మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?

సావిత్రిబాయి ఫూలే
    • రచయిత, ప్రాచీ కులకర్ణి
    • హోదా, బీబీసీ మరాఠీ కోసం

మహాత్మ జ్యోతిబా ఫూలే, క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే 1848 జనవరి 1న తొలిసారి అమ్మాయిల కోసం పాఠశాలను ప్రారంభించారు.

ఆయన తీసుకున్న ఈ నిర్ణయం భావితరాల భవిష్యత్తు దిశను మార్చేసింది. పుణెలో ఆ స్కూల్ ఏర్పాటు చేసిన స్థలంలో ప్రస్తుతం స్మారక చిహ్నం నిర్మిస్తున్నారు.

మహాత్మ ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఈ పాఠశాలను ఎలా ప్రారంభించారు? అసలు అప్పటి పరిస్థితులేంటనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అహ్మద్ నగర్ కేంద్రంగా వెలువడే జ్ఞానోదయ మేగజైన్‌ను పరిశీలిస్తే అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.

అతిశూద్రులకు (అణగారిన వర్గాలకు) జ్ఞానం బోధించే ఒక గ్రూపు ఉండేది. దానికి జ్యోతిరావు గోవింద్ ఫూలే నాయకుడు. ఇటీవల ఈ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు, ఆయన చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయి.

''ఈ దేశంలో భారీ సంఖ్యలో ఉన్న మహార్లు, మాంగ్‌లు, చాంభార్లు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉండడం చూసి, వారికి విద్యను అందించేందుకు మార్గాలను అన్వేషించాలని అనిపించింది.

మదర్ యోగా (తల్లి యోగా) ద్వారా చిన్నారుల ఎదుగుదల బాగుటుందనే ఆలోచన వచ్చింది. అందుకోసం మొదట బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేయాలి. ఆ క్రమంలో ఒక మిత్రుడితో కలిసి అహ్మద్ నగర్ వెళ్లి అక్కడ అమెరికన్ మిషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలో, మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు వెళ్లాను. నాకు వాళ్లను చూసి చాలా ముచ్చటేసింది. పాఠశాలను బాగా నడుపుతున్నారు.

అక్కడి నుంచి వచ్చి పుణెలో బాలికల పాఠశాల ప్రారంభించాం. చదవడం, రాయడం, గణితం, వ్యాకరణం నేర్పించడం మొదలుపెట్టాం. అయితే, శూద్రులకు చదువు చెప్పడం మా కులపెద్దలకు నచ్చలేదు. మా నాన్న నన్ను తన్ని ఇంటి నుంచి గెంటేశారు.

స్వీయ రక్షణ కోసం ఏదైనా చేయాలని అప్పుడు అనిపించింది. అయితే, పాఠశాల మూతపడింది. మళ్లీ స్కూల్ ప్రారంభించేందుకు కొద్దిరోజుల పాటు ప్రయత్నించాం. కానీ చాలా కష్టమైంది. ఎందుకంటే, స్కూల్‌కు స్థలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొత్త స్కూల్ కట్టడానికి డబ్బులు లేవు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను పంపించేందుకు వెనుకాడారు.''

భిడే వాడాలో ప్రారంభించిన తొలి బాలికల పాఠశాల గురించిన ఈ ప్రస్తావన మహాత్మ ఫూలే రాసిన సమగ్ర వాంగ్మయ్‌లో ఉంది.

ఇది 1953 సెప్టెంబర్ 12న జ్ఞానోదయలో ప్రచురితమైన కథనం సారాంశం.

బాలికా విద్యకు అడుగులు వేసిన భిడే వాడాలోని తొలి బాలికా పాఠశాల ప్రదేశాన్ని ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పాత కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ బాలికల తొలి పాఠశాల స్మారక చిహ్నం నిర్మించనున్నారు.

బాలికా పాఠశాల

బాలికల మొదటి పాఠశాల ఎలా ఉండేది?

