తెలంగాణ: రికార్డు మెజార్టీతో సీట్లు నెగ్గిన కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటి వాటి ప్రాభవం ఎలా తగ్గుతూ వస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1952వ సంవత్సరం ఏప్రిల్. స్వాతంత్య్రం వచ్చాక, భారతదేశానికి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి, తొలి లోక్‌సభ ఏర్పడింది. పార్లమెంటు భవనం పాతదే. కానీ, అందులో కొలువుదీరబోతున్న లోక్‌సభ మొట్టమొదటిది.
భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి ఆ సభలోకి మొట్టమొదటగా ఎవరు కాలు పెట్టాలి? సాధారణంగా అయితే ప్రధానమంత్రి. కానీ, అప్పటి ప్రధాని నెహ్రూ ముందుగా ఆ సభలోకి వెళ్లలేదు.
తెలుగువాడు, తెలంగాణ వాడు అయిన అప్పటి నల్లగొండ ఎంపీ రావి నారాయణ రెడ్డిని ఆ అరుదైన అవకాశం వరించింది.
ఆ ఎన్నికల్లో దేశంలో అందరు ఎంపీల కంటే ఎక్కువ మెజార్టీ, అక్షరాలా 3 లక్షల 9 వేల ఓట్ల మెజార్టీతో నల్లగొండ ఎంపీగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణ రెడ్డి లాంఛనంగా మొదటి లోక్‌సభను ప్రారంభించారు.
నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ సాధించిన వ్యక్తిగా ఆయన ఘనతను ఇప్పటికీ కమ్యూనిస్టులు నెమరు వేసుకుంటారు.
ఆ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలను అప్పటి కమ్యూనిస్టు పార్టీ గెలుచుకుంది. చిత్రం ఏంటంటే, ఆ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ప్రచారం కూడా చేయలేదు. అప్పుడు ఆయన జైల్లో ఉన్నారు.
జైల్లో ఉండి దేశంలోనే రికార్డు మెజార్టీ సాధించారు. దానికితోడు అప్పటికి సీపీఐ పార్టీ మీద తెలంగాణలో నిషేధం ఉంది.
దీంతో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశారు. నాయకుడు బయట లేడు.. పార్టీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయినా కనీవినీ ఎరుగని మెజార్టీ వచ్చింది.
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఘనమైన గతానికి సాక్ష్యం ఈ ఎన్నిక.

ఫొటో సోర్స్, EPARLIB.NIC.IN
కట్ చేస్తే, 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
తెలంగాణ శాసన సభలో మొట్టమొదటిసారిగా ఒక్కరంటే ఒక్క కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా లేని ఎన్నికగా అది రికార్డు సృష్టించింది.
ఒక దశలో తెలంగాణను కమ్యూనిస్టు రాజ్యం చేయగలమనే నమ్మకం, చేయాలన్న పట్టుదలతో ఉన్న కమ్యూనిస్టు పార్టీ, చివరకు మాకు రెండు సీట్లిచ్చినా చాలు అంటూ ఇతర పార్టీల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చేసింది.
ఫలానా ఆయన ముఖం టీవీలో చూస్తే చాలు వాళ్ల పేరు, హోదా తెలియని వారు కూడా ‘‘ఆయన ఎర్ర జెండా పార్టీ నేత కదా’’ అని గుర్తు పట్టేంతగా కమ్యూనిస్టు పార్టీలతో పెనవేసుకున్న నేతలు కూడా కండువాలు మార్చేశారు.
తెలంగాణలో మిగిలిన చోట్ల పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి మంచి పట్టు ఉండేది. ఇతర జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, ఈ రెండు జిల్లాల్లో మాత్రం క్లీన్ స్వీప్ పరిస్థితులు ఉండేవి.
ఈ ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటం వల్ల కమ్యూనిస్టులకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ఆ తరువాత ఆ పార్టీల బలం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముందు నల్లగొండ జిల్లా ఆ తరువాత ఖమ్మం జిల్లాలో అవి పూర్తిగా బలహీనపడ్డాయి.

ఫొటో సోర్స్, FB/LOKSABHA1
50లలో అంత క్రేజ్ ఎందుకు వచ్చింది?
సిద్ధాంత పరంగా కమ్యూనిస్టు పార్టీలో ఎన్ని చీలికలు ఉన్నప్పటికీ, ఏదో ఒక ఎర్ర జెండా పార్టీని ఆదరించే వారి సంఖ్య ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండేది. అందుకు ప్రధాన కారణం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.
ఆ ఒక్క పోరాటం తెలంగాణ సామాన్య జనాల్లో కమ్యూనిస్టులను హీరోలుగా నిలిపింది.
‘‘రైతాంగ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమి పంచి, మూడు వేల గ్రామాలను విముక్తి చేశాం. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర లక్షకు పైగా ఎకరాల భూమి ఉంటే, దాన్ని వేలాది పేదలకు పంచాం. ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వంలో లేకుండా ఇంత భూమిని పంచిన ఘనత మరెవ్వరికీ లేదు.’’ అంటూ సాయుధ పోరాటం తమకు ఎలాంటి పునాది వేసిందో వివరించారు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు పోతినేని సుదర్శన రావు.

