నలదుర్గ్: కోట లోపల ఆనకట్ట, ఆ జలాశయంలోనే రాజభవనం ఉన్న ఒకే ఒక్క దుర్గం

ఫొటో సోర్స్, DHARASHIV DISTRICT OFFICE
- రచయిత, ఆశయ్ యేడగే
- హోదా, బీబీసీ మరాఠీ
మరాఠ్వాడా పేరు ప్రస్తావనకు రాగానే, వర్షాభావ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పథకాలు అందకపోవడం, నిధుల లేమి వంటి విషయాలు గుర్తుకొస్తాయి. కానీ, ఒకప్పుడు యూరప్ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల్లో మరాఠ్వాడా కేంద్రబిందువుగా ఉండేదని చాలా మందికి తెలియదు.
మరాఠ్వాడాలోని టెర్, పేథాన్, భోకర్దాన్ వంటి చిన్న పట్టణాల నుంచి సరుకులు సహ్యాద్రి పర్వతశ్రేణిలోని నానేఘాట్ మీదుగా చారిత్రక నలసొపారా ఓడరేవుకు వెళ్లి, అక్కడి నుంచి నౌకల ద్వారా యూరప్‌కు రవాణా అయ్యేవి.
దక్షిణ భారత దేశం నుంచి మరాఠ్వాడా మీదుగా యూరప్‌తో వాణిజ్య వ్యవహారాలు నడిచేవి. ఇది కీలక వాణిజ్య మార్గంగా ఉండడంతో రక్షణ కోసం ఈ రహదారిలో అనేక కోటలను నిర్మించారు.
దాదాపు రెండు వేల ఏళ్లు వివిధ రాజవంశాలు ఈ మరాఠ్వాడా ప్రాంతాన్ని పాలించాయి. అందువల్ల ఒస్మానాబాద్ జిల్లాలో ప్రధానమైన అనేక కోటలు నిర్మితమయ్యాయి.
నలదుర్గ్, పరండా, ఔసా, ఉద్గిర్, రామ్‌దుర్గ్ కోటలు మరాఠ్వాడాలో మండే ఎండల నుంచి రక్షణగానూ, కొన్నిసార్లు సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు, మరికొన్నిసార్లు వ్యవసాయదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇతోధికంగా సాయపడ్డాయి.
మహారాష్ట్రలో అన్ని హంగులూ ఉన్న అతిపెద్ద కోట నలదుర్గ్.
ఈ కోట నలదుర్గ్, రాణ్‌మండల్‌లను కలుపుతూ ఉండేది. ఇలాంటి కోట మరెక్కడా లేదు. ఎందుకంటే, ఈ కోటలో నీటి వనరుల సమర్థ నిర్వహణతో పాటు, పాలకులు ఈ కోట నుంచి చుట్టుపక్కల ప్రాంతాలపై ఎలా నియంత్రణ సాధించారనే అంశాలపై నిజంగా అధ్యయనం చేయాల్సిందే.
ఈ నలదుర్గ్ కోట చుట్టూ మూడు వైపులా నీరు ఉంటుంది. నాలుగో వైపు పెద్ద లోయ ఉంటుంది.

ఫొటో సోర్స్, DHARASHIV DISTRICT OFFICE
నలదుర్గ్ కోట నిర్మించిన కొండ చుట్టూ ఎత్తైన కొండలు ఉండడంతో దగ్గరికి వెళ్లే వరకూ అక్కడ కోట ఉందని కూడా ఎవరికీ తెలియదు.
దాదాపు మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కోటలో పానీ మహల్ చాలా ప్రత్యేకం.
కోట సమీపంలో ప్రవహించే బోరి నదిని దారిమళ్లించి కోటకు రక్షణగా మలిచారు. వర్షాకాలంలో వానలు మొదలైన తర్వాత ఇక్కడ రంగురంగులుగా కనువిందు చేసే స్త్రీ, పురుష జలపాతాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు.
