ఉత్తరకాశీ సొరంగం: కార్మికులను కాపాడడంలో ‘ర్యాట్ హోల్ మైనర్స్’దే కీలకపాత్ర... ఇంతకు వాళ్ళు ఏం చేశారు?

- రచయిత, సల్మాన్ రవి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు మొదట్లో చేసిన రకరకాల ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి, దిల్లీ నుంచి వెళ్ళిన 'ర్యాట్ హోల్ మైనర్స్' ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేసి హీరోలుగా మారారు.
కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి దగ్గరలో కొన్ని మీటర్ల దూరం వరకూ ఉన్న శిథిలాలను ఈ ర్యాట్ హోల్ మైనర్లే తవ్వుకుంటూ ముందుకు వెళ్ళారు.
12 మందితో కూడిన ఈ మైనర్ల బృందం సొరంగంలో కార్మికులున్న దగ్గరికి చేరుకునేందుకు వారు ఉలి, సుత్తి పట్టుకుని తవ్వుకుంటూ రక్షణ కార్యక్రమంలో చివరి అడుగు వేశారు.
ఇంతకీ, ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏమిటి? సొరంగంలోని కార్మికులను వీరెలా కాపాడారు?
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్‌హోల్ మైనింగ్‌పై 2014లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) నిషేధం విధించింది.
పర్యావరణ సమస్యలతో పాటు కార్మికుల ప్రాణాల రక్షణ దృష్టితో నిషేధం విధిస్తున్నట్లు ట్రైబ్యునల్ చెప్పింది.

ఫొటో సోర్స్, REUTERS
ర్యాట్ హోల్ మైనింగ్ ప్రమాదకరం...
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని ‘తూర్పు జైంథియా హిల్స్’లోని క్సాన్ ప్రాంతంలో బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికితీసేందుకు ఈ విధానాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో అనుకోని ప్రమాదం కార్మికుల ప్రాణాలను బలిగొంది.
క్సాన్ బొగ్గు గనిలో 2018 డిసెంబర్ 13న మొత్తం 20 మంది కార్మికులు 370 అడుగుల లోతుకు వెళ్లి.. అక్కడి నుంచి నేలకు సమాంతరంగా సన్నని సొరంగ మార్గాల్లో తవ్వకాలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు.
అంతలోనే.. సమీపంలోని లైతే నది నుంచి నీరు ఒక్కసారిగా గనిలోకి రావడం మొదలైంది. అంతే, కార్మికులంతా బయటపడే ప్రయత్నం చేశారు. కానీ, అయిదుగురు మాత్రమే ప్రాణాలతో బయటకు రాగలిగారు. మిగతావారంతా గనిలోనే చిక్కకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
జార్ఖాండ్‌లోని రాణిగంజ్,ధన్‌బాద్, హజారిబాగ్, దుంకా, అసన్‌సోల్‌లో మూతపడిన బొగ్గు గనుల నుంచి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ ద్వారానే అక్రమంగా బొగ్గును వెలికితీసేవారు.
ఈ ప్రాంతాల్లో ఎన్నో అతిపెద్ద ప్రమాదాలు జరిగాయి. అక్రమ మైనింగ్ వెలికితీత వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
సిల్క్యారాలో ‘ర్యాట్ హోల్ మైనింగ్’ కోసం వచ్చిన నిపుణుల బృందానికి అదిల్ హసన్ నేతృత్వం వహించారు. ఈ బృందం దిల్లీలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది.
మాన్యువల్‌గా సొరంగంలోకి వెళ్లేందుకు వీరు ప్రయత్నించారని తెలిపారు.
ఉలి, సుత్తి సాయంతో వారు రాళ్లను తొలిచారు. ఒక తాడుకు కట్టిన బాస్కెట్ ద్వారా శిథిలాలను వారు మోశారు.
మేఘాలయ, జార్ఖండ్‌లలో మూతపడిన గనుల్లో అక్రమ మైనింగ్ కూడా ఇలానే చేసేవారు.

ఫొటో సోర్స్, REUTERS
ఈ మైనింగ్ ఎంత కష్టం?
‘ర్యాట్ హోల్ మైనింగ్’ చట్టవిరుద్ధం అయినప్పటికీ, మిషన్లు చేరుకోలేని పర్వత ప్రాంతాల్లో రాళ్లను తొలగించుకుంటూ ముందుకెళ్లే అనుభవం ఈ పనులు చేసే వారికి ఉంటుందని మేఘాలయ షిల్లాంగ్‌లోని ‘నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ’లో పనిచేసే ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త దేవేష్ వాలియా చెప్పారు.
‘‘వీరికి పర్వతాల గురించి తెలుసు. ఈ ప్రాంతాల్లో ఉండే రాళ్ల అమరిక గురించి అవగాహన ఉంటుంది. వాటి లోపలికి ఎలా చొచ్చుకుపోవాలో వారికి తెలుసు. ఈ పనిని అధునాతన మెషిన్లతో చేయరు. ఎందుకంటే వారికంటూ కొన్ని పరిమితులుంటాయి. ఆగర్ మిషన్ కూడా ఇక్కడ పనిచేయలేదు. ఎందుకంటే, ఆ టెక్నాలజీతో పర్వతాల్లోకి చొచ్చుకుపోలేం’’ అని ఆయన తెలిపారు.
ర్యాట్ హోల్ మైనింగ్ చేసే వారు తొలుత ఆ శిలల ఆకృతిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా శిలలను తొలచాలి.

ఫొటో సోర్స్, REUTERS
ఎన్‌జీటీ ఎందుకు నిషేధించింది?
ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు నిషేధించారని ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి.
ర్యాట్ హోల్ మైనింగ్ పదాన్ని తొలుత బ్రిటన్ వాడినట్లు ధన్‌బాద్‌కు చెందిన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్’ ప్రొఫెసర్ సతీష్ సిన్హా తెలిపారు.
ఆ దేశంలో మైనింగ్ మొదలైన తొలి నాళ్లలో అంటే 1920 కాలం నుంచే ఈ పనులు ప్రారంభించారని అన్నారు.
అప్పట్లో ఇదే విధానంలో బొగ్గు గనుల నుంచి బొగ్గును బయటికి వెలికితీసేవారు. ఉపరితలంలో ర్యాట్స్ అతిపెద్ద రంధ్రాలు చేస్తారు.
‘‘అప్పట్లో మైనింగ్‌లో ఎలాంటి మిషన్లను, పేలుళ్లను వాడే వారు కాదు. భూఉపరితలంలో ఉన్న బొగ్గును చేరుకునేందుకు ఉలి, సుత్తి, రాడ్ల సాయంతో బొగ్గు గనులను తవ్వేవారు. ఆ సమయంలో టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. అందుకే దీనికి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అనే పేరు వచ్చింది’’ అని ప్రొఫెసర్ సిన్హా బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో దాదాపు లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్న అఫిడవిట్ ఆమెదే...
- చైనా చిన్నారుల్లో పెరుగుతున్న న్యుమోనియా కేసులు, ప్రపంచం ఎందుకు కలవరపడుతోంది, భారత్ పరిస్థితేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
- ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం వల్ల భారత్‌కు ఇరాన్ అవసరం పెరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














