రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు, కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?

రేవంత్, కేసీఆర్

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, పసునూరు శ్రీధర్‌బాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణం చేయబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన రోజునే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపిస్తే సీఎం పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డిని పోటీకి నిలబెట్టడం ద్వారా కూడా ఏఐసీసీ స్పష్టమైన సంకేతాలే ఇచ్చింది.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్ళు కూడా కాకముందే పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి వచ్చాయి. పార్టీలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులను కాదని రేవంత్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సహజంగానే పార్టీలో వ్యతిరేక స్వరాలు తీవ్ర స్థాయిలో వినిపించాయి.

‘తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేస్తే ఊరుకోం” అని ఆ పార్టీ మెగా సీనియర్ నేత వి. హనుమంతరావు ఆ సందర్భంలో బాహాటంగానే అన్నారు.

కానీ, తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్‌ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ ఒక ఫైర్ బ్రాండ్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంది. అది రేవంత్ రెడ్డేనని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కు రెండు లక్ష్యాలను నిర్దేశించిందని సమాచారం.

ఒకటి : తెలంగాణకు ఆల్టర్ ఇగోలా వెలిగిపోతున్న తిరుగులేని నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కోవడం.

రెండు : తెలంగాణలో 2018 ఎన్నికల తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకోవడమే కాకుండా, 2020 చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 వార్డులు గెల్చుకుని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)కు షాకిచ్చిన బీజేపీకి, ఆ పార్టీకి అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడం.

ఈ రెండు లక్ష్యాలను సాధించి పార్టీని రేవంత్ రెడ్డి ఎలా విజయం వైపు నడిపించారు?

ఒకప్పుడు రేవంత్‌ను ససేమిరా అన్న వీహెచ్ డిసెంబర్ 3 ఫలితాల తరువాత కాబోయే ముఖ్యమంత్రి ఎవరని విలేఖరులు అడిగినప్పుడు, “సీఎం ఇంకెవరు అయితరు? పని చేసినోడే అయితడు. పని చేసిందెవరు... రేవంత్ రెడ్డి” అని తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పే విధంగా పరిస్థితులు ఎలా మారాయి?

కాంగ్రెస్‌లో పార్టీని గెలిపించడం ఒక ఎత్తు అయితే, పార్టీలోని ఇతర నేతల ఆమోదాన్ని పొందగలగడం మరో కసరత్తు. ఎన్నికల క్షేత్రంలో విజయాన్ని, పార్టీలో తన నేతృత్వం పట్ల ఆమోదాన్ని రేవంత్ ఎలా సాధించారు?

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

విజయానికి ఆరు మెట్లు

1. కుటుంబ పాలనే టార్గెట్

రేవంత్ రెడ్డి 2015లో ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలు నుంచి నెల రోజుల తరువాత బయటికి వచ్చినప్పుడు, ‘కేసీఆర్‌ను ఓడించడమే నా ఏకైక అజెండా’ అని చెప్పారు. ఈ ఎన్నికలకు ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “నేను కేసీఆర్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. ఆయనే నన్ను తన ప్రత్యర్థిని చేసుకున్నారు” అని అన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసిన సమయంలో పోలీసులు రాత్రిపూట ఆయన ఇంట్లోకి బలవంతంగా వెళ్ళి అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనల ద్వారా కేసీఆరే తన ప్రత్యర్థిని తయారు చేసుకున్నారన్నది రేవంత్ మాటల అంతరార్థం అయి ఉండవచ్చు. కొడంగల్‌లో ఓడిపోయిన ఆ తరువాత నాలుగు నెలలకు పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

ఇక, అక్కడి నుంచి ఆయన కేసీఆర్‌నే టార్గెట్ చేసుకుని మాట్లాడడం మొదలు పెట్టారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయాలన్నది ఆయన మొదటి నినాదంగా మారింది.

కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఎవరి మాటా వినరనే విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ నినాదం ప్రజల్లోకి వేగంగా వెళ్ళింది. మోదీ గురించి లేదా రాష్ట్ర బీజేపీ నాయకుల గురించి రేవంత్ పెద్దగా మాట్లాడలేదు. ఆయన ఫోకస్ అంతా బీఆర్ఎస్ లేదా కేసీఆర్ మీదే పెట్టారు.

ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమనే వాదనను కూడా బలంగా వినిపించగలిగారు. ఇది రేవంత్ విజయానికి తొలి మెట్టు.

