ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం వల్ల భారత్‌కు ఇరాన్ అవసరం పెరిగిందా?

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఆదివారం ఇరాన్ చేరుకున్నారు.
ఇరాన్ రాజకీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రితో వినయ్ క్వాత్రా సమావేశం అయ్యారు.
18వ భారత్-ఇరాన్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల (ఎఫ్‌ఓసీ) కింద ఈ సమావేశం జరిగింది. ఇది సాధారణ సమావేశమే అయినప్పటికీ పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
అఫ్గానిస్తాన్, గాజాలో నెలకొన్న పరిస్థితులే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష, చాబహార్ పోర్ట్ వంటి కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు భారత విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.
భారత్, ఇరాన్, రష్యా మధ్య కుదిరిన ఒక ఒప్పందానికి చాబహార్ పోర్ట్‌ను చాలా కీలకంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో చాబహార్ ఓడరేవుపై తాజా చర్చల్ని కూడా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు.
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)కు ఈ ఓడరేవు కేంద్ర స్థానం. ఈ రేవు ద్వారా కారిడార్‌ను మధ్య ఆసియా, రష్యా వరకు రైలు మార్గంతో అనుసంధానిస్తారు.
ఇటీవల దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ఒక కొత్త వాణిజ్య మార్గం నిర్మాణానికి సమ్మతి లభించింది. అప్పటి నుంచి ఈ మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ కొత్త వాణిజ్య మార్గానికి ‘‘ఇండియా-యూరప్-మిడిల్ ఈస్ట్ కారిడార్’’ అనే పేరు పెట్టారు. ఇందులో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, గ్రీస్ భాగంగా ఉన్నాయి. ఈ కారిడార్‌పై ఏకాభిప్రాయం కుదరడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది.
కొత్త వాణిజ్య మార్గం నిర్మాణం తర్వాత ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకున్నారు. ఇదంతా జరగడానికి ఇరాన్ నిర్లక్ష్య వైఖరిని కారణంగా చూశారు. కానీ, హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

ఫొటో సోర్స్, MEA
ఇరాన్‌లో ఆందోళన ఎందుకు?
దిల్లీ వేదికగా సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సదస్సులో భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా యూరప్‌కు కొత్త వాణిజ్య మార్గం నిర్మించడానికి అనేక దేశాల నాయకులు చొరవ తీసుకున్నారు.
‘‘ఇండియా-యూరప్-మిడిల్ ఈస్ట్ కారిడార్ (ఐఎంఈసీ)’’ నిర్మించే ఒప్పందం మీద భారత్, సౌదీ అరేబియా, యూఏఈ, అనేక యూరప్ దేశాలు, అమెరికా సంతకం చేశాయి.
ఈ చొరవను చాలా మంది విశ్లేషకులు చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ) ప్రాజెక్ట్‌కు పోటీగా చూస్తున్నారు. ఇరాన్‌ను ఒంటరి చేసే ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు.
ఇరాన్ చాబహార్ పోర్ట్, ఐఎన్‌ఎస్‌టీసీ కంటే కూడా భారత్ ఈ కొత్త వాణిజ్య మార్గం వైపే ఎక్కువ ఆసక్తి చూపుతుందని నమ్ముతున్నారు.
యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, ‘‘ఐఎంఈసీ నిర్మాణమైతే ఆసియా నుంచి యూరప్‌కు రవాణా సమయం ప్రస్తుతాని కంటే 40 శాతం ఆదా అవుతుంది’’ అని అన్నారు.
అదే సమయంలో చాబహార్, ఐఎన్‌ఎస్‌టీసీ, ఐఎంఈసీలలో ఒకేసారి పెట్టుబడులు పెట్టడం భారత్‌కు అంత సులభం కాకపోవడం కూడా ఇరాన్‌లో ఆందోళనలు పెరగడానికి కారణం కావచ్చు.
పైగా, ఇరాన్‌పై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, దానితో వ్యాపారం చేయడం భారత్‌కు ఇప్పటికే చాలా కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఇరాన్ మార్గాన్ని ఎంచుకుంటుందా, లేక కొత్త మార్గం వైపు వెళ్తుందా అనే చర్చ మొదలైంది.
భారత్ పరిస్థితిని ముందే పసిగట్టిన ఇరాన్, చైనాతో ‘‘25 సంవత్సరాల సహాయ కార్యక్రమానికి’’ అంగీకరించిందని అమ్వాజ్ మీడియాలో ప్రచురితమైన ఒక కథనంలో పేర్కొన్నారు.
ఈ కథనం ప్రకారం, ఈ కార్యక్రమం కింద చాబహార్ పోర్ట్‌లోని మిగిలిన భాగాలను అభివృద్ధి చేయడానికి చైనా అంగీకరించింది. బదులుగా ఈ పోర్టును చైనా ఉపయోగించుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిదానంగా చాబహార్, ఐఎన్‌ఎస్‌టీసీ పనులు
ఇరాన్ తీర నగరమైన చాబహార్‌లో ఓడరేవు అభివృద్ధికి 2003లో భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. 2016లో ఈ ఒప్పందానికి ఆమోదం దక్కింది. ప్రస్తుతం భారత్ ఇక్కడ కార్గో టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)కు ఈ ఓడరేవు చాలా ముఖ్యమైనది.
ఈ కారిడార్ కింద భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌ల మధ్య వస్తు రవాణాకు 7,200 కి.మీ పొడవైన రోడ్డు, రైలు, ఓడ మార్గాల నెట్‌వర్క్‌ను నిర్మించాల్సి ఉంది.
ఈ మార్గం ద్వారా యూరప్‌కు వెళ్లడం భారత్‌కు సులభం అవుతుంది. ఇరాన్, రష్యాకు కూడా దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి.
యుక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి యూరప్‌తో రష్యా వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది.
రష్యాతో పాటు ఇరాన్‌కు ఈ మార్గం ఉపయోగపడుతుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి ఉపశమనం పొందడంలో ఇరాన్, రష్యాకు ఇది చాలా సహాయపడుతుంది. ఈ మార్గం గుండా మధ్య ఆసియా ద్వారా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉండదు.
కానీ చాబహార్, ఐఎన్‌ఈటీసీలకు సంబంధించి పెద్దగా పురోగతి లేదు.
అమ్వాజ్ మీడియా కథనం ప్రకారం... ‘‘చాబహార్, ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భారతదేశం చాలాసార్లు కోరింది. అయితే రష్యా-యుక్రెయిన్ యుద్ధం తర్వాతే ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యం వారికి అర్థమైందని ఒక భారతీయ అధికారి చెప్పారు.’’
దానికంటే ముందు భారత్ నిదానంగా వ్యవహరిస్తోందంటూ ఇరాన్ ఆరోపించింది. చాబహార్ రైలు ప్రాజెక్టుకు నిధులు అందడంలో జాప్యాన్ని కారణంగా చూపుతూ 2020లో ఇరాన్, భారత్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి వేరు చేసింది.
ఆ తర్వాత, ఇరు దేశాలు ఈ విషయంలో తమ వైఖరిని మార్చుకున్నాయి. ఇరాన్ ఇటీవల చాబహార్‌కు సంబంధించి ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని భారత్‌కు ప్రతిపాదించింది. చాబహార్‌లో 8 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ ఏడాది భారత్ ప్రకటించింది.
ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని భారత్ కోరుకుంటున్నట్లుగా ఇది సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎంఈసీపై అనిశ్చితి
ప్రతిపాదిత ఐఎంఈసీకి సంబంధించి అనేక అనిశ్చితులు వెలుగులోకి రావడమే ఐఎన్‌ఎస్‌టీసీపై భారత్ ఆసక్తి చూపడానికి ఒక కారణం అని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మధ్యప్రాచ్యంలో మరోసారి అస్థిరతకు దారితీసింది.
‘‘ఐటీయూ గ్రూపు దేశాల్లో (ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమెరికా) కనెక్టివిటీని పెంచడంలో, భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా అడ్డంకులు రావొచ్చు. కానీ, కచ్చితంగా భవిష్యత్‌లో పురోగతి ఉంటుంది’’ అని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గ్రాసెట్టి గత వారం అన్నారు.
ప్రతిపాదిత ఇండియా మిడిల్‌ఈస్ట్ కారిడార్ వాణిజ్య మార్గం సఫలత ఈ ప్రాంతంలోని శాంతిపై ఆధారపడి ఉంటుంది.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు నెలకొనడం కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ దిశలో ప్రగతి ఆగిపోయింది.
ఐఎన్‌ఎస్‌టీసీపై భారత్ తిరిగి ఆసక్తి చూపడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. అదేంటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యాతో భారత్ వాణిజ్యం గణనీయంగా పెరిగింది. రష్యా నుంచి భారత్ దిగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి. చమురు చౌకగా లభించడం కారణంగా వాణిజ్యం బాగా పెరిగింది.
పైగా, జనవరి నుంచి బ్రిక్స్ ప్లస్ గ్రూప్‌లో ఇరాన్ అధికారిక సభ్యదేశంగా ఉండబోతోంది. ఈ కారణంగా ఐఎన్‌ఎస్‌టీసీ, చాబహార్‌లో పెట్టుబడులు పెట్టడం భారత్‌కు సముచితంగా అనిపించవచ్చు.
బ్రిక్స్‌కు సొంత బ్యాంకు ఉంటుంది. దీనివల్ల భారత్, ఇరాన్ మధ్య ఆర్థిక లావాదేవీలు సులభతరం అవుతాయి.
పైగా బ్రిక్స్‌లో స్విఫ్ట్ చెల్లింపు విధానాన్ని అవలంబించే అంశంపై కూడా పరిశీలన జరుగుతోంది.
ఈ విషయంలో భారత విదేశాంగ కార్యదర్శి, ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మధ్య జరిగిన చర్చల వివరాలు బహిర్గతం కాలేదు.
అయితే, ప్రస్తుతం రెండు దేశాలు చాబహార్ ప్రాజెక్ట్‌ను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రాజస్థాన్ రాజకుటుంబాలు బీజేపీకి ఎందుకు దగ్గరవుతున్నాయి?
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం..
- తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














