చిమ్నీల్లో చితికే చిన్నారులు: ఈ అనాగరికతకు ముగింపు ఎలా దొరికింది...

ఫొటో సోర్స్, GETTY IMAGE
ఈ కథనంలో కలవరపరిచే అంశాలు ఉన్నాయి.
ఇది చిమ్నీలను శుభ్రం చేసే పిల్లల గురించిన కథనం. ఒకనాడు ప్రపంచ వ్యాప్తంగా చిమ్నీలను శుభ్రం చేసే పిల్లలు దుర్భరమైన జీవితాలను అనుభవించారు.
పొగ గొట్టాలను తుడిచే పనిలో పిల్లలు గంటలకొద్దీ నలిగిపోయేవారు. భయానకమైన పరిస్థితుల మధ్య పిల్లలు పని చేయాల్సి వచ్చేది.
మూడేళ్ళ వయసులోని అనాథలు, లేదా పేదరికం కారణంగా తల్లిదండ్రులు అమ్మేసిన పిల్లలు తమ యజమానుల దయాదాక్షిణాల్యా మీద ఆధారపడి బతకాల్సి వచ్చేది.
పొగ గొట్టాలలోకి దిగడం ఎంతో ప్రమాదకరమైనప్పటికీ బలవంతంగా ఈ చిన్నారులతో ఆ పని చేయించేవారు.
18,19 శతాబ్దాలలో ‘క్లైంబింగ్ బాయ్స్’ అని పిలిచే ఈ పిల్లలు మృతి చెందిన వార్తలు బ్రిటీషు పత్రికలలో తరచూ కనిపిస్తుండేవి.
కొందరు చిమ్నీల పై భాగం నుంచి పడిపోయేవారు, మరికొందరు లోపల చిక్కుకుపోయి ఊపిరాడక మరణించేవారు. మరికొందరు పిల్లలను బలవంతంగా ఇంకా వేడిగా పొగలు కక్కుతుండే చిమ్నీలలోకి దింపడంతో వారు బతికుండాగానే అందులో మాడి మసైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
1846లో లైమ్‌రిక్ ద్వీపంలో ఇటువంటి విషాద ఘటన ఒకటి జరిగింది.
మైకేల్ బబ్రెయిన్ అనే 8ఏళ్ళ పిల్లాడు చిమ్నీలో మంటల్లో చిక్కుకుని మరణించాడు.
దీనిపై జరిగిన విచారణలో పనిమనిషి కేథరైన్ ర్యాన్ చిమ్నీని శుభ్రం చేయాల్సిందిగా ఒబ్రెయిన్‌ను యజమాని సులీవన్ ఆదేశించడాన్ని తాను విన్నట్టు తెలిపింది. పావుగంట తరువాత మంటల్లో చిక్కుకున్న ఆ పిల్లాడి అరుపులు వినిపించినట్టు చెప్పింది.
అంతకు ముందు చిమ్నీ శుభ్రం చేయమని సులీవన్ ఒబ్రెయిన్‌ను హింసించాడు. తోలు బెల్టులతో చావబాదాడు. ఆ దెబ్బలు తాళలలేక పిల్లాడు అతని కాళ్ళపై పడి చిమ్నీ శుభ్రం చేస్తానని చెప్పాడు.
వెంటనే సులీవన్ బబ్రెయిన్ చేయి పట్టుకుని బరాబరా ఈడ్చుకుంటూ పై అంతస్తుకు తీసుకువెళ్ళాడు. తరువాత ఆ బాలుడి శవాన్ని చిమ్నీలోంచి బయటకు తీశారు అని ఆమె చెప్పింది.
ఒబ్రెయిన్ శరీరం భయంకరమైన స్థితిలో ఉందని, చర్మం మొత్తం కాలిపోయి, గుర్తు పట్టలేనట్టుగా మారిందని శవ పంచనామాలో రాసినప్పటికీ, తరువాత ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మృతిగా తీర్పు వచ్చింది.
