గాజా యుద్ధం: 50 మంది బందీలను విడిపించే ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం

గాజాలో యుద్ధానికి నాలుగు రోజుల విరామం ఇస్తూ ఆ బందీలను విడిపించబోతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీని ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్‌డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    ధన్యవాదాలు.

  2. కశ్మీర్‌: రాజౌరిలో ఎన్‌కౌంటర్... నలుగురు సైనికులు మృతి

    జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    జమ్ము కశ్మీర్‌లో బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత అధికారులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

    ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్న విషయం వెలుగులోకి వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    ఈ ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్ ర్యాంకు కలిగిన ఇద్దరు అధికారులు, ఇద్దరు జవాన్లు చనిపోగా... ఒక మేజర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు చెప్పారు.

    గాయపడిన వారిని ఉధంపూర్‌లోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. ధర్మసల్ ప్రాంతంలోని బాజిమల్‌లో సైన్యం, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయని జమ్మూ, కశ్మీర్ పోలీసులు తెలిపారు.

    అదనపు సాయుధ బలగాలను రప్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను విదేశీయులుగా గుర్తించామని, ఆదివారం నుంచి వీరు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పారు.

    రజౌరి, పూంచ్ జిల్లాల సరిహద్దుల్లో గడిచిన ఏడాదిన్నరగా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.

  3. ఉత్తర కాశీ: కూలిన సొరంగంలోకి డ్రిల్లింగ్ ఎలా చేస్తున్నారు... లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయి?

  4. తెలంగాణలో సోషల్ మీడియా ప్రచారం గీత దాటుతోందా... బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ యాడ్స్‌పై నిషేధం ఎందుకు?

  5. మళ్లీ ఓపెన్ఏఐ సీఈవోగా వెళ్లనున్న సామ్ ఆల్ట్‌మాన్

    సామ్ ఆల్ట్‌మాన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సామ్ ఆల్ట్‌మాన్

    కొన్ని రోజుల కిందటే ఓపెన్‌ఏఐ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన దాని సహవ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి సీఈవోగా బాధ్యలు చేపట్టనున్నారని ఆ కంపెనీ తెలిపింది.

    సామ్ ఆల్ట్‌మాన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం (నవంబర్ 17న) ప్రకటించింది. విశ్వాసాన్ని కోల్పోయిన కారణంగా ఆయన్ను తొలగిస్తున్నట్లు తెలిపింది.

    ఆ తర్వాత సామ్ ఆల్ట్‌మాన్ మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారంటూ ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు.

    మరోవైపు, సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఓపెన్ఏఐ ఉద్యోగులంతా డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాశారు. ఆల్ట్‌మాన్‌ను మళ్లీ కంపెనీలోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు.

    అనంతరం నాటకీయ పరిణామాల తర్వాత సామ్ మళ్లీ ఓపెన్ఏఐలో చేరుతున్నారంటూ ఆ సంస్థ ప్రకటించింది.

    ఇటీవల బాగా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ని రూపొందించడంతో ఓపెన్ఏఐ సంస్థ పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.

    ఈ సంస్థ సహవ్యవస్థాపకుల్లో 38 ఏళ్ల సామ్ ఆల్ట్‌మాన్ ఒకరు. కృత్రిమ మేధ రంగంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది.

  6. విశాఖపట్నం: లారీని ఢీకొట్టిన స్కూల్ పిల్లల ఆటో.. ఒకరి పరిస్థితి విషమం

    లారీని ఢీకొట్టిన స్కూల్ ఆటో

    ఫొటో సోర్స్, UGC

    విశాఖపట్నంలో స్కూల్ పిల్లలతో ప్రయాణిస్తున్న ఆటో ఓ లారీని ఢీ కొట్టింది. సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

    లారీని ఢీకొట్టిన అనంతరం ఆటో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

    ప్రమాదం జరిగాక లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. రోడ్డుపై పడి ఉన్న విద్యార్థులను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

    లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థులందరూ బేతని స్కూల్‌కు చెందినవారు.

    ‘‘ఉదయం 7.40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. బేతని స్కూలుకు ఆ ఆటో వెళ్తోంది. దానిలో నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. టీ జంక్షన్ దగ్గర లారీని ఆటో ఢీకొట్టింది. వెంటనే పిల్లలను దగ్గర్లోని ఆటో డ్రైవర్లు ఆసుపత్రికి తరలించారు. నలుగురు పిల్లలు డిశ్చార్జి అయ్యారు. మిగతా వారిలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఓ పోలీసు అధికారి మీడియాతో చెప్పారు.

  7. వరల్డ్ కప్ 2023: రోహిత్ శర్మ‌ ఏం తప్పు చేశాడని నిందిస్తున్నారు?

  8. 50 మంది బందీలను విడిపించే ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

    హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారిలో 50 మందిని విడిపించే ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

    గాజాలో యుద్ధానికి నాలుగు రోజుల విరామం ఇస్తూ ఆ బందీలను విడిపించబోతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

    ఈ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం యుద్ధానికి విరామం ఇస్తే, రోజుకు పది మంది చొప్పున బందీలను హమాస్ విడుదల చేస్తుంది.

    అయితే, బందీలను విడిచిపించిన తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు.

    ఇప్పటివరకూ గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 14,000కు పైనే ఉందని హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  9. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  10. ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?