ఎందుకంటే, ఇది నలదుర్గ్, రాణ్‌మండల్ అనే రెండు కోటలను కలుపుతూ నిర్మించిన కోట. చాలా మంది ఈ కోటను 'జోడాఖిల్లా' (జోడు కోటలు)గా పిలుస్తారు.
కోట రక్షణ కోసం అలా నిర్మించారు. ఆ కోటలో మొత్తం 114 స్తంభాలు ఉన్నాయి.
పరండా, ఉపాలి, సంగ్రామ్, నవ్‌బురుజ్ నలదుర్గ్ కోటలోని ప్రధాన నిర్మాణాలు. కోట ఎగువ బురుజులో మూడు ఫిరంగులు ఉంచేంత విశాలమైన స్థలం ఉంది. అదే కోటలో ఎత్తైన ప్రదేశం.
కోటలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం 'హల్ముఖ్ దర్వాజా'. శత్రదుర్బేధ్యంగా ఈ కోటను నిర్మించినట్లు ఆ ద్వారాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
ఆ ద్వారాన్ని చూస్తే అదే ప్రధాన ద్వారం అనిపిస్తుంది. కానీ, కొంతముందుకి వెళ్లాక కానీ తెలియదు అది ప్రధాన ద్వారం కాదని. ఎవరైనా దాన్ని చూసి ప్రధాన ద్వారం ఇదే అనుకోవాలని దానిని నిర్మించినట్లు అర్థమవుతుంది.
మలుపులు తిరుగుతూ కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత కోట ప్రధాన ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి నలదుర్గ్ రహస్యాలు ఒక్కొక్కటీ తెలుసుకునే ప్రయాణం మొదలవుతుంది.

ఫొటో సోర్స్, DHARASHIV DISTRICT OFFICE
నలదుర్గ్‌కు ఆ పేరెలా వచ్చింది?
ఈ కోట నేపథ్యం పురాణాల్లో చెప్పిన నలుడు, దమయంతితో ముడిపడి ఉంది. నలుడు ఈ కోటను నిర్మించినట్లు 'తారిఖ్ ఇ ఫరిష్టా' పుస్తకంలో రాసి ఉంది. అలా ఈ కోటకు నలదుర్గ్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు.
నలదుర్గ్ అనేది నగరమని, దానికి పూర్వంలో మైలార్‌పూర్‌గా పిలిచేవారని చరిత్రకారులు, స్కాలర్ జైరాజ్ ఖోచ్రే చెప్పారు.
మైలార్ అనేది దేవత ఖండోబా పేరు నుంచి వచ్చింది. అలాగే, నల్ల అంటే తెలుగులో నలుపు, దుర్గ్ అంటే దుర్గం, లేదా కోట అనర్థం. దాని ప్రకారం, నల్లటి రాళ్లతో కట్టినందువల్ల దానికి నలదుర్గ్ అనే పేరు వచ్చి ఉండొచ్చన్నారు.
ఆదిల్‌షాహీల కాలంలో ఈ కోటలను షాహ్‌దుర్గ్ అని పిలిచినప్పటికీ, ఆ పేరు అంతగా ప్రసిద్ధి చెందలేదు.
చాళక్యులు, బహ్‌మనీ సుల్తానులు, నిజాంషాహీలు, ఆదిల్‌షాహీలు, మొఘలులు, మరాఠాలు, బ్రిటిష్ పాలకులకు ఈ నలదుర్గ్ కోట సాక్ష్యంగా నిలిచింది. స్వతంత్ర భారతంలోనూ ఈ కోటకు ప్రత్యేకత ఉంది.

ఫొటో సోర్స్, PRAGATIPRAKASHAN
నలదుర్గ్ కోట చరిత్ర
సుమారు 1351 నుంచి 1480ల మధ్య కాలంలో బహ్‌మనీల ఏలుబడిలో ఈ మట్టికోటను పునర్నిర్మించినట్లు నలదుర్గ్ కోట చరిత్ర గురించి జైరాజ్ ఖోచ్రే రాసిన 'దుర్గ్ నలదుర్గ్' పుస్తకంలో రాశారు.
