రాజస్థాన్ రాజకుటుంబాలు బీజేపీకి ఎందుకు దగ్గరవుతున్నాయి?

రాజస్థాన్ రాజకీయాలు

ఫొటో సోర్స్, ROYAL FAMILY OF GAYATRI DEV

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడి భార్య జాక్వెలిన్ కెన్నడితో గాయత్రిదేవి

స్వరాజ్య సాధన అనంతరం దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజస్థాన్ నేలపై శతాబ్దాల రాచరికానికి తెరపడింది. దాని అస్తిత్వం ప్రశ్నార్ధకంగా మారింది.

కానీ, రాజస్థాన్‌లో మొదలైన ప్రజాస్వామ్య వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడంలో నాటి రాచరిక కుటుంబం తన యుక్తిని చూపించింది.

రాజస్థాన్ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిటీ పాలెస్‌లో తొలి ముఖ్యమంత్రిని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు. ఆ పేరు హీరాలాల్ శాస్త్రి. ఈ పేరును జైపూర్ మహారాజు సిఫార్సు చేశారు.

సిటీపాలెస్‌లోని దర్బార్ హాల్‌లో 1949, మార్చి 3న పురుడుపోసుకున్న రాష్ట్రానికి రాజస్థాన్‌గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి హీరాలాల్ శాస్త్రి ప్రత్యక్ష సాక్షి.

స్వాతంత్య్రం కోసం పోరాడిన జయనారాయణ్ వ్యాస్, మాణిక్యాల వర్మ, గోకుల్‌భాయ్ భట్ లాంటి నెతలెవరి కోసం ఈ కార్యక్రమంలో కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు కానీ, మొదటి వరుసలో రాజులు, మహారాజులు, జాగీర్దార్లు,నవాబులు, అధికారులకు సీట్లు రిజర్వ్ చేశారు.

స్వతంత్ర పోరాటంలో ముందున్న కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినా, ఎవరూ వీరిని పట్టించుకోలేదు. ఆశ్చర్యకరంగా హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

రాజస్థాన్ రాజకీయాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాచరికం వెన్ను వంచిన ఇందిరా గాంధీ

రాచరికానికి చెక్ పెట్టిన ఇందిరా గాంధీ

1949లో ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఎంపికలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన విభేదాలు 2023 ఎన్నికలలోనూ ప్రతిఫలిస్తూనే ఉన్నాయి.

అసమ్మతి నేతల కారణంగా 1951, జనవరి 20న హీరాలాల్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో జయనారాయణ వ్యాస్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఈయన 1951 ఏప్రిల్ 26న ప్రమాణస్వీకారం చేశారు.

అదే ఏడాది 160 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరపాలని నిర్ణయించగా 1952లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు, అసమ్మతి ఉన్నప్పటికీ ఆ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 81 స్థానాలను దాటి 82 స్థానాలు గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో రాజవంశానికి చెందినవారు కూడా పోటీ చేశారు. వారు మద్దతు ఇచ్చిన రామరాజ్య పరిషత్ 24 స్థానాల్లో గెలిచింది.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయనారాయణ వ్యాస్ తాను నిలబడిన రెండుస్థానాల్లోనూ రాజకుటుంబాలకు చెందినవారి చేతిలో పరాజయం పాలయ్యారు. జోధ్‌పూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన మహారాజ హన్వంత సింగ్, రామరాజ్య పరిషత్ తరపున జాలోర్ ఏ సత్ లో పోటీచేసిన మధోసింగ్‌పై ఓటమిపాలయ్యారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు రాచరిక కుటుంబాలకు విసిరిన మొదటి సవాల్ ఇదే. అయితే రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం తన పవరేమిటో చూపించడం మొదలుపెట్టింది. దీంతో యువరాజులందరూ ముఖం చిట్లించుకునేవారు. జాగీర్దార్లు ప్రభుత్వ పాలనను ఇబ్బంది పెట్టేవారు.

ఇక్కడి పరిస్థితులను నెహ్రూ కానీ, తరువాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిగానీ అర్థంచేసుకోలేకపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక రాజ్యంగ సవరణతో మహారాజులను సామాన్యులుగా మార్చివేశారు.

ఇదంతా గతం.. వర్తమానానికి వస్తే రాచరిక కుటుంబాలు బీజేపీ పట్ల ఆకర్షితమవడానికి కారణం ఏమిటి? దీనికి లభించే సమాధానం ఒక్కటే. ఇందిరాగాంధీ రాజస్థానాలను నేలపైకి దించడమే అని చెప్పుకోవాలి. గతంలోని రాచరిక కాంతులన్నీ మసకబారిపోయాయి. వీరంతా ఇప్పుడు సామాన్యులు అయిపోయారు. ఈ అంశాలు నేటికీ రాజాస్థానాలను బాధిస్తూనే ఉన్నాయి.

బీజేపీ లీడర్ దియాకుమారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దియాకుమారి

రాజస్థాన్ రాయల్ ఫ్యామిలీలు, బీజేపీ

రాచరిక రాష్ట్రాల రాజకీయాల నిపుణుడు, చరిత్రకారుడు ప్రొఫెసర్ రాజేంద్రసింగ్ కంగ్రోత్ మాట్లాడుతూ, ‘‘ఎవరి అధికారమైనా లాగేసుకుంటే, వారు ప్రభుత్వ వ్యతిరేకులుగా మారుతారు. రాజస్థాన్‌లోని రాచరిక కుటుంబాలతో అదే జరిగింది’’ అని చెప్పారు.

‘‘కాంగ్రెస్ హయాంలో వారి అధికారాలన్నీ తుడిచిపెట్టుకుపోతుంటే, వారంతా తమ అధికారాలు లాక్కోని పార్టీతో పొత్తు పెట్టుకుని తమను తాము రక్షించుకోవాలని చూశారు’’ అని చెప్పారు.

దీంతో వీరు తొలుత రామరాజ్య పరిషత్‌లో చేరారు. ఆపైన స్వతంత్ర పార్టీ. స్వతంత్ర పార్టీ విలీనమైన తరువాత వారు భారతీయ జనసంఘ్‌తోనూ ఆపైన భారతీయ జనతాపార్టీతో వారి అనుబంధం సులభతరమైంది. కొంతమంది రాజులు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు.

రాజస్థాన్‌లో రాచరిక కుటుంబాలకు చెందిన వృద్ధులను ఎవరిని కదిలించిన వారు చెప్పేది ఒక్కటే. కాంగ్రెస్ మొదట మా పాలనను లాక్కుంది. తరువాత మా జాగీర్లను, అధికారాలను రద్దు చేసింది. మా భూములన్నింటికీ మమ్మల్ని దూరం చేసింది. రాజాభరణాలను జాతీయం చేసింది. దీంతో ఆగలేదు. మా బంగారం, వెండి, వజ్రాల మాకు దక్కకుండా చేసిందని చెపుతారు.

కొందరు దీనిని సామ్యవాద ఉప్పెనగా చెపితే, మరికొందరు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన సమానత్వంగా భావిస్తారు. రాజస్థాన్ ఏర్పడిన తరువాత రాచరిక కుటుంబాలు ఉనికి కోల్పోయాయి కొందరు మాత్రం తమ ఉనికిని రాజకీయాలద్వారా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఓ విమాన ప్రమాదంలో హన్వంత్ సింగ్ మరణించాక రాచరిక రాష్ట్రాల ద్వారా అధికారాన్ని దక్కించుకోవాలనే కల చెదిరిపోయింది. ఏదేమైనా కరౌలీ నుంచి బ్రజేంద్రపాల్, కుమ్మేర్ నుంచి రాజామాన్ సింగ్, నవలాథ్ నుంచి భీమ్ సింగ్, తికాన ఉనియారా నుంచి రావ్ రాజా సర్దార్ సింగ్, అమెర్ బి నుంచి మహారావల్ సంగ్రామ్ సింగ్, జైసల్మేర్ నుంచి హద్వాంత్ సింగ్, సిరోహి నుంచి జవాన్ సింగ్, బాలి నుంచి లక్ష్మణ్ సింగ్, జలోరే నుంచి మధో సింగ్, జోధ్‌పూర్ సిటీ బీ నుంచి హన్వంత్ సింగ్, అత్రు నుంచి రాజా హిమ్మత్ సింగ్, రాజాధీరేంద్ర అమర్ సింగ్ బనేరా నుంచి గెలిచారు.

రాజస్థాన్‌ రాజకీయాలలో రాచరిక కుటుంబాలు చక్రం తిప్పుతున్నాయనడానికి ఈరోజు అక్కడి రాజకీయాలలో వినిపించే ప్రసిద్ధ పేర్లే సాక్ష్యం. వీరంతా లోక్‌సభలో తమ అస్తిత్వాన్ని చూపుతున్నారు. జైపూర్ రాజకుటుంబమైనా లేదా, అల్వార్ భరత్ పుర్ కుటుంబాలైనా రాజకీయాలలో తమదైన ముద్ర వేస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో విద్యాధర్ నియోజకవర్గం నుంచి జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజస్థాన్ రాజకీయాలలో పవర్ హౌస్‌గానూ, బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరైన భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడికి టిక్కెట్ నిరాకరించారు. దియాకుమారి రాజ్‌సమంద్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఈమె జైపూర్ మహారాజు బ్రిగేడియార్ భవానీ సింగ్, పద్మినిదేవిల కుమార్తె. ఇంతకుముందు ఈమె సవాయ్ మదోపూర్ ఎమ్మెల్యేగానూ పనిచేశారు.

జైపూర్‌లోలానే నత్‌ద్వారాలోనూ మేవార్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్ పోటీ చేస్తున్నారు. ఈయను నుంచి ఇక్కడ శక్తిమంతమైన కాంగ్రెస్ నేత, రాజకీయ మనోశాస్త్ర నిపుణుడు సీపీ జోషి బలమైన పోటీని ఎదుర్కొంటున్నారు. సీపీ జోషీ ఎప్పటి నుంచో ప్రజలమధ్యన మసలుతున్న నేత కాగా, విశ్వరాజ్ తొలిసారి పోటీ చేస్తున్నారు. కానీ పోటీ మాత్రం గట్టిగా ఉంది.

ఈసారి బీజేపీ ఉదయ్‌పూర్ సంస్థానంతో అనుబంధం ఉన్న లక్ష్యరాజ్ సింగ్ ను నిలబెట్టలానుకుంది. కానీ ఆయన రాజకీయాల నుంచి దూరం జరగడంతో విశ్వరాజ్ సింగ్‌ను బరిలోకి దింపింది. విశ్వరాజ్ సింగ్ మహారాణా మహేంద్ర సింగ్ తనయుడు. చిత్తోర్‌గర్ నుంచి మహారాణా మహేంద్ర సింగ్ కూడా ఎంపీగా పనిచేశారు.

రాజస్థాన్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాణి గాయత్రి దేవి

మహారాణి గాయత్రి పలుకుబడికి ఇందిర ఈర్ష్య పడ్డారా?

దియాకుమారి నానమ్మ మహారాణి గాయత్రిదేవి జైపూర్ నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎంపీ అయ్యారు. 1962, 1967, 1971లో వరుసగా ఆమె గెలిచారు. ఇందిరా గాంధీ నుంచి పోటీ ఎదుర్కొన్న అతి తక్కువమంది వ్యక్తులలో మహారాణి గాయత్రి దేవిని కూడా ఒకరుగా పరిగణిస్తుంటారు.

గాయత్రిదేవి కుమారుడు పృథ్వీరాజ్ సింగ్ కూడా స్వతంత్ర పార్టీ రతపున 1962 లో దౌసా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంటే ఒకేసారి తల్లీ కొడుకులు పార్లమెంట్‌లో ఎంపీలుగా ఉన్నారన్నమాట.

1967లో గాయత్రిదేవి టాంక్ జిల్లాలో మాల్‌పూర్ నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ లాల్ వ్యాస్ చేతిలో ఓడిపోయారు. గాయత్రిదేవి ఈ ఎన్నికల్లో ఓడిపోకుండా ఉండి ఉంటే కాంగ్రెసేతర రాజకీయాలన్నీ బహుశా భైరాన్ సింగ్ షెకావత్ చేతిలో కాకుండా మహారాణి చెంతకు చేరేవని, 1977లో ఆమె బీజేపిని ముందుండి నడిపి ఉండేవారని పాతకాపులు చెపుతుంటారు.

ఆమె తన చివరిరోజులలో సామాన్య ప్రజల కష్టాలు తీర్చడం లేదంటూ బీజేపీ ముఖ్యమంత్రి వసుందర రాజే తీరుకు నిరసనగా ప్రదర్శన కూడా చేశారు. ఈమెకు ఇందిరాగాంధీతో కూడా విభేదాలున్నాయి. ఇందిర గాయత్రిదేవిని పన్ను వ్యవహారాలలో జైలుకు కూడా పంపారు.

గాయత్రిదేవి పలుకుబడిని చూసి ఇందిరాగాంధీ ఈర్ష్యపడ్డారని రాజకుటుంబం నమ్ముతుంటుంది. 1962లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడి భార్య జాక్వెలన్ కెన్నడి గాయత్రిదేవి రాజభవనంలో అనేక రోజులు గడిపారు. జాక్వెలన్ కెన్నడి గాయత్రిదేవి వ్యక్తిగత అతిథిగా అక్కడి పలు ప్రాంతాలను కూడా సందర్శించారు.

వసుంధర రాజే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, తన తల్లి రాజమాత విజయరాజే సింధియా సమయంలో గాయత్రి దేవిని ప్రపంచంలోనే అందమైన మహిళగా చెప్పేవారని తెలిపారు.

గాయత్రిదేవి కుమారుడు బ్రిగేడియర్ భవానీసింగ్ 1989లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్‌పైన పోటీ చేశారు. కానీ బీజేపీ సామన్య కార్యకర్త గిరిధారీలాల్ భార్గవ్ చేతిలో ఓడిపోయారు.

రాజస్థాన్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

భైరాన్ సింగ్ షెకావత్

జనసంఘ్ తొలితరం నాయకులలో షెకావత్ ఒకరు. ఆయన జాగీర్దార్ల వ్యవస్థను రద్దు చేయడాన్ని, ప్రజాస్వామ్య హక్కులను సమర్థించారు.

రాచరిక రాజకీయాలలో కీలకమైన ఘట్టం ఒకటి 1977లో చోటు చేసుకుంది. అప్పుడు జనతాపార్టీ గెలిచింది. ఆ సమయంలో రాజకుటుంబాలన్నీ మహర్వాల్ లక్ష్మణ్ సింగ్ నాయకత్వంలో ఏకమయ్యాయి. కానీ జనతా పార్టీ గెలిచిన తరువాత మహారాణి గాయత్రిదేవికి, లక్ష్మణ్ సింగ్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విభేదాలు మొదలయ్యాయి.

ఈ వివాదం ముదరడంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న భైరాన్ సింగ్ షెకావత్ చురుకుగా స్పందించడం మొదలుపెట్టారు. తన రాజకీయ చతురతను ఉపయోగించుకుని ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయారు. తరువాత సిటీప్యాలెస్‌లో జరిగే సమావేశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. రాజకుటుంబాలను కూడా పక్కన పెట్టారు. మహార్వాల్ లక్ష్మణ్ సింగ్ నుంచి అసెంబ్లీ స్పీకర్‌గాను, గాయత్రిదేవిని ఆర్టీడీసీ చైర్మన్‌గానూ చేశారు. ఈ కార్పొరేషన్ ను కేవలం గాయత్రిదేవి కోసమే ఏర్పాటు చేశారు.

