కట్టుపల్లి పోర్టు: 'అదానీ గ్రూపు ఈ పోర్టును విస్తరిస్తే మా గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయి, ప్రాణాలకు తెగించి అయినా దీన్ని అడ్డుకుంటాం'

కట్టుపల్లి పోర్టు
    • రచయిత, కే శుభగుణం
    • హోదా, బీబీసీ తమిళ్

తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరువళ్లూర్ జిల్లా ఎల్&టీ పోర్టును ప్రస్తుతమున్న 330 ఎకరాల నుంచి 6,110 ఎకరాలకు విస్తరించేందుకు అదానీ గ్రూపు ప్రతిపాదనలు సిద్ధంచేసింది.

అయితే, ఈ ప్రతిపాదనలపై పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో జీవించే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా తీరం కోతకు గురికావడంతో ప్రభావితం అవుతున్న వారిపై ఈ విస్తరణ ప్రాజెక్టు మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ విషయంలో ఎదురవుతున్న వ్యతిరేకతను తోసిపుచ్చితూ.. ఈ ప్రాజెక్టుతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని అదానీ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీపీఎల్) ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రాణాలకైనా తెగిస్తామని పులికాట్ ప్రాంత మత్స్యకార మహిళలు అంటున్నారు.

కట్టుపల్లి పోర్టు

అసలేమిటీ ప్రాజెక్టు?

తిరువళ్లూరు జిల్లా పరిధిలోని పులికాట్ సరస్సుకు సమీపంలో ఈ ఎల్&టీ పోర్టు ఉంది. దీన్ని ప్రస్తుతమున్న 330 ఎకరాల నుంచి 6,110 ఎకరాలకు విస్తరించేందుకు కేంద్రానికి అదానీ గ్రూపు ప్రతిపాదనలు పంపింది.

ఈ భూమిలో 2,000 ఎకరాలను తీర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉంటుంది. మరో 4,000 ఎకరాలను ఇతర భూభాగాల నుంచి సేకరిస్తారు. ఇక్కడ కట్టుపల్లి కుప్పం, కలంజి తీరం మొత్తం నీటిలో మునిగే ఇసుక నేలలు (మడ్‌ఫ్లాట్స్) కనిపిస్తాయి. పీతలు, రొయ్యలు, తాబేళ్లు సహా చాలా జీవులకు ఇవి ఆవాస ప్రాంతాలు.

తాజా ప్రతిపాదనల్లో భాగంగా ఈ తీర ప్రాంతంలో ఇసుకను పోసి భూభాగంలా సిద్ధం చేస్తారు. అంటే కరుంగాలి, అలమరం, కలంజి, కలంజి కోడై, కూడా.. లాంటి చిత్తడి నేలల్లో ఇసుకను పోసి పోర్టుకు సంబంధించిన నిర్మాణాలను చేపడతారు.

వీటితోపాటు తీరంలో కొంత ప్రాంతంలో సముద్ర మట్టాన్ని పెంచుతారు. ఇక్కడ పడవలు తిరిగేలా చూసేందుకు టైడల్ వాల్స్ నిర్మిస్తారు. పోర్టుకు సంబంధించిన నిర్మాణపు పనులు కలంచి, కట్టూర్ గ్రామాల నుంచి దక్షిణాన ఊరంబేడు, వయలూర్ ప్రాంతాల వరకూ కొనసాగుతాయి.

అయితే, దీని వల్ల కట్టుపల్లి నుంచి పులికాట్ వరకూ తీరం భారీగా కోతకు గురిఅవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పులికాట్‌తోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మత్స్య సంపదపై ఆధారపడే గ్రామాలు వందకుపైనే ఉంటాయి. అయితే, ఈ గ్రామాలన్నీ కోతకు గురయ్యే ముప్పుంటుందని తీర ప్రాంత అడవుల పెంపకం నిపుణురాలు మీరా షా చెప్పారు.

‘‘పులికాట్ సరస్సుపై ఇప్పటికే పర్యావరణ కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో నిర్మాణాల వల్ల ఇక్కడి భూమి కోతకు గురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని నిర్మాణాలను చేపడితే, ఈ సరస్సు దెబ్బతింటుంది. మరోవైపు ఈ సరస్సు పూర్తిగా సముద్రంలో కలిసిపోయే ముప్పు కూడా ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

కట్టుపల్లి పోర్టు

ఈ విస్తరణతో తీరం మరింతగా కోతకు గురవుతుందా?

తమిళనాడు తీరంలో పోర్టు నిర్మాణానికి భూమి అనువుగా ఉండదని ఐఐటీ మద్రాస్‌లోని హైడ్రోజియాలజీ ప్రొఫెసర్ ఇలాంగో లక్ష్మణన్ అన్నారు. ‘‘మద్రాసు పోర్టు నిర్మించినప్పటి నుంచే చెన్నై తీరం కోతకు గురికావడం మొదలైంది. మీరు 1985నాటి ఉపగ్రహ చిత్రాలను నేటితో పోల్చిచూస్తే, చెన్న పోర్టుకు ఉత్తరాన ఉండే పెరియకుప్పం, చినకుప్పం లాంటి ప్రాంతాలు 180 మీటర్ల వరకూ తీరంలో కలిసిపోయినట్లు తెలుస్తుంది. దీనికి పోర్టు నిర్మాణాలే కారణం’’ అని ఆయన చెప్పారు.