మట్టికి బదులు రాతితో నిర్మాణం చేయడంతో నలదుర్గ్ పటిష్టంగా మారింది. దాని పక్కనే రాణ్‌మండల్ అనే మరో పాత కోట ఉంది.
బీజాపూర్‌కి చెందిన ఆదిల్ షా 1481లో నలదుర్గ్ కోటను జయించారు.
ఆ తర్వాత 1558లో ఆదిల్ షా రాతి నిర్మాణాలతో ఈ కోటను బలోపేతం చేశారు. అనంతరం 1613లో ఇబ్రహీం ఆదిల్ షా - 2 బోరి నదిపై ఆనకట్ట కట్టడం ద్వారా పానీ మహల్ నిర్మాణం చేపట్టారు. దీంతో నలదుర్గ్, రాణ్‌మండల్ కోటలు ఏకమయ్యాయి.
ఆ తర్వాతి కాలంలో 1676లో ఔరంగజేబు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ కోట మొఘలుల నియంత్రణలోకి వెళ్లింది.
అనంతరం 1724లో ఖమరుద్దీన్ అలియాస్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్‌జా మొఘలుల నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యం స్థాపించారు. తదనంతర కాలంలో నలదుర్గ్ నిజాంల నియంత్రణలోకి వెళ్లిపోయింది.
1758లో జరిగిన ఒప్పందంతో పేష్వాలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో కొద్దికాలం నలదుర్గ్‌ను మరాఠాలు పాలించారు. ఆ తర్వాత నిజాం మరోసారి ఈ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ తర్వాత 1853లో ఈస్టిండియా కంపెనీ నుంచి రుణం తీసుకునేందుకు వర్హాద్, నలదుర్గ్, రాయచూర్ జిల్లాలను నిజాం బ్రిటిష్ వారికి అప్పగించారు.
అనంతరం, 1857 తిరుగుబాటు అణచివేతలో సహకరించినందుకు బ్రిటిష్ వారు నలదుర్గ్, రాయ్‌చూర్‌ను నిజాంకు బహుమతిగా ఇచ్చారు.
ఇక ఆ తర్వాత 1948లో భారత ప్రభుత్వం ఈ కోటను, మొత్తం మరఠ్వాడాను నిజాం పాలన నుంచి విడిపించింది. సైనిక చర్య ద్వారా నిజాం పాలనను అంతమొందించడంతో ఈ రాజ్యం స్వతంత్ర భారతంలో కలిసిపోయింది.

ఫొటో సోర్స్, DHARASHIV DISTRICT OFFICE
పానీ మహల్, ఆనకట్ట
ఇబ్రహీం ఆదిల్‌షా 2 కాలంలో, ఆర్కిటెక్ట్ మీర్ ఇమాదిన్ నీళ్ల మధ్యలో ప్యాలెస్(పానీ మహల్)తో పాటు, బోరి నదిపై ఆనకట్టను నిర్మించారు.
సుమారు 1022 హిజ్రీ (అంటే 1613 ప్రాంతం)లో, అదే పానీ మహల్‌లో పర్షియన్ భాషలో రాసిన లేఖనంలో ఈ ఆనకట్ట గురించి సవివరంగా రాశారు.
పానీ మహల్‌లో లభ్యమైన సమాచారాన్ని బట్టి, మొదటి అలీ ఆదిల్ షా (158-1579) కాలంలోనే ఈ జలాశయం నిర్మాణం ప్రారంభమైంది. ఈ డ్యామ్ నిర్మాణం నలభై ఏళ్ల తర్వాత ఇబ్రహీం ఆదిల్ షా -2 కాలంలో పూర్తయింది.
ఈ జలాశయం కేవలం వ్యూహాత్మక నిర్మాణం మాత్రమే కాదు, ఆదిల్‌షాహీ సుల్తానులకు విశ్రాంతి ప్రదేశం కూడా.
