మోనాలిసా నవ్వు వెనుక దాగిన రహస్యం ఏంటో తెలుసా?

మోనాలిసా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ 'మోనాలిసా'. ఈ పెయింటింగ్‌ను ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ వేశారు. లియోనార్డో కేవలం కళాకారుడు మాత్రమే కాదు. అనేక రంగాల్లో ఆయన ప్రజ్ఞావంతుడు.

పెయింటింగ్‌తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఆయనకు ఉండేది. అనాటమీ (శరీర నిర్మాణం)పై లియోనార్డోకు ప్రత్యేక ఆసక్తి. ముఖ్యంగా మ్యాథ్స్, ఆప్టిక్స్, అనాటమీ సబ్జక్టులను ఆయన అమితంగా ఇష్టపడేవారు.

కళకు, సైన్స్‌కు మధ్య తేడాను ఆయన పట్టించుకోలేదు. మార్చురీలో గమనించిన విషయాలు ఆయన పెయింటింగ్స్‌లో ప్రతిబింబించేవి. లియోనార్డో పెయింటింగ్స్‌ను విశ్లేషించడమనేది పెద్ద గౌరవం. ఎందుకంటే, అలా అధ్యయనం చేయడంలోనే ఆయనకు ఏయే అంశాల్లో ప్రావీణ్యముందో తెలిసేది.

కానీ, ఆయనకు శరీర సౌష్టవంపై ఉన్న ఇష్టం 'మోనాలిసా' ముఖాన్ని పెయింటింగ్ చేసేందుకు ఉపయోగపడిందని మీరు అనుకున్నట్లైతే, మీరు దానిని మరోలా చూడలేరు. ప్రతి విషయంలోనూ తన జ్ఞానాన్ని ఉపయోగించారని ఆయన పెయింటింగ్స్, నోట్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

 లియోనార్డో డా విన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లియోనార్డో డా విన్సీ

మోనాలిసా కళ్లు

ఆప్టిక్స్‌ను ఉపయోగించి పెయింటింగ్ వేయడమంటే ఏంటి? మీరు గదిలో ఎటువైపు వెళ్లినా మోనాలిసా కళ్లు మిమ్మల్నే చూస్తున్నట్లు అనిపించిందా? అదే అందుకు చక్కని ఉదాహరణ.

మనం ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు కంటిలోని ఐరిస్ (కనుపాప) సూటిగా ఉంటుంది. కానీ అవతలి వ్యక్తి ఐరిస్ సూటిగా ఉన్నట్లు అనిపించదు. అది కాస్త అటూఇటుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోనాలిసా ఇల్యూషన్ వెనక కారణం ఇదే. దీన్నే మోనాలిసా ఎఫెక్ట్ అని పిలుస్తారు. కానీ, ఇది ఇల్యూషన్ కాదు. అది పూర్తిగా ఆప్టిక్స్‌ ఆధారంగా జరుగుతుంది.

మోనాలిసా నవ్వును పరిశీలించండి. మీరు ఎదురుగా నిల్చుని చూసినప్పుడు ఆమె ముఖంలో నవ్వు కనిపించదు. కానీ, ఒకవైపు నుంచి చూస్తే చిరునవ్వు నవ్వుతున్నట్లు కనిపిస్తుంది.

పెయింటింగ్స్‌లో మోనాలిసా పెదవుల చివర్లో 'స్ఫుమాటో' (స్ఫుమాటో) అనే మందంగా కనిపించే రూపురేఖలను గీశారు. ఆప్టిక్స్‌లో బాగా ప్రావీణ్యం ఉన్న లియోనార్డో మనం దేనినైనా సూటిగా చూసినప్పుడు మాత్రమే మన దృష్టి మరింత స్పష్టంగా ఉంటుందని గ్రహించాడు.

మోనాలిసా

ఫొటో సోర్స్, Getty Images

మోనాలిసా నవ్వుతుందా?

ఈ కళాఖండాన్ని చూసినప్పుడు మన కళ్ళు మోసపోవచ్చు. అత్యంత ప్రతిభావంతమైన ఈ పెయింటింగ్‌‌లో ఆయన మోనాలిసా పెదవుల చివరన కిందికి రేఖలు గీయడం ద్వారా ఆమె నవ్వుతున్న ప్రభావాన్ని సృష్టించాడు. అంతేకానీ, అక్కడ మోనాలిసా నవ్వలేదు.

పెయింటింగ్‌లో ఆమె చూపులు తీక్షణంగా ఉన్నట్లు గీశారు. పెదవులు మసకబారినట్లుగా ఉన్నప్పటికీ, పెదవులు చివరివైపున పైకి లేచినట్లుగా ఉంటుంది. దీంతో పెదవుల ఆకృతి మారిపోతుంది. అందుకే నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, అది అస్పష్టంగా ఉంటుంది. అది పెదవులు కదులుతున్నట్లు, నవ్వుతున్నట్లు ఒక భ్రమ కలిగిస్తుంది.

మోనాలిసా

ఫొటో సోర్స్, Getty Images

ముఖం ఎందుకు కదులుతుంది?

''మోనాలిసా ముఖానికి బలమైన ఔట్‌లైన్స్ (రూపురేఖలు) గీయలేదు. అంతా బ్లర్(బూదర)గా ఉంటుంది. అందువల్ల ఆమె ముఖం కదులుతున్నట్లు అనిపిస్తుంది'' అని ఆర్ట్ క్రిటిక్, హిస్టారియన్ ఎస్తెల్ లావెట్ అభిప్రాయపడ్డారు.

పెయింటింగ్‌లో మిమ్మల్ని చూస్తున్నట్లుగా గీయలేదు. చూపు వేరే దిశలో ఉండడం వల్ల అది కదులుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఆ పెయింటింగ్ మూడు రకాలుగా కనిపిస్తుంది.

''ఆ పెయింటింగ్‌లో తాను ఏం చేశాడో ప్రజలు గ్రహించినప్పుడు లియోనార్డో సంతోషించి ఉంటాడని అనుకుంటున్నా'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ ఆర్ట్ విభాగంలో ఎమిరిటస్ రీసెర్చ్ ప్రొఫెసర్ మార్టిన్ కెంప్ అన్నారు. శరీరం పక్కకు, చూపు సూటిగా ఉండడం వల్ల ఈ పెయింటింగ్ మరింత అందంగా ఉందని భావిస్తున్నానన్నారు.

''చాలా పెయింటింగ్స్‌లో మహిళల చూపు పురుషుల కళ్లలోకి నేరుగా చూస్తున్నట్లు ఉండదు. ఎందుకంటే పురుషుల కళ్లలోకి నేరుగా చూడడం తప్పుగా భావించేవారు. అందువల్ల పెయింటింగ్స్‌లో కళ్లు కిందికి ఉంటాయి. లియోనార్డో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టాడు'' అన్నారాయన.

వీడియో క్యాప్షన్, మోనాలిసా పెయింటింగ్స్ ప్రత్యేకత ఏంటి? ఆ నవ్వు వెనుక దాగిన రహస్యమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)