ఉత్తరకాశీ: 'రెండో కొడుకు కూడా పోతే బతకలేను'.. సొరంగంలో చిక్కుకుపోయిన కుమారుడి కోసం తండ్రి వేదన

ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం
ఫొటో క్యాప్షన్, సొరంగంలో చిక్కుకుపోయిన తన కొడుకు మ‌న్‌జిత్ కోసం చౌదరి ఘటనా స్థలం వద్దకు వచ్చారు.
    • రచయిత, సమీరా హుస్సేన్
    • హోదా, ఉత్తర కాశీ నుంచి బీబీసీ ప్రతినిధి

ఉత్తరాఖండ్‌లో సిల్‌క్యారా సొరంగం కూలి, అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల్లో తన కొడుకు మ‌న్‌జిత్ కూడా ఉన్నాడని తెలియడంతో చౌదరి దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి ప్రమాదం జరిగిన స్థలం వద్దకు చేరుకున్నారు.

ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి నుంచి వచ్చారు.

యాభై ఏళ్ల చౌదరి 11 రోజులుగా ప్రమాదం జరిగిన సొరంగం దగ్గరే ఉంటున్నారు. తన కొడుకు మ‌న్‌జిత్‌తో పరిచయమున్న వ్యక్తులతో కలిసి ఉంటూ, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బ్యారక్స్‌లోనే నిద్రిస్తున్నారు.

రెండేళ్ల కిందట ముంబయిలో నిర్మాణ పనుల్లో జరిగిన ఒక ప్రమాదంలో తన పెద్ద కొడుకును కోల్పోయారు చౌదరి. మరో కొడుకు కూడా దూరమైపోతే తట్టుకునే శక్తి తనకు లేదని ఆయన వాపోతున్నారు.

''నేను దేవుడిని కోరుకుంటున్నా.. దయచేసి ఈ కొడుకును నా నుంచి దూరం చేయొద్దని! నా కొడుకు క్షేమంగా బయటికి రావాలన్నదే నా కోరిక. అందుకోసమే ప్రార్థిస్తున్నా. ఇదే నా చివరి కోరిక'' అన్నారాయన.

రెండు వారాల కిందట ఉత్తరకాశీలో హిమాలయాల అంచున ఉండే మారుమూల గ్రామమైన సిల్‌క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం ఒక కొండచరియ విరిగిపడటం వల్ల కూలిపోయింది. అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. డ్రిల్లింగ్ మెషీన్ చెడిపోవడంతో సహాయ చర్యలు ఆలస్యం అవుతున్నాయి.

సొరంగంలో చిక్కుకుపోయిన తమ వారి కోసం ఇక్కడకు వచ్చిన వారిలో చౌదరి ఒకరు.

చంచల్
ఫొటో క్యాప్షన్, లోపల చిక్కుకుపోయి రెండు వారాలైనా తన సోదరుడు పుష్కర్ ధైర్యంగా ఉన్నాడని చంచల్ తెలిపారు

సమీపంలోని మరో గ్రామం నుంచి వచ్చారు చంచల్ సింగ్ బిస్త్. కూలిపోయిన సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో ఆయన సోదరుడు, 24 ఏళ్ల పుష్కర్ సింగ్ కూడా ఉన్నారు.

మొదట అక్కడికి వచ్చినప్పుడు చంచల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే, వాకీటాకీ ద్వారా తన సోదరుడు పుష్కర్‌తో మాట్లాడిన తర్వాత కాస్త కుదుటపడ్డారు.

''నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఇంటికి వెళ్లు. నేను వచ్చేస్తా. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నా. అవసరమైనవన్నీ అందుబాటులో ఉన్నాయని నాతో చెప్పాడు'' అని చంచల్ అన్నారు.

సొరంగం లోపల ఉన్న తమ వారితో మాట్లాడే అవకాశం రావడంతో కొందరు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సొరంగం లోపల చిక్కుకున్న తన భర్తతో మాట్లాడి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్న ఒక మహిళను బీబీసీ పలకరించింది.

