స్మోకింగ్ బ్యాన్ ఎత్తేస్తున్న న్యూజీలాండ్, ఆదాయం కోసమే యూటర్న్...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్
న్యూజీలాండ్ కొత్త ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించే చట్టాన్ని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.
పన్ను వసూళ్ల లోటును పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పింది.
జసిండా ఆర్డర్న్ నేతృత్వంలోని ప్రభుత్వం 2022 డిసెంబర్‌లో ఈ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి 2008 తర్వాత పుట్టిన వాళ్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషిద్ధం. అయితే, ఆదాయంలో కోతలు ఎదుర్కొనేందుకు ఇప్పుడీ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించింది.
న్యూజీలాండ్‌లో ధూమపానం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. అందుకే, యువతరాన్ని ఈ అలవాటుకు దూరం చేయాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు.
ఈ చట్టం 2024 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, నేషనల్ పార్టీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈ చట్టం రద్దుపై ప్రకటన చేయడంతో ఆరోగ్య నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
'మాకు భయమేస్తోంది'
"మాకు భయంగానే కాదు, అసహ్యంగానూ ఉంది, ఆరోగ్య ప్రమాణాల విషయంలో ఇది నమ్మశక్యం కాని తిరోగమనం" అని ఒటాగో విశ్వవిద్యాలయంలో పొగాకు నియంత్రణ పరిశోధకుడు, ప్రజారోగ్య నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ ఎడ్వర్డ్స్ అన్నారు.
"న్యూజీలాండ్‌లోని హెల్త్ గ్రూప్స్ ప్రభుత్వం చర్యలను చూసి భయపడుతున్నాయి, నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పిలుపునిస్తున్నాయి" అని బీబీసీతో తెలిపారు రిచర్డ్.
గతేడాది రూపొందించిన ఈ ధూమపాన నిషేధ చట్టం, కీలక సంస్కరణలకు తోడ్పడుతుందని అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.
పొగాకు రిటైలర్ల సంఖ్యను పరిమితం చేయడం, సిగరెట్‌లలో నికోటిన్ స్థాయిని తగ్గించడం వంటి చర్యలు దీనిలో ఉన్నాయి.
స్మోక్‌ఫ్రీ చట్టాలు ప్రతి సంవత్సరం 5,000 మంది జీవితాలను రక్షించగలవని పలు అధ్యయనాలు గతంలోనే సూచించాయి.
యూకే ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో యువకులకు ఇదే విధమైన ధూమపాన నిషేధాన్ని ప్రకటించడానికి న్యూజిలాండ్ చట్టాలే ప్రేరణ అని పలువురు భావిస్తున్నారు.
అయితే, యూకే ప్రధాని రిషి సునక్ నిషేధంపై నిర్ణయం మార్చుకోలేదని న్యూజీలాండ్ కొత్త ప్రభుత్వం ప్రకటన అనంతరం యూకే అధికారి ఒకరు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు రద్దు చేస్తున్నారు?
ఈ చట్టం న్యూజీలాండ్‌లో ప్రజారోగ్య విధానంగా ప్రశంసలందుకున్నా, కొన్ని వ్యాపార సమూహాల నుంచి వ్యతిరేకత వచ్చింది.
ప్రభుత్వ రాయితీలతో పాటు ఇతర ఆదాయాలనూ కోల్పోతున్నామని న్యూస్ ఏజెంట్స్, కార్నర్ షాపుల యజమానులు విమర్శించారు.
కొత్త ప్రధాని క్రిస్టోపర్ లుక్సన్ సహా పలువురు చట్టసభ సభ్యులు పొగాకు నిషేధం అనేది బ్లాక్ మార్కెట్‌కు దారితీస్తుందని వాదించారు.
అయితే, ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఈ చట్టం గురించి 'నేషనల్ పార్టీ' ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ పార్టీ అక్టోబర్ 14న జరిగిన ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించి, అధికారం చేపట్టింది.

ఫొటో సోర్స్, EPA
ప్రభుత్వంపై ప్రభావం చూపాయి: ఆర్థిక మంత్రి
ఈ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందని శనివారం కొత్త ఆర్థిక మంత్రి నికోలా విల్లిస్ చేసిన ప్రకటన, ఈ విధానాన్ని ఎవరూ ముట్టుకోరని విశ్వసించిన ఆరోగ్య నిపుణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
సంకీర్ణ ప్రభుత్వంలోని న్యూజిలాండ్ ఫస్ట్, ఏసీటీ పార్టీలు ఈ చట్టాలను రద్దు చేయాలని గట్టిగా పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విల్లీస్ తెలిపారు.
ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు మైనర్ పార్టీలతో నేషనల్ పార్టీ కొన్నివారాలపాటు చర్చలు జరిపింది.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం (ఎన్నికలు ముగిసిన ఆరు వారాల తర్వాత) ఒప్పందం కుదిరింది.
ధూమపాన చట్టాలను రద్దు చేయడంపై ప్రచారం చేసిన ఏకైక పార్టీ న్యూజిలాండ్ ఫస్ట్, ఇది కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే సాధించింది.
"స్మోక్‌ఫ్రీ చట్టానికి సంబంధించిన మార్పులు ప్రభుత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని గుర్తుంచుకోవాలి, అందులో సుమారు ఒక బిలియన్ డాలర్లు ఉన్నాయి" అని TV3తో ఆర్థిక మంత్రి విల్లీస్ అన్నారు.
బిల్లు అమలైతే ఏం జరగనుంది?
"వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యవంతమైన జీవితాలు గడుపుతారు. ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన అవసరం లేకుండా దాదాపు 26 వేల కోట్ల రూపాయలు ఆరోగ్య వ్యవస్థ ఆదా చేయనుంది" అని అప్పటి ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ మంత్రి అయేషా వెరాల్ అన్నారు.
కాగా, న్యూజిలాండ్ ధూమపాన రేటు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది.
2022 నవంబర్‌లో విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం 8 శాతం మంది పెద్దలు ప్రతిరోజూ ధూమపానం చేస్తున్నారు.
అయితే గత సంవత్సరం ఇది 9.4 శాతంగా ఉంది. స్మోక్‌ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ బిల్లు 2025 నాటికి ఆ సంఖ్యను 5 శాతం కంటే తగ్గించగలదని నమ్ముతున్నారు.
చివరికి ఈ పద్ధతితో మొత్తం అంతం అవుతుందని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులను విక్రయించగల రిటైలర్ల సంఖ్యను 6,000 నుంచి 600కి పరిమితం చేసేలా కూడా ఈ బిల్లు రూపొందించారు.
ఈ చట్టం మావోరీ (న్యూజిలాండ్‌లోని ఓ జాతి), మావోరీయేతర పౌరుల మధ్య ఆయుష్షు అంతరాలను చెరిపేయగలదని వెరాల్ అన్నారు.
మావోరీ పౌరుల మొత్తం ధూమపాన రేటు 19.9 శాతం వద్ద ఉంది. గత సంవత్సరం ఇది 22.3 శాతంగా ఉంది.
కాగా, ఈ కొత్త చట్టం వేప్ ఉత్పత్తులను ( ఈ-సిగరెట్ లాంటివి) నిషేధించలేదు. అయితే సిగరెట్ల కంటే ఇవే యువతలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
ఇవి కూడా చదవండి
- షియా, సున్నీలు ఎవరు... ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఈ విభేదాలు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














