తెలంగాణ ఎన్నికలు: పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎందరు, యువ ఓటర్ల సంఖ్య ఎంత... మీరు తెలుసుకోవాల్సిన 9 ఆసక్తికర అంశాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చిల్లిగవ్వ ఆస్తి లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంతమంది? ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గమేదీ? తక్కువ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గం? అత్యధికంగా ఆస్తులున్న అభ్యర్థి..? పోటీలో ఉన్న వారిలో అత్యధిక వయస్కులు ఎవరు.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణలో అసెంబ్లీకి నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేసి ఎన్నికల రణక్షేత్రంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

దాదాపు రెండున్నర లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్న ఈ ఎన్నికల్లో 9 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..

1. అభ్యర్థుల్లో 873 మందిపై క్రిమినల్ కేసులు

గత ఎన్నికలతో పోల్చితే ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ. 2018లో జరిగిన ఎన్నికల్లో 1,777 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడ్డారు. క్రిమినల్ కేసులు, కోటీశ్వరుల సంఖ్య కూడా గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో పెరిగింది.

  • పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య – 2,290
  • క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు – 521 (23 శాతం)
  • తీవ్ర క్రిమినల్ కేసులున్న వారు – 353 (15శాతం)

ఇందులో బీఆర్ఎస్ నుంచి 57, కాంగ్రెస్ నుంచి 85, బీఎస్పీ నుంచి 40, బీజేపీ నుంచి 79 మందితోపాటు 138 మంది స్వతంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

ఎంఐఎంకు చెందిన ఐదుగురు, అలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన పది మంది, సీపీఎంకు చెందిన 12మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

2. జిల్లాలవారీగా నియోజకవర్గాలు, పోటీలో ఉన్న అభ్యర్థులు

జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎక్కువ మంది ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్ జిల్లాలో 312 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,504 నామినేషన్లు దాఖలు కాగా, చివరికి 2,290 మంది బరిలో ఉన్నారు.

జిల్లాలు..

హైదరాబాద్ – 15 (312)

రంగారెడ్డి –8 (209)

నల్గొండ –6 (144)

మేడ్చల్-మల్కాజిగిరి – 5 (126)

ఖమ్మం – 5 (119)

సంగారెడ్డి –5 (102)

భద్రాద్రి కొత్తగూడెం – 5 (95)

సిద్దిపేట – 4 (95)

సూర్యాపేట –4 (92)

నారాయణపేట –2 (77)

నిజామాబాద్ – 6 (77)

కరీంనగర్ –4 (73)

కామారెడ్డి –3 (67)

వికారాబాద్ –4 (61)

పెద్దపల్లి –3 (61)

వరంగల్ – 3 (59)

జనగాం – 3 (53)

జగిత్యాల – 3 (45)

మంచిర్యాల –3 (44)

హన్మకొండ – 2 (43)

నాగర్ కర్నూల్ – 3 (43)

మహబూబ్ నగర్ –3 (42)

యాదాద్రి భువనగిరి – 2 (40)

నిర్మల్ –3 (38)

రాజన్న సిరిసిల్ల –2 (37)

ఆదిలాబాద్ – 2 (35)

జోగులాంబ గద్వాల – 2 (33)

కొమ్రం భీం ఆసిఫాబాద్ – 2 (30)

మహబూబాబాద్ – 2 (26)

మెదక్ – 2 (24)

జయశంకర్ భూపాలపల్లి – 1 (23)

వనపర్తి – 1 (13)

ములుగు – 1 (11)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

3. ఎక్కువ మంది బరిలో ఉన్నది అక్కడే..

పోలింగ్ కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసినట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అ‌‍ధికారి వికాస్ రాజ్ మీడియాకు చెప్పారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నారు.

దాదాపు 27,094 మంది పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లున్నాయి.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు – 35,655
  • రాష్ట్రవ్యాప్తంగా బ్యాలెట్ యూనిట్లు – 59,779
  • ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గం – ఎల్బీనగర్ (48 మంది)
  • తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గం – నారాయణపేట, ‌బాన్సువాడ (7 గురు)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

4. చిల్లిగవ్వ లేని అభ్యర్థులు

ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 25 మంది అ‌‍భ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవని అఫిడవిట్లో చూపించారు. స్థిర, చరాస్తులు ‌ఏమీ లేవని పేర్కొన్నారు.

అదే సమయంలో రూ.5 కోట్లకుపైగా ఆస్తులున్న అభ్యర్థులు 270 మంది ఉన్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 580 మంది (25శాతం) కోటీశ్వరులున్నారు.

మరో ముగ్గురు తమ వద్ద కేవలం రూ.500 మాత్రమే ఉన్నట్లు చెప్పారు.