బాలికల మొదటి పాఠశాలను స్మారకంగా మార్చాలని సామాజిక కార్యకర్త నితిన్ పవార్ ఎన్నో ఏళ్లుగా కృ‌షి చేస్తున్నారు.

''సావిత్రిబాయి 1847లో నాల్గవ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఆడపిల్లలకు చదువు చెప్పేందుకు చొరవ తీసుకోవాలని మహాత్మ ఫూలే పట్టుబట్టారు. అలా 1848 జనవరి 1న ఫూలే దంపతులు తాత్యాసాహెబ్ భిడియా ప్యాలెస్‌లో మొదటి పాఠశాలను ప్రారంభించారు."

''మొదట తమ స్నేహితుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు అక్కడ చదువుకున్నట్లు పాత రికార్డుల్లో ఉంది. ఈ బాలికల పాఠశాల ప్రయోగం సనాతనవాదుల ఆగ్రహానికి కారణమైంది. కానీ, అణగారినవర్గాల ప్రజలు చాలా సంతోషించారు. షాహీరా అనే దస్త్రాల్లో దీని గురించిన ప్రస్తావన ఉంది. ఆ పాఠశాలలో బ్రాహ్మణ, షెన్వి, ప్రభు కులాలకు చెందిన బాలికలు ఉన్నట్లు అందులో ఉంది.''

ఆ స్కూల్లో వారు కాకుండా ఇంకా చాలా మంది బాలికలు ఉన్నారని అందులో ఉంది.

భిడే ప్యాలెస్‌లోని రెండు గదుల్లో ఈ పాఠశాల నడిచేదని సావిత్రిబాయి ఫూలే పుణె యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రద్ధా కుంభో‌జ్‌కర్ చెప్పారు.

ఈ పాఠశాలల్లో బోధించే అంశాలను కూడా ఫూలేనే నిర్ణయించారని ఆమె అన్నారు.

''ఫూలే పాఠశాలలో ఏఏ సబ్జెక్టులు బోధించారు, ఏ పుస్తకాలను అనుసరించారు అనే వివరాలు మహాత్మ ఫూలే రచించిన సమగ్ర వాంగ్మయ్‌లో ఉన్నాయి. భౌగోళిక శాస్త్రం, చరిత్ర, గణితం, వ్యాకరణం బోధించారు. అందుకోసం గతంలోనే ఉన్న కొన్ని భారతీయ పుస్తకాలు, మరికొన్ని ఇంగ్లిష్ పుస్తకాలను అనువదించి ఉపయోగించారు. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా ఉండేది కాదు. కొద్దికాలం తర్వాత బాలికలకు ఇలాంటి కోర్సులు ఎందుకు నేర్పిస్తున్నారంటూ తిలక్ నిరసన వ్యక్తం చేశారు.''

సావిత్రిబాయి ఫూలే

పాఠశాలకు చోటిచ్చిన తాత్యారావు భిడే ఎవరు?

తాత్యారావు భిడేకి చెందిన ప్యాలెస్‌లో ఫూలే దంపతులు పాఠశాల ప్రారంభించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఈ తాత్యారావు భిడే ఎవరనే విషయం గురించి ప్రొఫెసర్ శ్రద్ధ చెబుతూ, ''ఈ ప్యాలెస్ యజమాని శంకర్‌ రామచంద్ర భిడే. వారి గురించిన సమాచారం భిడే కుల్వ్రుతన్‌లో ఉంది. దాని ప్రకారం భిడే ఓ వడ్డీ వ్యాపారి. పెష్వాయ్‌ల పాలన అనంతరం రాజు ఆశ్రయం పొందేందుకు ఆయన పట్వర్ధన్‌కు వెళ్లి, అక్కడే ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు.

