ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ... బందీల విడుదల ఎందాకా వచ్చింది?

ఫొటో సోర్స్, REUTERS/ARAFAT BARBAKH
- రచయిత, బీబీసీ
- హోదా, న్యూస్ వరల్డ్
ఇజ్రాయెల్, గాజా మధ్యన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇరుపక్షాలు కూడా ఈ విరమణ తాత్కాలికమని, కేవలం నాలుగురోజులే అమల్లో ఉంటాయని తెలిపాయి.
ఖతార్ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం కింద హమాస్ వద్ద బందీలుగా ఉన్న 13మంది ఇజ్రాయెలీలు శుక్రవారం నాడు విడుదలవుతారు. ఈ నాలుగురోజుల వ్యవధిలో మొత్తంగా 50 మంది బందీలు విడుదలవుతారని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ జైల్లో ఉన్న దాదాపు 150 మంది పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. వీరిలో మహిళలు,పిల్లలు ఉన్నారు.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ మొదలయ్యేవరకు తన కార్యకలాపాలు కొనసాగించినట్దు దక్షిణ ఇజ్రాయెల్‌కు చెందిన బీబీసీ జర్నలిస్టు అన్నా ఫాస్టర్ గమనించారు.
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగే అవకాశం ఉందని, ప్రతి పదిమంది బందీల విడుదల తరువాత అదనంగా ఒకరోజు విరమణను కొనసాగిస్తారని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/AMIR COHEN
యుద్ధం ముగియలేదు... ఇజ్రాయెల్ హెచ్చరిక
అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిచేసి 1200మందిని హతమార్చి 240మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్ళింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేసిన దాడులలో పాలస్తీనా భూభాగాలలోని 14వేలమంది మరణించారని గాజా ఆరోగ్యశాఖా తెలిపింది.
సామాజిక మాధ్యమాలలో అరబిక్ భాషలో పోస్టు చేసిన ఓ సందేశంలో , కాల్పుల విరమణ తాత్కాలికమని, ప్రస్తుత విరమణ మానవతాదృక్పథమని, యుద్ధం ఇంకా ముగియలేదని పాలస్తినీయులకు గుర్తుచేస్తూ ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఒప్పందంలో భాగంగా 200 ట్రక్కులలో ఆహారం, నీరు, వైద్యసదుపాయాలను, నాలుగు ఇంధన ట్యాంకులలో వంటగ్యాస్ ఈజిప్ట్‌లోని రఫా క్రాసింగ్ ద్వారా ఈ నాలుగురోజులలో గాజా ప్రజలకు అందించనున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/IBRAHEEM ABU MUSTAFA
ఇంధన సరఫరాపై ఇజ్రాయెల్ అభ్యంతరం
‘‘రఫా క్రాసింగ్ వద్ద అతి ముఖ్యమైన మానవతాసాయాన్ని తీసుకువెళుతున్న ట్రక్కులు సరిహద్దు దాటి గాజాలోకి ప్రవేశిస్తున్నాయని’’ఫాసర్ట్ రిపోర్ట్ చేశారు. ప్రతిరోజు 13వేల లీటర్ల డీజిల్ గాజా ద్వారా సరఫరా చేసేందుకు అనుమతిస్తామని కైరో అధికారులు తెలిపారు.
గాజాకు ఇంధనం సరఫరా చేయడంపై ఇజ్రాయెల్ మొదటినుంచి అభ్యంతరం చెపుతోంది. హమాస్ వద్ద సరిపడా ఇంధనం ఉందని, అదనంగా పంపితే దానితో హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ సైన్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని అడ్డుకుంటూ వచ్చిందని’’ ఫాస్టర్ తెలిపారు.
అయితే ఒప్పందంలో అవసరమైన చోటకు మాత్రమే అంటే హమాస్‌కు ప్రవేశం లేని ఆస్పత్రులు లాంటి చోట్లకు ఇంధనం తీసుకువెళ్ళాలనే కచ్చతమైన హామీని పొందుపరిచారు.
ఇవికూడా చదవండి :
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