2. ఇంట గెలిచి...

ఎన్నికల ఏడాదిలో పార్టీలోని సీనియర్లను కలుపుకుని పోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కప్పల తక్కెడ అనే విమర్శకు తావు ఇవ్వకుండా పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు రాకుండా చూడగలిగారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వంటి నాయకులను ఎన్నికల్లో కలిసి పని చేసేలా చేయగలిగారు. లేదా కనీసం విభేదాలు రోడ్డున పడకుండా చూసుకున్నారు. బహిరంగ నిరసనలను సహించం అంటూ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పార్ఠీ నాయకులకు సందేశం రావడం కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడింది. దాదాపు 90 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ విధంగా అటు ప్రజల్లో, ఇటు అభ్యర్థుల్లో తన నాయకత్వ స్థానాన్ని కన్సాలిడేట్ చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, RevanthReddy/X

3. నిరుద్యోగ సమస్య

తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్ళుగా ఉద్యోగాలు రాక ఆగ్రహంతో ఉన్న యువతరానికి కాంగ్రెస్‌ను ఒక ప్రత్యామ్నాయంగా చూపడంలోనూ రేవంత్ సక్సెస్ అయ్యారు.

జిల్లాల్లో నిరుద్యోగ సభలు నిర్వహించి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని ఒక రాజకీయ అస్త్రంగా మార్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

4. భారత జోడో, కర్ణాటక

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 12 రోజుల పాటు పర్యటించడం ప్రధానంగా గ్రామీణ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపించింది. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో పాటు పర్యటించిన రేవంత్ రెడ్డి స్థానికంగా తన బలాన్ని చాటుకోవడానికి ఆ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారు.

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు, రేవంత్ రెడ్డి ఫోటో ఉన్న జెండాలు కనిపించాయి. స్థానికంగా తనకు ఆదరణ పెరుగుతోందన్న ఇంప్రెషన్ రాహుల్ గాంధీకి కలిగించడంలో రేవంత్ సఫలమయ్యారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అనే మాటను ప్రతి సభలోనూ ప్రజలకు గుర్తు చేస్తూ వచ్చారు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో సోనియా గాంధీకి తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని చెప్పిన బీఆర్ఎస్ నాయకత్వం ఈసారి ఎన్నికల్లో సోనియాను, రాహుల్‌ను టార్గెట్ చేయడాన్ని రేవంత్ ఆ విధంగా తిప్పికొట్టగలిగారు.

కర్నాటక ఎన్నికల ఫలితాలు సైకలాజికల్ గా కాంగ్రెస్‌కు అందివచ్చింది. దాన్ని దూకుడుగా ఉపయోగించుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.

రాహుల్ జోడో యాత్ర
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రేవంత్ తన బలాన్ని చాటుకోగలిగారు

5. కాళేశ్వరం ఎఫెక్ట్

దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందంటూ చేసిన ప్రచారం కూడా కాంగ్రెస్‌కు కొంతవరకు అనుకూలంగా మారింది.

మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోయాయన్న వార్త బయటకు రాగానే ఆ ప్రచారానికి బలం పెరిగింది.

6. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు

ఇక, చివరిది అత్యంత ముఖ్యమైనది, “బీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగలు. రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయి” అనే ప్రచార వ్యూహం కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రచారాస్త్రం వెనుక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారని చెబుతున్నారు.

కర్ణాటకలో జేడీఎస్-బీజేపీలు కుమ్మక్కయ్యానే ప్రచారం అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభించింది. అదే తురుపు ముక్కను తెలంగాణలో కూడా ప్రయోగించాలనే సునీల్ వ్యూహం కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది.

ఇక, రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు, అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కళ్ళెం వేయాలనే కాంగ్రెస్ హైకమాండ్ రెండో టార్గెట్ కోసం రేవంత్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించడం ద్వారా ఆ పార్టీ పెద్దలు రేవంత్‌ రెడ్డి కోరుకున్నది అడగకుండానే ఇచ్చారు. ఈ మార్పుతో పాటు దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పట్ల ఈడీ మెతకగా వ్యవహరించిందనే ఆరోపణలు కాంగ్రెస్ అమ్ములపొదిలోని పాశు పతాస్త్రాన్ని మరింత పదునెక్కించాయి.