పానీ మహల్‌లోని ఫౌంటెయిన్, పానీ మహల్ కిటికీల నుంచి కనిపించే జలపాతాల సుందర దృశ్యాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
రెండు కోటలను కలుపుతూ నిర్మించిన ఈ డ్యామ్, ఆదిల్ షాహీల వ్యూహాత్మక రక్షణ ప్రణాళికల్లో భాగమని 1520లలో ఆదిల్ షాహీని విజయనగర రాజులు ఓడించిన తర్వాత అర్థమైంది.
ఈ డ్యామ్ కళ్లకు ఎంత రమణీయంగా కనిపిస్తుందో, ఆలోచనల్లోనూ అంతే కట్టిపడేస్తుంది.
మరఠ్వాడాలో తీవ్రవర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కోట పరిధిలో నివసించే సైన్యం, రైతులకు నీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఆనకట్టను నిర్మించారు.
ఈ జలాశయం విస్తీర్ణం దాదాపు 82,569 చదరపు కిలోమీటర్లు. దీని మరో ప్రత్యేకత ఏంటంటే, అక్కడి వ్యవసాయ భూములు ఎంత ఎత్తులో ఉన్నాయో, జలాశయం ఎత్తు కూడా అంతే ఉండేది. దీని వల్ల వ్యవసాయానికి నీటిని సరఫరా చాలా తేలిక.
ఈ డ్యామ్ గోడకు అనుసంధానంగా గాలి, వెలుతురు బాగా వచ్చేలా నిర్మించిన ఈ పానీ మహల్ నీటికి అడ్డుకట్టలా ఉండేది.
ఇక్కడ నిల్వ చేసిన నీరు పానీ మహల్‌లోని స్త్రీ, పురుష జలపాతాలుగా పిలిచే ద్వారాల గుండా బయటికి ప్రవహిస్తుంది. అయితే, నీళ్లు పానీ మహల్‌లోకి రాని విధంగా నిర్మాణం చేశారు.
పానీ మహల్‌లోకి వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ పానీ మహల్ గోడలలో ఒకదానిపై ఫార్సీ భాషలో రాసిన ఒక శాసనం ఉంది.
అదేం చెబుతుందంటే..
''అజ్దీన్ ఇ చాషం ముహిబ్బన్ రోషన్ మీగ్ దార్డ్ వా చాషం దుష్మనన్ గదార్డ్ కూర్ అని ఉంటుంది. అంటే, మీరు స్నేహపూర్వకంగా ఈ మహల్‌ను చూస్తే మీ కళ్లు ఆనందంతో మెరిసిపోతాయి. అలాకాకుండా శత్రుత్వంతో చూస్తే, మీ కళ్లు అంధకారంలో చిక్కుకుంటాయి'' అని రాసి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నీటి నిర్వహణ ద్వారా రాజ్య నిర్వహణ
పురాతన కాలంలో ఎత్తైన కొండలపైన కోటలు నిర్మించేవారు. కాలక్రమేణా యుద్ధ పద్ధతులు మారిపోయాయి. సైన్యం సంఖ్య పెంచుకుంటూ పోయారు. దీంతో కొండలపై కోటలను నిర్మించే ఆలోచనను పునరాలోచించుకోవాల్సి వచ్చింది.
రక్షణ కోసం వ్యూహాత్మకంగా కొండల పైఎత్తున నిర్మించిన కోటలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతే, ఆ కోట పరిధిలో నివసించే సైన్యం, రైతులు కేవలం వర్షపు నీటిపైనే ఆధారపడాల్సి వచ్చేది.
అందుకోసమే కోటల్లో భారీ నీటితొట్టెలు నిర్మించేవారు. అయితే, నలదుర్గ్ కోట విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.
