సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ: రాజ్‌పుత్ కర్ణీ సేన చీఫ్ హత్యతో రగులుతున్న రాజస్థాన్‌, ఆయన్ను చంపిందెవరు?

కర్ణీసేన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ
    • రచయిత, మోహర్‌సిన్హ్ మీనా
    • హోదా, బీబీసీ హిందీ

రాజ్‌పుత్ కర్ణీ సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ డిసెంబరు 5వ తేదీ మంగళవారం జైపూర్‌లో హత్యకు గురయ్యారు. హంతకులు గోగామేడీని కలిసేందుకు శ్యామ్‌నగర్‌లోని ఆయన ఇంటికి వచ్చారు. ఆ తరువాత కాల్పులు మొదలుపెట్టారు. ఈ దాడి చేయడానికి వచ్చిన వారిలో ఒకరు మృతి చెందారు.

హుటాహుటిన గోగామేడీని మానస సరోవర్‌లోని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు చెప్పారు.

దీంతో రాజ్‌పుత్ కర్ణీ సేన కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట గుమిగూడి నిరసనకు దిగారు. జైపూర్, ఉదయ్‌పూర్, బార్మర్ ప్రాంతాలకు కూడా నిరసన ప్రదర్శనలు వ్యాపించాయనే వార్తలు వస్తున్నాయి.

గోగామేడీ హత్యకు సంబంధించి మూడు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతూ కనిపించారు.

సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు హంతకుల కోసం వెదుకుతున్నారు. రాష్ట్రమంతటా పోలీసులు అలర్ట్ అయ్యారు.

వీడియో క్యాప్షన్, సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీను చంపిందెవరు?

పోలీసులు ఏం చెబుతున్నారు?

శ్యామ్‌నగర్ లోని సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కాల్పులు జరిపారు. ఆ తరువాత పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది.

ఈ సంఘటనపై జైపూర్ పోలీసు కమిషనర్ జార్జి జోసెఫ్ మాట్లాడుతూ ‘‘ గోగామేడీని కలవడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కలవడానికి అనుమతి పొందాక వారు ఆయనను కలిశారు. దాదాపు పదినిమిషాల సేపు మాట్లాడారు. తరువాత ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు’’ అని చెప్పారు.

దగ్గరలోనే నుంచుని ఉన్న సెక్యూరిటీ గార్డుకు కూడా గాయాలయ్యాయి. ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి చేసిన వ్యక్తులలో ఒకరు మరణించారని తెలిపారు.

చనిపోయిన దుండుగుడి పేరు నవీన్ సింగ్ షెకావత్. ఇతను షాపూర్‌కు చెందినవాడు. జైపూర్‌లో ఈయనకు ఓ బట్టల దుకాణం ఉందని జోసెఫ్ చెప్పారు.

‘‘ ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. దీని ఆధారంగా మేం విచారణ జరుపుతున్నాం. అలాగే ప్రత్యక్ష సాక్షులు, లభిస్తున్న సమాచారం ఆధారంగా త్వరలోనే మిగిలిన ఇద్దరు దుండగులను, దాడికి పథక రచన చేసినవారిని పట్టుకుంటాం. దుండగులకు సంబంధించిన ప్రాంతాలలో విచారణ సాగుతోంది. అలాగే జైపూర్, బికనీర్ డివిజన్లలోనూ వీరి కోసం వెదుకుతున్నాం’’ అని ఆయన తెలిపారు.

కర్ణీసేన

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జైపూర్‌లో పద్మావత్ చిత్రీకరణ సమయంలో నిరసన ప్రదర్శన

సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ ఎవరు?

హనుమాన్‌గర్ జిల్లాలో రాజ్‌పుత్‌లలో సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ ఓ ఆవేశపూరిత నాయకుడు.

2017లో ‘పద్మావత్’ సినిమాను వ్యతిరేకించడం ద్వారా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, రాజ్‌పుత్ కర్ణీసేన ఆ చిత్రం సెట్స్‌ను ధ్వంసం చేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సుఖ్‌దేవ్ అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని చెంపపై కొట్టి వార్తలలో నిలిచారు.

రాజ్‌పుత్‌ల కోసం పనిచేస్తున్న కర్ణీసేనలో చాలా కాలంగా సుఖ్‌దేవ్ ఉన్నారు. కానీ లోకేంద్ర సింగ్ కాల్వీ వివాదం తరువాత సుఖ్ దేవ్ కొత్త రాజ్‌పుత్ కర్ణీసేనను ప్రారంభించారు. కాల్వీ మరణం తరువాత గోగామేడీ రాజ్‌పుత్ కమ్యూనిటీలో ప్రాముఖ్యం కలిగిన నాయకుడిగా ఎదిగారు.

2020లో కంగనా రనౌత్, సంజయ్ రౌత్ మధ్య జరిగిన మాటల యుద్ధంలో సుఖ్‌దేవ్ గోగామేడీ కంగనా వైపు నిలబడ్డారు. కంగనాకు మద్దతుగా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

కర్ణీసేన

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, సుఖదేవ్ సింగ్ రాజ్‌పుత్‌లలో ప్రముఖ నాయకునిగా ఎదిగారు

రాష్ట్రవ్యాప్తంగా నిరసన

సుఖ్‌దేవ్ హత్య తరువాత రాజస్థాన్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. మానససరోవర్ ఆస్పత్రి ఎదురుగా ప్రదర్శన చేయడంతోపాటు రహదారులను దిగ్భంధించారు. నిరసనకారులు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జైపూర్, ఉదయ్‌పూర్, ప్రతాప్‌ఘర్, బికనీర్, బర్మార్, జోధ్‌పూర్, జైసల్మీర్‌లలో రాజ్‌పుత్‌లు నిరసన ప్రదర్శనలకు దిగారు. రహదారులను దిగ్బంధించినట్టు వార్తలు వస్తున్నాయి.

దీనిపై క్షత్రియ కర్ణీ సేన పరివార్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్ ఆందోళలను ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

‘‘కర్ణీసేన జాతీయ అధ్యక్షుడు గోగామేధి హత్య క్షత్రియులలో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. ప్రభుత్వం తక్షణం హంతకులను అరెస్ట్ చేయాలి. లేదంటే జైపూర్‌ను ముట్టడిస్తాం. తదనంతర పరిణామాలకు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆయన హెచ్చరించారు.

మాజీ మంత్రి రాజేంద్ర గుదా, సుఖ్‌దేవ్ హత్యను పిరికిపింద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన తరువాత రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న రాజ్‌పుత్‌లందరూ జైపూర్‌కు చేరుకున్నారు.

చాలా ప్రాంతాలలో దుకాణాలు మూతపడ్డాయి. బుధవారం జైపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.

రోహిత్ గోద్రా ఎవరు?

‘‘సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్యకు రోహిత్ గోద్రా గ్యాంగ్ బాధ్యత తీసుకుంది. త్వరలో వారిని అరెస్ట్ చేస్తాం. రోహిత్ గోద్రాపై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఇతను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడు’’ అని డీజీపీ ఉమేష్ మిశ్రా చెప్పారు.

రోహిత్ బికనీర్‌కు చెందినవాడు. ఇతడు అక్రమంగా దేశం విడిచి వెళ్ళడానికి కిందటేడాది యత్నించినట్టుగా అభియోగాలున్నాయి.

నిరుడు శిఖర్‌లో జరిగిన గ్యాంగ్‌స్టర్ రాజు థెహాట్ హత్య కూడా తన పనేనని అతడు ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి :