ఉత్తరాఖండ్: సొరంగంలో కార్మికులను రక్షించడం ఎప్పటికి సాధ్యమవుతుంది?

ఫొటో సోర్స్, ANI
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టి పద్నాలుగు రోజులు దాటింది.
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం నవంబర్ 12న కూలడంతో, అందులో ఉన్న 41 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెండు రోజుల కిందటే కార్మికులు బయటికి వస్తారని అనుకున్నారు కానీ, అంతలోనే మరో అడ్డంకి ఏర్పడింది. డ్రిల్ చేస్తుండగా ఆగర్ మెషిన్ ఇరుక్కుపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది.
రక్షణ కోసం అమర్చిన పైపులో కూరుకుపోయిన ఆగర్ బ్లేడ్‌ను తొలగించాల్సి ఉంటుంది.
దీనికోసం మాగ్నా, లేజర్, ప్లాస్మా కట్టర్ మెషీన్‌లనూ తెప్పించారు. ప్రస్తుతం ప్లాస్మా కట్టర్ ఉపయోగించి ఆగర్ మెషీన్ తొలగించే పనులు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో ఇతర ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టారు అధికారులు.

ఫొటో సోర్స్, ANI
ఇప్పుడేం జరుగుతోంది?
ప్రత్యామ్నాయాలలో మొదటిది ఆ మిగిలిన కొద్ది దూరాన్ని పెద్ద యంత్రాలు లేకుండా మనుషులతో తవ్వించాలి.
రెండోది భూమి నుంచి లోపలున్న సొరంగం వరకు మెషీన్లతో నిలువుగా తవ్వి వారిని చేరుకోవాలి.
రెండో ప్లాన్ కోసం నిలువుగా భూమిలోకి డ్రిల్లింగ్ చేసే యంత్రం కూడా తెచ్చారు. ఈ ప్రక్రియలో కార్మికులను చేరుకోవాలంటే భూమి నుంచి 86 మీటర్లు నిలువుగా కిందకి డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని ఎన్డీఎంఏ తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం నుంచి నిలువు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. దీనికోసం మొదటగా రెండు ప్రాంతాలను గుర్తించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్జేవీఎన్ ఈ పనులు చేపట్టింది.
సహాయక సిబ్బంది ఇప్పటికే 20 మీటర్ల మేర లోతు తవ్వారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
మొదటి ప్రణాళికలో 15 రోజుల్లో రెస్క్యూ పూర్తవుతుందని అనుకున్నామని నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) మేనేజింగ్ డైరెక్టర్ మెహమ్మద్ అహ్మద్ తెలిపారు.
అయితే కొన్ని అడ్డంకుల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. మరో రెండు ప్రత్యామ్నాయాలు పరిశీలించామని, అందులో భాగంగా నిలువుగా డ్రిల్లింగ్ మొదలైనట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన అన్నారు.
మొదటి ప్రక్రియపై ''ఈ ఆగర్ మెషీన్ తొలగించడం కష్టంతో కూడుకున్నదే. ఆ ప్రదేశం చాలా ఇరుకైనది. బ్లేడ్స్ కత్తిరించడం అంత సులభం కాదు. కోసే సమయంలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది, ఇది రెస్క్యూ కార్మికులకు ఇబ్బంది కలిగిస్తుంది. దీని కారణంగా మొత్తం ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.
ఆర్వీఎన్ఎల్ అధికారి ఒకరు మాట్లాడుతూ “ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళతాడు. ఈ ఇరుకైన ప్రదేశంలో ఎవరూ ఎక్కువసేపు పని చేయలేరు. యంత్రాన్ని ఉపయోగించడం వల్ల వేడి సమస్య వస్తోంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు ప్లాన్‌లు ఉన్నాయి: సయ్యద్
రెస్క్యూ చర్యలపై ఎన్డీఎంఏ సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ (రిటైర్డ్) మీడియాకు వివరాలు తెలియజేశారు.
సొరంగంలో తాము పైప్ ద్వారా 48 మీటర్ల వరకు చేరుకున్నామని.. కానీ, పైప్ వంగిపోవడంతో, 1.2 మీటర్లను కత్తిరించినట్లు సయ్యద్ అటా తెలిపారు. దీంతో ప్రస్తుతం తాము సొరంగంలో 46.8 మీటర్ల వద్దనే ఉన్నామని చెప్పారు.
"నిన్న ఆగర్ మెషిన్ ఇరుక్కుపోయింది, బ్లేడ్‌లు విరిగిపోయాయి. అందుకే మాన్యువల్ కటింగ్ చేయాల్సి వస్తోంది, దాని కోసం పరికరాలు బయటి నుంచి తెప్పించారు. ఎయిర్‌ఫోర్స్, ఇండిగో చార్టర్ ఫ్లైట్స్ ద్వారా మాగ్నా, లేజర్, ప్లాస్మా కట్టర్ మెషీన్‌లు రెస్క్యూ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇంతకుముందు గంటకు 4-5 మీటర్ల వేగంతో పని జరిగేది, ఇప్పుడలా జరగకపోవచ్చు. అదొక విఫలమైన టెక్నిక్" అన్నారు.
ఇప్పటివరకున్న ఉత్తమ విధానం ప్లాన్ 1 (అడ్డంగా డ్రిల్లింగ్) అని, ఆ డ్రిల్లింగ్ మాన్యువల్‌గా జరుగుతోందన్నారు. రెండో ఉత్తమ ప్రత్యామ్నాయం నిలువు డ్రిల్లింగ్ అని తెలిపారు సయ్యద్.
మూడో ప్లాన్ కూడా ఉందన్నారు సయ్యద్. అదేంటంటే లంబంగా 170 మీటర్లు డ్రిల్ చేయడం, ఇప్పటివరకైతే ఈ పనులు మొదలుపెట్టలేదని తెలిపారు.
ఈ డ్రిల్లింగ్ చేయడానికి ఒక మెషీన్ అవసరమని, అది రాత్రి రెస్క్యూ ప్రాంతానికి చేరుకుంటుందని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సిల్క్యారా టన్నెల్ ప్రాంతానికి చేరుకున్నారు. పనులను పర్యవేక్షించారు.
రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత ప్రభుత్వం సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ మాన్యువల్ కటింగ్ కోసం భారత ఆర్మీ ఇంజనీర్స్‌ను ఘటనా స్థలానికి రప్పించారు.
కాగా, సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక స్థితిపై ప్రభావం చూపకూడదని బీఎస్ఎన్ఎల్ వారికోసం ఫోన్ సౌకర్యం కల్పించిందని ఏఎన్ఐ తెలిపింది. కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేసింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా డ్రిల్లింగ్ తదితర పరికరాలు ఘటనా స్థలానికి త్వరగా తెప్పించడానికి ఫ్లైట్స్ నడుపుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవని 17 నియోజకవర్గాలు
- జ్యులియా సికెట్టిన్: ఈ అమ్మాయి దారుణ హత్య ఇటలీని కుదిపేస్తోంది, ఎందుకు?
- నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?
- 'రూ. 5 కోట్ల లాటరీ తగిలాక అందరూ వచ్చి పలకరిస్తున్నారు'
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














