ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు

మరియం, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, @NARENDRAMODI/@SHIUNA_M

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షదీవులను సందర్శించిన నేపథ్యంలో మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని చాలా మంది సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్( #BycottMaldives) అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది.

మరోవైపు మాల్దీవుల్లోని కొందరు ప్రజలు, నేతలు సైతం తమ మంత్రి మరియం, ఇతర నేతల వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు.

ఈ విషయం పెద్దది అవుతుండడంతో మాల్దీవుల ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది.

ఇటీవల మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. మొహమ్మద్ ముయిజ్జూ గత ఏడాది నవంబర్‌లో అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

మయిజ్జూకు ముందు మాల్దీవుల అధ్యక్షుడుగా మొహమ్మద్ సోలి ఉన్నారు. ఆయన ‘ఇండియా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరించారు.

కానీ ముయిజ్జూ ‘ఇండియా అవుట్’ అనే నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు.

మయిజ్జూ భారత్‌తో కాకుండా చైనాకు దగ్గరవుతున్నారు.

ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాల్లో మరింత దూరం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, @NARENDRAMODI

ఫొటో క్యాప్షన్, లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ లక్షద్వీప్‌ సందర్శన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారం ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘సాహసం ఇష్టపడే ఎవరైనా కచ్చితంగా లక్షద్వీప్‌ చూడాలి’’ అని ప్రధాని తన ఎక్స్‌ హ్యాండిల్‌లో రాశారు. లక్షద్వీప్‌ పర్యటకాన్ని ప్రోత్సహించాలని మోదీ చూస్తున్నారు.

ఈ ఫోటోలను చూసిన తర్వాత, గూగుల్‌లో లక్షల మంది ప్రజలు లక్ష్యదీప్‌ల గురించి వెతికారు. మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌లలో హాలిడేస్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్‌ మీడియాలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.

ప్రతి ఏడాది భారత్ నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలు మాల్దీవులను సందర్శిస్తూ ఉంటారు.

మాల్దీవుల్లోని భారత రాయబారి కార్యాలయం లెక్కల ప్రకారం, 2022లో 2 లక్షల 41 వేల మంది, 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారని తెలిసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మాల్దీవులకు బదులు లక్షద్వీప్ వెళ్లాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైన తర్వాత, మాల్దీవుల నుంచి కూడా పలు రకాల స్పందనలు వచ్చాయి.

మాల్దీవుల ప్రభుత్వంలోని మంత్రి మరియం షియునా కూడా కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్లలో ఒకటి డిలీట్ చేశారు. ‘మాల్దీవులకు భారత సైన్యం అవసరం లేదంటూ’ మరో ట్వీట్ చేశారు.

మరియంతో పాటు, మాల్దీవుల్లోని చాలా మంది నేతలు ఆమెలాంటి కామెంట్లే చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

కేవలం సామాన్య ప్రజలే కాక, బాలీవుడ్ స్టార్లు, క్రీడాకారులు సైతం స్పందిస్తున్నారు.

మాల్దీవుల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ఈ విషయంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

‘‘మాల్దీవుల ప్రభుత్వ మంత్రి మరియం ఎలాంటి భయంకరమైన భాషను వాడారు. అది కూడా మాల్దీవుల భద్రత, శ్రేయస్సుకు అత్యంత ముఖ్యమైన, సన్నిహిత దేశంపై ఈ వ్యాఖ్యలు చేశారు. మయిజ్జూ ప్రభుత్వం ఈ కామెంట్లకు దూరంగా ఉండాలి. అలాగే ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలు కావని స్పష్టం చేయాలి’’ అని మొహమ్మద్ నషీద్ సోషల్ మీడియాలో సూచించారు.

మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జూ

ఫొటో సోర్స్, GETTYIMAGES

మంత్రి వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం స్పష్టత

కొన్ని గంటల తర్వాత మాల్దీవుల ప్రభుత్వం దీనిపై స్పందించింది.

‘‘విదేశీ నేతలు, ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన అనుచిత వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసింది. ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలు కావు’’ అని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది.

‘‘భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యరీతిలో, బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలాంటి ద్వేషానికి, ప్రతికూలతకు దారితీయకూడదు. అంతర్జాతీయ భాగస్వాములతో మాల్దీవుల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపకూడదు’’ అని చెప్పింది.

‘‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి చెందిన సంబంధిత విభాగాలు వెనుకాడవు’’ అని తెలిపింది.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, X@NARENDRAMODI

ఫొటో క్యాప్షన్, లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ

ప్రధాని మోదీకి మద్దతుగా సెలబ్రిటీలు

భారతీయులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రముఖ వ్యక్తులంటూ సోషల్ మీడియా స్క్రీన్‌షాట్లను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షేర్ చేశారు.

‘‘పెద్ద ఎత్తున పర్యాటకులను పంపించే దేశానికి(భారత్‌కు) వ్యతిరేకంగా వీరు ఈ పనిచేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మనం పొరుగు వారితో సన్నిహితంగా ఉండాలని అనుకుంటాం. కానీ, ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను మనం ఎందుకు భరించాలి? నేను చాలా సార్లు మాల్దీవులకు వెళ్లాను. వాటి అందాలను పొగిడాను. కానీ, తొలుత మన ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మన భారత దీవులను అన్వేషిద్దాం. మన దేశ పర్యటకానికి తోడుగా నిలుద్దాం’’ అని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రాశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అక్షయ్ కుమార్ పోస్ట్ రీపోస్ట్ అవుతోంది.

తాను కూడా మాల్దీవులకు చాలా సార్లు వెళ్లానని, దాని అందాలను పొగిడానని సురైశ్ రైనా చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

భారతీయ దీవులను అన్వేషించాలని ఆయన కూడా ప్రజలను కోరారు.

మాల్దీవుల ఫోటోలను షేర్ చేసిన నటుడు జాన్ అబ్రహం.. ‘‘భారత్‌కు అద్భుతమైన ఆతిథ్య స్ఫూర్తి ఉంది. అదే ‘అతిథి దేవో భవ’. భారత్ భూభాగంలో ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని మనం అన్వేషించాల్సి ఉంది. లక్షద్వీప్‌ సందర్శించదగ్గ ప్రదేశం’’ అని అన్నారు.

#exploreindianislands అనే హ్యాష్‌టాగ్‌తో సెలబ్రిటీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.

సచిన్ తెందూల్కర్ సైతం మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ బీచ్ అందాల వీడియోను షేర్ చేశారు.

‘‘భారత్‌లో ఇలాంటి అద్భుతమైన బీచ్‌లు, దీవులు ఉన్నాయి. ‘అతిథి దేవో భవ’ అనే స్ఫూర్తితో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు పోగేసుకునేందుకు అవి వేచిచూస్తున్నాయి’’ అని చెప్పారు.

మాల్దీవులపై శ్రద్ధా కపూర్ కూడా ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, మోదీ లక్షద్వీప్ పర్యటన, మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం ఏంటి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)