శ్రీకాకుళం: గార ఎస్‌బీఐ బ్రాంచి నుంచి 7 కిలోల బంగారం ఎలా మాయమైంది, తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?

గార ఎస్బీఐ బ్యాంక్

ఫొటో సోర్స్, lakkojusrinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన రూ. 4 కోట్ల విలువైన 7 కిలోల బంగారం గోల్ మాల్ కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు.

గార మండలంలోని ఎస్బీఐ బ్రాంచిలో తాకట్టు పెట్టిన 7 కిలోల బంగారం ఇటీవల కనిపించకుండా పోయింది.

ప్రభుత్వరంగ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు అభరణాలు ఇలా చోరీ కావడంతో బాధితుల్లో అందోళన పెరిగింది.

ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. బంగారు ఆభరణాల్ని రికవరీ చేశారు.

అయితే, ఈ ఘటనతో ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వారు కూడా తమ బంగారు అభరణాల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ గార ఎస్బీఐలో ఏం జరిగింది? నిందితులు ఎలా దొరికారు?

ఇలా బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు పోతే, వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? పోయిన బంగారాన్ని తిరిగి పొందేందుకు కస్టమర్లు ఏం చేయాలి? బ్యాంకు నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే అంశాలపై బీబీసీ కొందరు బ్యాంకు అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులతో మాట్లాడింది.

బ్యాంకు కస్టమర్లు

ఫొటో సోర్స్, lakkojusrinivas

గార ఎస్బీఐ బ్రాంచిలో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐలో 2,400 మంది కస్టమర్లు ఉన్నారు. వీరిలో చాలామంది తమ అవసరాల కోసం బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు. అయితే ఇలా తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడానికి రుణం తీర్చినా అభరణాలను తిరిగి ఇవ్వలేదు. సాంకేతిక కారణాలని ఒకసారి, ఆడిట్ అవుతుందని మరోసారి ఇలా కాలయాపన చేశారు. దీంతో అనుమానం వచ్చిన చాలామంది కస్టమర్లు నవంబర్ నెల 30వ తేదీన తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు.

“నేను 20 గ్రాముల బంగారం ఇంటి అవసరాల కోసం గార బ్రాంచిలో తాకట్టు పెట్టాను. అందులో పది తులాలు నాది, మరో పది తులాలు నా సోదరిది. నేను తాకట్టు పెట్టిన 20 తులాల ఆభరణాల్లో కేవలం 6 తులాలే ఉన్నాయని, మిగతావి కనిపించడం లేదని బ్యాంకు అధికారులు చెప్పారు” అని వెంటకరావు అనే బ్యాంక్ కస్టమర్ బీబీసీతో చెప్పారు.

“ఇంటి కోసమని మా పిన్ని వాళ్ల దగ్గరి నుంచి 12 తులాలు తీసుకొచ్చానండి. ఆ బంగారం బ్యాంకులో కనిపించడం లేదన్నారు. నాకు ఏడుపోచ్చేసింది. బ్యాంకు వాళ్లని అడిగితే సమాధానం చెప్పేవారు కాదు” అని భారతి అనే మరో కస్టమర్ చెప్పారు.

దీంతో కస్టమర్లు ఒక రోజు బ్యాంకుకి తాళం వేసి, తమకు న్యాయం చేయాలంటూ అక్కడే వద్దే అందోళనకు దిగారు. దీంతో అప్పుడు బ్యాంకు ఉద్యోగులు తమ బ్యాంకులో నగలు పోయాయంటూ గార పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బ్యాంకులో జరిగిన మోసం బయటపడింది.

గార పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, lakkojusrinivas

పోలీసులు ఏం చెప్పారు?

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేసి డిసెంబర్ 8న ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఏ విధంగా బ్యాంకులోని నగలను అపహరించారో, వాటిని ఆ తర్వాత ఏం చేశారో పోలీసులు వివరించారు. జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక వెల్లడించిన వివరాల ప్రకారం...

“గార బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పని చేసిన స్వప్నప్రియ...అదే బ్యాంకులో పనిచేస్తున్న తన సోదరుడు కిరణ్‌బాబుతో కలిసి స్థిరాస్తి వ్యాపారం, రైస్‌ పుల్లింగ్‌, షేర్‌ మార్కెట్‌లలో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. దీని నుంచి గట్టెక్కెందుకు ఖాతాదారులు తాకట్టు పెట్టిన ఆభరణాలను బయటకు తీసుకొచ్చేవారు. తిరుమలరావు అనే వ్యక్తి ఈ బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పు తీసుకునేవారు. శ్రీకాకుళంలోని వివిధ బ్యాంకుల్లో వేర్వేరు వ్యక్తుల పేరిట పెట్టి రుణం తీసుకున్నారు.”

