చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?

- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ తమిళ్
ఆత్మహత్య చేసుకుంటే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో శ్రీలంకలో ఓ పాస్టర్ సహా ఏడుగురు చనిపోయారు.
రువాన్ ప్రసన్న గుణరత్నె అనే 47 ఏళ్ల వ్యక్తి బౌద్ధమతాన్ని వక్రీకరిస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బోధనలు చేశారు.
ఆత్మహత్య చేసుకోవడం ద్వారా త్వరగా పునర్జన్మ పొందవచ్చని ఆయన తన బోధనల్లో చెప్పినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఆయన మొదట్లో ఓ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగిగా పనిచేసినట్లు తెలిసింది.
ఆ తర్వాత కొద్దికాలానికి, కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాన్ని వదిలేసి శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో బోధనలు చేస్తూ ఉండేవారు. అనూహ్యంగా, డిసెంబర్ 28న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
హొమగామ ప్రాంతంలోని తన ఇంట్లో ఆయన విషం తీసుకుని చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది.
పాస్టర్ భార్య కూడా తన ముగ్గురు పిల్లలకు భోజనంలో విషం కలిపి పెట్టి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలపై మలబె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన భార్య, మానసిక ఒత్తిడి భరించలేక తన బిడ్డలకు విషం కలిపిన భోజనం పెట్టి, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు మొదట్లో భావించారు. కానీ, ఈ ఘటనలపై సందేహాలు వ్యక్తం కావడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
దర్యాప్తులో భాగంగా, ఆ కుటుంబం అంత్యక్రియలకు హాజరైన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు.
అంబలంగోడా ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల పీర్తి కుమారా అనే వ్యక్తిని పోలీసులు విచారించారు.
ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పాస్టర్ బోధనలకు కొన్నేళ్ల కిందట తాను హాజరయ్యాయని సదరు వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
అందువల్లే, తాను పాస్టర్ భార్య, వారి పిల్లల అంత్యక్రియలకు హాజరైనట్లు చెప్పారు.
పాస్టర్ బోధనలు ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఉండేవని కూడా ఆయన పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
త్వరగా పునర్జన్మ పొందవచ్చన్న ఉద్దేశంతోనే సదరు పాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఇచ్చిన వాంగ్మూలం చెబుతోంది.
ఈ క్రమంలో, పాస్టర్ బోధనల్లో పాల్గొన్నట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన 34 ఏళ్ల పీర్తి కుమారా కూడా ఆత్మహత్య చేసుకున్నారు.
మహారగమ ప్రాంతంలోని ఒక హోటల్ గదిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 2న ఒక విధమైన మత్తు మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆయన తీసుకున్నట్లుగా అనుమానిస్తున్న విషపూరిత మత్తు పదార్థాలను హోటల్ గదిలో పోలీసులు సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, SRI LANKA POLICE
ఇదే తరహాలో, పాస్టర్ భార్య, పిల్లల అంత్యక్రియలకు హాజరైన యువతి ఒకరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె యక్కల ఏరియాలోని తన ఇంటి వద్దే ప్రాణాలు తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న యువతి పాస్టర్ బోధనలకు హాజరైనట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు.
వారందరూ ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన విష పదార్థం కూడా ఒకటేనా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
అలాగే, పాస్టర్ బోధనలకు హాజరయ్యానని చెప్పిన వ్యక్తికి సంబంధించి పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో భాగంగా కొందరిని గుర్తించి విచారించారు.
అలాగే, వారిలోనూ ఇలాంటి భావనలు ఏమైనా ఉన్నాయోమేననే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
పోలీస్ ప్రతినిధి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిహాల్ తల్దువా మీడియాతో మాట్లాడుతూ- వారంతా సైనైడ్ లాంటి విషపదార్థం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
''నాలుగు ఘటనల్లోనూ ఒకే విధంగా మరణాలు జరిగాయి. విష పదార్థాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న బ్యాగ్‌ను గుర్తించాం. అందులోని చిన్నచిన్న బక్కెట్లలో ఆ విషపదార్థం దొరికింది. అది సైనైడ్‌గా భావిస్తున్నాం. ల్యాబ్ నివేదిక వచ్చిన అనంతరం అదేంటనేది తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ, ఇది హానికర స్వభావం'' అని నిహాల్ తల్దువా చెప్పారు.
విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని ఆ పాస్టరే బోధించినట్లు విచారణ బృందాల దర్యాప్తులో నిర్ధరణ అయింది. ఇప్పుడు చనిపోతే, ఇంకా ఉన్నతమైన జన్మ దక్కుతుందని బోధించారు. వాటిని నమ్మేవాళ్లు కూడా ఉంటారు. ఆయన బోధనల్లో పాల్గొన్న వారి బంధువులు వీటిని గమనించాలని కోరుతున్నా'' అని ఆయన విజ్ఞప్తి చేశారు.
(గమనిక: మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ ఎన్నికలు భారత్‌కు ఎందుకంత ముఖ్యం?
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














