మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి..

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, TelanganaCongress
మహాలక్ష్మి పథకం నిబంధనలివే..
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే..
1) తెలంగాణకు చెందిన మహిళ అయి ఉండాలి. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి.
2) అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయం వాడుకోవచ్చు.
3) తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
4) పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.
5) బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లగలరు, తరువాత టికెట్ కొనాలి.
6) ప్రయాణంలో కిలోమీటర్ల పరిధిపై ఎలాంటి పరిమితులు లేవు.
7) ప్రయాణించే ప్రతీ మహిళకు 'జీరో టికెట్' ఇస్తారు.
8) మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం ఛార్జీని ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి చెల్లిస్తుంది.
ఈ పథకం కింద మహిళలకు త్వరలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్’ అందించనుంది.
బస్ పాసులు పనిచేయవు: ఆర్టీసీ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ పథకం ప్రారంభిస్తారని సజ్జనార్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు.
పథకం మార్గదర్శకాలను ఆర్టీసీ సిబ్బందికి వివరించారు.
ప్రయాణికులతో వినయంగా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సజ్జనార్ ఉద్యోగులకు సూచించారు. ఈ పథకం కోసం 7,290 బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
మహిళల బస్‌పాస్‌లు రేపటి నుంచి పనిచేయవని, వాటికి రీయింబర్స్‌మెంట్ కూడా చేయబోమని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, TWITTER/CMOFKARNATAKA
కర్ణాటకలో ఎలా అమలవుతోంది?
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే ‘శక్తి’ పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2023 జూన్ నెలలో ప్రారంభించింది.
- కర్ణాటకలో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కొనాల్సి ఉంటుంది.
- మొదట్లో మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా అనుమతించారు. ఆ తర్వాత ప్రభుత్వం శక్తి స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది.
- కర్ణాటక మహిళలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకను ఆనుకొని ఉన్న మిగతా రాష్ట్రాల్లోనూ 20 కిలోమీటర్ల దూరం వరకు కర్ణాటక బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వమే మహిళల చార్జీలను భరిస్తుంది.
దిల్లీలో ఉచితమే కానీ..
దిల్లీలోనూ మహిళలకు ఇదే తరహా ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉంది.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో ఈ పథకం ప్రారంభించింది. అయితే కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే దిల్లీలో నిబంధనల్లో కొద్దిగా తేడాలున్నాయి.
స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం మహిళ అయినా సరే డీటీసీ, క్లస్టర్, మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.
దిల్లీలో ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు.
బస్సు ఎక్కిన మహిళలకు కండక్టర్ 'పింక్ టికెట్' ఇస్తారు. ఒకవేళ 'పింక్ టికెట్' తీసుకోకుండా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు.

ఫొటో సోర్స్, TelanganaCongress
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
1. మహాలక్ష్మి
- ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
- రూ.500లకే గ్యాస్ సిలిండర్
- రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
2. రైతు భరోసా
- ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
- ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
- వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
3. గృహజ్యోతి
- ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం
4. ఇందిరమ్మ ఇళ్లు
- ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
- తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
5. యువ వికాసం
- విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ లేని ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం.
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
6. చేయూత
- పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
- ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం
ఇవి కూడా చదవండి
- Skin care: కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే భారతీయుల చర్మం కూడా అలా మారుతుందా?
- పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















