షియా, సున్నీలు ఎవరు... ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఈ విభేదాలు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం షియా, సున్నీలుగా విడిపోయింది.
గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలావరకు ముస్లిం మెజారిటీ దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలిపాయి.
అయితే, మధ్యప్రాచ్య రాజకీయాలు, ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు వివిధ పార్టీల వైఖరిని బహిరంగ పరుస్తున్నాయి.
ఇస్లాంలోని ఈ రెండు శాఖల మధ్య వ్యత్యాసాలు ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య సంబంధాలను గుర్తుచేస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్ దాడికి మరో కారణముందా?
సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోంది, మతపరమైన విభజనల కారణంగా ఇది తీవ్రరూపం దాల్చింది.
ఈ రెండు దేశాలు ఇస్లాంలోని వివిధ శాఖలను అనుసరిస్తాయి. ఇరాన్.. షియాల మెజారిటీ దేశం అయితే సౌదీ అరేబియా తనను తాను అగ్ర సున్నీ శక్తిగా భావిస్తుంటుంది.
గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న వివాదంలోనూ వీరి మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి చేసింది.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య జరుగుతున్న చర్చలను విఫలం చేయడంలో ఈ దాడి ఒక భాగమని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ ఎందుకు అలా?
దాడికి కనుక కారణం ఇదే అయితే, ఇరాన్‌కు మూడు ప్రధాన శత్రు దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండేది.
అలాంటి ఒప్పందాలకు వాతావరణం కల్పించడంలో అమెరికా కీలకంగా వ్యవహరిస్తుంది.
హమాస్ ఒక ప్రత్యేకమైన సున్నీ సంస్థ, అయినప్పటికీ దశాబ్దాలుగా షియా మెజారిటీ దేశమైన ఇరాన్ నుంచి ఆర్థిక, సైనిక సహాయాన్ని పొందుతోంది.
అంతేకాదు, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతిచ్చిన మిడిల్ ఈస్ట్‌లోని లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులిద్దరూ షియా గ్రూప్‌కు చెందినవారే, ఇరాన్‌కు మిత్రదేశాలే.
అయితే, ఇజ్రాయెల్, హమాస్‌లు సాధారణ ప్రజలకు హాని కలిగిస్తున్నారని సౌదీ అరేబియా ప్రిన్స్ తుర్కీ అల్ ఫైసల్ ఆరోపించారు కూడా.
ఇదే సందర్భంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలనూ తోసిపుచ్చడంలేదు.
సున్నీ, షియా వర్గాల మధ్య విభజన, ప్రవక్త మొహమ్మద్ మరణంతో అంటే 632 A.D సంవత్సరంలో ప్రారంభమైందని చెబుతారు.
ఎందుకంటే దీని తరువాత ముస్లిం సమాజానికి నాయకత్వం వహించడానికి ఒక పోరాటం ప్రారంభమైంది, అది నేటికీ కొన్ని మార్గాల్లో కొనసాగుతోంది.
ఈ రెండు శాఖలు శతాబ్దాలుగా అనేక నమ్మకాలు, ఆచరణ పద్దతులు పాటిస్తున్నాయి. కానీ సున్నీ, షియాలలో చట్టం, ఆచారాలు, శాస్త్రం, సంస్థ వంటి అంశాలలో తేడాలుంటాయి.
ఏళ్లుగా ఈ రెండు వర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తూనే ఉన్నారు.
సిరియా నుంచి లెబనాన్, ఇరాక్ నుంచి పాకిస్తాన్ వరకు విభజన వాదాన్ని విస్తరించడంలో ప్రాంతీయ సంఘర్షణల పాత్రే కీలకం. కొన్ని చోట్ల సంఘాలనూ చీల్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
సున్నీలు ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను విశ్వసించే వారిలో ఎక్కువ మంది సున్నీ వర్గానికి చెందినవారే ఉన్నారు.
ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని దాదాపు 90 శాతం ముస్లింలు సున్నీ శాఖను అనుసరిస్తారు. ఈ వర్గం ప్రజలు సున్నీని ఇస్లాంలోని అత్యంత సాంప్రదాయిక శాఖగా చూస్తారు.
సున్నీ అనే పదం 'అహ్ల్-అల్-సున్నా' నుంచి వచ్చింది, అంటే... సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు.
ప్రవక్త మొహమ్మద్, ఆయన సహచరుల చర్యల ప్రభావంతో కూడిన ఆచరణ పద్దతులను ఈ సంప్రదాయం సూచిస్తుందని వారు భావిస్తారు.
ఖురాన్‌లో ప్రవక్తలు చెప్పిన వాటిని సున్నీలు విశ్వసిస్తారు. వీరికి మొహమ్మద్ ప్రవక్త అత్యంత పూజనీయులు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నేతలను తాత్కాలిక నాయకులుగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
షియాలు ఎవరు?
