బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా...

బర్రెలక్క(శిరీష)

ఫొటో సోర్స్, fb/princesssiribarrelakka

ఫొటో క్యాప్షన్, శిరీష అలియాస్ బర్రెలక్క

తెలంగాణలో యూట్యూబ్‌ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తున్న వీడియోలలో దాదాపు సగం బర్రెలక్కవే.

ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో దాదాపు లక్షమంది డౌన్‌లోడ్ చేసుకున్న అఫిడవిట్ బర్రెలక్కదే.

ఎన్నికలలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి న్యాయ సహాయం చేయడానికి అమెరికా నుంచి లాయర్ వచ్చారంటే అది బర్రెలక్క కోసమే.

కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారా లేదా? కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డేనా? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? లాంటి చర్చలు దాటి బర్రెలక్క గెలుస్తుందా లేదా? అనేది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు అతి పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

గెలుపోటముల అంచనాలు, ఊహాగానాల సంగతి పక్కన పెట్టి చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటూ కొన్నాళ్లుగా వినిపిస్తున్న తెలంగాణలో బలంగా వినిపించిన పేరు బర్రెలక్క.

ఆమెకు ఇల్లు లేదు, డబ్బు లేదు, పార్టీ లేదు. అన్నిటికీ మించి ఉద్యోగం లేదు.

అనేక పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన నిరుద్యోగి.

ఇప్పుడు రాజకీయాన్ని ఉద్యోగంగా మార్చుకోవాలని సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టారు.

Barrelakka

ఫొటో సోర్స్, fb/princesssiribarrelakka

డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు(గేదెలు) కాసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి వ్యూస్, కేస్ రెండూ తెచ్చుకున్న యువతి ‘బర్రెలక్క’.

ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్ కావడంతో కర్నె శిరీష అనే ఆమె అసలు పేరు స్థానంలో బర్రెలక్క అనేది స్థిరపడిపోయింది.

ఆమె బర్రెల వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు. ప్రభుత్వం, అధికార పార్టీయే తనపై కేసు పెట్టించిందంటూ, ఆ కేసు కారణంగా తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె కన్నీరుపెట్టారు.

ఇంతకాలం పరీక్షలకు ప్రిపేరవుతూ, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సాగిపోయిన ఆమె హఠాత్తుగా ఎన్నికల బరిలో దిగడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది.

ప్రస్తుత ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బర్రెలక్కకు అనూహ్య స్పందన వచ్చింది.

ఆ స్పందన అనేక రకాలుగా కనిపిస్తోంది. నైతిక మద్దతు, ప్రచారంలో మద్దతు, ఆర్థిక అండ, న్యాయ సహాయం.. ఒకటేమిటి అన్నిరకాలుగా వేలాది మంది ఆమె భుజం తడుతున్నారు.

మరి, ప్రధాన పార్టీల అభ్యర్థులను తట్టుకుని ఆమె నిలవగలరా? బయటి నుంచి కనిపిస్తున్న ఈ మద్దతు ఆమె నియోజకవర్గ ప్రజల నుంచీ అంతే స్థాయిలో ఉందా?

కేసీఆర్, బీఆర్ఎస్‌ల స్వయంకృతాపరాధమే బర్రెలక్కను ఈ ఎన్నికల హీరోను చేసిందా?

barrelakka video

ఫొటో సోర్స్, barrelakka creations

బర్రెల వీడియోపై కేసు ప్రభావం

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, భట్టి విక్రమార్క, రాజాసింగ్, అజహరుద్దీన్... వంటి హేమాహేమీలు అందరి అఫిడవిట్ డౌన్‌లోడ్ల సంఖ్య కలిపినా బర్రెలక్క అఫిడవిట్ డౌన్‌లోడ్ల సంఖ్య కంటే తక్కువ.

