గాజా, యుక్రెయిన్ కాకుండా ఈ భూమ్మీద ఇంకెన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రికార్డో సెన్రా
- హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్
ఈ శతాబ్దం ఆరంభంతో పోల్చితే ఇప్పుడు ప్రపంచం మరింత హింసాత్మక ప్రదేశంగా మారుతోంది.
ఈ ఏడాదిని 8 ప్రధాన యుద్ధాలతో, డజన్లకు పైగా తీవ్ర సాయుధ పోరాటాలతో ముగిస్తామని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
అక్టోబర్ 7నుంచి వేల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు, 2024 ఫిబ్రవరికి రెండేళ్లు పూర్తి చేసుకోనున్న యుక్రెయిన్‌పై రష్యా దాడి ఇలా ప్రస్తుతం పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. వీటితో పాటు బుర్కినా ఫాసో, సోమాలియా, సూడాన్, మియన్మార్, నైజీరియా, సిరియాల్లో కూడా సాయుధ పోరాటాలు ఉన్నాయి.
‘‘ఈ ఏడాది చివరి నాటికి కచ్చితంగా కనీసం 8 ప్రధాన యుద్ధాలు జరుగుతుంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు’’ అని ఉప్సలా కాన్‌ఫ్లిక్ట్ డేటా ప్రోగ్రామ్ (యూసీడీపీ) కో ఆర్డినేటర్ థెరిసే పీటర్సన్ అన్నారు.
పోరాటాలను పరిశోధించి, ధ్రువీకృత డేటాను స్వీడన్‌కు చెందిన యూసీడీపీ ప్రాజెక్ట్ ప్రచురిస్తుంది. వీరు ప్రచురించిన డేటాను ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, వరల్డ్ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి.
యుద్ధాలు, పోరాటాల నిర్వచనాలకు సంబంధించి వివిధ వివరణలు ఉన్నాయి. మరణాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకునే ఒక వివరణను యూసీడీపీ, ఇతర అంతర్జాతీయ అధ్యయన సమూహాలు అనుసరిస్తాయి. ఏడాది కాలంలో ఒక యుద్ధంలో వెయ్యి మరణాలు సంభవిస్తే దాన్ని పోరాటం (కాన్‌ఫ్లిక్ట్)గా నిర్వచిస్తారు.
భూభాగాలకు సంబంధించి జరిగే సాయుధ పోరాటాల్లో ఏడాదికి 25కి పైగా మరణాలు సంభవిస్తాయి.
‘‘సంఘర్షణల (కాన్‌ఫ్లిక్ట్స్)ల సంఖ్య పెరిగింది. పోరాటాల్లో సంభవించే మరణాల సంఖ్య 2022లోనే 97 శాతం పెరిగింది. 2000ల ఆరంభం నుంచి చూస్తే ఈ పెరుగుదల 400 శాతం ఉంది’’ అని బీబీసీతో యూసీడీపీ డైరెక్టర్ మాగ్నస్ ఓబెర్గ్ అన్నారు.
వాషింగ్టన్‌కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్‌లోని సెంటర్ ఫర్ ప్రివెంటివ్ యాక్షన్ హెడ్ పాల్ బి స్టారెస్ ఒక హెచ్చరిక చేశారు.
‘‘దశాబ్దాల పాటు చరిత్రాత్మకంగా తక్కువస్థాయిలో ఉన్న సంఘర్షణల స్థాయి ఇటీవలి ఏళ్లలో పెరగడాన్ని అనేక సంస్థలు కచ్చితంగా గుర్తించే ఉంటాయి’’ అని బీబీసీ న్యూస్ బ్రెజిల్‌తో ఆయన అన్నారు.
‘‘అనేక కారకాలు దీని గురించి వివరిస్తాయి. తక్కువ శక్తిమంతమైన రాజ్యాల్లో ఆర్థిక, సామాజిక ఉద్రిక్తతలు పెరగడం నుంచి గొప్ప శక్తులుగా పేరున్న దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం వరకు దీని గురించి వివరించగలవు’’ అని ఆయన చెప్పారు.
చాలా యుద్ధాలు, సంఘర్షణల్లో మరణాలు, విధ్వంసాలు సంభవిస్తున్నప్పటికీ అవి పెద్దగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం లేదు.

ఫొటో సోర్స్, EPA
యుద్ధం జరుగుతున్నట్లు ప్రపంచం దృష్టికి రాకపోతే?
ఒక యుద్ధం ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఆకర్షించడానికి లేదా తక్కువగా ఆకర్షించడానికి చాలా అంశాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
అందులో ఒకటి, ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల ఇతర దేశాలకు కూడా ప్రమాదం పొంచి ఉండటం.
