అమెరికాలో తీవ్ర నేరాల కింద అరెస్టైన సత్తారు వెంకటేశ్‌రెడ్డికి, వైసీపీకి సంబంధం ఏంటి, టీడీపీ ఏమంటోంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
తీవ్రనేరాలు చేశారనే ఆరోపణలపై అమెరికాలో అరెస్టైన సత్తారు వెంకటేశ్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయననెవరు? ఆయనకూ ఏపీకి సంబంధమేంటి?
ఆంధ్రప్రదేశ్‌లోని వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సత్తారు వెంకటేశ్ రెడ్డి దేశ రక్షణ బలగాల్లో పనిచేసి, ఆ తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే వ్యాపారాలు చేసి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా కొంత క్రియాశీలకంగా కనిపించారు. ముఖ్యంగా వినుకొండలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేశారు.
ఇప్పుడు అదే సత్తారు వెంకటేశ్ రెడ్డి అమెరికాలో పోలీసులకు చిక్కారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరిని కూడా అమెరికా మిస్సోరిలోని సెయింట్ చార్లెస్ కౌంటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మానవ అక్రమ రవాణాకు సహకరించడం, కిడ్నాప్ సహా వివిధ నేరాలతో ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్న సత్తారు వెంకటేశ్ రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.
అయితే, ఆ వ్యక్తితో తమకు ఏ మాత్రం సంబంధం లేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, టీడీపీ నాయకులు మాత్రం వైఎస్సార్సీపీ నేతల నేర ప్రవృత్తికి ఇదో నిదర్శమనంటూ విమర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
అమెరికాలో ఏం జరిగింది?
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో నివసిస్తున్న సత్తారు వెంకటేశ్ రెడ్డి (35) ఆర్థికంగా స్థిరమైన జీవితం గడుపుతున్నారు. ఆయనకు సమీప బంధువైన ఓ ఇరవై ఏళ్ల యువకుడు ఉన్నత విద్యకోసమంంటూ అమెరికా వెళ్లి వెంకటేశ్ ఇంట్లో ఉంటున్నారు.
అయితే, వెంకటేశ్ ఉంటున్న ఇంట్లో ఓ వ్యక్తిని తీవ్రంగా హింసిస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. తమ దర్యాప్తులో ఇది నిజమేనని తేలినట్లు వారు వెల్లడించారు. వెంకటేష్‌తో పాటుగా పెన్మత్స శ్రవణ్ వర్మ, పెన్మత్స నిఖిల్ వర్మ కూడా ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
"ఏడాది కిందట స్టూడెంట్ వీసాపై అమెరికా వచ్చిన విద్యార్థిని వారు తమ ఇంట్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారు. బాధితుడికి చేతి వేళ్లు, పక్కటెముకలతోపాటు అనేక ఎముకలు విరిగి ఉన్నాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించాం. బాధితుడు మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటారు. అతడిని కొట్టడమే కాకుండా కాళ్లతో తొక్కారు. విద్యుత్ తీగతో, పీవీసీ పైపులతో కొట్టారు" అంటూ అమెరికాలోని సెయింట్ చార్లెస్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ జో మెక్‌కల్లోచ్ మీడియాకు తెలిపారు.
బాధితుడిని కొట్టడానికి నిందితులు ఉపయోగించిన వైరు అంటూ ఓ కేబుల్‌ను కూడా చూపించారు. బాధితుడికి తలపై నుంచి పాదాల వరకూ గాయాలున్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, KSDKnews/YT
నెలల తరబడి హింసించారని అభియోగం
బాధితుడి పేరుని వెల్లడించేందుకు అమెరికన్ అధికారులు నిరాకరించారు. అయితే వినుకొండ ప్రాంతం నుంచే ఏడాది క్రితం వెంకటేశ్ సత్తారు సహకారంతో బాధితుడు అమెరికా వెళ్లినట్టు స్థానికుల సమాచారం.
బాధితుడి కుటుంబీకులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే అక్కడ ఏం జరిగిందన్నది తమకు పూర్తిగా తెలియదంటూ వారు మాట్లాడేందుకు నిరాకరించారు.
