ఉత్తర కాశీ: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులేంటి?

ఫొటో సోర్స్, ASIF ALI
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే వీరిని బయటికి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టి శుక్రవారానికి పదమూడు రోజులవుతుంది.
12వ రోజు సహాయక చర్యల్లోనే కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలనుకున్నారు అధికారులు. కానీ, సహాయక చర్యలు అడ్డంకులు ఏర్పడటంతో, ఈ పనులు నెమ్మదించాయి.
నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సొరంగం కూలడంతో, పనుల్లో ఉన్న 41 మంది కార్మికులు దాని లోపలే చిక్కుకుపోయాయి. అప్పటి నుంచి వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కార్మికులను కాపాడేందుకు కొత్త పైప్ వేయాల్సి ఉందని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ సాంకేతిక, రోడ్లు, రవాణా అదనపు కార్యదర్శి మహమ్మూద్ అహ్మద్ తెలిపారు.
‘‘ప్రస్తుతం మేం సొరంగంలో మరో 5.4 మీటర్ల లోపలికి చేరుకున్నాం. వచ్చే 5 మీటర్లను చేరుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘డ్రిల్లింగ్ మెషిన్‌ను మళ్లీ అమర్చాం. వెల్డింగ్ చేసిన తర్వాత, కొత్త పైప్‌ను కలుపుతాం. దీనికి రెండు గంటలు పడుతుంది. రెండు గంటల తర్వాత, సొరంగంలోకి పైప్‌ను లోపలికి నెడతాం’’ అని తెలిపారు.
సహాయక చర్యల్లో మున్ముందు ఎలాంటి అడ్డంకులు రావని తాము ఆశిస్తున్నామన్నారు.
‘‘మరో రెండు పైప్‌లను వేయాల్సి ఉంది. ఏ సమయంలోనైనా అడ్డంకులను ఎదురవుతాయని మేం గుర్తించాం. కానీ, మేం ఆశను వదిలేయాలనుకోవడం లేదు’’ అని చెప్పారు.
గురువారం పూర్తవుతుందని అనుకున్నాం, కానీ..
గురువారమే కార్మికులను బయటికి తీసుకొస్తామని ఆశించాం, కానీ అనుకోకుండా తలెత్తిన సమస్యలతో అలా జరగలేదని మహమ్మూద్ అహ్మద్ శుక్రవారం మీడియాతో చెప్పారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నప్పుడు, శిథిలాలలో మెటల్ పైప్ బయటికి వచ్చిందన్నారు. దీని వల్ల సహాయక చర్యలు చేపట్టడం కుదరలేదని చెప్పారు.
‘‘1.8 మీటర్లు పైకి వెళ్లిన తర్వాత, సొరంగ పైభాగంలో ఒక పైప్‌ను గుర్తించాం. అది మాకు అడ్డంకిగా మారింది. దీని వల్ల ఆగర్ మెషిన్‌ను మళ్లీ తీసుకొచ్చి, పనులు చేపట్టాల్సి వచ్చింది’’ అని మహమ్మూద్ అహ్మద్ తెలిపారు.
సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నప్పుడు పైప్ పాడవడంతో ఈ పనులు కాస్త నెమ్మదించాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి నీరజ్ ఖైర్వాల్ తెలిపారు.
‘‘గురువారం సొరంగం లోపల 1.8 మీటర్ల పైప్‌ను చొప్పించాం. కానీ, స్పేస్ లేకపోవడంతో పైప్ మరింత ముందుకు వెళ్లలేకపోయింది. పైప్‌లో 1.2 మీటర్ల భాగాన్ని కత్తిరించాల్సి వచ్చింది. ఆగర్ మెషిన్ బాగానే పనిచేస్తుంది. అది పాడుకాలేదు’’ అని ఖైర్వాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
వచ్చే ఐదు మీటర్లలో అడ్డంకులు తక్కువే...
‘‘జీపీఆర్(గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) టెక్నాలజీ నిపుణులను సహాయక పనుల వద్దకు పిలిపించాం. పైప్‌లోకి వాళ్లు వెళ్లారు. లోపల పరిస్థితి అర్థం చేసుకున్నారు. వచ్చే 5.4 మీటర్లలో ఎలాంటి మెటల్ పరికరాలు వారు గుర్తించారు’’ అని నీరజ్ ఖైర్వాల్ తెలిపారు.
సొరంగం లోపలున్న కార్మికులతో డాక్టర్లు, సైకియాట్రిస్ట్‌లు మాట్లాడుతున్నారు. గురువారం రాత్రంగా పనులు కొనసాగాయి. త్వరలోనే కార్మికులను బయటికి తీసుకొచ్చే పనుల్లో విజయం సాధిస్తామని ఆశిస్తున్నామన్నారు.
కానీ, జీపీఆర్ రిపోర్టుపై తాము ఆధారపడాల్సి ఉందని చెప్పారు.
తర్వాత 5 మీటర్లలో ఎలాంటి అడ్డంకులు లేవని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యులు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ సమాచారమిచ్చారు.
సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఎంత దూరం వెళ్లారు?
సొరంగంలో తాము పైప్ ద్వారా 48 మీటర్ల వరకు చేరుకున్నామని.. కానీ, పైప్ వంగిపోవడంతో, 1.2 మీటర్లను కత్తిరించినట్లు సయ్యద్ అటా తెలిపారు. దీంతో ప్రస్తుతం తాము సొరంగంలో 46.8 మీటర్ల వద్దనే ఉన్నామని చెప్పారు.
‘‘మరో రెండు పైప్‌లను చొప్పించడంతో సొరంగంలో ఉన్న కార్మికుల వద్దకు చేరుకోగలుగుతామని ఆశిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే మరిన్ని పైప్‌లు కూడా మా వద్ద ఉన్నాయి’’ అని తెలిపారు.
సొరంగం వెలుపల ఇప్పటికే వైద్యుల బృందం, అంబులెన్స్‌లు వేచిచూస్తున్నాయి.
మంగళవారం విడుదల చేసిన తొలి వీడియోలో సొరంగం లోపల కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.
వారికి కావాల్సిన ఆహారంతో పాటు లైఫ్ సపోర్ట్ పైప్ ద్వారా కెమెరాను కూడా లోపలికి పంపించారు. దీని ద్వారా కార్మికుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, ASIF ALI
తుది దశలో సహాయక చర్యలు
సహాయక చర్యలు తుది దశలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు.
ఎంత వీలైతే అంత త్వరగా కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొస్తామని ధామీ భరోసా ఇచ్చారు.
‘‘కార్మికుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడూ పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి’’ అని సీఎం ధామీ చెప్పారు.