షియా ఒక రాజకీయ వర్గంగా మొదలైంది. షియా అనే పదానికి సాహిత్యపరమైన అర్థం - షియాత్ అలీ.. అంటే అలీ పార్టీ.
ప్రవక్త మొహమ్మద్‌కు అల్లుడు అలీ. ముస్లింలను నడిపించే హక్కు అలీ, ఆయన వారసులకు మాత్రమే ఉందని షియాలు భావిస్తుంటారు.
అలీ హయాంలో జరిగిన కుట్రలు, హింస, అంతర్యుద్ధాల కారణంగా ఆయన హత్య జరిగింది.
అలీ మరణానంతరం ఆయన కుమారులు హాసన్ లేదా హుస్సేన్‌లు ఖలీఫా కావాలని షియాలు విశ్వసించారు. అలా జరగకపోవడంతో వారసత్వాన్ని కోల్పోయారు.
హాసన్‌పై ఉమయ్యద్ రాజవంశం మొదటి ఖలీఫా అయిన మువావియా ద్వారా విషప్రయోగం జరిగిందనే ఆరోపణలున్నాయి. కర్బలా యుద్ధభూమిలో హుస్సేన్ కుటుంబంతో సహా మరణించారు.
షియాలలో మతాధికారుల శ్రేణి కూడా ఉంది. ఈ మత గురువులు ఇస్లామిక్ గ్రంథాలను అభ్యసిస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 12-17 కోట్ల మంది షియాలు ఉన్నారని చెబుతారు.
ఈ జనాభా మొత్తం ముస్లిం జనాభాలో 10 శాతం. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, అజర్‌బైజాన్, యెమెన్ (కొన్ని అంచనాల ప్రకారం)లలో షియాలు అధికంగా ఉన్నారు.
అంతేకాదు, అఫ్గానిస్తాన్, ఇండియా, కువైట్, లెబనాన్, పాకిస్థాన్, ఖతార్, సిరియా, తుర్కియే, సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్‌లలో షియాల జనాభా ఎక్కువగానే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ ఘర్షణల్లో ఇద్దరి పాత్ర ఏమిటి?
సున్నీ పాలిత దేశాలలో షియాలే ఎక్కువగా పేదలు. వారు తమను తాము వివక్ష, అణచివేతలు బాధితులుగా భావిస్తుంటారు.
కొంతమంది సున్నీ మిలిటెంట్లు షియాలపై ద్వేషాన్ని కూడా బోధిస్తుంటారు. ఈ రెండింటి మధ్య విభజనే మిడిల్ ఈస్ట్ పొత్తులు, శత్రువులను నిర్ణయిస్తుంటుంది.
1979 నాటి ఇరాన్ విప్లవం ఈ ప్రాంతంలో షియా ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఎజెండాను ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లోని సున్నీ ప్రభుత్వాలకు ఇది సవాల్‌గా మారింది.
విప్లవం తర్వాత ఇరాన్ చేసిన విధానంలో భాగంగా, అది దేశం వెలుపల ఉన్న షియా పార్టీలు, మిలీషియాలకు సహాయం చేయడం ప్రారంభించింది.
ఉదాహరణకు లెబనీస్ అంతర్యుద్ధంలో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
షియా ప్రభావాన్ని ఎదుర్కోవటానికి సున్నీ ప్రభుత్వాలు దేశం వెలుపల ఇతర ఉద్యమాలకు మద్దతివ్వడం ప్రారంభించాయి.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లలో సున్నీ మిలిటెంట్ గ్రూపు అయిన తాలిబాన్ ఈ విధంగానే ఉనికిలోకి వచ్చింది. తాలిబన్లు తరచూ షియా మత స్థలాలపై దాడులు చేస్తుంటారు.
ఉమ్మడి శత్రువు
ఇరాక్, సిరియాలలో తాజా సంఘర్షణ కూడా దీనిలో ఒకటిగా మారింది.
సున్నీలలో యువకులు ఈ దేశాలలో చాలావరకు తుపాకులు పట్టుకున్నారు. ఈ సున్నీ గ్రూపులన్నీ అల్-ఖైదా భావజాలానికి ప్రభావితమయ్యాయి.
ఇరాక్, సిరియాలలో షియాలు ప్రభుత్వ దళాలతో కలిసి పోరాడుతున్నారు. అయితే ఇరాన్, సౌదీ అరేబియాలు రెండూ సున్నీ భావజాలం కలిగిన ఇస్లామిక్ దేశాన్ని తమ ఉమ్మడి శత్రువుగా భావిస్తుంటాయి.
ఇవి కూడా చదవండి
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














