ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, మార్టిన్ అస్సీర్ ల్యామ్‌ఈస్ అల్టలెబి, పాల్ క్యూసియక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, ప్రతిగా గాజా మీద ఇజ్రాయెల్ దాడి చెయ్యడం.. ఈ రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియను మరింత జటిలం చేసింది. అయితే, రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నవారు అక్టోబర్ నుంచి మొదలైన హింస తమ వాదనకు అవసరమైనంత ఆయుధ సంపత్తిని ఇచ్చిందని నమ్ముతున్నారు.
అక్టోబర్ 7 హింసకు రెండు వారాల ముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భద్రతా మండలిలో ప్రసంగించారు. “ఇజ్రాయెల్- అరబ్ దేశాల మధ్య శాంతి ప్రక్రియలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని” అన్నారు.
“నిపుణులమని చెప్పుకునే కొంతమంది గత పాతికేళ్లలో తమ ఆలోచనా ధోరణితో శాంతి ఒప్పందాన్ని (జోర్డన్ నది నుంచి మధ్యధరా సముద్రం మధ్య ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్- పాలస్తీనాకు పంచేలా రెండు దేశాలకు పరిష్కారం) ముందుకు వెళ్లనివ్వలేదు” అని నెతన్యాహు చెప్పారు.
“2020లో నేను సమర్థించిన విధానంతో ఎలాంటి ఆలస్యం లేకుండా అద్భుతమైన ప్రగతి సాధించాం. అరబ్ దేశాలతో నాలుగు నెలల్లో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.” అని తన పని తీరుకి తానే కితాబిచ్చుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అబ్రహాం ఒప్పందాలకు, ఆయన కంటే ముందున్న అమెరికన్ అధ్యక్షుల ప్రతిపాదనలకు పట్టిన గతే పట్టిందని అన్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
2020 నాటి అబ్రహాం ఒప్పందాలు
సెప్టెంబర్ -15 ఇజ్రాయెల్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్- బహ్రెయిన్ మధ్య సంబంధాలను తటస్థంగా ఉంచేలా ఒప్పందాలు
డిసెంబర్ 22- ఇజ్రాయెల్- మొరాకో మధ్య తటస్థ సంబంధాలు
డిసెంబర్ 24- ఇజ్రాయెల్ సూడాన్ మధ్య సంబంధాలను సాధారణ స్థితిలో కొనసాగించడం
అరబ్- ఇజ్రాయెల్ మధ్య గత ఒప్పందాలు
మార్చ్ 26, 1979 – ఈజిప్టు- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం
సెప్టెంబర్ 13, 1993 ఇజ్రాయెల్- పాలస్తీనా లిబరైజేషన్ ఆర్గనైజన్ మధ్య ఓస్లోలో తొలి ఒప్పందం.
అక్టోబర్ 26, 1994 ఇజ్రాయెల్- జోర్డాన్ మధ్య శాంతి ఒప్పందం
సెప్టెంబర్ 24, 1995 ఇజ్రాయెల్- పాలస్తీనా లిబరైజేషన్ ఆర్గనైజేషన్ మధ్య రెండో ఒప్పందం
పాలస్తీనీయులు ఒప్పందాల మీద సంతకం చేస్తే, “ ఇజ్రాయెల్‌ను నాశనం చెయ్యాలన్న వారి కలను వదిలేసి శాంతికి బాటలు పరిచేందుకు సిద్ధం కావాలి" అనే పరిస్థితిని సృష్టించారని నెతన్యాహు చెప్పారు.
తర్వాత ఆయన “న్యూ మిడిల్ ఈస్ట్” అనే మ్యాప్ చూపిస్తూ “పాలస్తీనీయులు లొంగిపోవడం రెండు దేశాల పరిష్కారానికి ముగింపు” అనే సందేశం ఇచ్చారు.

ఫొటో సోర్స్, REUTERS
ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పరిష్కారం విషయంలో తన కంటే ముందున్న ఏడుగురు అధ్యక్షుల కంటే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చాలా తక్కువ సమయం కేటాయించారు.
రెండు దేశాల పరిష్కారం అనేది సుదూర స్వప్నమని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే అది సాకారం అవుతుందనే ఆశను ఇంకా వదిలేయలేదని వాషింగ్టన్ చెబుతోంది.
