రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విమల్ కుమార్
- హోదా, బీబీసీ హిందీ
కొన్నినెలల కిందట ఐర్లాండ్‌లో భారత జట్టు పర్యటనకు సిద్ధమైనప్పటి సంగతి ఇది. రింకూ సింగ్ మొదటిసారిగా బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించి ఐర్లాండ్‌లో దిగాడు.
అనుకోకుండా ఈ వ్యాసకర్త కూడా అదే సమయానికి టీమిండియా కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు. రింకూ సింగ్‌ను ఈయన అక్కడే తొలిసారి కలిశారు.
రింకూ సిగ్గరి. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఏదో ఒకటి చేయాలనే ఆత్మవిశ్వాసాన్ని అతడు చూపాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరపున ఐపీఎల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన రింకూగా మాత్రమే తనను ఎప్పడూ గుర్తుపెట్టుకోవాలని అతడు కోరుకోవడం లేదు.
కొన్నిరోజుల తరువాత రింకూ తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను డబ్లిన్‌లో ఆడాడు.
ఈ నగరంలో సంజూ శామ్సన్ అభిమానులు వేలల్లో ఉన్నారు. సంజూను చూసేందుకు వీరంతా టికెట్లు కొని స్టేడియానికి వచ్చారు. కానీ రింకూ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రాగానే, ‘రింకూ, రింకూ’ అంటూ మైదానాన్ని మోతెక్కించారు.
విదేశీ గడ్డపై తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఓ యువ ఆటగాడిపై భారత అభిమానులు అంత ఉత్సాహాన్ని చూపడం నిజంగా ఆశ్చర్యకరమే.

ఫొటో సోర్స్, Getty Images
అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్న బుమ్రా
మ్యాచ్ అయిపోయాకా రింకూ పెవిలియన్ వైపు తిరిగొస్తున్న సమయంలో, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అతనిని పిలిచి అభిమానులతో సెల్ఫీలు దిగి, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాలని పంపాడు.
ఈ హఠాత్పరిణామానికి రింకూ ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు కనిపించింది.
బహుశా ఈ చిరునవ్వుతోనే రింకూ తన స్వల్ప కాలపు కెరీర్‌లో సురేష్ రైనా నుంచి సూర్యకుమార్ యాదవ్ దాకా చాలా మందిని ఆకట్టుకున్నట్టున్నాడు.
రింకూ అనేక సందర్భాల్లో తాను సురేష్ రైనాకు పెద్ద అభిమానినని చెప్పుకున్నాడు. సురేష్ రైనాది కూడా ఉత్తరప్రదేశే. చాలా సందర్భాలలో రైనా, రింకూకు అనేక విధాలుగా సాయపడ్డాడు.
రైనా ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో ఒత్తిడి మధ్య అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేవాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీతో అతని భాగస్వామ్యాలు చాలా పాపులర్.
ఒకప్పటి మేటి ఫినిషర్, భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లానే ఒత్తిడి సమయాల్లో రింకూ కూడా ఏకాగ్రతతో, నిమ్మళంగా ఉంటాడు.
ప్రస్తుత ఇండియా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు ముందు రింకూ, దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ఆటతీరు కనపరిచాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మ్యాచుల్లో ఉత్తరప్రదేశ్ తరపున రింకూ ఏడు ఇన్నింగ్స్‌లలో 170.66 స్ట్రైక్ రేట్‌తో 256 పరుగులు చేశాడు.
నవంబరు 27 వరకు రింకూ ఏడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా, అతని పరుగుల సగటు 128గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 216గా ఉంది.
ఓ ఆటగాడి కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి గణాంకాలు ఉండటం అమోఘమైన విషయం.
నవంబరు 26న తిరువనంతపురంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ- రింకూ ఆటతీరును మెచ్చుకున్నాడు.
రింకూను చూస్తే తనకొక వ్యక్తి గుర్తుకొస్తాడు అంటూ, అతడిని ‘నయా ఫినిషర్’ అని సూర్య కితాబిచ్చాడు. ధోనీ పేరును ప్రస్తావించకుండా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
రెండో మ్యాచ్ ఇన్నింగ్స్ చివరి దశలో 344.44 స్ట్రైక్ రేట్‌తో రింకూ చెలరేగి ఆడాడు. తొమ్మిదే బంతుల్లో 31 పరుగులు చేసిన అతడు, భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
నవంబరు 23న విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో నిబ్బరంతో ఆడి, జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ రింకూ తన ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో ఫినిషర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నాడు రింకూను బీసీసీఐ ఎందుకు నిషేధించింది?
రింకూను ఇప్పడు అందరూ పొగుడుతున్నారు. కానీ గడిచిన కొన్నేళ్ళలో అతను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడో కొంత మందికే తెలుసు.
ఇక్కడ రింకూ కుటుంబం గురించి, ఆ కుటుంబం ఆర్థిక కష్టాల గురించి చెప్పడం లేదు. ఎందుకంటే మీరీపాటికే వాటి గురించి చాలాసార్లు వినే ఉంటారు.
కానీ 2019లో బీసీసీఐ రింకూ సింగ్‌పై మూడు నెలల నిషేధం విధించింది, ఇది చాలా మందికి తెలియదు.
అబుదాబీలో టీ20 టోర్నమెంట్ ఆడేందుకు బోర్డు అనుమతి లేకుండా వెళ్ళినందుకు అతనిపై ఈ నిషేధం విధించింది బీసీసీఐ. ఆ సమయంలో రింకూ చాలా నిరాశకు గురయ్యాడు.
అతడీ తప్పు తెలియనితనంతో చేసిందే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.
చాలా సందర్భాలలో చిన్నపట్టణాల నుంచి వచ్చే ఆటగాళ్ళకు బీసీసీఐ నిబంధనలన్నీ తెలియవు. అయితే ఈ సంఘటన రింకూ క్రికెట్‌ను అంతగా ప్రభావితం చేయలేదు.
ఉత్తర్ ప్రదేశ్ అండర్-19కు ఆడుతున్న సమయంలోనే రింకూ తన కుటుంబానికి ఉన్న 5 లక్షల అప్పులు తీర్చేశాడు. కానీ అతనెప్పుడూ తన ఆట పట్ల చిత్తశుద్ధిని వదులుకోలేదు.
అతడికి ఇప్పుడు 26 ఏళ్లు.

