ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ కూతురు 'ద్వారక' పేరుతో వీడియో... ఆమె ముఖకవళికలపై అనుమానాలు

ఎల్టీటీఈ

ఫొటో సోర్స్, TAMILOLI.NET

    • రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
    • హోదా, బీబీసీ కోసం

సాయుధ పోరాటం ముగిసినప్పటికీ, తమిళుల స్వతంత్ర దేశ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాజకీయ పోరాటం కొనసాగుతుందంటూ ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురు ద్వారక పేరుతో సోషల్ మీడియాలో మంగళవారం ఒక వీడియో పోస్ట్ చేశారు.

హీరోస్ డే (వీరుల దినోత్సవం) సందర్భంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాకరన్ కూతురు ద్వారకగా చెబుతున్న ఆ యువతి వీడియోను శ్రీలంక టైమ్స్ మంగళవారం సాయంత్రం ప్రసారం చేసింది.

అందులో తమిళ్ ఈలం పోరాటం కొనసాగుతుందని చెబుతున్నట్లుగా ఉంది. అయితే, ఆ వీడియో ఎంతవరకూ నిజమనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఆ వీడియోలో ఏముంది?

ఏదో ఒకరోజు తమిళ్ ఈలం(తమిళ దేశం)కి తిరిగి వచ్చే అవకాశాన్ని కాలం తప్పకుండా ఇస్తుందని, అక్కడి ప్రజలతో మమేకమై, వారితో కలిసి పని చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు మంగళవారం విడుదలైన వీడియోలో ఆమె చెప్పారు.

తమిళ ప్రజల గొంతు నొక్కేశారని ద్వారక అన్నారు. ''సాయుధ పోరాటం ముగుస్తుందని, రాజకీయ మార్గాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకునే అవకాశం తప్పకుండా ఉంటుందని యుద్ధ సమయంలో ఆశలు కల్పించిన ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు, నేటికీ రాజకీయ పరిష్కారం చూపించలేదు'' అని ఆమె ఆరోపించారు.

''సింహళ జాత్యాహంకార రాజకీయ తంత్రం, స్వార్థ రాజకీయ నాయకులు ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక బీజాలు నాటి అమాయక సింహళీయులను తమిళ ప్రజలపైకి రెచ్చగొట్టారని కూడా నాకు తెలుసు'' అని ఆ వీడియోలో ఆమె అన్నారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, HANDOUT

శ్రీలంక రక్షణ శాఖ ఏమంది?

ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురు ద్వారకగా చెబుతున్న యువతి వీడియో గురించి తెలుసుకునేందుకు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖను బీబీసీ తమిళ్ ప్రతినిధి సంప్రదించారు.

ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ నళిన్ హెరాత్ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పనేనా?

కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురు ద్వారకను స‌ృష్టించినట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు పేర్కొన్నట్లు ఇటీవల శ్రీలంకకు చెందిన ఒక ఇంగ్లిష్ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఆ యువతి, ద్వారక పేరుతో హీరోస్ డే రోజున ప్రసంగించనున్నట్లు తెలిపింది. నార్వే సహా అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి నిధులు సేకరించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.

మీడియాలో వచ్చిన కథనంపై కూడా బీబీసీ ప్రతినిధి రక్షణ శాఖ ప్రతినిధి అడిగారు.

''దీనిని అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు'' అని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ నళిన్ చెప్పారు.

మురళీకృష్ణన్ చిన్నత్తురై

ప్రభాకరన్ కూతురు వీడియోలో కనిపించారా?

వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురు ద్వారక పేరుతో విడుదల చేసిన యువతి వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించించదని తమిళనాడుకి చెందిన జర్నలిస్ట్, ఆన్‌లైన్ నేరాల నివారణ నిపుణులు మురళీకృ‌ష్ణన్ చిన్నత్తురై అభిప్రాయపడ్డారు.

''ద్వారక భాష బాగానే ఉన్నప్పటికీ, ఆమె నోరు, ముఖ కదలికలు, శరీర కదలికలు సహజంగా అనిపించలేదు. వీడియోలో ఆమె ముఖంపై వెలుతురు ఎక్కువగా ఉంది. కళ్లలో కూడా పెద్దగా కదలిక లేదు. చేతులు కనిపించడం లేదు. ఏదో నాసిరకమైన టెక్నాలజీ వాడి దీనిని తయారుచేసినట్లుగా కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.

ఇది ఇంటర్నెట్‌ను ఉపయోగించి చేసిన ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపును దొంగిలించడం)గా చూస్తానని ఆయన అన్నారు. ఏదో సాధారణ టెక్నాలజీని వినియోగించి హడావిడిగా విడుదల చేసిన వీడియోగా భావిస్తున్నట్లు చెప్పారు.