  • అత్యధిక ఆస్తులున్న అభ్యర్థులు

గడ్డం వివేకానంద (చెన్నూర్) – రూ.606.67 కోట్లు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) – రూ.458.39 కోట్లు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(పాలేరు) - రూ.433.93 కోట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

5. నిరక్షరాస్యులు 89 మంది

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అక్షరాస్యత విషయంలో ఎలాంటి ప్రామాణికం లేదు. అందుకే చదువుతో సంబంధం లేకుండా అందరూ పోటీ చేస్తుంటారు. ఈ ఎన్నికలలో నిరక్ష్యరాస్యులైన అభ్యర్థులు 89 మంది పోటీలో ఉన్నారు.

ఎంతోకొంత చదువుకున్న వారు 26 మంది ఉన్నారు. ఐదో తరగతి వరకు చదువుకున్న వారు 91 మంది పోటీ చేస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న వారు 117మంది బరిలో నిలిచారు. పదో తరగతి వరకు చదువుకున్న వారు 441 మంది ఉన్నారు. 12వ తరగతి వరకు చదువుకున్న వారు 330 మంది ఉన్నారు.

గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు 392 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు 242 మంది ఉన్నారు.

పీజీ చేసిన వారు 477, డాక్టరేట్ చేసిన వారు 32 మంది ఉన్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు 53 మంది ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

6. పది శాతం దాటని మహిళా అ‌‍భ్యర్థులు

మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు కాగా, 222 మంది మహిళా అ‌భ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉన్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున చిత్ర పుష్పితలయ అనే ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. జడ్చర్లలో రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ నుంచి జానకమ్మ పోటీ చేస్తున్నారు.

బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా 8 మంది మహిళలు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. 12 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.

బీజేపీ 111 స్థానాల్లో పోటీలో ఉండగా, వారిలో 13 మంది మహి‌‍ళలు ఉన్నారు.

బీజేపీతో పొత్తుతో జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండగా, వారిలో ఒక మహి‌ళ ఉన్నారు.

పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యువత ఎక్కువ మంది ఉన్నారు. పోటీలో ఉన్నవారిలో ఎక్కువ మంది 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారే.

వయసుల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇలా..

25-30 ఏళ్ల వయసున్న వారు - 240

31-40 ఏళ్ల వయసున్న వారు - 787

41-50 ఏళ్ల వయసున్సన వారు – 628

51-60 ఏళ్ల వయసున్న వారు - 434

61-70 ఏళ్ల వయసున్న వారు - 171

71-80 ఏళ్ల వయసున్న వారు - 29

81-85 వయసున్న వారు - 1

మొత్తం అభ్యర్థుల్లో 80 ఏళ్లకు పైబడిన వ్యక్తి ఒకేఒక్కరు ఉన్నారు. 84 ఏళ్ల వయసులో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రావికొటి మదన్ మోహన్ స్వతంత్ర అ‌‍భ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అలాగే, జగిత్యాల నియోజకవర్గం నుంచి చీటి శ్యామల, వేములవాడ నియోజకవర్గం నుంచి జక్కని భూపతి 80ఏళ్ల వయసులో పోటీ చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

7. యువత ఓటింగ్ కీలకం

ఈసారి ఎన్నికల్లో యువత ఓటింగ్ కీలకంగా మారింది. యువత, మహిళలు ఎటు వైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రాష్ట్రం మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

వయసుల వారీగా..

18-19 ఏళ్లు ఉన్న ఓటర్లు – 9,99,667

80 ఏళ్లు పైబడిన ఓటర్లు – 4,40,371

ఎన్నారై ఓటర్లు – 2,944

పీడబ్ల్యూడీ (దివ్యాంగులు) ఓటర్లు – 5,06,921

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం – శేరిలింగంపల్లి (7,32,506)

అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం – భద్రాచలం (1,48,713)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

8. ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

సహజంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం గంట కుదించారు.

సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

ఆ సమయంలోపు పోలింగ్ కేంద్రంలో లైనులో ఉన్న వారికే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

మిగిలిన 106 నియోజకవర్గాలో పోలింగ్ సాయంత్రం ఐదు వరకు ఉంటుంది.

9. తెలంగాణలో అత్యధికంగా నగదు, మద్యం సీజ్

ఈ ఎన్నికల్లో అక్టోబరు 9 నుంచి మొత్తం రూ.737.29 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో ఇప్పటివరకు మొత్తం రూ.301.93 కోట్ల నగదు ఉంది. రూ.124.88 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారు.

రూ.39.86 కోట్ల మత్తుపదార్థాలు, రూ.186.75 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.83.84 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడసామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది.

రాష్ట్రంలో 4,400 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.

అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్, సెంట్రల్ ‌ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యురిటీ గార్డులు గస్తీ కాస్తున్నారు. 65 వేల మంది తెలంగాణ పోలీసు, 18 వేల మంది హోంగార్డులు విధుల్లో ఉంటారు.

(ఆధారం: ఏడీఆర్ రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)