ఇవీ రేవంత్ రెడ్డి విజయానికి ఆరు మెట్లు.

kCR

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కర్ణాటక ఎఫెక్ట్... బీఆర్ఎస్ స్వయంకృతం

అయితే, ఈ విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా బీఆర్ఎస్ పాత్రే ఎక్కువ ఉందనే విశ్లేషణలూ వస్తున్నాయి. అంటే, కేసీఆర్ అనురించిన వైఖరి, తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయన్నది ఆ విశ్లేషణల సారాంశం.

అంతేకాదు, “కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నుంచి తెలంగాణ పౌర సమాజం కొన్ని కొత్త పాఠాలు నేర్చుకుంది. కేసీఆర్ వంటి నాయకుడిని కూడా మనం మార్చుకోవచ్చన్న అవగాహన అది” అని రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

నిజానికి, దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ దశాబ్ద కాలం పాలనకే ఎందుకు మొహం మొత్తిపోయారు?

తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేకపోవడం, రైతులకు కూడా నిరంతరాయంగా విద్యుత్ అందించడం కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అతి ముఖ్యమైన విజయం.

ఏ రాష్ట్రమైనా వ్యావసాయికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధించాలంటే విద్యుత్ కొరతను లేకుండా చేయడం చాలా ముఖ్యం. దీనికితోడు, సాగునీరు తాగునీరు విషయాల్లో గణనీయమైన ప్రగతి ఉంది.

తెలంగాణలో ఇప్పుడు పచ్చదనం పెరిగిందన్నది కాదనలేని వాస్తవం. అలాగే, ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. అయినా, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కేసీఆర్ హ్యాట్రిక్ కల ఎందుకు చెదిరిపోయింది?

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేసీఆర్ స్వయంకృతమే కాంగ్రెస్‌ను గెలిపించిందా?

కేసీఆర్ హ్యాట్రిక్ ఎందుకు మిస్సయింది?

1. ప్రత్యర్థిని ఎంచుకోవడం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014లో కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన టీడీపీని టార్గెట్ చేశారు. “తెలుగుదేశం పార్టీకి ఇక్కడేం పని. ఆ పార్టీ ఇక్కడ నామరూపాల్లేకుండా పోతుంది” అని కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో బాహాటంగానే అన్నారు.

తెలంగాణ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నాయకులందర్నీ అప్పటి టీఆర్ఎస్‌లో చేర్చుకోగా మిగిలిన ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఆ కేసులో అరెస్ట్ చేయడమే కాకుండా 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్‌ను తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.

ఆ తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. “కేసీఆరే నన్ను తన ప్రత్యర్థిగా ఎంచుకున్నారు” అని రేవంత్ అనేది అందుకే. 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు.

ఈ పర్యవసానంగా ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక బలాన్ని కేసీఆర్ కోల్పోయారు. ఓటమి దిశగా కేసీఆర్ వేసిన తొలి అడుగు.

2. అధికారం అంటే ఇంతేనా?

ఫాంహౌస్ సీఎం అని, సెక్రటేరియట్‌కు రారని, ప్రజల సంగతి తరువాత అసలు ఎమ్మెల్యేలు మంత్రులకే ఆయన అపాయింట్మెంట్ దొరకదనే ఆరోపణలు కేసీఆర్ మొదటి టర్మ్ నుంచే మొదలయ్యాయి.

రెండోసారి గెలిచిన తరువాత ఈ వైఖరి మరింత పెరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను కేసీఆర్ ఎలా చూసినప్పటికీ, బయటి నుంచి చూసేవారికి మాత్రం అది అహంకారంగా కనిపించింది.

‘సాలు దొరా.. సెలవు దొరా’ అంటూ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన క్యాంపెయిన్‌కు లభించిన స్పందన అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి విమర్శలను అడ్రస్ చేయాల్సింది పోయి, ‘అధికారం అంటే ఇట్లనే ఉంటదయా, లేకపోతే కోఠీల నిలబెట్టి చారాణాకు అమ్మేస్తరు’ అనే ధోరణితో సమర్థించుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.

3. పేరులో ఏముంది?

ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగాలనుకునే ఆకాంక్షలకు గత నేతల అనుభవాలను ఉదహరిస్తూ వ్యతిరేకించాల్సిన పని లేదు. ఎందుకంటే, భవిష్యత్తు ఎప్పుడూ గతాన్నే రిపీట్ చేయదు.