అధిక జనసాంద్రత గల కేంద్రాలకు ఈ పోరాటాల సామీప్యత, ఎన్జీవోలు-జర్నిస్టుల కదలికలపై ఆంక్షలు, సోషల్ మీడియాలో వీడియోలు, రికార్డింగ్‌లు, ఫొటోలు, స్టోరీలు వ్యాప్తి చెందడం, సంక్షోభాల్లో చిక్కకున్న దేశాలతో ఇతర దేశాలకు భౌగోళిక, సాంస్కృతిక సంబంధాలు వంటివి ప్రభావం చూపే ఇతర అంశాలు.
ఈ యుద్ధాలు, సంఘర్షణలు ప్రపంచం దృష్టికి రాకపోతే, ఆయా దేశాల అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కాల్పుల విరమణకు అంతర్జాతీయ ఒత్తిడి, మానవతా కారిడార్లను తెరవడం, ఆహారం-ఔషధాలకు సంబంధించిన సామగ్రిని పంపించడం వంటి పనులపై ఇది ప్రభావం చూపుతుంది.
యుద్ధం లేదా సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు మానవతా సహాయాన్ని పంపడానికి ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యమని ప్రొఫెసర్ ఒబెర్గ్ అన్నారు.
‘‘ఒక యుద్ధం గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేనప్పటికీ వ్యూహాత్మక కారణాల రీత్యా మిలిటరీ మద్దతు అందుతుంది. కానీ, మానవతా సహాయం ఇలా కాదు. ఇది పొందడానికి అంతర్జాతీయ సమాజం అభిప్రాయాన్ని సమీకరించడం అవసరం’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు
1994లో రువాండా మారణహోమం తర్వాత, గత ఏడాదిని అత్యంత ఘోరమైనదిగా పరిగణిస్తున్నట్లు నార్వే దేశం ఓస్లోలో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ పీస్ రీసెర్చ్‌లో పేర్కొన్నారు. రువాండా మారణహోమంలో మొత్తం 2.37 మంది మరణించారు.
రెండు ప్రముఖ హింసాత్మక యుద్ధాల కారణంగా 2022లో మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదల కనిపించింది. అందులో ఒకటి రష్యా-యుక్రెయిన్ యుద్ధం కాగా, రెండోది టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా ఇథియోపియా ప్రభుత్వ చర్య. 2022 చివరి నాటికి ఈ రెండు యుద్ధాల్లో వరుసగా 81,500 మంది, 1,01,000 మంది చనిపోయారు.
2014లో ప్రారంభమైనప్పటి నుంచి యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 3 లక్షలకుపైగా మరణాలు సంభవించాయని, ఇది అంతం అయ్యే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఆ దేశంలో సగం మరణాలకు సాయుధ పోరాటం ప్రత్యక్ష కారణం. ఆకలి, మానవతా సంక్షోభం వల్ల తలెత్తిన వ్యాధుల కారణంగా మిగతా సగం చనిపోయారు.
‘‘నిరుటికి, 2023కు మధ్య పోలిక ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఇప్పటివరకైతే 2022 కంటే 2023 లో మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా. ఇథియోపియాలో రక్తకాండ వల్ల 2022 ఏడాది అత్యంత ఘోరంగా తయారైంది. ఈ సంఘర్షణ 2022 చివర్లో ముగిసింది’’ అని యూసీడీపీ కో ఆర్డినేటర్ థెరిసే పీటర్సన్ చెప్పారు.
గాజాలో యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో? ఎంతమంది చనిపోతారో మనకు తెలియదని ఆయన అన్నారు.
యుక్రెయిన్, గాజా కాకుండా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఇతర ప్రధాన యుద్ధాల గురించి ఇక్కడ చూద్దాం.

ఫొటో సోర్స్, AFP
1. బుర్కినా ఫాసో
ఉత్తర ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్‌లో జరిగిన భారీ సాయుధ సంఘర్షణలో బుర్కినా ఫాసో యుద్ధం అత్యంత హింసాత్మకమైన భాగం. ఇందులో మౌరిటానియా, సెనెగల్, మాలి, బుర్కినాఫాసో, నిగర్, నైజీరియా, చాద్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా దేశాల్లోని రీజియన్లు భాగంగా ఉన్నాయి.
2016 నుంచి ప్రభుత్వ బలగాలకు, ఇస్లామిక్ తిరుగుబాటు సమూహాలకు మధ్య హింసాత్మక ఘర్షణలకు బర్కినా ఫాసో వేదికగా ఉంది.
2023 జులై నుంచి బుర్కినా ఫాసాలోని 46కు పైగా ప్రాంతాలు సాయుధ బలగాల ఆధీనంలో ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంచనా వేసింది.
అత్యంత ఘోరమైన ఏడాదిగా పేరున్న 2022లో 1,418 మంది పౌరులు చనిపోయినట్లు ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లోకేషన్స్ ఈవెంట్ డేటాబేస్ (ఏసీఎల్‌ఈడీ) పేర్కొంది.
