కిడ్నాప్ అయిన యుక్రెయిన్ చిన్నారి రష్యాలో పుతిన్ స్నేహితుడి ఇంట్లో ఎలా ప్రత్యక్షమైంది?

యుక్రెయిన్ చిన్నారి
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారినే కిడ్నాప్ చేసి రష్యాకు తీసుకువెళ్ళారు
    • రచయిత, హిలరీ అండర్సన్
    • హోదా, బీబీసీ పనోరమ

యుక్రెయిన్ హాస్పిటల్ నుంచి కిడ్నాప్ అయిన ఓ చిన్నారిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్నేహితుడు దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని పేర్కొన్న డాక్యుమెంట్లను బీబీసీ పనోరమ బృందం కనిపెట్టింది.

2022లో రెండేళ్ళ చిన్నారిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఆ మహిళను రష్యన్ రాజకీయ పార్టీ నాయకుడు, 70 ఏళ్ళ సెర్జీ మిరోనోవ్ వివాహం చేసుకున్నారు. ఆయన పేరే యుక్రెయిన్ చిన్నారిని దత్తత తీసుకున్నట్టు కాగితాలలో కనిపించింది.

రష్యాలో ఈ చిన్నారి గుర్తింపును మార్చేసినట్టుగా కాగితాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా మిరోనోవ్‌ను కోరగా ఆయన స్పందించలేదు.

కానీ, ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో, తనపైనా, తన కుటుంబంపైనా దుష్ఫ్రచారం జరుగుతోందని ఓ పోస్టుపెట్టారు.

యుక్రెయిన్ చిన్నారి

ఫొటో సోర్స్, IGOR KASTYUKEVICH

ఫొటో క్యాప్షన్, 2022 వేసవిలో దాదాపు 50మంది చిన్నారులను రష్యా తీసుకుపోయింది. వీరేమయ్యారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది

మార్గరెట్ కథ

ఈ చిన్నారి అసలు పేరు మార్గరైటా. యుక్రెయిన్ నగరంలో రష్యన్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్న ఖేర్సన్ ప్రాంతీయ చిన్నారుల సంరక్షణా గృహం నుంచి అదృశ్యమైన 48 చిన్నారులలో మార్గరైటా కూడా ఉంది. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా పెద్ద ఎత్తున దండయాత్ర చేసినప్పటినుంచి 20వేలమంది చిన్నారులు కిడ్నాప్‌కు గురైనట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మొదట్లో యుక్రెయిన్ చిన్నారులను అక్రమంగా రష్యా అధీనంలోని ప్రాంతాలకు తరలించారనే ఆరోపణలపై అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా లోవా బెలోవాకు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఉక్రెయిన్ పిల్లలను తరలించారనే ఆరోపణలను రష్యా ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే యుద్ధం నుంచి పిల్లలను కాపాడేందుకు వారిని ఖాళీచేయించినట్టు తెలిపింది.

మార్గరైటా, ఇతర పిల్లలకు ఏమైందనే విషయమై యుక్రెయిన్ మానవ హక్కుల పరిశోధకురాలు విక్టోరియా నోవికొవాతో కలిసి బీబీసీ పనిచేసింది. నోవికోవా యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ ఆఫీసు కోసం కొత్త ఆధారాలతో ఓ ఫైల్ తయారుచేస్తున్నారు. ఈ ఫైలును అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్పించనున్నారు.

మార్గరైటా మిస్టరీ అంతా ఖేర్సన్ చిన్న పిల్లల ఆస్పత్రిలో గౌను ధరించిన ఓ మహిళ ప్రత్యక్షమైనప్పటి నుంచి మొదలైంది. అప్పటికి మార్గరైట్ వయసు పదినెలలు. 2022 ఆగస్టు నుంచి ఈ చిన్నారి బ్రోంకైటిస్‌కు చికిత్స పొందుతోంది. చిన్నారుల సంరక్షణా గృహంలో మార్గరైటానే అత్యంత పిన్నవయస్కురాలు. తల్లిదండ్రులు చనిపోవడం, లేదా జైలుపాలవడం వలన ఎవరి ఆలనాపాలనా లేక, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులను ఈ సంరక్షణా కేంద్రంలో చేర్చుతారు.