సెప్టెంబర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్- పాలస్తీనా నాయకుల్ని కలిసినప్పుడు అందులో పొలిటికల్ ఫార్ములా ఏదీ లేదు.
పరిస్థితులు చాలా మారిపోయాయి. “రెండు దేశాల పరిష్కారం ఒక్కటే అత్యుత్తమ అనుసరణీయ మార్గం, అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని అమెరికా నమ్ముతోంది” అని నవంబర్ 3న ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
అయితే, పాతికేళ్ల క్రితం శాంతి స్థాపనలో ఎదురైన అడ్డంకులు, అభిప్రాయ బేధాలు ఇప్పుడు మరింత క్లిష్ట తరంగా మారాయి.
శాంతి ఆశలు ఎలా ఆవిరయ్యాయి?
1993లో నార్వే నుంచి వచ్చిన మధ్యవర్తులు ఇజ్రాయెల్- పాలస్తీనా విమోచన సంస్థ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. దీని ప్రకారం రెండు పక్షాలు ఒకరినొకరు గుర్తించేందుకు అంగీకరించిన తర్వాత రెండు దేశాల పరిష్కారం కోసం ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించారు.
అయితే, ఓస్లో ఒప్పందం ఎన్నడూ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారాన్ని మరింత జఠిలంగా మార్చింది.
1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుచుకుని ఆక్రమించుకున్న భూభాగంలో పాలస్తీనా అథారిటీ పరిపాలన సాగేలా పీస్ ఫర్ ల్యాండ్ ఒప్పందం బాటలు వేసింది.
అయితే, ఈ ప్రాంతాల మీద ఇజ్రాయెల్ అధికారం, యూదు సెటిల్మెంట్లు కొనసాగుతాయని, శాశ్వత హోదా లాంటి అంశాల గురించి భవిష్యత్ చర్చల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు.
1948లో మొదటి అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం, 1947లో విభజనకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి ఓటు వేసిన తర్వాత ఇజ్రాయెల్‌లో కలిసిన భూభాగాల్లో పాలస్తీనా శరణార్థులు హోదా ఏంటనే దానిని కూడా చేర్చారు.
1967లో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను స్వాధీనం చేసుకుంది. ఇదికొత్త సమస్యకు దారి తీసింది. ఈ ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన వారి పవిత్ర స్థలాలు ఉండటంతో రెండు గ్రూపులు ఈ ప్రాంతం కోసం గట్టిగా పట్టు పట్టాయి. ఈ ప్రాంతాన్ని వదులుకునేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు.
దశాబ్దాల దౌత్య ప్రయత్నాల తర్వాత, 2002లో క్యాంప్ డేవిడ్‌లో అప్పటి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నిర్వహించిన క్లోజ్డ్-డోర్ సమ్మిట్‌లో ఈ సమస్యలకు పరిష్కారం కనిపించింది, అయితే అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ పాలస్తీనా అథారిటీ నాయకుడు యాసర్ అరాఫత్ పట్టు విడుపులను ప్రదర్శించడంలో విఫలం అయ్యారు.
ఈ వైఫల్యానికి కారణం మీరంటే మీరంటూ ఒకరి నొకరు నిందించుకున్నారు. అరాఫత్ తాను సాధించగల ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించారని ఇజ్రాయెల్, అమెరికన్ అధికారులు ఆరోపించారు. ఈస్ట్ జెరూసలేంను తమ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లకు దూరంగా అసలు ఇదొక స్కామ్ అని ఆరోపించారు.
తన ప్రధాన శత్రువుని ఓడించాలనే లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడో సాధించిందని విమర్శకులు గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ అప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టిన ప్రాంతాన్ని, ప్రత్యేకించి పాలస్తీనా జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల భద్రతను వారికే ఎందుకు ఇస్తుందనేది విమర్శకుల ప్రశ్న.
చర్చల సమయంలో అరాఫత్ పరిస్థితి బలహీనంగా ఉంది. అదే సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా ఇజ్రాయెల్‌కు చరిత్రలో ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉంది.