అమెరికన్ పోలీసుల అదుపులో ఉన్నవెంకటేష్, శ్రవణ్, నిఖిల్ కలిసి బాధితుడిని అత్యంత క్రూరంగా హింసించినట్టు పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి అర్థాకలితో మాడుస్తూ అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు. చివరకు సమీపంలో నివసిస్తున్న వారు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన సమయంలో తొలుత వారిని అనుమతించలేదనే ప్రచారం ఉంది. బాధితుడి పరిస్థితిని గమనించి అక్కడే ఉన్న శ్రవణ్, నిఖిల్‌ని అదుపులోకి తీసుకున్నామని, వెంకటేష్‌ని ఆ తర్వాత అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ ముందు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
అయితే చాలారోజుల నుంచి టార్చర్ పెడుతున్నా బాధితుడు ఎందుకు బయటికి వెల్లడించలేదని మీడియా ప్రశ్నించగా.. బాధితుడితో ఎప్పుడూ ముగ్గురు నిందితులలో ఎవరో ఒకరు ఉండేవారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనిచ్చే వారు కాదని, ఎప్పుడైనా ఫోన్ చేయాలనుకుంటే నిందితుల సమక్షంలోనే చేయించేవారని, వీడియో కాల్స్ చేయనిచ్చేవారు కాదని చెప్పారు.
బాధితుడు సెయింట్ చార్లెస్‌లోని కమ్యూనిటీ కాలేజీలో ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారని, కాలేజీకి నేరుగా వెళ్లలేదని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులకు ఇండియాలో రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఫిర్యాదు విషయం బయటికి తెలిస్తే చంపేస్తారని భయపడి బాధితుడు ఎవరికీ చెప్పలేదని పోలీసులు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో వెల్లడించారని మిస్సోరిలోని స్థానిక మీడియా కేఎస్‌డీకే తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్ర నేరాలు, కఠిన శిక్షలుంటాయి
అమెరికా చట్టాల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషులను నిర్బంధించి హింసించడం, బలవంతంగా చాకిరీ చేయించుకోవడం వంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన అమెరికన్ పౌరులతో పాటుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపై కూడా కఠిన శిక్షలు అమలు చేసిన ఘటనలు ఉన్నాయి.
గతంలో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి 500 ఏళ్ల పాటు శిక్ష విధించారని సామాజిక వేత్త రాజేశ్వరి అన్నారు.
" రాజకీయ అండదండలు ఉపయోగించి నేరాల నుంచి తప్పించుకునే అవకాశం అమెరికాలో ఉండదు. ఇప్పుడు బాధితుడిని స్వయంగా పోలీసులే రక్షించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. కాబట్టి ఈ కేసులో కఠిన శిక్షలు తప్పవు. ఇండియాలో జీవిత ఖైదుతో సరిపెడతారు. కానీ నేరాల తీవ్రత అందరికీ అర్థంకావడం, మరొకరు అలాంటి ప్రయత్నం చేయకుండా నిరోధించేందుకు అక్కడ వందల ఏళ్ల శిక్షలు విధిస్తారు. అందులో స్టూడెంట్ వీసాతో వెళ్లిన విద్యార్థిని ఇంట్లో బంధించి, చాకిరీ చేయించుకోవడం వంటి నేరాలు కాబట్టి ఈ కేసులో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది" అని ఆమె వివరించారు.
మాకు సంబంధం లేదు: వైఎస్సార్సీపీ
వెంకటేశ్ రెడ్డి సత్తారు గతంలో ఏపీ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించానని ఆయన చెప్పుకున్నారు.
లీగల్ సెల్, టీయూ, డాక్టర్స్, టీచర్స్ విభాగాల్లో కోఆర్డినేటర్ గా పనిచేయడం వల్ల ఏపీలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో తనుకు సంబంధాలున్నాయని గతంలో ఆయనిచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎస్వీఆర్ యువసేన కూడా ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఆ వీడియో క్లిప్పులను ఇప్పుడు టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికార పార్టీ నేతలు విజయసాయిరెడ్డి సహా పలువురితో నిందితుడి ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు.
అయితే సత్తారు వెంకటేశ్ రెడ్డికి, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి
- వరల్డ్ కప్ ఫైనల్: ‘భారత్ ఓడిపోయిందని’ సంబరాలు చేసుకున్న కశ్మీరీ విద్యార్థులపై యూఏపీఏ ఎందుకు ప్రయోగించారు?
- గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమ్మీద ఇంకెన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?
- హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత
- దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