ఇది చాలా సాధారణమైన తీర్పు. కేవలం కొన్ని కేసులలో మాత్రమే ఇది జరుగుతుంది. అది కూడా ప్రజలు ఎవరినైనా నిందితుడిగా భావిస్తుంటే అప్పుడే ఈ కేసులు వెలుగులోకి వస్తాయి. ఇలాంటివి కేవలం ఐర్లాండ్‌కే పరిమితం కాలేదు.
స్కాట్లాండ్, రష్యాలో ఈ పనికి ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించేవారు. ఏదైన బరువైన వస్తువు అడుగు భాగానా బ్రష్‌ను కట్టి, ఆ బరువుకు ఓ తాడు కట్టి చిమ్నీ లోపలకు పంపి శుభ్రం చేసేవారు.
ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జీయం, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌తోపాటు చాలా ప్రాంతాలలో చిమ్నీలను శుభ్రం చేసేపనిలో పిల్లలు ఉండేవారు.
ఇటలీలో ఈ పనిని చేసేవారిని ‘పజ్జాకామిని’ అని పిలిచేవారు. ఇటలీలోని ఉత్తర భాగంలో అనాథలకు, బిచ్చగాళ్ళకు విదేశాలలో పనిచేసేందుకు శిక్షణ ఇచ్చేవారు.
19, 20 శతాబ్దాలలో స్విస్ ప్రాంతంలో పేదరికంలో మగ్గిపోతున్నవారు తమ కుటుంబాలలోని 8 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న పిల్లలను మిలన్ తదితర నగరాలలో చిమ్నీలను శుభ్రం చేసే పనికి పంపేవారు. ఇది దాదాపు బానిసత్వానికి సమానంగా ఉండేది.
అమెరికాలో బానిసత్వం రద్దు చేయడానికి ముందు, వెనుకా కూడా సాధారణంగా ఈ చిమ్నీలను శుభ్రం చేసేవారంతా ఆప్రికన్ అమెరికన్లే.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రోమన్ సామ్రాజ్యంలోనూ, మధ్య యుగాలలోనూ నిప్పుగూడులు ఉండేవి. ప్రత్యేకించి పెద్ద పెద్ద భవంతులలో ఎక్కువగా ఉండేవి. 16వ శతాబ్దంలో ఇవి చాలా ప్రసిద్ధి చెందాయి.
అయితే ధనవంతులు, అధికారవర్గాలు తమ ఇళ్ళు వెచ్చగా ఉండటానికి ఇళ్ళ మధ్యలో కట్టెలతో కాల్చుకునే నిప్ఫుగూళ్ళు ఏర్పాటు చేసుకోవడం మొదలైంది.
ఆ తరువాత ఉద్యోగులు కూడా ఈ పద్ధతిని అనుసరించడం మొదలైంది.
ఈ నిప్పుగూళ్ళను శుభ్రం చేసేవారికి 17, 18 శతాబ్దాలలో డిమాండ్ పెరిగింది. ఇది అప్పటికే అగ్నిప్రమాదాలను నివారించే పనిగా రూపాంతరం చెందింది.
చాలామంది ప్రజలు బొగ్గుల కోసం కట్టెలను వదిలేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ నిప్పుగూళ్ళ రూపం మారడం మొదలైంది. గాలి బయటకు వెళ్ళే చిమ్నీలను ఇరుకుగా మార్చారు.
పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక, నగరాలలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు పెరగడం, వీటికి అనుసంధానంగా ఎక్కువ గదులకు చిమ్నీల నిర్మాణం మొదలైంది. అయితే పొగ గొట్టాల ప్రామాణిక కొలతలు మారాయి. సైజు తగ్గించి ఇరుకైన చిమ్నీలు నిర్మించేవారు. దీంతో పొగ గొట్టాలను శుభ్రం చేయడం కష్టతరంగా మారింది.
ఈ చిమ్నీలను తరచూ శుభ్రం చేయకపోతే అవి పూర్తిగా మసిబారిపోయి చిమ్నీలోంచి పొగ సరిగా బయటకు వెళ్ళే అవకాశం లేక ఇళ్ళన్నీ పొగచూరిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీంతో ఈ సన్నని, ఇరుకైన చిమ్నీలలోకి దిగి ఎవరు శుభ్రం చేయగలుగుతారు అనే వేట మొదలైంది.