రెండు దేశాల పరిష్కారాన్ని చేరుకోవడంలో అధిగమించలేని ఇతర అంశాలు చాలా ఉన్నాయని నిరూపితమైంది.
1987లో గాజాలో ఏర్పడిన హమాస్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ శాంతి స్థాపన కోసం అరాఫత్ పేర్కొన్న సడలింపులతో ఏకీభవించలేదు. చర్చలను అడ్డుకునేందుకు 1994లో ఆత్మాహుతి దాడులను మార్గంగా ఎంచుకుంది.
రెండు దేశాల పరిష్కార మార్గంలో అధిగమించలేనివిగా భావించిన మరి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి.
అల్ట్రా-ఆర్థోడాక్స్ సెటిలర్లు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. యూదులు తాము నివశిస్తున్న ప్రాంతాలను దేవుడి హామీ మేరకు తమకు ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ఓస్లో ఒప్పందం తర్వాత ఏం జరిగింది?.
2000లో రెండో ఇంతిఫాదాగా పిలిచే పాలస్తీనీయుల విజృంభణతో ఇజ్రాయెల్ రాజకీయాలు కూడా అతివాద మలుపు తీసుకున్నాయి.
ఓస్లో చర్చల్లో పాల్గొన్న ఇజ్రాయెలీ లేబర్ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం కోల్పోయింది. సెటిల్‌మెంట్ల విషయంలోనూ అతివాదుల వాదన బలంగా వినిపించేది.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఓటర్లు అతివాద లికుడ్ పార్టీ నాయకుడు, అరాఫత్‌ని అదుపు చేయగలిగిన వ్యక్తిగా ఏరియల్ షరోన్ వైపు చూడటం మొదలు పెట్టారు.
పాలస్తీనా తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్‌పై పోరాటానికి దిగారు. అప్పుడే షరాన్ ప్రభుత్వం ఇజ్రాయెలీలను పాలస్తీనీయుల నుంచి వేరు చేస్తూ అడ్డుగోడలు నిర్మించడం మొదలు పెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ కొన్ని సెటిల్‌మెంట్లలోనూ ఇదే వ్యూహాన్ని చేపట్టింది.
ఊహించడానికి కూడా కష్టమైన మరో అంశం ఏంటంటే... గాజాలో నివసిస్తున్న 15లక్షల మంది పాలస్తీనీయుల మధ్య నుంచి కొన్ని వేల మందిని నిరాశ్రయుల్ని చేశారు. ఆ ప్రాంతం బయట దళాలను మోహరించారు. వెస్ట్‌బ్యాంక్‌లోనూ నాలుగు సెటిల్‌మెంట్లను ఖాళీ చేయించారు.
ఇజ్రాయెల్ భూభాగంలో పాలస్తీనీయుల జనాభా మెజారిటీగా ఉన్న చోట వారిని వేరు చేయడం ద్వారా యూదులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశం ఉంది. ఈ వేరు చేయడం అనే ప్రణాళిక వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయి.
దీని వల్ల రాజకీయ చర్చలకు శుభం కార్డు పడిందని షరోన్ సలహాదారు రిపోర్టర్‌తో చెప్పారు.
ఈ నిర్ణయం వల్ల లికుడ్ పార్టీలో విబేధాలు సృష్టించింది. ఒప్పందాలపై సంతకం చేసిన సెటిలర్లు లికుడ్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోని షరాన్ 2006 ఎన్నికలలో పోటీ చేసేందుకు కొత్త పార్టీ స్థాపించారు.
ఎన్నికలకు కొన్ని వారాలకు ముందు ఆయనకు మెదడులో రక్తస్రావం అయింది. దీంతో వెస్ట్ బ్యాంక్ కోసం ఇలాంటి ప్రణాళిక ఒకటి సిద్ధం చేశారా లేదా అనేది ఎప్పటికీ బయకు రాలేదు. అలాంటిదేదైనా ఉంటే, దాన్ని ఆయన మాత్రమే అమలు చేయగలిగేవారు.
అరాఫత్ వారసుడు మహమూద్ అబ్బాస్ ఓస్లో ఒప్పందం ద్రోహమని ప్రకటించారు. గాజాలోని హమాస్ తమ పోరాటానికి ఇదొక విజయంగా భావించి వేడుకలు చేసుకుంది.
