ఓరీ: ఈ సోషల్ మీడియా స్టార్‌తో ఒక్క ఫోటో దిగేందుకు రూ. 20-30 లక్షలు చెల్లిస్తున్నారు...

ఓరీ

ఫొటో సోర్స్, ORHAN AWATRAMANI

రాజమౌళి సినిమా బాహుబలి విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో ఒకే ఒక ప్రశ్న, 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ప్రశ్ననే ప్రతి ఒక్కరూ సంధిస్తున్నారు. అదేటంటే.. నీతా అంబానీ, ఇషా అంబానీ, కత్రినా కైఫ్, హార్దిక్ పాండ్యా వంటి ఎంతో మంది సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతున్న ఓరీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి ఎవరసలు అని ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్లతో ఓరీ దిగిన పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కామెంట్లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.

సాధారణంగా పార్టీలలో ఫోటోగ్రాఫర్లు స్టార్లను ఫోటోలు తీసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వారి కెమెరాలలో ఎక్కువగా బంధిస్తోన్న ఫోటో ఓరీదే.

ఒక్కోసారి పార్టీలో సెలబ్రిటీ ఫోటోనన్నా మర్చిపోతున్నారేమో కానీ, ఓరీని మాత్రం మరవడం లేదు.

ఓరీ అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి. ఆయన వ్యాపారవేత్త సూరజ్ అవత్రమణి, షానాజ్ అవత్రమణి కొడుకు.

న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌ నుంచి ఓరీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఓరీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కుమారులు, కుమార్తెలు, బాలీవుడ్ స్టార్ కిడ్స్‌తో కలిసి చదువుకున్నారు.

లింక్డిన్ ప్రొఫైల్‌లో తనకు తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకున్నారు. అంతేకాక, పాటల రచయిత, గాయకుడు, క్రియేటివ్ డైరెక్టర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా కూడా అభివర్ణించుకున్నారు.

స్టార్ కిడ్స్‌తో స్నేహం

నైసా దేవ్‌గణ్, సారా అలీఖాన్ నుంచి జాహ్నవి కపూర్ వరకు ఎంతో మంది స్టార్ కిడ్స్ ఓరీని మంచి స్నేహితునిగా భావిస్తారు. వారితో కలిసి ఆయన తరచూ పార్టీలకు వెళ్తూ ఉంటారు.

ఖుషీ కపూర్, అనన్య పాండేలు ఓరీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానాతో కూడా ఓరీకి మంచి స్నేహం ఉంది.

ఓరీకి కేవలం బాలీవుడ్ స్నేహితులు మాత్రమే కాక, పారిశ్రామికవేత్తల పిల్లలతో కూడా మంచి స్నేహం ఉంది. అంబానీ కోడలు శ్లోకా అంబానీ, రాధికా మర్చెంట్‌ కూడా ఆయనకు మంచి స్నేహితురాళ్లు.

కరణ్ జోహార్ హోస్ట్‌గా చేసే ‘కాఫీ విత్ కరణ్’ ఎనిమిదో సీజన్‌లో సారా అలీఖాన్, అనన్య పాండేలను ఓరీ గురించి అడిగారు.

‘కాఫీ విత్ కరణ్’లో ఆయన గురించి మాట్లాడిన తర్వాత, ఓరీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి ‘బిగ్ బాస్’ హౌస్‌కి వచ్చారు.

‘బిగ్ బాస్’ హౌస్‌కి వచ్చినప్పుడు, అసలు నువ్వేం చేస్తావు? అని సల్మాన్ ఖాన్ ఓరీని ప్రశ్నించారు. అప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా ‘నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు పనిచేస్తుంటాను’ అని చెప్పారు.

అంతేకాక, ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజర్‌గా కూడా ఓరీ పనిచేస్తున్నారు.

ఓరీ

ఫొటో సోర్స్, ORHAN AWATRAMANI

ఓరీ ఫోటో ఎప్పుడు వైరల్ అయింది?

న్యూయార్క్‌లో ఉంటున్నప్పుడు ఓరీకి చెందిన ఒక ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోలో ఓరి కైలీ జెన్నెర్‌తో కలిసి ఉన్నారు.

కైలీ అమెరికా మోడల్, వ్యాపారవేత్త. ఓరీ ఆమె ఇంటికి వెళ్లి, తనని కలిశారు. ఈ ఫోటో తర్వాత ఓరీ వెలుగులోకి వచ్చారు.

కైలీ జెన్నెర్‌తో ఫోటోలో ఉన్న ఈ యువకుడు ఎవరా? అని తెలుసుకునేందుకు ప్రజలు తెగ ఆసక్తి చూపించారు. ఆ తర్వాత నుంచి ఓరీ ట్రెండ్ అవుతున్నారు.