''ఆయన ఆందోళన చెందుతున్నారు'' అని ఆమె అన్నారు.

''ఇక్కడ ఇంకా ఎన్నిరోజులు ఉండాలి. బయటకు తీసుకురావడానికి ఏమైనా పని జరుగుతోందా అని అడిగారు. ఈ రోజు కూడా ఆయన ఏమీ తినలేదు'' అని ఆమె చెప్పారు.

ఒక చిన్న పైపు ద్వారా లోపల చిక్కుకున్న వారికి పప్పు, రోటీలు, కూరలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు పంపిస్తున్నారు. వారు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

నవంబర్ 12న ప్రమాదం జరిగినప్పుడు అధికారులపై నమ్మకం కలగలేదని, వాళ్లేం చేస్తున్నారో వాళ్లకే తెలియదని అనుకున్నానని చంచల్ అన్నారు.

కానీ, ఈ వారం రోజుల్లో పనుల్లో పురోగతి చూసిన తర్వాత అందరూ క్షేమంగా బయటికి వస్తారని ఆయన ఆశిస్తున్నారు.

''మొదట్లో అధికారుల ప్రణాళికలు అంత సవ్యంగా లేవని అనుకుంటున్నా. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బయటికి వచ్చేస్తారు'' అని ఆయన అన్నారు.

శనివారం సహాయ చర్యలకు ఎదురుదెబ్బ తగలక ముందు ఆయన ఈ మాట అన్నారు.

ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం

సొరంగంలో శిథిలాలను తొలిచి, కార్మికులు బయటకు వచ్చేంత పరిమాణంలో రంధ్రం చేసేందుకు తెచ్చిన యంత్రం పూర్తిగా పాడైపోయింది. దానికి మరమ్మతులు చేసే అవకాశం కూడా లేదు.

అత్యవసర సిబ్బంది సొరంగంలో నుంచి ఆ యంత్రాన్ని బయటకు తీసుకొచ్చే వరకూ సహాయ చర్యలు నిలిచిపోయినట్లే. ఆ తర్వాత మరో యంత్రాన్ని తెప్పించడానికి బదులు మనుషులతోనే (మాన్యువల్‌గానే) మిగిలిన శిథిలాల తొలగింపు పనులు చేపట్టనున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ సజావుగా పూర్తవుతుందని భావించిన అధికారులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. వారు ముందస్తు చర్యల్లో భాగంగా సొరంగం ప్రవేశ ద్వారం వద్ద నాలుగు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అలాగే, పదుల సంఖ్యలో కార్మికులను పెట్టి సొరంగం వద్ద ఇరుకుగా ఉన్న రోడ్డును కూడా బాగు చేయించారు.

యంత్రానికి బదులు మాన్యువల్‌గా శిథిలాలను తొలగించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కార్మికులను ఎప్పటిలోగా బయటకు తీసుకొస్తారంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని మీడియా అడిగింది. అందుకు ఆయన సమాధానమిస్తూ -ప్రభుత్వ దృష్టంతా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంపైనే ఉందన్నారు.

లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు సమాలోచనలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో చంచల్, చౌదరి సహా ఇతర కార్మికుల కుటుంబ సభ్యులకు వేచిచూడడం మినహా దారి లేదు. అయితే, బయటికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.

''మా సోదరుడిని (పుష్కర్‌ను) ఇంటికి తీసుకెళ్లిన తర్వాత దీపావళి పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే, దీపావళికి అతను సొరంగంలో ఉన్నాడు. కాబట్టి పండుగ మళ్లీ చేసుకుంటాం'' అన్నారు చంచల్.

తన కొడుకు మ‌న్‌జిత్‌ను ఆనందంగా తన చేతుల్లోకి తీసుకుని చూసుకుంటానని చౌదరి అన్నారు.

''గట్టిగా కౌగిలించుకుంటా. దేవుడు మా మొర విన్నాడని అనుకుంటా. ఇది మా వాడు బయటికి వస్తేనే. నాకు సంతోషమే. అందరికీ సంతోషమే. మా వాడు ఇంటికి తిరిగి రావాలి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)