“ఇలా రూ.4 కోట్ల వరకు నగదు వివిధ రూపాల్లో బదిలీ చేశారు. డిప్యూటీ మేనేజర్‌ స్వప్నప్రియపై అనుమానం వ్యక్తం చేస్తూ మేనేజర్ సీహెచ్‌ రాధాకృష్ణ, లాకర్‌లోని బంగారం తనిఖీ చేయగా 86 సంచులు మాయమైనట్లు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా... 26 సంచులను రాజారావు ద్వారా తిరిగి అప్పగించారు. బ్యాంకు ఖాతాదారులు ఆభరణాలు కుదువ పెట్టిన తర్వాత ఆరు నెలల వరకు వాటి కోసం వెళ్లేవారు కాదు. ఈ విషయం గమనించి ఆ బంగారాన్ని వేరే చోట్ల తాకట్టు పెట్టేవారు.”

బాధితులు

ఫొటో సోర్స్, lakkojusrinivas

“ఎవరైనా ఖాతాదారులు వచ్చి తమ బంగారం ఇవ్వమని అడిగితే.. సాంకేతిక సమస్య ఉందని.. మళ్లీ రేపు రావాలని చెప్పేవారు. ఇంతలో ఇతర బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని తీసుకొని వచ్చేవారు. వాటిని తాకట్టు నుంచి విడిపించుకుని కస్టమర్లకు ఇచ్చేసేవారు. ఇలా ఏడాది కాలంగా చేస్తున్నారు.”

“కస్టమర్లు నిలదీయడంతో మోసం బయటపడింది. దీంతో స్వప్నప్రియ ఆత్మహత్యకు పాల్పడగా, మిగిలిన నిందితులు పొన్నాడ తిరుమలరావు, ఉరిటి కిరణ్‌బాబు, నంబాన రాజారావు, కొండల గణపతిరావు, కాకర్ల తారకేశ్వరరావు, మార్పు వెంకట రమేష్‌, మొదలవలస మోహన్‌ చంద్‌లను అరెస్ట్ చేశాం. వారి నుంచి రూ. 4 కోట్ల విలువైన 7 కేజీల 195 గ్రాముల బంగారం పూర్తిగా రికవరీ చేశాం. ఈ నగలను కోర్టుకు అప్పగిస్తాం. అక్కడ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత అవి బ్యాంకుకు చేరుతాయి. బ్యాంకు నుంచి కస్టమర్లు తమ నగలను పత్రాలు చూపించి, రుణం చెల్లించి తీసుకోవచ్చు” అని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక చెప్పారు.

బ్యాంకులో సీసీ కెమెరాలను పరిశీలించడం, సక్రమంగా ఆడిట్లు చేయడం చేస్తుండాలని బ్యాంకు అధికారులకు సూచించారు ఎస్పీ.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బంగారం పోతే బాధ్యత ఎవరిది?

గార ఎస్సీఐ బ్రాంచిలో జరిగిన ఈ మోసంతో పలు అనుమానాలు వస్తున్నాయి.

అసలు బ్యాంకులో నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖా పెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరిస్తారు? కస్టమర్కు ఎటువంటి భరోసా ఉంటుంది అనే అంశాలపై ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కేవీ జగన్నాథరావు, బీబీసీకి పలు విషయాలను వెల్లడించారు.

  • బ్యాంకులో పోయిన నగలకు బదులు కస్టమర్లకు డబ్బు రూపంలో సెటిల్ చేస్తామంటూ ముందుగా బ్యాంకు అధికారులు కొందరు కస్టమర్లతో చెప్పారు. తమకు ఆ నగలంటే సెంటిమెంటని ‘అవే నగలు కావాలి’ అంటూ కస్టమర్లు బ్యాంకు ముందు ఆందోళనకు కూడా దిగారు. దీనిపై జగన్నాథరావు ఏం చెప్పారంటే...
  • “బ్యాంకులో ఏ నగలైతే తనఖా పెట్టారో అదే నగలు బ్యాంక్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంకు రికార్డుల్లో ఆ నగ పేరు ఉంటుంది. అది పుస్తెలతాడా, గాజులా, హారమా ఇలా ఏదో పేరు... దాని ఖచ్చితమైన బరువు రాసి ఉంటుంది. అదే నగ ఇవ్వాలి. దాని రూపంలో డబ్బులు ఇవ్వడమంటే నేరం చేసినట్లే గుర్తించాలి. తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుంది. అవి పోతే తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుదే” అని ఆయన తెలిపారు.
  • బ్యాంకులకు బ్లాంకెట్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఇది బ్యాంకులో నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులకు వర్తిస్తుందని, ఈ విషయంలో ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
  • అప్పటికే ఆభరణాలు చోరి అయ్యింటే.. ఆ సమయంలోనే కస్టమర్లు ఎవరైనా వాళ్ల లోన్ క్లియర్ చేసుకుంటే వెంటనే రిసిప్ట్ తీసుకోవాలి. మీ లోన్ క్లియర్ అయిపోయింది, మీ ఆభరణాల్ని ఇన్ని రోజుల్లో ఇస్తామంటూ బ్యాంకు అధికారులు లేఖ ఇస్తారు. దానిని మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి. ఆ సమయానికి బ్యాంక్ మన అభరణాలు ఇవ్వకపోతే...ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులకు వడ్డీతో సహా కలిపి నగలను అప్పగించాలి.
మోసాలు

ఫొటో సోర్స్, ISTOCK

బ్యాంకులో మోసం జరుగుతుందని ఎలా గ్రహించాలి?