ఆయన మొదటి భార్య, ఆమె పిల్లలు పుణెలో ఉండేవారు. శంకర్‌రావు భిడే మరణానంతరం ఆస్తి వ్యవహారంలో ఇద్దరు భార్యల పిల్లల మధ్య వివాదం తలెత్తింది. ఆ కేసు కోర్టుకెళ్లింది. ఆ కేసుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో భిడే కుటుంబం గురించిన సమాచారం ఉంది. శంకర్‌రావు భిడే దత్తతకు వచ్చినట్లుగా కూడా వాటిలో ఉంది.''

ఆ ప్యాలెస్‌లోనే ఈ పాఠశాల ప్రారంభించినట్లు ప్రొఫెసర్ చెప్పారు.

''తాత్యాసాహెబ్ భిడే ఆదర్శ భావాలున్న వ్యక్తి. ఆయన మహాత్మ ఫూలే మిత్రుడు. అంతపెద్ద ప్యాలెస్‌లో భార్య, తన ఇద్దరు పిల్లలతో ఆయన నివాసం ఉండేవారు. బాలికల పాఠశాల గురించి భిడేకి చెప్పినప్పుడు, ఆ ఆలోచన ఆయనకు నచ్చి, తన ప్యాలెస్‌లో పాఠశాల పెట్టుకునేందుకు చోటిచ్చారు. దానితో పాటు ప్రారంభ ఖర్చుల కోసం 101 రూపాయల విరాళం కూడా ఇచ్చారు'' అని నితిన్ పవార్ చెప్పారు.

బాలికా విద్యకు తొలి అడుగు..

పాఠశాల ప్రారంభానికి ముందే సావిత్రిబాయి ఫూలే తన చదువు పూర్తి చేశారు. మొదట్లో జ్యోతిరావు ఫూలె ఆమెకు చదువు చెప్పినట్లు రికార్డుల్లో ఉంది.

''ప్రాథమిక విద్య అనంతరం, సావిత్రిబాయి ఫూలేకి తర్వాతి చదువులు చెప్పే బాధ్యతను తన సహచరులైన గోవాండే, భావల్కర్‌కు మహాత్మ ఫూలే అప్పగించారు'' అని శ్రద్ధ చెప్పారు.

''1847లో సావిత్రిబాయి ఫూలే నాల్గవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత బాలికలకు చదువు చెప్పే బాధ్యతలు తీసుకోవాలని జ్యోతిరావు ఫూలే పట్టుబట్టారు. అనంతరం సావిత్రిబాయి ఫూలే తన సహచరిణి సుగుణాబాయితో కలిసి మిచెల్ బెయిన్‌లో పాఠశాల బోధనలో నైపుణ్య శిక్షణ పూర్తి చేశారు. ఇది శాస్త్రి నారోబా బాజీ మహాఘట్ పాటిల్ జీవిత చరిత్రలో రాసి ఉంది. అలా ఫూలే దంపతులు భిడే వాడాలో 1848 జనవరి 1న బాలికల పాఠశాలను ప్రారంభించారు'' అని నితిన్ పవార్ చెప్పారు.

ఫూలే రాసిన దాని ప్రకారం, ఆయన అహ్మద్‌నగర్‌లోని ఫర్రార్స్ నర్సరీ స్కూల్‌ని సందర్శించారు. ఆ తర్వాత పుణెలో పాఠశాలను ప్రారంభించారు.

''అహ్మద్‌నగర్‌లోని స్కూల్ చూసేందుకు ఫూలే తన స్నేహితులతో కలిసి వెళ్లారు. అయితే ఫర్రార్స్ స్కూల్ మతపరమైన ప్రయోజనాల కోసం నడిచేది. అందువల్ల చాలా మంది వారి పిల్లలను ఆ పాఠశాలకు పంపించేవారు కాదు. సామాన్య బాలికలకు విద్య అందేది కాదు. దీంతో ప్రతి ఒక్కరూ ఫూలే స్కూల్లో చేరిపోయారు. ఆయన బాలికా విద్యకు తలుపులు తెరిచారు'' అని వివరించారు నితిన్ పవార్.