నీటి వనరుల సమర్థ నిర్వహణతో వ్యవసాయానికి వెసులుబాటు కల్పించి, తద్వారా ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలా చూసుకోవాలో చెప్పేందుకు ఈ నలదుర్గ్ కోట ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
పురాతన కాలం నుంచి దక్కన్ సుల్తానులు నీటికి మతపరమైన సంబంధాన్ని, పవిత్రతను జోడిస్తూ నీటి నిర్వహణను ఒక రాజకీయ సాధనంగానూ మలుచుకున్నారు.
అప్పటి ఆనకట్టలు నీరు, భూమిపై రాజు అధికారానికి నిదర్శనంగా నిలవడమే కాకుండా, ఆనకట్ట వంటి నిర్మాణంలోనే 'పానీ మహల్' నిర్మించడం రాజు అధికార బలానికి ప్రత్యేక గుర్తుగా నిలిచింది. ఇవి దక్కన్ పాలకుల సామ్రాజ్య చిహ్నాలుగా నిలిచాయి.
నలదుర్గ్ కోట కేవలం రాజ్య రక్షణ కోసం సరిహద్దులో నిర్మించిన కట్టడం మాత్రమే కాకుండా, 'నీరు' అని పిలిచే అతి ముఖ్యమైన కరెన్సీని నియంత్రించే శాశ్వతమైన నిర్మాణం కూడా.
ఈ డ్యామ్ ఆదిల్ షాహీల కాలంలో నిర్మించినప్పటికీ, నిజాం షాహీలు, బ్రిటిష్ కాలంలోనూ వ్యవసాయం అభివృద్ధి చెందడంలో నలదుర్గ్ కోటలో నిర్మించిన ఈ ఆనకట్ట ప్రధాన పాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోట ఇప్పుడెలా ఉంది?
కొన్నేళ్ల కిందటి వరకూ నిర్లక్ష్యానికి గురైన నలదుర్గ్ కోట నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు కంపెనీకి అప్పగించిన తర్వాత పర్యాటక కేంద్రంగా మారింది. లాతూర్, ఒస్మానాబాద్, షోలాపూర్ జిల్లాల నుంచి పర్యాటకుల రద్దీ మొదలైంది.
కోటలో పచ్చిక మైదనాలను ఏర్పాటు చేశారు. ఫౌంటెయిన్లు, టాయిలెట్లు నిర్మించారు. పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్ కార్లు, జలాశయంలో బోటింగ్ షికారు వంటివి ఏర్పాటు చేశారు.
వర్షాకాలంలో కనువిందు చేసే స్త్రీ, పురుష జలపాతాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
అయితే, నలదుర్గ్ కోటకు వచ్చే పర్యాటకులకు ఈ కోట నిర్మాణం, కోట చరిత్రను వివరించేందుకు అవసరమైన ఏర్పాట్లు లేవు.
ముంబయి-హైదరాబాద్ హైవేపై ఉన్నప్పటికీ, దాదాపు పదిహేనేళ్లుగా ఈ హైవే పనులు నత్తనడకన సాగుతుండడంతో రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాలంటే గతుకుల రోడ్డులో ప్రయాణించాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కట్టుపల్లి పోర్టు: 'అదానీ గ్రూపు ఈ పోర్టును విస్తరిస్తే మా గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయి, ప్రాణాలకు తెగించి అయినా దీన్ని అడ్డుకుంటాం'
- తక్కువ ఖర్చులో హాయిగా బతకాలంటే దేశంలో హైదరాబాదే బెస్ట్.. ‘మెర్సర్’ సర్వే ఇంకా ఏం చెప్పింది?
- 2023లో ఎక్కువ మంది సర్చ్ చేసిన వంటకం ఏది? గూగుల్ చరిత్రలో అత్యధికులు వెతికిన క్రికెటర్ ఎవరు?
- ఓషో: కట్టుబాట్లు లేని సెక్స్‌తోపాటు రజనీష్ ఆశ్రమంలో ఇంకా ఏం జరిగేది?
- మహువా మొయిత్రా: పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మీదే ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