దీని తరువాత రాజకీయాలు వేగంగా మారిపోయాయి. రాజకుటుంబాల ఆడంబరాలకు భిన్నంగా రాజకీయాలలో మార్పులు వచ్చాయి. అనేకమంది సాధారణ రాజపుత్‌ల పేర్లు రాజకీయాలలో కనిపించడం మొదలైంది. జస్వంత్ సింగ్ జసోల్, కల్యాణ్ సింగ్ కల్వి, తనిసింగ్, దేవిసింగ్ భాటీ, సురేంద్ర సింగ్ రాథోడ్, రాజేంద్ర సింగ్ రాథోడ్ లాంటి పేర్లు కనిపించడం మొదలైంది.

1987లో రాజస్థాన్ కేంద్రంగా రాజకీయాలు సాగినప్పుడు వీపీ సింగ్ దేశరాజకీయాలను శాసించారు. వీపీ సింగ్ రాజీవ్‌ గాంధీని వ్యతిరేకించినప్పుడు రాజకుటుంబాలు తమ భవితను ఆయనలో చూసుకున్నాయి.

1993,1998 మధ్య షెకావత్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకువచ్చిన టూరిజం పాలసీ కారణంగా పావురాల ఆవాసంగా మారిపోయి బూజుపట్టిన కోటలకు కొత్త కళ వచ్చింది. ఈ కోటలను చూడటానికి విదేశీయులు రావడం మొదలైంది.

అయితే తరువాత జరిగిన ఎన్నికలలో షెకావత్ కోటలను బాగు చేయడానికి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీని ఫలితంగా బీజేపీ 33 స్థానాలకే పరిమితమవగా, కాంగ్రెస్ 153 స్థానాలు గెలుచుకుంది. 1998లో అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

రాజస్థాన్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వసుంధర రాజే

వసుంధరరాజే ప్రయాణం

రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ధోల్‌పూర్‌లోని రాజరిక కుటుంబాలు జాట్లకు చెందినవి. ధోల్‌పూర్ జాట్ రాజకుటుంబానికి వసుంధరరాజే సింధియా కోడలు. ఈమె 2003 నుంచి జలర్‌పతన్ నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఈమె కుమారుడు ధుష్యంత్ సింగ్ జల్వార్ బరాన్ లోక్‌సభకు 2004 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

1985లో బీజేపి టిక్కెట్‌పై ధోల్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా వసుంధరరాజే తొలిసారి గెలిచారు. 1991,1996,1998, 1999 వరుసగా జల్వార్ నుంచి ఎంపీగానూ గెలిచారు.

రాజస్థాన్ రాజకీయాలలో క్రియాశీలకంగానూ, శక్తిమంతంగానూ ఉండే భరత్ పూర్ రాజకుటుంబం కూడా ఈమె వెనుక ఉంది.

2003 ఎన్నికలలో మహారాణి వసుంధరరాజే తుపానుతో కాంగ్రెస్ పార్టీ బలం 56కు పరిమితం కాగా, బీజేపీ 120 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మొదటిసారి స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించుకుంది. వసుంధరరాజే పరివర్తన యాత్ర చేసి మూలమూలలకు తిరిగారు.

వసుంధరరాజే తరువాత బీజేపీ నాయకత్వం మరోసారి రాజకుటుంబాల కోసం తన చేతులు చాచింది.

ప్రొఫెసర్ కంగ్రోత్ మాట్లాడుతూ ‘‘ రాజస్థాన్‌లోని రాజకుటుంబాలన్నీ అణిగిపోలేదు. కానీ అధికారం తీరు మాత్రం ఎప్పటికీ మారదు. ఒకప్పుడు రాజులకు, నవాబులకు పరిచే ఎర్రతివాచీపై ఇప్పుడు ప్రజాప్రతినిధులు నడుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు’’ అని చెప్పారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)