ఫొటో సోర్స్, ASIF ALI
కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?
సొరంగం లోపల విరుక్కుపోయిన 41 మంది కార్మికులలో బిహార్ బంకా జిల్లాకు చెందిన వీరేంద్ర కిస్కు కూడా ఒకరు.
ప్రమాదం జరిగిన తర్వాత వీరేంద్ర సోదరుడు దేవేంద్ర కిస్కు ఉత్తర కాశీ వచ్చారు. వీరేంద్ర భార్య కూడా సోదరుడితో పాటు వచ్చారు.
ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలో వారు ఉంటున్నారు. కమ్యూనికేషన్ పైప్ ద్వారా వీరేంద్రతో మాట్లాడేందుకు వారు సొరంగం లోపలికి వెళ్తూ వస్తున్నారు.

ఫొటో సోర్స్, ASIF ALI
‘‘అంత దూరం నుంచి మేం వచ్చినట్లు తెలుసుకుని వీరేంద్ర చాలా బాధపడ్డాడు. కానీ, మేం అతని గురించి ఆందోళన చెందుతున్నాం. బయట ఏం జరుగుతుందని వీరేంద్ర మమ్మల్ని అడిగాడు. అతన్ని మేం ఓదార్చాం. త్వరలోనే సహాయక చర్యలు పూర్తయి, మీరందరూ బయటికి వస్తారని చెప్పాం’’ అని దేవేంద్ర తెలిపారు.
వీలైనంత వేగంగా కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు, సిబ్బంది బాగా కష్టపడుతున్నారని అన్నారు.
వీరేంద్ర సురక్షితంగా బయటికి వచ్చాక, మళ్లీ ఆయన్ను ఈ పనులకు పంపించాలనుకోవడం లేదని భార్య రజనీ చెప్పారు.

ఫొటో సోర్స్, ASIF ALI
బిహార్ నుంచి వచ్చిన 33 ఏళ్ల సబా అహ్మద్ సిల్క్యారాలో సీనియర్ ఫోర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఈయన కూడా సొరంగంలో చిక్కుకుపోయారు.
ఆయన కజిన్ నయ్యర్ అహ్మద్, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా నుంచి ఉత్తర కాశీ వచ్చారు.
‘‘నా సోదరుడు తనతో చిక్కుకుపోయిన కార్మికులను అందర్ని సురక్షితంగా చూసుకుంటున్నారు. మీరు సొరంగం లోపలున్న కార్మికుల వీడియోలు చూస్తే, నా సోదరుడు సబా అహ్మద్ ముందు కనిపిస్తారు’’ అని నయ్యర్ అహ్మద్ చెప్పారు.
బిహార్‌లో ఉంటున్న అమ్మ, నాన్న, ఇతర కుటుంబ సభ్యులతో సబాను మాట్లాడించామన్నారు.
‘‘ఒకటి లేదా రెండు రోజులైనా కానీవండి, కానీ మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకురాండి. లోపల మాకేం సమస్య లేదు’’ అని సబా తమకు చెప్పినట్లు నయ్యర్ తెలిపారు.
సహాయక సిబ్బంది, కంపెనీ వారిని కాపాడేందుకు తమ పనులను చేస్తుందని నయ్యర్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఎప్పుడు, ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది?
నవంబర్ 12న ఉత్తర కాశీ సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో పనులు జరుగుతున్నప్పుడు, ఆ సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.
నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగం.
4.5 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిపై యమునోత్రికి దగ్గర్లో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.
బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఇది ఒక వివాదాస్పద ప్రాజెక్టు అని, దీని వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని, ఇప్పటికే అదో పెద్ద సమస్యగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో 2020లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 2024 చివరి నాటికి ఈ సొరంగ నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు.
అయితే, ఇప్పుడు జరిగిన ప్రమాదం మూలంగా దీని నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