ప్రజల్లో ఆమెపై ఉన్న ఆసక్తికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె విషయంలో ఆసక్తి చూపుతున్నవారంతా ఆ నియోజకవర్గానికి చెందినవారు కావొచ్చు కాకపోవచ్చు.

కానీ, బర్రెలక్కకు ఎందుకింతగా చర్చలో ఉంది? కేసీఆర్, కేటీఆర్ వంటివారు కూడా తమ ప్రచార సభల్లో బర్రెలక్కను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఆమె కూడా అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారన్న సంకేతాలు ఎందుకు ఇస్తున్నారు?

నిరుద్యోగాన్ని హైలైట్ చేస్తూ వ్యంగ్యంగా ఆమె చేసిన వీడియోకు ఆదరణ రావడంతో ఆమెపై కేసు పెట్టారు.

ఆ కేసు పెట్టడంలో ప్రభుత్వ తీరును అనేకమంది యువత, నిరుద్యోగులు తప్పుగా భావించారు. బర్రెలక్క ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తుండడంతో ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు.

barrelakka

ఫొటో సోర్స్, bbc

మెల్లమెల్లగా మొదలై...

నామినేషన్ వేసినప్పటికి అంతా సాధారణంగానే ఉన్నా ఆ తరువాత రోజురోజుకూ తనకు స్పందన పెరుగుతుండడంతో బర్రెలక్క కూడా తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్తూ ఒక మేనిఫెస్టో విడుదల చేశారు.

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా అసెంబ్లీలో పోరాడుతానని హామీ ఇస్తూ ఆమె ఓట్లు అడుగుతున్నారు.

చేతిలో 5 వేల నగదు, బ్యాంక్ అకౌంట్లో రూ. 1500 మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడంతో అఫిడవిట్లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు అనేక మంది గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా విరాళాలు పంపిస్తున్నారు.

తన ఖాతాకు రూ. 6 లక్షలకు పైగా డబ్బులొచ్చాయని బర్రెలక్కే ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో చెప్పారు.

తన రాజకీయ ప్రత్యర్థులు యూపీఐ ద్వారా తనకు పేమెంట్లు రాకుండా ఫిర్యాదులు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో పాపులర్

సోషల్ మీడియాతో ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు నేరుగా జనంలోకి వస్తున్న బర్రెలక్కకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫాలోవర్లున్నారు.

యూట్యూబ్‌లో ఒకటిన్నర లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో మరో లక్ష మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ఎన్నికలలో ఆ ఫాలోయింగ్ కలిసొస్తుందన్న ఆశతో ముందుకు సాగుతున్నారు.

barrelakka

ఫొటో సోర్స్, bbc

నిరుద్యోగ యువతకు ప్రతినిధా?

ఉద్యోగాల కోసం ప్రయత్నించి, ఆ తరువాత ఊరికొచ్చి బర్రెలు పెంచుతూ బతకాలని ప్రయత్నించడం.. ఇలా ప్రతి దశలో బర్రెలక్క సంఘర్షణకు లోనై ఉంటుందని.. ఆ సంఘర్షణ నుంచే ఆమె బలంగా పోరాడే దశకు వచ్చారని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి ‘బీబీసీ’తో అన్నారు.

ఆమె ప్రస్తావిస్తున్న అంశాలతో నిరుద్యోగ యువత కనెక్ట్ అయిందని చెప్పారు.

బర్రెల వీడియోపై కేసు పెట్టడాన్ని ప్రజలు ప్రభుత్వ అహంకారానికి చిహ్నంగా చూశారని, ఆ కేసుతో ఇబ్బంది పడిన బర్రెలక్క ఎన్నికలలో పోటీ చేయడాన్ని పోరాటంగా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

బర్రెలక్క విజయం సాధిస్తారా? లేదా? అనేది పక్కన పెడితే తెలంగాణ నిరుద్యోగులకు, ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నవారికి ప్రతినిధిగా ఈ ఎన్నికలలో జెండా ఎత్తారన్నది మాత్రం వాస్తవమని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)