కానీ అదంతా గత వైభవం. నేడు సీపీఐగానీ, సీపీఎంగానీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటునైనా గెలుచుకునే స్థితిలో లేవన్నది ఇప్పుడు వినిపించే మాట.
‘‘1991 తరువాత ఎన్నికల తీరులో మార్పు వచ్చింది. ఓటు కొనడం మొదలైంది. చంద్రబాబు మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్‌లు దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. వాళ్ల మాదిరిగా డబ్బున్న కార్పొరేట్ వాళ్లకు మేం టికెట్లు ఇచ్చి జనాల్ని మోసం చేయలేం. ప్రజా సమస్యలు పక్కకు పోయి, డబ్బు, కులం, మతం చుట్టూ ఎన్నికలు తిరుగుతున్నాయి. దీనివల్ల మేం ఎన్నికల రూపంలో దెబ్బతిన్నాం’’ అని అన్నారు సుదర్శన రావు.
ఒకనాడు కమ్యూనిస్టు పార్టీ ఒకటిగానే ఉండేది. 1964లో రెండుగా చీలిపోయింది. అది కూడా దెబ్బే అంటారు సీపీఐ నాయకులు.
‘‘64 చీలిక మాకు పెద్ద అవరోధం. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ వైపు ఎక్కువ మంది వెళ్లారు. కానీ తెలంగాణలో మాత్రం సమానంగా చీలింది. దీంతో రెండు సమ ఉజ్జీలుగా మారాయి’’ అన్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ నాయకుడు బి. ప్రసాద్.

పునాదులు బలమే కానీ, ప్రస్థానంలో పలుచబడిన పార్టీలు
కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానం చూసినప్పుడు 50ల నుంచి 90ల వరకు ఒకలా.. ఆ తర్వాత ఒకలా కనిపిస్తుంది. 90ల వరకు ఏదో రూపంలో బలాన్ని కాపాడుకున్న పార్టీలు ఆ తరువాత క్రమంగా బలహీన పడడం కనిపిస్తుంది.
‘‘రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగింది. సమాజానికి కలిగే లాభాన్ని చూడకుండా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించడం పెరిగింది. ఎన్నికల రాజకీయాల్లో రూలింగ్ పార్టీలతో కమ్యూనిస్టులు పోటీపడలేకపోయారు. వాళ్లకు కార్పొరేట్ విరాళాలు తక్కువ. పెద్ద పార్టీలతో పోటీ పడేంత డబ్బు లేదు. ఇక ఆ పార్టీల నాయకులు కూడా రాజీపడిపోవడం మరొకకారణం. వాళ్లూ వ్యాపారాలు చేస్తున్నారు. పోరాటాలు, జనాన్ని సమీకరించడం వంటివి తగ్గిపోయాయి. అలాగే పార్టీల నాయకత్వం కూడా పోరాటాల నుంచి కాకుండా కుల సమీకరణల నుంచి వస్తోంది. దాంతో మిగతా వారికీ వీళ్లకీ తేడా లేదు అన్న చర్చ వచ్చింది. ’’ అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