యుక్రెయిన్ చిన్నారి
ఫొటో క్యాప్షన్, వంకాయరంగు గౌనులో వచ్చిన వచ్చిన మహిళను ఇనా వార్లమోవాగా గుర్తించారు

గౌనులో వచ్చిన మహిళే కారణమా?

మార్గరైటా పుట్టిన కొంతకాలానికే తల్లికి జైలుశిక్షపడింది. ఆ చిన్నారి తండ్రి ఆచూకీ తెలియలేదు. మార్గరైటా నవ్వుతూ ఉండేదని, ఎవరినైనా హత్తుకుపోవడానికి ఇష్టపడేదని ఈ సంరక్షణా కేంద్రంలో చిన్నారులకు చికిత్స అందించే డాక్టర్ నటాలియా ల్యూటికోవా చెప్పారు.

ఆరోజు గౌనులో వచ్చిన మహిళ తాను ‘మాస్కోలో చిన్నపిల్లల వ్యవహారాల శాఖాధిపతినని’ పరిచయం చేసుకున్నారు. అప్పట్లో ఖేర్సన్ రష్యన్ సేనల అధీనంలో ఆరునెలలపాటు ఉంది. ప్రస్తుతం యుక్రెయిన్ చేతికి తిరిగొచ్చింది. ఈ మహిళ వెళ్ళిపోయాకా ల్యూటికోవాకు రష్యా నియమించిన ఓ అధికారి నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ అధికారినే పిల్లల సంరక్షణకు ఇన్‌చార్ఝ్‌గా నియమించారు. ఆ అధికారి మార్గరైటాను తక్షణం ఆస్పత్రి నుంచి సంరక్షణా కేంద్రానికి పంపించేయాలని డిమాండ్ చేశారు.

ఓ వారం రోజుల తరువాత మార్గరైటా ఆస్ప్రతి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ తరువాత రోజు ఉదయమే రష్యన్ సేనలు మార్గరైట్ ను ట్రిప్పుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధం చేయాల్సిందిగా సంరక్షణా కేంద్ర సిబ్బందిని ఆదేశించారు. ‘‘మేమందరం భయపడిపోయాం’’ అని ఈ కేంద్రంలోని నర్సు ల్యూబోవ్ తెలిపారు.

కొంతమంది రష్యాకు చెందినవారు అక్కడికి వచ్చారు. వారిలో కొందరు మిలటరీ తరహా దుస్తులు ధరించి ఉన్నారు. ఒకతను చేతిలో సూట్‌కేసుతో మార్గరైటాను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ‘‘ ఇది అచ్చం సినిమాలా అనిపించింది’’ అని నర్సు తెలిపింది.

ఏడువారాల తరువాత రష్యా పార్లమెంట్ సభ్యుడు ఇగోర్ కస్త్యూకేవిచ్ ఇతర అధికారులతో కలిసి మిలటరీ దుస్తులలో ఈ కేంద్రానికి వచ్చారు. అక్కడ మార్గరైటా సవతి సోదరుడు సహా మిగిలిన పిల్లలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ‘‘మా చేతుల్లోంచి పిల్లలను తీసుకుని వారు వెళ్ళిపోయారు’’ అని నర్సు తెలిపింది.

పిల్లలను బస్సులు, అంబులెన్సుల వద్దకు తీసుకువెళుతున్న ఫోటోలను కస్త్యూకేవిచ్ టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. క్రిమియాలోని సురక్షితమైన చోటుకు పిల్లలను తీసుకువెళ్ళినట్టు ఆయన తెలిపారు. ఆయన దీన్నోక మానవీయ కార్యకలాపంగా పేర్కొన్నారు.

యుక్రెయిన్ చిన్నారి

ఫొటో సోర్స్, IGOR KASTYUKEVICH

ఫొటో క్యాప్షన్, రష్యా ఎంపీ కస్త్యూకేవిచ్ ఖేర్సన్ చిన్నపిల్లల హోమ్ నుంచి పిల్లల తరలింపును పర్యవేక్షించారు

అర్థరాత్రి రైలు

లాయర్ విక్టోరియా నొవికోవాతో కలిసి మార్గరైటా, మరో 47మంది పిల్లల ఆచూకీ కనిపెట్టేందుకు బీబీసీ ఐదునెలలుగా ప్రయత్నిస్తోంది. 17 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రష్యాలో తప్పిపోయిన పిల్లలను వెదకడమనేది అంత తేలికైన పనికాదు.

మా మొదటి పని ఆగస్టు 2022లో గౌనులో ఆస్పత్రికి వచ్చిన మహిళ ఎవరో కనుక్కోవడం. మార్గరైటాను వైద్యపరీక్షల కోసం మాస్కోలోని ఓ ఆస్ప్రతికి తీసుకువెళ్ళినట్టుగా ఉన్న ఓ రష్యన్ డాక్యుమెంట్‌ను నొవికోవా కనుక్కున్నారు. ఆ డాక్యుమెంట్‌లో మేం వెదుకుతున్న ఆ మహిళ పేరు ఇన్నా వార్లమొవ అని తెలిసింది. సామాజిక మాధ్యమాలలో ఈ పేరుతో సెర్చ్ చేసి, మేం వెదుకుతున్న మహిళ ఆమె అని నిర్థరించుకున్నాం.

బీబీసీ బృందం వార్లమొవ ఫోటోను యుక్రెయిన్‌లోని డాక్టర్ ల్యుటివకోవాకు చూపించగా, ఆరోజు ఆస్పత్రికి వచ్చి, పిల్లల వార్డును సందర్శించిన మహిళ వార్లమొవనే అని ఆయన నిర్థరించారు. మరింత పరిశోధన చేయగా, వార్లమొవ రష్యా పార్లమెంట్‌లో పనిచేస్తారని తెలిసింది. ఆమెకు మాస్కో సమీపంలోని పోడోల్స్క్‌లో ఆస్తిని ఏ హోదాలో సంపాదించారో మాత్రం తెలియలేదు.

మార్గరైటాకు సంబంధించిన మిస్టరీ వీడిపోయింది. కానీ.. కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి.

‘‘మార్గరైటాకు ఎటువంటి ప్రత్యేకమైన పరీక్షలు అవసరం లేదు’’ అని డాక్టర్ ల్యూటికోవా ఆ చిన్నారిని తీసుకువెళ్ళే రోజున చెప్పారు.

వర్లమొవా పేరు బీబీసీ చేతిలో ఉంది, రష్యాలోని కొందరి సహాయంతో పనోరమ బృందం ట్రైన్ రికార్డులను సంపాదించింది. ఈ డాక్యుమెంట్లలో వార్లమొవ అదేరోజున యుక్రెయిన్‌కు చేరుకున్నట్టు తెలిసింది. మార్గరైటాను చిన్నారుల సంరక్షణా కేంద్రం నుంచి తీసుకువెళ్ళిపోయినట్టు సాక్షులు తెలిపారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక 12గంటల 20 నిమిషాల ప్రాంతంలో వార్లమొవ మళ్ళీ ట్రైన్‌లోనే మాస్కోకు తిరిగొచ్చారు. ఆమె తిరిగొచ్చేటప్పుడు అదనపు టిక్కెట్లు కూడా కొన్నారు.

ఈ అర్థర్రాతి రైల్లోనే మార్గరైటా కిడ్నాప్ అయినట్టు ఆధారాలు చెపుతున్నాయి.

యుక్రెయిన్ చిన్నారి
ఫొటో క్యాప్షన్, ఇనా వార్లమొవా పుతిన్ మద్దతుదారుడు సెర్జి మిరోనోవ్‌ను పెళ్ళాడారు

కారణమేంటి?