ఫొటో సోర్స్, CLEM RUTTER, ROCHESTER, KENT
చిన్నారులను కబళించిన క్యాన్సర్
చిమ్నీలను శుభ్రం చేసే పిల్లలు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి యజమానుల ఆరోగ్యాన్ని చూసుకున్నారు.
నాలుగేళ్ళ వయసు నుంచి యుక్త వయసు పిల్లలవరకు ఈ ఇరుకైన చిమ్నీలలోకి దిగి శుభ్రం చేయడం వలన వారి శారీరక ఎదుగుదల సరిగా ఉండేది కాదు. ఎముకలు ఎదగకపోవడం తదితర సమస్యలను కూడా వీరు ఎదుర్కొనేవారు.
చిమ్నీలలోని మసి, అందులోని విషవాయువులు ఈ చిన్నారుల ఊపిరితిత్తులను అతలాకుతలం చేసేవి. దీనికితోడు కళ్ళమంటలు ఎక్కువగా ఉండేవి. కొన్ని సందర్భాలలో చూపు కూడా పోగొట్టుకునేవారు.
తరచుగా వీరు ప్రవేశించాల్సిన చిమ్నీలు వేడిగా ఉండేవి. మరికొన్ని అప్పటికింకా నిప్పులు కక్కుతుండేవి. దీంతో వాటిలోకి దిగినవారి చర్మం కాలిపోయేది.
చాలామంది పిల్లలు పూర్తిగా కమిలిపోయేవారు. ఇలా కమిలిన శరీరాలపై చిమ్నీలలో అయ్యే గాయాలకు మందు పూయకపోవడం వలన అవి ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవి. ఈ పిల్లలను ఏడాదిలో మూడుసార్లు స్నానం చేయడానికి అనుమతించడం గొప్ప విషయంగా ఉండేది.
ఈ పనిలో తగినంత నైపుణ్యం లేకుంటే వారు చిమ్నీలోనే చిక్కుపోయేవారు. ఎందుకంటే చిమ్నీలో వారి గడ్డం, మోకాళ్ళు అతక్కుపోయి ఉంటాయి. ఈ లాకింగ్ మోడ్ నుంచి బయటపడటం వారికి తెలిసి ఉండాలి.
వీరిని బయటకు తీసేందుకు పైనుండేవారు తాడుతో ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం ఎక్కువసేపు సాగితే వారు ఊపిరాడక అల్లాడిపోతారు.
ఇటువంటి సందర్బాలలో సంభవించే మరణాలలో మృతదేహాలను బయటకు తీయడానికి చిమ్నీ చుట్టూ ఉండే ఇటుకలను తొలగించడం మాత్రమే మార్గంగా ఉండేది.
ఈ భయంకరమైన పరిస్థితులను తట్టుకుని నిలబడిన పిల్లలు తమ జీవితం ముందుకు సాగాలంటే మరింత చురుకుగా, దృఢంగా ఉండాల్సి వచ్చేది.
కానీ వీరంతా తరువాత కాలంలో ఓ అనారోగ్యం బారినపడే ప్రమాదం మెండుగా ఉండేది. 18వ శతాబ్దంలో యూరప్‌లోనూ ఇది ఎక్కువగా కనిపించేది. దీనిని చిమ్నీ స్వీప్ క్యాన్సర్’ అని పిలిచేవారు. చిమ్నీ శుభ్రం చేసిన పిల్లలు పెద్దవారయ్యాక ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనేవారు.
అయితే చాలామంది డాక్టర్లు దీనిని లైంగిక వ్యాధిగా భావించేవారు. కానీ బ్రిటీషు వైద్యుడు పెర్సివాల్ పాట్ మాత్రం దీనికేదో ప్రత్యేకమైన కారణం ఉందనుకునేవారు.
1775లో ఈయన ఈ స్క్రోటల్ క్యాన్సర్‌కు చిమ్నీలలో మసి పనిచేసిన వారికీ మధ్య సంబంధం ఉందనే విషయాన్ని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు.