యువత, పార్టీలోని వారి పిల్లలు కొత్తగా ఎందుకు రావడం లేదు?
ఒకనాడు కమ్యూనిస్టు పార్టీల్లో కనిపించే ఒక లక్షణం యువత కొత్తగా ఆ పార్టీలో నిరంతరం చేరుతూ కనిపించేవారు. దాంతో పాటూ అప్పటికే పార్టీలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా అదే పార్టీలో చేరేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపు మారిపోయింది. అటు యువత, ఇటు పార్టీలో చేస్తోన్న వారి పిల్లలు కూడా కమ్యూనిస్టు సభ్యత్వం జోలికి వెళ్లడం లేదు.
బీబీసీ మాట్లాడిన ఇద్దరు కమ్యూనిస్టు నాయకుల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టు సిద్ధాంతం మీద ఆసక్తితో ఈ పార్టీలో చేరిన వ్యక్తి కాగా, మరొకరు నాలుగు తరాలుగా కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్న కుటుంబానికి చెందిన వారు.
యువత ఇప్పుడు తమ వైపు రావడం లేదన్న విషయాన్ని ఇద్దరూ అంగీకరించారు.
‘‘మా కుటుంబం నాలుగు తరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది. నేను పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నాను. మాది 200 ఎకరాల భూస్వామ్య కుటుంబం. ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నాం. మా అమ్మ, నానమ్మ, అత్త, నాన్న, తాత అంతా పార్టీకోసం అవమానాలు భరించారు, జైలుకు వెళ్లారు, కూలీలుగా బతికారు. బంధుత్వాలు, కుటుంబ బంధాలు తెంచుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త తరం పార్టీ కంటే బతుకుదెరువు ముఖ్యం అనుకుంటోంది. నీతిగా రాజకీయాలు చేయడం వల్ల లాభం లేదనే భావన యువతలో పెరిగిపోయింది. ’’ అంటూ సీపీఐ నాయకుడు ప్రసాద్ వివరించారు.
‘‘మా పిల్లలనే కాదు, మొత్తంగా యువతే రాజకీయాల్లోకి రావడం తగ్గింది. నేను పదవులే కావాలనుకుంటే ఈ పార్టీలో ఉండను కదా. కాంగ్రెస్ కుటుంబంలో పుట్టినా ఒక విప్లవ ఆశయం కోసం ఇటు వచ్చాం. నాతో పనిచేసిన వారు బయటి పార్టీలకు వెళ్లి ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వారు కూడా ఉన్నారు. నేను కాలేజీ దశలో ఈ ఉద్యమం పట్ల ఆకర్షితుడినై వచ్చాను. అప్పట్లో కాలేజీల్లో చర్చలు జరిగేవి, అభిప్రాయాలు పంచుకునేవారు. పోరాటం గురించిన చర్చ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే వందల కోట్లు ఉంటేనే రావాలి అన్నట్టు పరిస్థితి తయారైంది. నిజాయితీకి రాజకీయాల్లో స్థానం లేదన్న అభిప్రాయంతో యువత దూరమవుతున్నారు’’ అన్నారు సుదర్శన రావు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు ఏంటి?
తెలంగాణ ఏర్పడ్డ తరువాత సీపీఎం పార్టీ తరపున ఆ పార్టీ ప్రస్తుత కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాద పార్టీ ముద్ర నుంచి తప్పించి, మళ్లీ ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం చేసే దిశగా ఈ పాదయాత్ర ఉపయోగపడిందని ఆ పార్టీ చెబుతోంది. కానీ ఎన్నికల రాజకీయాల్లో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు.
ఓటర్లు ఎలా ఆలోచిస్తున్నప్పటికీ, కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేస్తోన్నవారు, వారి సానుభూతిపరులు మాత్రం ఎప్పటికైనా ఈ పార్టీలకు అవకాశం వస్తుందనే అనుకుంటున్నారు.
అయితే పార్టీ సిద్ధాంతాల్లో మార్పు రావాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. 80ల నుంచి మారిన ఆర్థిక పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతిన్నప్పటికీ, మళ్లీ ఏదో రోజు పుంజుకుంటాయని హరగోపాల్ అంటున్నారు.
‘‘ప్రపంచం అంతా కమ్యూనిస్టులు దెబ్బతిన్నారు. మళ్లీ పుంజుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ మార్పు వస్తోంది. అందుకు నిదర్శనంగా గ్రీస్, బ్రెజిల్ కనిపిస్తున్నాయి. అమెరికాలో సంపద పంచుతాను అన్న శాండర్స్‌కి 6 శాతం ఓట్లు రావడం ఒక పరిణామం’’ అన్నారు హరగోపాల్.
‘‘క్రోనీ క్యాపిటలిజం మీద కష్టజీవులకు ఆగ్రహం వచ్చిన రోజు మేం ఉంటాం. యువత అసంతృప్తితో ఉన్నారు. వారు మావైపు వస్తారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నప్పుడు కచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ నిలబడుతుంది’’ అన్నారు ప్రసాద్.

ఫొటో సోర్స్, Getty Images
సీపీఐ – సీపీఎం కలసిపోతే?
కమ్యూనిస్టు పార్టీలను అభిమానించే బయటి వారు చాలా మంది చెప్పే మాట సీపీఐ, సీపీఎం కలసిపోవాలని. 1964లో సిద్ధాంతపరమైన విభేదాలతో విడిపోయిన ఈ పార్టీలు బయటి వారికి చూడటానికి ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ, ఆ సిద్ధాంతానికి సంబంధిన సూక్ష్మ అంశాలు, మార్గాల విషయంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు వారి మధ్య ఉన్నాయి.
‘‘మేం కలవాలి అన్న ఆకాంక్ష చాలా మందిలో ఉంది. నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీలు కలిశాక ప్రయోజనం కలిగింది. కానీ, ఇక్కడ మేం కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అని అనుకోవడం లేదు. అలాగే మేం విడిపోవడానికి కారణమైన మౌలిక తేడాలు ఇంకా సమసిపోలేదు. కాకపోతే ప్రజా ఉద్యమాల్లో కలసి పోరాడితే ప్రయోజనం ఉండొచ్చు’’ అన్నారు సీపీఎం నాయకుడు సుదర్శన రావు.
‘‘రెండు పార్టీల మధ్య ఐక్యత రావాలి. కష్టజీవుల కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు ఇంకా దోపిడి పెరిగింది. సమైక్యంగా ఉంటే బావుంటుంది. మేం అందుకోసం ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు సీపీఐ నాయకుడు ప్రసాద్.