ఈజిప్టు సహకారంలో ఇజ్రాయెల్ గాజాలో దిగ్బంధనాన్ని తీవ్రం చేసింది. దీంతో అక్కడ తరచూ హింస చెలరేగుతుండేది. ఈ ప్రాంతంలోకి రాడికల్ మిలిటెంట్లు చొరబడి ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించేవారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బాంబులు ప్రయోగించేది. తిరుగుబాట్లను అదుపులో ఉంచేందుకు దాడులు చెయ్యడం ప్రారంభించింది.
ఈ పరిస్థితుల మధ్య హమాస్ వెస్ట్‌బ్యాంక్‌లో పట్టు పెంచుకుంది.
పాలస్తీనా స్వాతంత్ర్యం సాధించడంలో, పారదర్శక పాలనలో ఫతా విఫలం కోవడంతో ఓటర్లు 2006 పాలస్తీనియన్ అథారిటీ శాసనసభ ఎన్నికల్లో హమాస్‌కు మెజారిటీ కట్టబెట్టారు.
హింసకు ముగింపు పలకడం, ఇజ్రాయెల్‌ను గుర్తించడం వంటి పాలస్తీనా అథారిటీ గత నిర్ణయాలకు హమాస్ కూడా మద్దతు పలికాలంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగింది. అయితే హమాస్ అందుకు ఇష్టపడలేదు.
హమాస్ పాలస్తీనా అథారిటీని గాజా నుండి బలవంతంగా బహిష్కరించింది. దీంతో గాజా ఇజ్రాయెల్‌పై పోరాటానికి కేంద్రంగా మారింది. ఫతా వెస్ట్‌బ్యాంకుకు పరిమితం కావడంతో పాటు శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం ఆ ప్రాంతానికి కొన్ని లాభాలు తెచ్చి పెట్టింది.
హమాస్ వ్యవహార శైలి గందరగోళంగా ఉన్నప్పటికీ, హింసకు దీర్ఘకాల విరామం ఇవ్వడం, 1967లో ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే సలహా లాంటి అంశాలు, హమాస్ భవిష్యత్‌లో రాజకీయపరంగా రాజీ పడుతుందనే సంకేతాలు ఇచ్చాయి.
అయితే ఇజ్రాయెల్‌ను తుడిచి పెట్టాలనే డిమాండ్ విషయంలో హమాస్ తన వైఖరి మార్చుకోలేదు. వెస్ట్ బ్యాంక్‌లో కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోవడం, జనాభాను విస్తరించడం కొనసాగించింది.
గాజాలో రక్షణ వ్యవస్థ లేకపోవడాన్ని హమాస్ అవకాశంగా తీసుకుంది. లెబనాన్‌లో హెజ్బొల్లా లాంటి సంస్థల సహకారంతో తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంది. తర్వాతి కాలంలో ఇదే యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.

ఫొటో సోర్స్, ZAIN ZAFFER/AFP
కొత్త మార్పులు
అక్టోబర్ 7 హింస తర్వాత ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్య మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. కొన్ని కొత్త అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.
ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే, హమాస్‌ను తుదముట్టించాలనే, అయితే దీని ప్రభావం గాజా స్ట్రిప్‌లోని ప్రజలపై పడకూడదనే దానిపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చింది.
గాజాలో ఉంటున్న ప్రజలను అక్కడ నుంచి పంపించేయాలని దానిపై నెతన్యాహూ అతి వాద మద్దతుదారులు ఆలోచించారు. ఇది మరొక నక్బా( అరబిక్‌లో విపత్తు అని) అవుతుందని పాలస్తీనా భావించింది. 1947లోని తొలి నెలలు, 1949 ప్రారంభంలో జరిగిన వాటిని గుర్తు చేసింది. ఈ సమయంలో 7 లక్షల మది పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌గా మారిన భూభాగంలో శరణార్థులుగా మారారు.