దీంతో పర్యావరణ కారకాల వలన క్యాన్సర్ వస్తుందని నిరూపించిన మొదటి డాక్టర్‌గా ఈయన నిలిచిపోయారు. దీంతోపాటు ఆయన మొట్టమొదటి పారిశ్రామిక క్యాన్సర్‌ను కూడా గుర్తించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎట్టకేలకు బానిసత్వానికి ముగింపు
తల్లిదండ్రులు లేకుండా, తమ బాగోగులు పట్టించుకునే చట్టాలు లేనందువలన ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బతకాల్సి రావడంతో ఈ పిల్లలంతా పనిముట్లుగా కనిపించేవారు.
వీరిని కొట్టడం చాలా సాధారణంగా జరుగుతుండేది. వారు కేవలం నగ్నంగా కనిపించకుండా ఉండేందుకు వీలుగా మాత్రమే బట్టలు ఇచ్చేవారు. అంతేకానీ చలి నుంచి కాపాడుకోవడానికి తగినన్ని బట్టలు ఇచ్చేవారు కాదు. ఎప్పుడూ మసికొట్టుకుపోయి ఉంటారు కాబట్టి పదే పదే బట్టలు మార్చనిచ్చేవారు కాదు.
కడుపు నిండా తిండి ఉండేది కాదు. వీధులలో నిద్రపోయేవారు. చిమ్నీని శుభ్రం చేసే గుడ్డలోనే చుట్టచుట్టుకుని పడుకునేవారు.
బ్రిటీష్ కవి విలియం బ్లేక్ , ఫ్రెంచ్ కవి విక్టర్ హ్యూగో వంటి వారు వీళ్ల దురవస్థను సాహిత్యంలోకి తీసుకురాగలగడంతో వీరిపై ప్రపంచం దృష్టి పడింది.
ఈ పిల్లల బానిసత్వం పూర్తిగా నిర్మూలించడానికి కొంతకాలం పట్టింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, 1760లలో జోనాస్ హాన్‌వే అనే మానవతావాది చేసిన ప్రచారం కారణంగా , 1788లో చిమ్నీలను శుభ్రం చేసేవారి వయసు కనీసం 8 ఏళ్ళు ఉండాలనే చట్టాన్ని రూపొందించారు.
అయితే ఇది పూర్తిగా ఈ పనిని నిర్మూలించే చర్యలను తీసుకోలేకపోయింది. చివరకు ఓ చిన్నారి మరణం ఈ పరిస్థితులను రూపుమాపేందుకు దారి తీసింది.
11 ఏళ్ళ జార్జ్ బ్రూస్టర్ కేంబ్రిడ్జ్‌షైర్‌లోని విక్టోరియన్ ఆసుపత్రిలో ఇరుకైన చిమ్నీలో చిక్కుపోయాడు. ఇతనిని బయటకు తీసేందుకు చుట్టూ ఉన్న గోడను బద్దలు కొట్టినప్పటికీ, కొద్దిసేపటి తరువాత ఆ పిల్లాడు మరణించాడు.
దీని తరువాతే పిల్లలను చిమ్నీ వర్కర్లుగా నియమించుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంటు చట్టం చేసింది.
1875 చట్టం ప్రకారం చిమ్నీ స్వీప్‌లు లైసెన్స్ పొంది, పోలీసుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిపైన పర్యవేక్షణను కూడా ఈ చట్టం తప్పనిసరి చేసింది.
ఇలా ఈ అనాగరిక చర్యకు ఎట్టకేలకు ఓ ముగింపు దొరికింది.
ఇవి కూడా చదవండి :
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్: ఈ మూడు రాష్ట్రాలనూ బీజేపీ ఎలా గెల్చుకోగలిగింది?
- అంగవైకల్యం ఉన్న ఆమె ఒక సెక్స్ వర్కర్‌ను ఎందుకు బుక్ చేసుకున్నారంటే....
- ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, ఆమోదించిన గవర్నర్
- కైలాస: 'నిత్యానంద దేశం'తో ఒప్పందం కుదుర్చుకున్న పరాగ్వే అధికారిపై వేటు, అసలేం జరిగిందంటే...
- ‘దూత’ రివ్యూ: నాగచైతన్య తొలి వెబ్ సిరీస్‌లో అతీంద్రియ శక్తులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














