పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?

గొర్రెలకాపరులు

ఫొటో సోర్స్, TASEER BEYG

ఫొటో క్యాప్షన్, సకీనా, థాయ్ బీబీ, అనార్‌లు ఏటా పామిర్‌కు గొర్రెలను తోలుకెళ్తారు.
    • రచయిత, ఫర్హత్ జావెద్
    • హోదా, బీబీసీ 100 విమెన్

శతాబ్దాలుగా పాకిస్తాన్‌ వాఖీ మహిళా గొర్రెలకాపరులు మారుమూల పర్వతాలను ఎక్కుతూ గొర్రెలను మేపుతున్నారు. వీరు సంపాదించే ఆదాయమే వీరి కుటుంబాలకు ఆధారం. ఆరోగ్య సంరక్షణ, పిల్లలను చదివించుకోవడంతోపాటు తమ లోయ ప్రాంతానికి తొలి రోడ్డును కూడా దీని సాయంతోనే వీరు వేసుకున్నారు.

అయితే, నేడు వీరి జీవన శైలి క్రమంగా అంతరించిపోతోంది. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బీబీసీ '100 మంది మహిళలు' సిరీస్‌లో భాగంగా వారితో కలిసి నడుస్తూ అందిస్తున్న కథనమిది:

పామిర్ పచ్చికబయళ్ల వరకూ మా ప్రయాణం చాలా ప్రమాదకరంగా సాగింది. నిటారుగా కనిపించే పర్వతాలు, సన్నని మలుపుల మధ్య ఒక్క అడుగు ఏమరుపాటుతో వేస్తే మన పని అయిపోయినట్టే.

గొర్రెలు, మేకలు, దున్నలు సన్నని మార్గాల గుండా వెళ్లేటప్పుడు కిందకు జారిపోకుండా చూసేందుకు ఇక్కడి మహిళలు ఈలలు వేస్తుంటారు. ఒక్కోసారి గట్టిగానూ అరుస్తుంటారు.

‘‘ఒకప్పుడు మా దగ్గర చాలా పశు సంపద ఉండేది’’ అని 70ల వయసులోనున్న బానో చెప్పారు. ‘‘ఒక్కోసారి పశువులు ఇక్కడి నుంచి దూకుతుంటాయి. ఆ తర్వాత మా నుంచి తప్పించుకుంటాయి. వాటిలో కొన్ని మళ్లీ తిరిగి వస్తుంటాయి. కొన్ని ఎప్పటికీ రావు’’ అని ఆమె అన్నారు.

గొర్రెల కాపరులు

ఫొటో సోర్స్, TASEER BEYG

ఫొటో క్యాప్షన్, పామిర్‌కు వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడే ముప్పు ఉంటుంది

ఏటా వేసవిలో డజన్లకొద్దీ వాఖీ మహిళా గొర్రెలకాపరులు కఠినమైన కారాకోరం పర్వతాలను ఎక్కుతుంటారు. తమ చిన్న పిల్లలను వీపుపై మోసుకొని వెళ్తారు. వీరి ఇళ్లలోని మగవారు దిగువన ఉండే శింషాల్ లోయలో పొలాలను చూసుకుంటారు.

ప్రస్తుతం వాఖీ మహిళా గొర్రెలకాపరులు ఏడుగురు మాత్రమే మిగిలారు.

వర్షం, మంచుతోపాటు ఎండలో రోజుకు ఎనిమిది గంటలకు నడుస్తూ మేం ముందుకు వెళ్లాం. ఇక్కడి మహిళలు మూడు రోజుల్లో వెళ్లే దూరానికి మేం ఐదు రోజులు తీసుకున్నాం. ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్లే అలవాటు లేకపోవడంతో, మా కంటే ఇక్కడి వృద్ధ కాపరులే వేగంగా ముందుకు వెళ్తూ కనిపించారు.

ఇక్కడ కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గొర్రెల కాళ్ల చప్పుడు కూడా భూమి కంపిస్తున్నట్లు వినిపిస్తుంది. ఒక్కోసారి వీటి వల్ల రాళ్లు, ధూళి ఎగసిపడతాయి.

గొర్రెల కాపరులు

ఫొటో సోర్స్, TASEER BEYG

ఫొటో క్యాప్షన్, 88 ఏళ్ల అనార్ చాలాసార్లు పామిర్‌కు గొర్రెలను తీసుకెళ్లారు

గతంలో ఇలా వెళ్లడం మరింత కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడి మహిళల దగ్గర థెర్మల్ జాకెట్లు, వాకింగ్ షూలు ఉండేవి కాదు.

‘‘మేం సాధారణ బట్టలు వేసుకునేవాళ్లం. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కాదు. మంచుపై అలానే నడుచుకుంటూ వెళ్లేవాళ్లం’’ అని 88 ఏళ్ల అనార్ చెప్పారు.