నెతన్యాహు విధానాలు ఒకే జాతి ఉన్న వివక్షరాజ్యానికి దారి తీస్తాయని ఇజ్రాయెల్ వామపక్షాలు ఆందోళన చెందాయి. హమాస్‌ను నిర్మూలించడం కూడా రెండు రకాల సమీకరణలకు దారి తీస్తుంది. హమాస్‌తో కలిపి మూడు సంస్థలకు బదులుగా పాలస్తీనీనియన్ అథారిటీ, ఇజ్రాయెల్‌ను మాత్రమే మిగులుస్తుంది. దీని వల్ల రెండు ప్రాంతాల ప్రక్రియ మళ్లీ తెరపైకి వస్తుంది.
రియల్ షాక్ నుంచి తేరుకోవడానికి ఇజ్రాయెలీలు, పాలస్తీనీయులకు సమయం అవసరమని గతంలో లేబర్ పార్టీకి చెందిన రచయిత అవ్రహం బర్గ్ బీబీసీతో చెప్పారు. సమయం వచ్చినప్పుడు దీర్ఘకాలిక ప్రశాంతత కోసం రక్తపాతాన్ని ఆపేందుకు వాళ్లిద్దరూ రెండు ప్రాంతాల ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారని ఆయన నమ్ముతున్నారు.
“దీర్ఘకాలం ప్రశాంతతను అందించే ఏ ప్రతిపాదనకైనా మెజార్టీ ఇజ్రాయెలీలు అంగీకరిస్తారు” అని ఆయన అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, SVEN NACKSTRAND
గాజాపై జరుగుతున్న దాడుల తీవ్రత పాలస్తీనియన్లు అందరి మీదా పడుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో సెటిలర్లు, సైన్యం పాలస్తీనీయులపై దాడులు చేస్తున్నారు. టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఇదంతా చూస్తున్న వారు కూడా ప్రభావానికి గురవుతున్నారు.
పాలస్తీనీయులు నివసిస్తున్న గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు అరబ్ వరల్డ్ ఫర్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 68 శాతం మంది రెండు దేశాల ఏర్పాటు అనే అంశానికి తాము మద్దతివ్వడం లేదని చెప్పారు.
తమకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోందనే విషయం పాలస్తీనీయులకు తెలుసు. అమెరికాలోనూ ప్రస్తుత తరం, గత తరాలతో పోలిస్తే అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడాన్ని ఎక్కువగా సమర్థించడం లేదని రాయిటర్స్, ఐపీఎస్ఓఎస్ పోల్ చెబుతోంది. 40 ఏళ్ల లోపు వయసున్న వారిలో 40 శాతం మంది అమెరికా తటస్థంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయి? ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరుగుతుందా?. మిడిల్‌ఈస్ట్‌లో శాంతి స్థాపన కోసం మూడు దశాబ్ధాలుగా కృషి చేస్తున్న అమెరికా రానున్న రోజుల్లోనూ ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు కావచ్చు.
తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుతున్న ప్రాంతంలో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు ఉండడానికి, చర్చలకు అదనపు సమయం ఇచ్చేందుకు శాంతిని కోరుకుంటున్న పాలస్తీనీయులు అంగీకరిస్తారని అనుకోవడం లేదు.
చర్చల విషయంలో వాళ్లు సీరియస్‌గా ఉంటే అందుకు పటిష్టమైన చర్యలు ఉండాలి. ఇజ్రాయెల్ సరిహద్దుల్ని నిర్వచిస్తూ, ఆక్రమణలకు ముగింపు పలకాలని యుద్ధ పరిష్కారాల నిపుణుడు, విద్యావేత్త దలాల్ ఇరికాత్ చెప్పారు.
సరైన చర్యలు తీసుకోకుండా, శాంతి ప్రక్రియ గురించి అమెరికా పదే పదే ఎన్ని రకాల మాటలు చెప్పినా ఫలితం ఉండకపోవచ్చని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
- మహువా మొయిత్రా బహిష్కరణ: ఈ కేసును రమేశ్ బిధూరీ వ్యవహారంతో ఎందుకు ముడిపెడుతున్నారు? డానిష్ అలీ ఆరోపణలేంటి
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మోనాలిసా నవ్వు వెనుక దాగిన రహస్యం ఏంటో తెలుసా?
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














