐఎంఐఎం నుంచి ఆయనే అభ్యర్థి.
నాంపల్లి కూడా ఎంఐఎం వరుసగా గెలుస్తున్న నియోజకవర్గం. అయితే, ఫిరోజ్ ఖాన్ ఇక్కడ ఒకసారి టీడీపీ నుంచి, మిగతాసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ప్రతిసారీ ఆయన రెండో స్థానంలో నిలుస్తూ ఎంఐఎం అభ్యర్థులకు పోటీ ఇస్తున్నారు.
మలక్‌పేటలో 2009 నుంచి ఎంఐఎం గెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు గెలిచాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నరుగా ఉన్న ఇంద్రసేనారెడ్డి బీజేపీ నుంచి ఇక్కడ మూడుసార్లు గెలిచారు.
కార్వాన్‌లో 1985 నుంచి 1999 వరకు బీజేపీ గెలిచింది. 1999 నుంచి ఎంఐఎం గెలుస్తూ వస్తోంది.
చార్మినార్‌లో 1989 నుంచి ఎంఐఎం అభ్యర్థులకు ఓటమి లేదు. ఈ నియోజకవర్గంలో సలాఉద్దీన్ ఒవైసీ మూడుసార్లు, అసదుద్దీన్ రెండు సార్లు గెలిచారు.
ఇవి కూడా చదవండి
- జ్యులియా సికెట్టిన్: ఈ అమ్మాయి దారుణ హత్య ఇటలీని కుదిపేస్తోంది, ఎందుకు?
- నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?
- 'రూ. 5 కోట్ల లాటరీ తగిలాక అందరూ వచ్చి పలకరిస్తున్నారు'
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- క్లిటొరొమెగాలీ: యోనిలో క్లిటోరిస్ సైజును సర్జరీతో తగ్గించుకున్న ఓ యువతి కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