2024లో తమిళనాడులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కూడా ఇది జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రవీణ్ కలైసెల్వన్, సేవ్‌దెమ్ ఫౌండేషన్

'అది నకిలీ వీడియో'

ఎల్టీటీఈ వ్యవస్థాపక అధ్యక్షులు వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురు ద్వారక పేరుతో విడుదలైన వీడియో కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినదేనని ప్రవీణ్ కలైసెల్వన్ అన్నారు. ఆయన సేవ్‌దెమ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు.

అది నకిలీ వీడియో అని ప్రచారం జరుగుతోందని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు.

ఈ వీడియో చాలా కచ్చితత్వంతో రూపొందించిందని, తమిళ ప్రజల్లో ఊహాగానాలు పెంచేందుకు దీన్ని తయారు చేశారని ప్రవీణ్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వీడియో రూపొందించి ఉంటారని అభిప్రాయపడ్డారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు, ప్రచారం కోసం టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే తీవ్రమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలు, మీడియా సంస్థలు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలైసెల్వన్ అన్నారు.

'భాషపై సందేహం'

శ్రీలంకలో సాయుధ పోరాటం ముగిసిన తర్వాత తమిళుల రాజకీయ పోరాటాన్ని కించపరిచేందుకు ద్వారక ముసుగులో టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను విడుదల చేశారని జర్నలిస్ట్, మీడియా పాఠాలు బోధించే లెక్చరర్ ఏ.నిక్సన్ అభిప్రాయపడ్డారు.

''2009 నుంచి ఇప్పటికి 14 ఏళ్లు గడచిపోయినా శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎలాంటి రాజకీయ పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో వీరుల దినోత్సవానికి ప్రాధాన్యం పెరిగింది. అక్కడి సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి వీరుల ఇళ్లను శుభ్రం చేసి వీరుల దినోత్సవం నిర్వహించారు.

ఎవరూ ముందుండి దానిని నిర్వహించలేదు. ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తాము ఆ పని చేశారు. ప్రజల్లో తిరుగుబాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి తిరుగుబాటును తప్పుబట్టేలా ద్వారక వీడియో బయటకు వచ్చింది'' అని ఆయన అన్నారు.

ఎ.నిక్సన్, వెటరన్ జర్నలిస్ట్

''ఇదొక అబద్ధం. ఎందుకంటే ప్రభాకరన్ ఎప్పుడూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. తనను తాను దేవుడిగా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ సమాజానికి రాజకీయ విముక్తి కావాలని మాత్రమే చెప్పేవారు. హీరోస్ డే ప్రసంగాలను గమనించినా సింహళ ప్రజలతో ఎప్పుడూ శత్రుత్వం లేదని తెలిసిపోతుంది. మేము హక్కులు మాత్రమే అడుగుతున్నామని, మిగిలిన ప్రపంచం కూడా తమ హక్కులను గుర్తించాలని ఆయన అనేవారు'' అని నిక్సన్ చెప్పారు.

ద్వారక ప్రసంగం తప్పు అని నిక్సన్ అన్నారు. ''ఆ అమ్మాయి వాడిన భాష ఈలం తమిళులు వాడే భాష కాదు. ఉచ్ఛారణలో తప్పులున్నాయి. స్టేట్ (దేశం) అనే పదం కూడా వచ్చింది. దానిని దేశానికి సంబంధించిన రోజుగా భావించడం లేదు.

అలాగే, రాజకీయాలకు బదులు ఎతిక్స్ (విలువలు) అని వాడారు. ఇది ఈశాన్య ప్రాంత ప్రజలు వాడే భాష. ఉచ్ఛారణ సరిగ్గా లేదు. భారత్‌లో ఉండేవారు మాత్రమే ఇలాంటి మాటలు (పదాలు) వాడే అవకాశం ఉంది'' అన్నారాయన.

దీని వెనక శ్రీలంక లేదా భారత నిఘా వ్యవస్థల ప్రమేయం ఉండొచ్చని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.

''వీడియో వెనక ఏదో బలమైన శక్తి ఉంది. అయితే, అది ఎవరనేది తెలియదు. శ్రీలంక నిఘా విభాగం కావొచ్చు. లేదంటే భారత నిఘా విభాగం కూడా కావొచ్చు. 2009 తర్వాత తమిళుల రాజకీయ పోరాటాన్ని కించపరిచే ఉద్దేశంగా దీన్ని చూడొచ్చు'' అని నిక్సన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)