ప్రస్తుతం 67 ఏళ్ల వయసున్న అఫ్రోజ్ ఇక్కడి లోయలో తొలి షూలు వేసుకున్న మహిళ. ‘‘నాకు పెళ్లి అయినప్పుడు నా సోదరుడు రెండు జతల షూలు బహుమతిగా ఇచ్చాడు’’ అని ఆమె చెప్పారు. ‘‘వాటిని చూడటానికి చాలా మంది వచ్చేవారు. చాలా మంది ఒకసారి వేసుకుంటామని వాటిని అడిగేవారు. పెళ్లిళ్లకు నా బట్టలు కూడా వారు తీసుకెళ్తుంటారు’’ అని ఆమె చెప్పారు.

సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులోని పామిర్‌కు ఎట్టకేలకు మేం చేరుకున్నాం. ఎటుచూసినా పచ్చని పచ్చికబయళ్లు, మెరిసే హిమనీనదాలు, మంచుతో కప్పివున్న పర్వత శిఖరాలే కనిపించాయి.

‘‘మా అమ్మలు, అమ్మమ్మలతో కలిసి మేం ఇదే మార్గంలో వచ్చేవాళ్లం. మాలానే వారు కూడా గొర్రెలను కాసేవారు. గొర్రెలు, మేకల పాల నుంచి వెన్న, పెరుగు తయారుచేశారు’’ అని అనార్ చెప్పారు. ఆమెపాటలు పాడుతుంది. నృత్యం కూడా చేస్తుంది.

గొర్రెల కాపరులు

ఫొటో సోర్స్, TASEER BEYG

ఫొటో క్యాప్షన్, పామిర్ పచ్చిక బయళ్లకు వెళ్లేందుకు ఇలాంటి వంతెలను దాటాలి

ఇక్కడి 60 రాతి ఇళ్లలో చాలావరకూ తాళాలు వేసి కనిపించాయి. దీని ద్వారా వీరి సంస్కృతి ఎలా కనుమరుగు అవుతోందో తెలుస్తోంది.

కురు వృద్ధురాలైన అనార్ ఒక ఇంటి తలుపుకు మద్దుపెట్టుకొని, ప్రార్థన చేశారు. అనంతరం మండుతున్న ఆకులతో కూడిన ఒక పళ్లేన్ని తీసుకొని ఆమె లోపలకు అడుగుపెట్టారు.

‘‘స్పందుర్ మొక్కలను దీని కోసం ఉపయోగించాలని మా పెద్దలు మాకు చెప్పారు. వీటిని దగ్గరగా ఉంచుకుంటే సమస్యలు దూరం అవుతాయని వారు చెప్పేవారు’’ అని ఆమె చెప్పారు. అవి మండుతున్నప్పుడు వచ్చే పొగ ప్రతి జంతువుపై పడేలా ఆమె చూశారు.

ఒకప్పుడు తోడేళ్లు, చిరుతపులిలను తరిమికొట్టేందుకు అత్యంత కఠిన వాతావరణంలోనూ ఇంటిపైకప్పులపై నిద్రపోయేవారు. పశువులపై దాడులు జరగకుండా ఉచ్చులు ఏర్పాటుచేసేవారు, మంటలు కూడా రాత్రంతా వెలిగేలా చూసేవారు.

‘‘రాత్రిపూట చాలా చీకటిగా ఉండేది. మా దగ్గర లైట్ లేదా టార్చ్ ఉండేదికాదు. అసలు మా పశువుల్లో ఎన్ని చనిపోయాయో తెల్లవారితేగానీ తెలిసేది కాదు’’ అని అనార్ చెప్పారు.

ఇక్కడి మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి. అయితే, పర్వత ప్రాంతాల్లో ఆసుపత్రులు లేదా వైద్యులు ఉండరు. ఒక వేసవిలో 12 మంది పిల్లలను ఇక్కడి పచ్చికబయళ్లలో ఎలా పాతిపెట్టాల్సి వచ్చిందో అనార్ గుర్తుచేసుకున్నారు. ఆనాడు మరణించిన వారిలో ఆమె కొడుకు, కూతురు కూడా ఉన్నారు.

‘‘నేను ఏమీ చేయలేకపోయాను’’ అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 60 ఏళ్ల నుంచీ ఆమె ఈ బాధను అనుభవిస్తున్నారు.

గొర్రెల కాపరులు
ఫొటో క్యాప్షన్, టూరిస్టు సంస్థను నడిపిస్తున్న వజీర్

కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి గొర్రెలకాపరులు వ్యాపారులుగా మారుతూ వచ్చారు. ‘‘మా పశువుల నుంచి పాలను సేకరించి, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు మేం తయారుచేస్తాం. మేం గొర్రెలను పంచుకుంటాం. వాటి నుంచి ఉత్పత్తులను తయారుచేసి గ్రామానికి తీసుకెళ్తాం’’ అని బానో చెప్పారు.