‘‘తూర్పు తీరంలో ఏడాదిలో 75 శాతం వరకూ ఇసుక ఉత్తరం వైపుగా కదులుతుంది. మిగతా 25 శాతం రోజుల్లో మాత్రమే ఇది దక్షిణం వైపుగా కదులుతుంది. ఈ ప్రాంతాల్లోని పర్యావరణంలో మనం మార్పులు చేస్తే, ఇక్కడి భూభాగంలో చాలా మార్పులు వస్తాయి’’ అని ఆయన అన్నారు.

పోర్టు నిర్మాణాల్లో భాగంగా ‘టైడల్ వాల్స్’ నిర్మించడంతో పర్యావరణానికి ముప్పనే వాదనతో ఆయన ఏకీభవించారు. కట్టుపల్లి పోర్టుకు ఉత్తరాన కరుంగలిలో 1985లో కనిపించిన 187.29 మీటర్ల తీర ప్రాంతం 2022లో మునిగిపోయినట్లు కనిపిస్తుందని.. అదే సమయంలో ఎన్నూరో, కట్టుపల్లి పోర్టులకు దక్షిణాన తీర ప్రాంతం 160.77 మీటర్లు పెరిగిందని ఆయన చెప్పారు.

సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఉత్తరం వైపుగా సముద్రపు అలలు తీసుకెళ్లే ఇసుక కట్టుపల్లి పోర్టు టైడల్ వాల్స్ వల్ల ముందుకు వెళ్లే మార్గం కనిపించలేదు. కాబట్టి ఇది దక్షిణాన పేరుకుపోయింది. మరోవైపు ఉత్తరం నుంచి వెనక్కి వెళ్లే ఇసుక మాత్రం ఎప్పటిలానే సముద్రంలో వెళ్లి కలిసింది. దీంతో ఇక్కడి తీరం భారీగా కోతకు గురైంది.

అదానీ గ్రూపు కట్టుపల్లి పోర్టును విస్తరిస్తే ఇలా తీర ప్రాంతం కోతకు గురికావడం మరింత పెరుగుతుందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు, నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా పులికాట్‌కు పరిసరాల్లో జీవించే ప్రజలు ఈ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కట్టుపల్లి పోర్టు, గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

అదానీ గ్రూపు ఏం చెబుతోంది?

ఈ విస్తరణ ప్రాజెక్టుతో సముద్రం కోతకు గురవుతుందనే రిపోర్టులతోపాటు ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) నివేదికలోని అంశాలపైనా అదానీ గ్రూపు సీనియర్ అధికారితో బీబీసీ మాట్లాడింది.

అయితే, తీరం కోతకు గురికావడానికి ఈ పోర్టు నిర్మాణమే ప్రధాన కారణమనే వాదనను ఆయన ఖండించారు.

‘‘2018లో నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఈ విషయంపై ఒక నివేదిక విడుదల చేసింది. 1990 నుంచి 2016 మధ్య డేటాను దీనిలో విశ్లేషించారు. దీనిలో గుజరాత్, మహారాష్ట్ర లాంటి పోర్టులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తీరం తక్కువగా కోతగా గురైనట్లుగా తేలింది. తీరం కోతకు గురికావడానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో పోర్టు నిర్మాణాలు ప్రధాన కారణం కాదు’’ అని ఆయన అన్నారు.

అయినప్పటికీ, పోర్టులు, హార్బర్‌లు కట్టేటప్పుడు తీరం కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని బీబీసీతో ఆయన చెప్పారు.

కట్టుపల్లి పోర్టు

ఫొటో సోర్స్, SUBAGUNAM KANNAN

మత్స్యకారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఈ ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తున్న మత్స్యకార మహిళల్లో విజయ కూడా ఒకరు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఈ పోర్టును విస్తరిస్తే మా గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయి’’ అని ఆమె అన్నారు.

పులికాట్ సరస్సులో తెల్లవారుజామున తన భర్త పట్టి తీసుకొచ్చే చేపలను విజయ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అయితే, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రస్తుతం తమ రోజువారి పనులను పక్కపెట్టేసి నిరసన తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు.

‘‘ఈ ప్రాజెక్టును విస్తరించకుండా మేం అడ్డుకుంటాం. ఎందుకంటే దీని వల్ల మా బతుకుతెరువు పోయే ముప్పుంది. అందుకే ఎంతకైనా మేం తెగించి పోరాడతాం’’ అని విజయ చెప్పారు.