2. సోమాలియా
సోమాలియాలో అంతర్యుద్ధం 2000ల ఆరంభంలో తీవ్రమైంది. ఆఫ్రికా యూనియన్ మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలకు వ్యతిరేక పోరాటంలో ఆల్ ఖైదా మిత్రపక్షమైన అల్ షబాబ్ పుట్టుకతో ఈ అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అల్ షబాబ్ ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చి అక్కడ ఇస్లామిక్ చట్టం ప్రకారం పాలించాలని అనుకుంటోంది.
హ్యుమన్ రైట్స్ వాచ్ ఎన్జీవో ప్రకారం, పౌరులపై అల్ షబాబ్ సాయుధ గ్రూపు విచక్షణా రహితంగా దాడులు చేస్తుంది. పిల్లలను బలవంతంగా తమ గ్రూపులో నియమించుకుంటుంది.
యూసీడీపీ చెప్పినదాని ప్రకారం ఇక్కడ 2022లో హింస స్థాయి పెరిగింది. 1990లలో ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచి 2022లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
3. సూడాన్
సూడాన్‌లోని మానవతా సంక్షోభాన్ని ఊహించలేనిదిగా ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అభివర్ణించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 60 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది.
సూడాన్ మిలిటరీ బలగాలకు, ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న పారామిలిటరీ బృందానికి మధ్య ఆరు నెలల్లో జరిగిన ఈ ఘర్షణలో 9 వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా ఇది నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం, ఈ పోరాటం కారణంగా 2.5 కోట్ల మంది అంటే దేశజనాభాలో సగానికి పైగా మానవతా సహాయాన్ని అందుకునే స్థితిలోకి జారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
4. మియన్మార్
మియన్మార్‌లో హింస పుట్టుకకు కారణాలు 2021లో మిలిటరీ తిరుగుబాటు, కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు అణచివేత.
దేశంలో 13 వేలకు పైగా చిన్నారులు మరణించినట్లు, 13 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్లు స్వతంత్ర పరిశోధకులను ఉటంకిస్తూ ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
మయన్మార్‌లో 1950ల నుంచి వివిధి తిరుగుబాటు గ్రూపులు పనిచేస్తున్నాయి. వాటిలో చాలా గ్రూపులు తమ కార్యకలాపాలను సమూలంగా మార్చుకున్నాయి. దేశంలోని మిలిటరీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో హింస స్థాయిని పెంచాయి.
5. నైజీరియా, సిరియా
ఉప్సల ప్రోగ్రామ్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం నైజీరియా, సిరియాల్లోని అంతర్గత పోరాటాల కారణంగా రెండు దేశాల్లో మృతుల సంఖ్య 1000కి చేరే క్రమంలో ఉంది.
1960లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వ్యవస్థీకృత సమూహాల హింసకు నైజీరియా వేదికగా ఉంది.
భూభాగాలపై నియంత్రణ కోసం ప్రభుత్వ బలగాలకు, వివిధ రాష్ట్రాల్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
2011 మార్చిలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో మొదలైన సిరియా అంతర్యుద్ధంలో తిరుగుబాటు గ్రూపులతో పాటు రష్యా, తుర్కియే, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ వంటి విదేశీ శక్తులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, YAHYA ARHAB/EPA-EFE/REX/SHUTTERSTOCK
6. యెమెన్
తమ మిలిటరీ డ్రోన్లలో ఒకదాన్ని హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ తీరంలో కూల్చేసినట్లు నవంబర్ 8న అమెరికా ప్రకటించింది.
హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. వీరు జైడిజంను ఆచరిస్తారు.
2014 నుంచి యెమెన్‌ను నాశనం చేసిన సంఘర్షణకు అమెరికా డ్రోన్ కూల్చివేత ఒక రిమైండర్ లాంటిది. సౌదీ అరేబియా మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌతీలు నిలబడ్డారు.
సెప్టెంబర్‌లో రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒక సంకీర్ణం ప్రతిస్పందించింది. ఎనిమిదేళ్లు, వేలాది వైమానిక దాడుల తర్వాత కూడా తిరుగుబాటుదారులు ఇంకా రాజధానిని నియంత్రిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి జోక్యంతో 2022లో ఆరునెలల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి అక్కడ హింస కాస్త తగ్గింది.
అయితే హౌతీలు, సౌదీ మధ్య చర్చలు ఆగిపోయాయని వస్తోన్న నివేదికలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
దేశం మరింతగా చిన్నాభిన్నమైంది. ఈ విభజన కేవలం హౌతీ తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికే పరిమితం కాలేదు. ఉదాహరణకు అక్కడ యూఏఏ మద్దతుతో వేర్పాటువాద ఉద్యమం కూడా పుట్టింది.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష
- హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