వాఖీ ప్రజలు వస్తు మార్పిడి విధానంపై ఆధారపడతారు. పాల ఉత్పత్తులు వీరి నుంచి తీసుకొని వీరి ఇళ్లను నిర్మించేందుకు ప్రజలు సాయం చేస్తుంటారు. అఫ్రోజ్ ఇలానే రెండు ఇళ్లను నిర్మించుకున్నారు. వీటిలో ఒకటి శింషాల్‌లో మరొటి సమీప నగరమైన గిల్గిత్‌లో ఉన్నాయి.

‘‘ఈ ప్రాంతం నాకు చాలా ఇచ్చింది. నా పిల్లల పెళ్లిళ్లకు అవసరమైన ఖర్చు, వారి చదువుల ఖర్చు.. అన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

మహిళా గొర్రెలకాపరుల సంపాదన, పురుషుల వ్యవసాయంతో ఇక్కడి ప్రజల జీవితాలు మారుతున్నాయి. 2000కు ముందువరకూ ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో అసలు సంబంధాలే ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. శింషాల్ లోయను కారాకోరం ప్రధాన రహదారితో అనుసంధానిస్తూ రోడ్డు వేయడంలో వీరు సాయం చేశారు.

ఒకప్పుడు రోజులు పట్టే ప్రయాణం నేడు గంటల్లోనే పూర్తవుతోంది. నేడు ఇక్కడ ఆసుపత్రులు, స్కూళ్లు కూడా వచ్చాయి.

బానో కుమారుడు వజీర్ నేడు భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఇక్కడ ఒక పర్యటక సంస్థను నడిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యటకులకు ట్రెక్కింగ్, కల్చరల్ టూర్స్ ఆయన ఏర్పాటుచేస్తున్నారు.

‘‘కొత్త రోడ్డు వేసిన తర్వాత, మా జీవితాలు చాలా మారాయి. అప్పుడే నేను వ్యాపారం కూడా మొదలుపెట్టాను’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ 100 మంది మహిళలు: మహిళల మీద హింసపై పాటతో పోరాడుతున్న జహారా

24 ఏళ్ల ఫజీలాకు శింషాల్ లోయలో ఒక గెస్ట్‌హౌస్ కూడా ఉంది. దీన్ని తండ్రితో కలిసి ఆమె నిర్మించారు. అయితే, ఆయన ఇప్పుడు లేరు. ఆమె తల్లి గొర్రెలకాపరి. అయితే, ప్రస్తుతం అనారోగ్యం వల్ల ఈ ఏడాది ఆమె గొర్రెలను తీసుకుని వెళ్లలేదు.

‘‘గొర్రెలను మేపేకంటే చదువుకోవాలని మా అమ్మలు చెప్పేవారు. వారిలా కష్టపడొద్దని సూచించేవారు’’ అని ఫజీలా చెప్పారు. ‘‘మాకు నచ్చిన పనిని చేసుకునే స్వేచ్ఛ ఉంది. నేను చదువుకోకపోయుంటే మా అమ్మలానే కష్టపడేదాన్ని. అదే వలయం ఇప్పటికీ కొనసాగేది’’ అని ఆమె అన్నారు.

ఇదే వాదనతో వజీర్ కూడా ఏకీభవించారు. ‘‘మా అమ్మలు చేసిన కృషి వల్లే నేడు ఇక్కడ డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర నిపుణులు అందుబాటులో ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

తమ పిల్లలు ప్రయోజకులు కావడం చూసి వృద్ధ మహిళలు సంతోషంగా ఉన్నారు. అయితే, పామిర్ పచ్చికబయళ్లకు నేడు వెళ్లేవారు తగ్గిపోవడంపై విచారం కూడా వ్యక్తంచేస్తున్నారు.

‘‘గొర్రెలను పెంచడం అనేది ఉద్యోగం కంటే ఎక్కువ. పామిర్‌తో మాకు మంచి అనుబంధముంది. అది ఒక పువ్వులా ఎంతో అందమైన ప్రదేశం. అది మాకు నిధి లాంటిది’’ అని అఫ్రోజ్ అన్నారు.

అనార్ నెమ్మదిగా నడుస్తూ తన పిల్లలను పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. ఆమె కళ్లు నీటితో చెమర్చాయి.

‘‘నేను పామిర్‌లోనే చనిపోవాలని అనుకుంటున్నాను. నన్ను నా పిల్లల పక్కనే పూడ్చిపెట్టాలి. నేను ఇక్కడకు వచ్చే ప్రతిసారీ, వారి దగ్గరకు వెళ్తున్నట్లే అనిపిస్తుంది’’ అని ఆమె అన్నారు.

(బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ కథనం అందిస్తున్నాం.)

బీబీసీ 100 విమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)