ఒక బ్యాంకులో మోసం జరుగుతుందని బ్యాంకు ఉన్నతాధికారులు తెలుసుకోలేరా అనే ప్రశ్నకు జగన్నాథరావు కొన్ని సూచనలు, పాటించాల్సిన నిబంధనలు చెప్పారు.

  • బ్యాంకు ఉద్యోగులు సెలవులు పెట్టకపోతే అనుమానించాలి. ఎందుకంటే సెలవు పెడితే వారు మరో ఉద్యోగికి తమ బాధ్యతలు (అన్ని లెక్కలతో సహా) అప్పగించాలి. ఎవరైనా సెలవు పెడితే చార్జి టేకోవర్ ఉంటుంది. ఆ చార్జ్‌లో అన్ని వివరాలను మరో వ్యక్తి వెరిఫై చేసుకుంటారు. అప్పుడు ఏఏ వస్తువులు ఉన్నాయో వాటిని యథాతథంగా అప్పగించాలి. బంగారు అభరణాల బ్యాగులను చెక్ చేస్తారు. క్యాష్ లెక్క పెడతారు. అందుకే మోసం చేసే వ్యక్తులు సెలవులు పెట్టరు. ఇది గమనించాలి.
  • బ్యాంకులో పని చేసే వ్యక్తులెవరైనా అనుమానాస్పద లావాదేవీలు చేస్తుంటే, వాళ్లని మిగతా బ్యాంక్ స్టాప్ గమనిస్తుండాలి. వాళ్ల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి. ఆ బాధ్యత బ్యాంక్ మేనేజర్, రీజినల్ మేనేజర్ పై ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో ఏదైనా ఊహించని మార్పు గమనిస్తే వెంటనే వారిపై నిఘా ఉంచాలి.
  • అలాగే ఒక బ్యాంక్ ఉద్యోగి తన జీతం కంటే ఎక్కువ విలువైన ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే బ్యాంకు అధికారుల అనుమతి తీసుకోవడం లేదా కనీసం సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అలా చెప్పకపోతే వారిని అనుమానించాల్సిందే.
  • ఇతర బ్రాంచుల నుంచి వచ్చి మరో బ్రాంచిలో ఆడిట్లు చేస్తుండాలి. ఇది కనీసం 15 రోజులకి ఒకసారి లేదా నెల రోజులకి ఒకసారి చేయాలి. దీని వలన తప్పులకు ఆస్కారం ఉండదు.
  • బ్యాంకు సిబ్బంది బాధ్యతలను ఎప్పటీకప్పుడు మారుస్తూ ఉండాలి. ఉదాహరణకి ఫీల్డ్ ఆఫీసర్‌ని అకౌంటెంట్‌గా, అకౌంటెంట్‌ను ఫీల్డ్ ఆఫీసర్గా మార్చాలి. అలాగే ఇతర స్టాప్ విషయంలో కూడా. ఈ చిన్నది చేస్తే చాలు, ఎక్కడికక్కడ చెక్ పెట్టినట్లే. ఎందుకంటే ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకునేటప్పుడు లోటుపాట్లని చూస్తారు. దాని వలన లోపాలేమైనా ఉంటే బయటపడతాయి.
ఆర్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

తనఖా నగల విషయంలో ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి?

ప్రతి బ్యాంకు ఆర్బీఐ రూల్స్ పాటించాలని, అలా పాటించినప్పుడే ఆర్బీఐ అధికారులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించి ఇటు బ్యాంకు, అటు కస్టమర్ ఇరువురు నష్టపోకుండా చర్యలు తీసుకుంటుందని జగన్నాథరావు చెప్పారు.

బ్యాంకులో తనఖా పెట్టిన నగలు ఏ రూపంలోనూ బయటకు వెళ్లకూడదు. బ్యాంకు లోపలే ఉండాలి. ఆ నగలు బ్యాంకు లోపల ఉంటేనే ఇన్స్యూరెన్స్ వస్తుంది. అవి బ్యాంకులో లేవని తేలితే ఇన్స్యూరెన్స్ వాటికి వర్తించదు.

మణప్పురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి వాటిలో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఏ సంస్థా నగలును తాకట్టు పెట్టుకోకూడదు.

ఎస్బీఐ వంటి ప్రభుత్వ బ్యాంకైనా, మరేదైనా ప్రైవేటు బ్యాంకైనా లేదా బంగారంపై వ్యాపారం చేసే సంస్థలైనా నిరంతరం వ్యక్తులపై నిఘా ఉంచాలి.

ముఖ్యంగా ఒకే వ్యక్తి ఎక్కువ నగలు తరచూ తెస్తూ రుణం తీసుకుంటుంటే వెరిఫై చేయాలి. ఎందుకంటే ఎవరైనా బంగారాన్ని తనఖా పెడుతుంటే అది వారి సొంత బంగారమే కావాలి. నా భార్య బంగారం అని చెప్పినా భర్తకు లోన్ ఇవ్వరు. ఒకరి బంగారంపై మరొకరికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు.

వీడియో క్యాప్షన్, బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)