ఫొటో సోర్స్, Getty Images
దేశవాళీలో వాడి చూపిన రింకూ
రింకూ గొప్పతనం టీ20లకే పరిమితం అనుకోకూడదని గణాంకాలు చెబుతున్నాయి.
రింకూ తన కెరీర్ తొలినాళ్లలో (2018 రంజీ ట్రోఫీ సీజన్‌లో) అత్యంత విజయవంతమైన రెండో బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. రింకూ 13 ఇన్నింగ్స్‌లలో 105.88 సగటుతో 953 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2021-22 విజయ్ హజారే ట్రోఫీలో ఆరు ఇన్నింగ్సులలో 379 పరుగులు చేసి ఒంటిచేత్తో తన జట్టును నాకౌట్ దశకు చేర్చాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో అతని సగటు 94.75గా ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండీస్ టూర్‌కు రింకూ ఎంపిక అవకాశాల గురించి చాలా చర్చ నడిచింది. కానీ చివరకు హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టులో రింకూకు చోటు దక్కలేదు.
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించిన తర్వాత రోజు అంటే 2023 జులై 6న నేను రింకూను చూసినప్పుడు అతను లోలోపల చాలా బాధపడుతున్నాడని గ్రహించా. కానీ భారత జట్టుకు ఆడాలనే అతని బలమైన కోరిక అంతకంతకు పెరిగేదే కానీ తగ్గేది కాదని అర్థమైంది.

ఫొటో సోర్స్, ANI
వెన్ను తట్టి ప్రోత్సహించిన అభిషేక్ నాయర్
ముంబయి మాజీ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహాయ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ రింకూ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
రింకూను అభిషేక్ తన ఫ్లాట్‌లో అట్టిపెట్టుకుని ఆటపై అతనికున్న ఇష్టాన్ని కొనసాగేలా చేశాడని దినేష్ కార్తీక్ చెప్పాడు. 2018లోనే రింకూ ప్రతిభను నాయర్ గుర్తించాడని, ‘థింక్ బిగ్’ అని, ఏదైనా సాధించాలని చెబుతూ రింకూను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడని వివరించాడు.
అభిషేక్ నాయర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మ్యాచ్‌లోనే రింకూ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను గెలిపించాడని అతడు చెప్పుకొచ్చాడు.
ఆట అయిపోయిన తరువాత రింకూను అభిషేక్ హత్తకున్న ఫోటో వైరల్‌గా మారింది.
ఇవికూడా చదవండి:
- కశ్మీర్: అమర్నాథ్ గుహ మార్గంలో రోడ్డు నిర్మాణంపై వివాదం ఎందుకు రాజుకుంది?
- సామూహిక సెక్స్, విచ్చలవిడి శృంగారం, మత్తు పదార్థాలు, విలాసవంతమైన విందు.. ప్రాచీన చక్రవర్తులు శ్రుతిమించి సుఖపడేవారా?
- రాజస్థాన్ రాజకుటుంబాలు బీజేపీకి ఎందుకు దగ్గరవుతున్నాయి?
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- భారతీయులు వీసా లేకుండానే ఈ 19 దేశాలు చుట్టిరావొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