సైద్ధాంతిక చర్చ
కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతంపై, దాని అమలుపై, దాని ప్రస్థానంపై భారతదేశంలో ఎన్నో చర్చోపచర్చలు జరిగాయి. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం.
‘‘దేశంలో క్రోనీ క్యాపిటలిజం పెరిగింది. రైట్ వింగ్ పెరిగింది. రకరకాల సెంటిమెంట్లు, అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి. దీంతో విశాల కమ్యూనిస్టు భావజాలం, విశాల ప్రపంచ భావజాలం, చరిత్ర పట్ల అవగాహన ఇవన్నీ ప్రస్తుత పరిస్థితికి పనికిరాకుండా పోయాయి. దానికితోడు కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంత పరంగా రాజీపడ్డాయి.

బెంగాల్లో సీపీఎం ప్రభుత్వం టాటాలను ఆహ్వానించి ఫ్యాక్టరీ పెట్టమని అడిగింది. ఇక అప్పుడు మామూలు పార్టీలకూ వీరికి తేడా ఏముంది అనే ప్రశ్న వచ్చింది. ఆ పార్టీలు నిలువునా కూలిపోయాయి. ఇక విప్లవోద్యమాలు వచ్చి మేమే నిజమైన కమ్యూనిస్టులమంటూ వీరికి మరో చాలెంజ్ విసిరాయి.
ఆదివాసీ, దళిత అస్తిత్వ ఉద్యమాలు, క్యాస్ట్ – క్లాస్ వార్, ఇలా చాలా కోణాల నుంచి కమ్యూనిస్టు పార్టీ దెబ్బతింది. ఆఖరికి పొత్తుల సమయంలో ఎన్ని సీట్లు ఇస్తారు అని అడుగుతున్నారు తప్ప, పొత్తు పెట్టుకోవాలంటే ప్రభుత్వం వచ్చాక ఈ పనులు చేయాలి.. భూములు పంచాలి.. లేదా విద్యా రంగంలో ఫలానా మార్పులు తేవాలి అని షరతులు పెట్టడం లేదు. ఇలా షరతులు పెట్టకుండా సీట్లు అడగడం వారి గౌరవాన్ని పెంచడం లేదు’’ అన్నారు హరగోపాల్.
‘‘భారతదేశంలో అసలు కమ్యూనిస్టు ఆవిర్భావమే ఇక్కడ ఉద్యమాలు, లేదా స్వతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో కాకుండా, సోవియట్ విప్లవ స్ఫూర్తితో వచ్చింది. అలా జరగాల్సింది కాదు. కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో భారతదేశంలో ఆవిర్భవించాల్సింది. తెలంగాణ సాయుధ పోరాటం దానికి మినహాయింపు.
దానికితోడు కమ్యూనిస్టు పార్టీల చీలిక కూడా భారతదేశానికి సంబంధించిన కారణాలతో కాకుండా, అంతర్జాతీయ విభజనతో అంటే 1964లో సోవియట్, చైనా మధ్య తగాదాతో ఇక్కడ చీలిక వచ్చింది. భారతీయ పరిస్థితుల వల్ల కాదు’’ అంటూ తన అభిప్రాయం చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్.

ఫొటో సోర్స్, CPI
పొత్తులు
ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తుల కోసం చర్చలు జరిపి, అవి విఫలం కావడంతో చివరకు సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్‌తో సీపీఐ, సీపీఎం కలసి పనిచేశాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కి మద్దతిచ్చాయి. కానీ, ఇండియా కూటమి ఏర్పాటు తరువాత ఆ పార్టీలు కాంగ్రెస్ వైపు మళ్లాయి.
‘‘బీజేపీని ఓడించడం అనేది ఇప్పుడు లక్ష్యం. ఎన్డీయే రాకూడదనే మునుగోడులో బీఆర్ఎస్‌కి మద్దతిచ్చాం. కొంత కాలం పొత్తుల విషయంలో ఈ పద్ధతి తప్పదు. ఇప్పుడు బీఆర్ఎస్ అటు వైపు చూస్తుందనే అనుమానంతో దూరమై కాంగ్రెస్‌తో ప్రయాణానికి ప్రయత్నం చేశాం’’ అన్నారు సీపీఐ నాయకుడు ప్రసాద్.
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