అయితే, దశాబ్దాల తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ ప్రగతిశీల మేధావుల ఆలోచనలతో, ప్రాణాలకు తెగించి ఉద్యమించిన తరంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదబంధానికి ఉన్న భావోద్వేగ బంధం పార్టీ పేరు మార్చడంతో కొంత వరకు తెగిపోయింది.

అప్పటివరకు తెలంగాణ సామాజిక అస్తిత్వంలో భాగంగా కనిపించిన టీఆర్ఎస్... బీఆర్ఎస్‌గా మారడంతో కేసీఆర్‌కు మాత్రమే చెందిన సొత్తుగా మిగిలిపోయింది.

తెలంగాణ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే, “ఇక నుంచి మాది ఫక్తు పొలిటికల్ పార్టీ” అని ప్రకటించడం ద్వారా ఉద్యమ విలువల భారాన్ని కొంత దించుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పకనే చెప్పారు.

ఇప్పుడు పేరు కూడా మార్చడంతో ఉద్వేగబంధం పోయినట్లైంది. ఒక తెలంగాణ కవి చెప్పినట్లు, “పేరు మార్పుతో ఆ పార్టీ తెలంగాణ బొడ్డు పేగును తెంచుకుంది.”

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

4. సంక్షేమ పథకాలు

సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతౌల్యం పాటిస్తున్నట్లు చెప్పుకున్నప్పటికీ కేసీఆర్ ఎక్కువగా ఎన్నికల పోరాటాల్లో గెలిచేందుకు పాలసీల కన్నా స్కీములనే ఎక్కువగా నమ్ముకున్నారు.

గత ఎన్నికలకు ముందు హడావిడిగా రైతు బంధు ప్రకటించి నిధుల పంపిణీ చేశారు. మొన్న హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో దళిత బంధు ప్రకటించారు.

దళితబంధు పథకం అమలు చేయడానికి ముందు ముందు లక్ష కోట్లకు పైగా ఖర్చవుతాయని, అయినా వెనక్కిపోమని ప్రకటించారు. కానీ, ఇది కూడ దళితులకు మూడెకరాల పథకం లాగే కొందరితో ఆగిపోయింది. దాంతో, ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు ప్రభుత్వం పట్ల కోపంతో ఉన్నారు.

రైతు బంధు పథకంలోనూ సీలింగ్ లేకపోవడంతో వందల ఎకరాలున్న బడా భూస్వాములు, ఫార్మ్ హౌస్ యజమానులు, సినిమా తారలకు ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలను అప్పనంగా కట్టబెడుతోంది. ఇది రెండు మూడు ఎకరాలున్న రైతులకు న్యాయంగా అనిపించడం లేదు.

పన్నులతో సమకూరే ప్రజాధనాన్ని సంపన్నులకు ఇవ్వడమేంటనే ప్రశ్నను ప్రభుత్వం పట్టించుకోలేదు. కౌలు రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలోని రైతు భరోసా పథకంలో కౌలు రైతులను చేర్చారు. అది గ్రామీణ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న చిన్న రైతులకు ఆశలు కల్పించింది.

5. సిట్టింగ్స్ దెబ్బ

నిజానికి, తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలన ను స్థూలంగా చూస్తే పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. కెసిఆర్ ఆయన కుటుంబం వ్యవహారశైలిమీద ఉన్నంత తీవ్రమైన విమర్శలు పాలనమీద లేవు.

కానీ, కొన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధుల పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. భూముల పంచాయితీల విషయంలో చెడ్డపేరు ఉంది. ఈ సంగతి ఇంటలిజెన్స్ నివేదికలు చెక్ చేసుకునే అధికార వర్గానికి ఎలా తెలియకుండా ఉంటుంది?

ఈ విషయాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ అంగీకరించారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కేటీఆర్ అన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబెట్టిన 18 మంది కొత్త అభ్యర్థుల్లో 12 మంది గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట్ల కూడా ఎక్కువ మంది గెలిచారు.

kavitha

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కవిత కోసం కేసీఆర్ బీజేపీతో రాజీపడ్డారనే ప్రచారం ముమ్మరంగా సాగింది

6. నిరుద్యోగ సమస్య

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజి, ప్రవల్లిక ఆత్మహత్య వంటి విషయాలలో ప్రభుత్వ స్పందన ప్రజలకు భరోసా ఇచ్చేదిగా కాకున్నా కనీసం ఉపశమనంగా కూడా లేదు. “ఈ ప్రభుత్వం నిజాలను అర్థం చేసుకోవాల్సింది పోయి, వాటిని కౌంటర్ చేయడం ప్రారంభించింది” అని అన్నారు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, “యువత ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తే, లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని ప్రభుత్వం బదులిచ్చింది. నీళ్ళు రావడం లేదంటే, అందరికీ ఇచ్చామని ప్రభుత్వం ప్రజలను కౌంటర్ చేస్తూ వచ్చింది” అని అన్నారు.