మరొక మత్స్యకార మహిళ రాజలక్ష్మి కూడా అదే విషయాన్ని చెప్పారు. ‘‘పులికాట్ చేపలు, పీతలకు మంచి పేరుంది. కానీ, ఎల్&టీ పోర్టు, ఎన్నోర్ థెర్మల్ పవర్ స్టేషన్‌ల రాకతో ఇక్కడి మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోయింది. ఇదివరకటిలా చేపలు, రొయ్యలు, పీతలు ఇప్పుడు రావడం లేదు. ఒకప్పుడు ఇక్కడ 100కుపైగా రకాల చేపలు కనిపించేవి. ఇప్పుడు అవి 50 కంటే తక్కువకు పడిపోయాయి’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇక్కడ పోర్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రతిగ్రామం నుంచి 150 నుంచి 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ, కనీసం పది మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు’’ అని ఆమె అన్నారు.

‘‘ఇప్పటికే ఈ పోర్టుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాన్ని మళ్లీ విస్తరించడం ఎందుకు? మేం అసలు దీనికి ఒప్పుకోం. మా ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటాం’’ అని రాజలక్ష్మి అన్నారు.

కట్టుపల్లి పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, కట్టుపల్లి పోర్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారని చెప్పడం సరికాదని అదానీ గ్రూపు సీనియర్ అధికారి బీబీసీతో అన్నారు.

‘‘మేం పోర్టుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో మాట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి వారు చాలా ఆసక్తితో ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

‘‘కొంతమంది ఈ విస్తరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. వారు తమని తాము పర్యావరణ ఉద్యమకారులుగా చెప్పుకుంటున్నారు. కానీ, వారి వాదనకు బలం చేకూర్చే డేటా వారి దగ్గర లేదు. వారు ఫేక్ యాక్టివిస్టులు. పబ్లిసిటీ కోసమే పనిచేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

‘‘పర్యావరణాన్ని నిజంగా కాపాడే కొన్ని మంచి ఎన్‌జీవోలు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. అయితే, వాటి పరిష్కారం కోసం ఏం చర్యలు తీసుకుంటామో త్వరలోనే మేం వివరిస్తాం’’ అని ఆయన చెప్పారు.

కట్టుపల్లి పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఉపాధి పోతుందని ఆందోళన

అదానీ గ్రూపుకు చెందిన కొందరు సిబ్బంది ప్రతివారం తమ దగ్గరకు వచ్చి మెడికల్ చెకప్‌లు చేసి, మందులు ఇస్తున్నట్లు చెంగళనీరమేడు గ్రామ ప్రజలు చెప్పారు. తమకు కొన్ని స్పోర్ట్స్ కాంపిటీషన్లు కూడా పెడుతున్నారని చెప్పారు.

అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రన ప్రాజెక్టుకు తాము అనుకూలమని భావించకూడదని వారు అన్నారు.

‘‘మందులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం. కానీ, మందులు ఇచ్చి, భూములు తీసుకుంటామంటే ఊరుకునేది లేదు. అలా అసలు జరగనివ్వం. ఇక్కడి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారని అదానీ గ్రూపు తెలుసుకోవాలి’’ అని స్థానిక మత్స్యాకార మహిళ రూపావతి చెప్పారు.

ఇక్కడి ప్రజల్లో కొందరు వ్యవసాయ కూలీల్లా పనిచేస్తారు. మరికొందరు చేతులతోనే పీతలు, రొయ్యలు పట్టుకొని, అమ్ముతుంటారు. ఇంకొందరు వలలతో చేపలు పడుతుంటారు.

ఇక్కడి వ్యవసాయ భూములు, సరస్సులు, తీర ప్రాంతాలే తమకు జీవనాధారమని.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోర్టును విస్తరించేందుకు అనుమతించబోమని వారు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

పర్యావరణ సంక్షోభం

‘‘ఈ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా చిత్తడి నేలలు, గడ్డి, అటవీ భూములు దెబ్బతినే ముప్పుంది. ఈ ప్రాంతాలన్నీ ఎంతో జీవివైవిధ్యమైనవి’’ అని పర్యావరణ ఇంజినీర్ ఎం దుర్గ చెప్పారు.

పోర్టు విస్తరణతో తీరం మరింత కోతకు గురవుతుందనే వాదనతో ఆమె కూడా ఏకీభవించారు.

‘‘వారు చేపట్టిన ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌లోనే తీరం ఏడాదికి 8 మీటర్ల వరకూ కోతకు గురికావచ్చని తేలింది’’ అని ఆమె చెప్పారు.

ఏదైనా తీర ప్రాంతం ఏడాదికి ఒక మీటరు కంటే ఎక్కువ కోతకు గురైతే దాన్ని ‘హై ఎరోషన్ జోన్’గా గుర్తించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెబుతోందని, ఇలాంటి ప్రాంతాల్లో పోర్టుల్లాంటి నిర్మాణాలు అసలు చేపట్టకూడదని ఆమె అన్నారు.

‘‘వాతావరణ సంక్షోభం ఇప్పటికే ఇక్కడ ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సున్నితమైన తీర ప్రాంతాలను మనం కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలే వాతావరణ మార్పుల ప్రభావం నుంచి మనల్ని కాపాడగలవు’’ అని దుర్గ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)