ప్రత్యేకంగా మార్గరైటాపైనే వీరికి ఎందుకింత ఆసక్తి? రష్యాలోనే మరో చోటు నుంచి కీలక సమాచారం ఒకటి తెలిసింది. వర్లమొవ ఇటీవలే రాజకీయవేత్త సెర్జీ మిరోనోవ్‌ను వివాహం చేసుకున్నారు. మిరోనోవ్, మాజీ పారాట్రూపర్, ఫెయిర్ రష్యా పార్టీ నాయకుడు. అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుదారుడు. ఈయనపై యూకే, యురోపియన్ యూనియన్ సహా అనేక పశ్చిమదేశాలు ఆంక్షలు విధించాయి.

ఇక ఇప్పుడు కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కిందటి డిసెంబరున 14 నెలల వయసుగల మరీనా పేరుతో సృష్టించిన పుట్టినరోజు ధ్రువపత్రాన్ని బీబీసీ సంపాదించింది. ఈ చిన్నారి తల్లిదండ్రుల పేర్లు ఇన్నా వర్లమొవా, సెర్జి మిరోనోవ్. బర్త్ సర్టిఫికెట్ ఎంట్రీలు స్పష్టంగా లేవు. చిన్నారి పుట్టినరోజు గురించిన ఒరిజినల్ రికార్డు చూపలేదు.

‘‘మరీనా’’ పుట్టినరోజును అక్టోబరు 31, 2021గా చెప్పారు. అదేరోజున మార్గరైటా పుట్టింది.

‘మరీనా పుట్టినరోజు, మార్గరైటా పుట్టినరోజునాడే ఉండటంతో నేను విషయాన్ని అర్థం చేసుకున్నాను’ అని డాక్టర్ నవొకోవా చెప్పారు.

రష్యాలోని గుర్తుతెలియని సోర్సుల ద్వారా మార్గరైటా దత్తత రికార్డును బీబీసీ సంపాదించింది. మార్గరైటా ప్రొకొంపెన్కోను దత్తత తండ్రిగా సెర్జి మినోరోవ్ గౌరవార్థం మరీనా మిరోనోవాగా మార్చారు. చిన్నారి పుట్టిన ఊరును పోడోల్స్క్‌గా చూపారు.

మార్గరైటా కేసు గురించి తమకు తెలియదని, తాము దానిపై వ్యాఖ్యానించలేమని రష్యా ప్రభుత్వం చెప్పింది.

యుద్ధ నేరాలంటే ఏమిటి? భద్రతా కారణాల రీత్యా పౌరులను తరలించాల్సి వస్తే అది తాత్కాలికమేనని జెనీవా ఒప్పందం పేర్కొటోంది. పిల్లల కుటుంబ అస్తిత్వాన్ని మార్చడాన్ని కూడా ఈ ఒప్పందం నిషేధించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, రష్యా బాలల హక్కుల కమిషనర్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం నోటీసులు ఇస్తూ

యుక్రెయిన్‌లోని అనాథశరణాలయాల నుంచి వందలాదిమంది చిన్నారులను తరలించడంలో వారిని స్వదేశం నుంచి శాశ్వతంగా దూరం చేసే దురుద్దేశం దాగుందని చెప్పింది.

దీంతో యుక్రెయిన్ పిల్లలను దత్తత తీసుకోమంటూ పుతిన్ డిక్రీ జారీచేశారు. రష్యాలో పిల్లలను , సంరక్షణా కేంద్రాల నుంచి మాత్రమే దత్తత తీసుకుంటారని లోవో బెలోవా చెప్పారు. మేము ఎటువంటి దత్తతా తీసుకోలేదని ఆయన కిందటి నెలలో చెప్పారు.

‘‘ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దత్తత తీసుకుంటే ఆ పిల్లల జన్మస్థలం పూర్తిగా మారిపోతుంది. మీరు వారి పేరు మార్చాలి, ఇంటిపేరు మారిపోతుంది, జన్మస్థలాన్ని మార్చాలి’’ అని ఆయన చెప్పారు.

అయితే బీబీసీ పరిశోధనకు బదులుగా ‘‘ఇది సరైనది కాదు’’ అని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా కలుపుకున్న యుక్రెయిన్ ప్రాంతాల నుంచి పిల్లలను దత్తత తీసుకోవడాన్ని రష్యా ప్రభుత్వం ధృవీకరించలేదని తెలిపింది.

ప్రస్తుతం ఉక్రైన్ రష్యన్‌గా మారిన మాస్కోలో నివసించే ప్రజలు, పిల్లలు తమ వారినేని మాస్కో ప్రకటించింది.

యుక్రెయిన్ చిన్నారి
ఫొటో క్యాప్షన్, లాయర్ విక్టోరియా నొవికొవా బీబీసీతో కలిసి ఖేర్సన్ పిల్లల తరలింపుపై చేసినపరిశోధనకు సహకరించారు

సమాధానం లేని ప్రశ్నలు

మిరోనోవ్‌కు, వర్లమొవాకు బీబీసీ ఈ విషయమై రాసిన లేఖపై వారు స్పందించలేదు. ఖేర్సన్ సంరక్షణా గృహం నుంచి తరలించిన పిల్లలందరూ రష్యా చేతుల్లోనే ఉన్నారని నమ్ముతున్నారు. వీరిలో 17మంది క్రిమియాలో ఉన్నారు రష్యన్ అధికారులు చెపుతున్నారు. వీరందరికీ యుక్రెయిన్‌లో బంధువులు ఉన్నారని నోవికోవా చెప్పారు.

తమ దేశం నుంచి 19,546 మంది పిల్లలను రష్యాకు తీసుకువెళ్ళారని, వీరిలో కేవలం 400మంది మాత్రమే తిరిగొచ్రాని యుక్రెయిన్ ప్రకటించింది.

పిల్లలకు సంబంధించి ఏదైనా చట్టబద్ధమైన సంప్రదింపులు వస్తే పిల్లలను వారి కుటుంబంతోను స్నేహితులతోనూ కులపుతామని రష్యా చెపుతోంది. కానీ చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. వారిని కనుక్కోవడం, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టమైన ప్రక్రియగా మారింది.

ఖేర్సన్ సంరక్షణా గృహం నుంచి తీసుకువెళ్ళిన పిల్లల్లో ఒక్కరే యుక్రెయిన్‌కు తిరిగొచ్చారు. కిందటి నెలలో 3 ఏళ్ళ విక్టర్ పుజిక్‌ను క్రిమియాలో తల్లి ఓల్హా కలుసుకోగలిగారు. తన బిడ్డ తననుంచి దూరం అయినప్పుడు ఆవేదన చెందానని ఓల్హా తెలిపారు. ‘‘ నా బిడ్డ ఎక్కడుంది, అసలు బతికుందా లేదా’ అనే ప్రశ్నలు నా మనసును తొలిచేస్తుండేవి ఆమె చెప్పారు.

ఖేర్సన్ హోం నుంచి తీసుకువెళ్ళిన ప్రతిచిన్నారిని తిరిగి కనిపెట్టాలని నొవికోవా పట్టుదలతో ఉన్నారు. కానీ అంత త్వరగా వారిని కనుక్కోగలమా అనే బాధ వెంటాడుతోంది.

‘‘టైమ్ మనపక్కన లేదు’’ అని నొవికోవా చెప్పారు.

యుక్రెయిన్ నుంచి తీసుకువెళ్ళిన పిల్లల గుర్తింపును వారికి రష్యన్ పాస్‌పోర్టులు ఇచ్చేటప్పుడో, బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడో రష్యన్ అధికారులు మార్చేస్తున్నారు. కానీ అదే సమయంలో మార్గరైటా ను ఉక్రెయిన్‌కు తిరిగి తీసుకురావడంపై ఆమె ఆశ వదులుకోలేదు.

ఈమెకు ఇప్పటికీ మార్గరైటా బంధువులెవరో తెలియదు. దీంతో యుక్రెయిన్ ప్రభుత్వం నొవికోవాను లీగల్ సంరక్షకురాలిగా నియమించింది. మార్గరైటాను యుక్రెయిన్‌కు తిరిగి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయమని కోరింది.

‘‘మార్గరైటా గురించి ప్రపంచం తెలుసుకోవాలి. ఆమె గుర్తింపును చెరిపేయాలని వారనుకున్నారు. ఆ చిన్నారిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది'' అని ఆమె తెలిపారు.

ఇవికూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)