ఉద్యమంలో ఎన్నో ఆశలతో పాల్గొన్న విద్యార్థి లోకం ఏజ్ బార్ అయి నిస్పృహలోకి కూరుకుపోయిందనే వాస్తవాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయాలు వినిపించాయి.

7. కుమ్మక్కు థియరీ

ఇక అసలు సిసలు పొలిటకల్ రీజన్... బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయనే కాంగ్రెస్ ఆరోపణను తిప్పి కొట్టడంలో బీఆర్ఎస్ విఫలమైంది.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న కుమార్తెను కాపాడుకోవడానికి కేసీఆర్.. బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది.

కూతురు కోసం కేసీఆర్, బీజెపి పన్నిన ట్రాప్‌లో చిక్కుకున్నారనే విశ్లేషణలు ఇప్పుడు గ్రామస్థాయిలోనూ వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజలను ఓటుబ్యాంకుగా చూసింది

ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యమేది?

ఏ రాజకీయ పోరాటంలోనైనా విజయానికి కొన్ని కారణాలే ఉండవచ్చు. కానీ, పరాజయానికి కారణాలు చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, గెలుపుకన్నా ఓటమినే ఎక్కువ విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.

సంక్షేమ పథకాలతో ప్రజల అకౌంట్లలో డబ్బులు పడుతూనే ఉన్నాయి, పంటసాగు పెరిగింది, హైదరాబాద్ విస్తరించింది, రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోల్చితే రెండింతలు అని తాము సాధించిన అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. కానీ, ప్రభుత్వంలో తమ భాగస్వామ్యమేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

“నిరుద్యోగుల ఆగ్రహం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, మూతబడిన చక్కెర మిల్లులను తెరుస్తామనే హామీలు నెరవేరలేదు. అభివృద్ధి లేదని, సంక్షేమం జరగలేదని ప్రజలు ఇలా స్పందించారని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళను వేధిస్తున్న అంశం ఇంకేదో ఉంది. దాన్ని ప్రతిపక్షం తన వ్యూహంగా మార్చుకుంది” అని సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ అన్నారు.

తెలంగాణ ప్రజలు అభిమానాన్ని కోరుకుంటారే కానీ బానిసలుగా ఉండడానికి ఇష్టపడరని గుర్తు చేశారు రాఘవాచారి. “కానీ, బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రదర్శించింది. మేం సంక్షేమం చేస్తున్నాం. కాబట్టి మీరు ఓటు వేయాలన్నట్లుగా మాట్లాడింది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతి లేదన్నది ప్రజల నుంచి వ్యక్తమైంది. తెలంగాణ సమాజానికి యాంటీ-ఫ్యూడల్ ఉద్యమాల చరిత్ర ఉంది. ఈ ఎన్నికల ఫలితం బహుశా ఆ ఉద్యమాల కొనసాగింపు” అన్నారు హరగోపాల్.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే కేసీఆర్ తన రాజీనామా లేఖను ఓఎస్‌డీ ద్వారా గవర్నర్‌కు పంపించారు. ప్రగతి భవన్ నుంచి ప్రైవేట్ వాహనంలో తన ఫామ్‌హౌస్‌కు వెళ్ళిపోయారు.

అదే సమయంలో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల నడుమ ప్రజలకు చేతులెత్తి ధన్యవాదాలు చెబుతూ తన నివాసం నుంచి గాంధీభవన్‌కు బయలుదేరారు.

“ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది” అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజా నాయకత్వానికి పర్యాయపదంగా ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయారు. ఈ ఓటమిని ఆయన ఎలాగూ విశ్లేషించుకుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని గెల్చుకున్న రేవంత్ రెడ్డి ఏం చేయాలి?

ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పినట్లు, “ఓడిపోయిన వాళ్ళకంటే గెలిచిన వాళ్ళు ప్రత్యర్థి ఓటమిని విశ్లేషించుకోవాలి. అప్పుడు విభిన్నమైన పాలన వస్తుంది.”

వీడియో క్యాప్షన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: గాంధీభవన్‌కు చేరుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)