భారత్‌లోఓరీ తొలుత జాహ్నవి కపూర్‌తో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జాహ్నవి కపూర్, ఓరీలు డేటింగ్‌లో ఉన్నట్లు అభిమానులు అనుకున్నారు.

కానీ, కాజోల్, అజయ్ దేవ్‌గన్ కూతురు నైసా దేవ్‌గన్‌తో కూడా ఓరీ కనిపించారు.

ఆ తర్వాత నుంచి ఎంతో మంది స్టార్ కిడ్స్‌తో ఓరీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

మెట్ గాల కార్యక్రమంలో ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన తర్వాత, ఓరీ పాపులారిటీ మరింత పెరిగింది.

ప్రస్తుతం చాలా మందికి ఓరీ సుపరిచితుడు.

ఓరీ

ఫొటో సోర్స్, ORHAN AWATRAMANI

అంబానీ కుటుంబంతో సాన్నిహిత్యం ఎలా?

టామ్ ఫోర్డ్, ప్రాడా వంటి ఎన్నో పెద్ద బ్రాండ్లకు ఓరీ పనిచేశారు. లింక్డిన్ ప్రొఫైల్‌లో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి ప్రత్యేక ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు ఉంది.

అంబానీ కుటుంబంతో సంబంధాలు ఏర్పడేందుకు ఇది కూడా ఒక కారణం.

అది మాత్రమే కాదు, ఓరీ తండ్రి కూడా ఒక వ్యాపారవేత్త. ఓరీ తండ్రికి మద్యం, హోటల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి.

ఓరీ చిన్నప్పుడు కైరా అద్వానీ వంటి ఎంతో మంది స్టార్లు చదివిన ప్రముఖ స్కూల్‌లో చదువుకున్నారు.

న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌ నుంచి ఫైన్ ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్‌లో డిగ్రీ తీసుకున్నారు.

అక్కడ కూడా ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు, వ్యాపారవేత్తల పిల్లల్ని ఓరీ కలుసుకున్నారు. వీరందరూ కూడా ఓరీ వయసున్న వారే.

‘నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు పనిచేస్తుంటాను’

బిగ్ బాస్ హౌస్‌లోకి ఓరీ వచ్చినప్పుడు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓరీని ఒక ప్రశ్న అడిగారు. బతకడం కోసం నువ్వేం చేస్తావు? అని ప్రశ్నించారు. అప్పుడు, ‘నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు పనిచేస్తుంటాను’ అని చెప్పారు.

ఇది క్లిష్టమైన 9 టూ 5 జాబ్ లాంటిదా? అని ప్రశ్నించారు.

అప్పుడు నా కోసం నేను చాలా కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.

‘‘నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు పనిచేస్తుంటాను. జిమ్‌కి వెళ్తాను. కష్టించి పనిచేస్తాను. యోగా చేస్తాను, మసాజ్‌కి వెళ్తాను. వర్కవుట్ చేస్తాను’’ అని చెప్పారు.

ఓరీ

ఫొటో సోర్స్, ORHAN AWATRAMANI

ఓరీతో ఫోటో దిగేందుకు రూ. 20 - 30 లక్షలు

మనీని ఎలా సంపాదిస్తున్నారో కూడా ఓరీ సల్మాన్‌ ఖాన్‌కు తెలిపారు. సెలబ్రిటీ పార్టీలకు తానెందుకు వెళ్తారో కూడా చెప్పారు.

‘‘పార్టీలకు వెళ్లేందుకు నేనేమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే, వాళ్లే నన్ను వారి వివాహాలకు పిలిచి, వారితో, కుటుంబ సభ్యులతో ఫోటో దిగమని అడుగుతారు. ఆ తర్వాత ఫోటోలను సోషల్ మీడియాలో చేయమంటారు’’ అని తెలిపారు.

దీంతో సోషల్ మీడియాలో సెల్ఫీలను పోస్ట్ చేయడం ద్వారా ఒక్కోసారికి రూ.20 నుంచి రూ.30 లక్షలు సంపాదిస్తాను అని చెప్పారు.

తనతో కలిసి ఫోటో దిగాలని చాలా మంది అనుకుంటూ ఉంటారని అన్నారు. ఎందుకంటే, ఓరీని కలవడం ద్వారా వారు యవ్వనస్తులుగా భావిస్తారు.

‘‘ఒకవేళ మీకు 28 ఏళ్లుంటే, మీరు 22 ఏళ్ల మాదిరిగా భావిస్తారు. మీకు 38 ఏళ్లు అయితే, 32 ఏళ్ల మాదిరిగా ఉంటారు’’ అని ఓరీ చెప్పారు.

తనని కలిసిన తర్వాత వారి ఆరోగ్య సమస్యలు తీరుతున్నట్లు చెబుతున్నారని ఓరీ తెలిపారు.

ఓరీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)