ఆ రోజుల్లో చాలా కొద్దిమంది మహిళలను మాత్రమే అవసరమైనంత చదివించేవారని శ్రద్ధ అన్నారు. అహల్యా దేవి హొల్కర్ వంటి కొందరు మహిళలు చదువుకున్నట్లు తెలుస్తోంది కానీ, అప్పటికి విద్య అందరికీ అందుబాటులో లేదని ఆమె అన్నారు.

బాలికా పాఠశాల

పాఠశాల ప్రారంభించిన తర్వాత..

భిడే వాడాలో ఏర్పాటు చేసిన మొదటి పాఠశాల ఏడాదికే మూతపడింది. ఆ పాఠశాలను మళ్లీ తెరిచేందుకు మహాత్మ ఫూలే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ప్రారంభమైన పాఠశాల ఇక మూతపడలేదు.

ఆ స్కూల్ మూతపడిన తర్వాత మహాత్మ ఫూలే బాలికల కోసం మరిన్ని పాఠశాలలు ప్రారంభించారు. సమగ్ర వాంగ్మయ్‌లో పేర్కొన్న దాని ప్రకారం, పుణెలో నాల్గో తరగతి వరకూ చదువుకునే విధంగా మూడు బాలికల పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

వాటిని పూణా నేటివ్ ఫిమేల్ స్కూల్ (పూణా స్థానిక బాలికల పాఠశాల)గా పిలిచేవారు. ఈ పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షలను చూసేందుకు దాదాపు 3 వేల మంది గుమిగూడినట్లు చెబుతారు.

ఫిబ్రవరి 12న పూణా కాలేజీలో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పరీక్షను చూసేందుకు వచ్చిన వారిలో యూరోపియన్లతో పాటు భారతీయులు కూడా ఉన్నారు.

దాదాపు 31 వేల మంది అక్కడికి వచ్చినట్లు సమాచారం. పరీక్ష పూర్తయిన తర్వాత, పాఠశాలకు సాయం చేయాలని అక్కడికి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశారు.

గత రికార్డుల ప్రకారం, బాలికల పాఠశాల బోధనాంశాల్లో కథలు, మరాఠా చరిత్ర, వ్యాకరణం, ఆసియా - భారత్ మ్యాప్‌లు, గణితం, లేఖలు రాయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ తరగతులు ఉండేవి.

వాటితో పాటు మహాత్మ ఫూలే 'పూణా మహర్ అండ్ మాంగ్ స్కూల్స్'ను స్థాపించారు. ఈ స్కూల్ కమిటీ ప్రెసిడెంట్‌గా సదాశివ్ బల్లాల్ వ్యవహరించారు. జ్యోతిరావు ఫూలే వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు.

స్కూల్ పత్రాల ప్రకారం, మొరో విఠల్, సఖారామ్ యశ్వంత్, వామన్ ప్రభాకర్ వంటి వారు వివిధ హోదాల్లో ఉన్నారు. మొదటి స్కూల్‌లో 106 మంది విద్యార్థులు, రెండో స్కూల్‌లో 83 మంది, మూడో స్కూల్‌లో 69 మంది ఉండేవారు.

అక్కడ పాఠాలు చెప్పిన టీచర్ల గురించి రికార్డుల్లో భద్రంగా ఉంది. విష్ణు మోరేశ్వర్, రామచంద్ర మోరేశ్వర్, రాఘో సఖారామ్, కేస్ త్రయంబక్, విఠోబా బిన్ బాపూజి, వినాయక్ గణేశ్, గను శివ్‌జీ మాంగ్, గనోజి బిన్ రాజోజి ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఈ పాఠశాలల్లో చదవడం, రాయడం, నీతి కథలు, వ్యాకరణం, భౌగోళిక శాస్త్రం, ఆసియా - భారత దేశ మ్యాప్‌లు, లెక్కల వంటి సబ్జెక్టులను బోధించేవారు. బాలికలు, బాలుర పాఠశాలల్లో బోధించే పాఠ్యాంశాల్లో పెద్దగా తేడా ఉండేది కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)