బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, రియాజ్ సొహైల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు పెద్ద బలూచీ వేర్పాటువాద సంస్థలు విలీనం కోసం చర్చలు జరుపుతున్నాయి.

బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. ఎవరు నాయకత్వం వహించాలన్నదానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం చాలా కాలంగా ఉంది. కలాత్ రాష్ట్రం పాకిస్తాన్‌లో విలీనమైన తర్వాత, ఆ ప్రాంతంలో స్వాతంత్ర్యం కోసం సాగుతున్న నాలుగో సాయుధ ఉద్యమం ఇది.

ఇటీవల గ్వాదర్ ఓడరేవు నిర్మాణంతో బలూచ్ ఉద్యమం మరోసారి రాజుకుంది.

సుయీ ప్రాంతంలో ఒక మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు చెలరేగడంతో ఇది మరింత ఊపందుకుంది.

న్యాయం కావాలంటూ బలూచిస్తాన్‌కు చెందిన ప్రముఖ నేత నవాబ్ అక్బర్ బుగ్తీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

అత్యాచార ఘటన తర్వాత ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వ్యతిరేక భావాలు పెరగడం కనిపించింది. అదే సమయంలో బలూచీ యువకులు అదృశ్యం కావడం కూడా మొదలైంది.

పాకిస్తాన్, చైనా మధ్య ఎకనామిక్ కారిడార్‌పై ఒప్పందంలో భాగంగా పారిశ్రామికీకరణతోపాటు గ్వాదర్ ఓడరేవు నిర్మాణం మొదలైంది. ఈ రేవును చైనా నిర్మిస్తోంది.

బలూచ్ వేర్పాటువాద ఉద్యమానికి గ్వాదర్ ఓడరేవు టార్గెట్‌గా మారింది.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

బలూచ్ సంస్థల విలీనం ఎందుకు?

ప్రస్తుతం, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్, బలూచ్ లిబరేషన్ టైగర్స్, బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ, యునైటెడ్ బలూచ్ ఆర్మీ అనే అతివాద సంస్థలు బలూచిస్తాన్‌లో క్రియాశీలంగా పని చేస్తున్నాయి.

వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్ సంస్థలు ‘బ్రాస్’ అనే పేరుతో ఒక ఉమ్మడి సంస్థగా పని చేస్తున్నాయి.

‘‘పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచ్ రాజకీయ, సైనిక దళాలను బలోపేతం చేయడం, శత్రువులపై సమర్థవంతమైన ఉద్యమాన్ని రూపొందించడం చాలా అవసరం" అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ బషీర్ జైబ్, బీబీసీతో చెప్పారు.

బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అధిపతి డాక్టర్ అల్లా నాజర్ కూడా దీనిపై మాట్లాడారు. విలీనం లేదా ఐక్యత కోసం ప్రయత్నాలు చాలా కాలంగా ఉన్నాయని, అవి చాలా వరకు విజయవంతమయ్యాయని ఆయన వెల్లడించారు.

"అన్ని పార్టీలు, సంస్థలు ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నాయి. స్వేచ్ఛ అనేది మా అందరి ప్రాథమిక లక్ష్యం" అని అన్నారాయన.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు భారీ నష్టంపైనే దృష్టి

ఉమ్మడి దాడుల సంఖ్యను పెంచడం ఈ ఐక్యత, విలీన ప్రయత్నాల ప్రధాన ఉద్దేశమని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ అధిపతి అమీర్ రాణా అంటున్నారు.

“వారి బలం, సంస్థాగత నిర్మాణం కేంద్రీకృతం చేయాల్సి ఉంది’’ అని రాణా అన్నారు.

వాషింగ్టన్‌కు చెందిన విశ్లేషకుడు మాలిక్ సిరాజ్ అక్బర్ దీనిపై స్పందిస్తూ- బలూచ్ వేర్పాటువాద సంస్థల చర్యలను గతంతో పోలిస్తే వ్యూహంలో, స్థాయిలో చాలా తేడా కనిపిస్తోందన్నారు.

“ఈ సంస్థల దృష్టి ఇప్పుడు పాకిస్తాన్‌కు పెద్ద ఎత్తున నష్టం కలిగించే చర్యలపై ఉంది. ఇంతకుముందుతో పోలిస్తే ఈ సంస్థలు తీసుకున్న చర్యల సంఖ్య తగ్గడానికి ఇదే కారణం. వాళ్లు ఒక చర్య చేపట్టడానికి ప్లానింగ్ కోసం చాలా సమయం వెచ్చిస్తున్నారు’’ అని ఆయన వివరించారు.

ఈ సంస్థలు ఒకదానికొకటి సన్నిహితంగా ఉండటమే ఈ వ్యూహానికి, కార్యకలాపాలలో మార్పుకు ప్రధాన కారణమని సిరాజ్ చెప్పారు.

"గతంతో పోల్చితే, ఈ సంస్థలు ఒకదానికొకటి మరింత సహకారంతో పని చేస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి పని చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. పరస్పర సహకారం అనేది ఈ సంస్థల ఉనికికి కూడా చాలా కీలకం’’ అన్నారాయన.

ఇటీవల బలూచ్ నేషనల్ ఆర్మీ చీఫ్ గుల్జార్ ఇమామ్ అరెస్టు వ్యవహారం కూడా ఒకే నాయకత్వం కింద పని చేయాల్సిన అవసరాన్ని వీరందరికీ నొక్కి చెప్పిందని విశ్లేషకులు అంటున్నారు.

"ఆ సంస్థల గురించి గుల్జార్ ఇమామ్ వద్ద సమాచారం ఉంది. అతను ప్రభుత్వానికి ఈ సమాచారం అందించక ముందే నష్టనివారణ చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిరాజ్ వ్యాఖ్యానించారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

నాయకత్వంపై కార్యకర్తల్లో చర్చ

మరి బలూచ్ వేర్పాటువాద సంస్థలన్నీ ఒకే తాటి మీదకు వస్తే ఈ సంస్థకు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఆయా సంస్థలకు చెందిన కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

‘‘మేము సంస్థను నమ్ముతాం. దాని నాయకత్వాన్ని అనుసరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ డాక్టర్ అల్లా నాజర్ అన్నారు.

ఉమ్మడి సంస్థ ‘బ్రాస్’ సహా మరేదైనా సంస్థ వీటికి నాయకత్వం వహించవచ్చని నాజర్ అన్నారు. అందరం చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బలూచ్ జాతి లక్ష్యాన్ని నెరవేర్చే ఈ ఏ సంస్థతో కలిసి పని చేయడానికైనా తాము సిద్ధమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ బషీర్ జైబ్ చెప్పారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

సైద్ధాంతిక విభేదాలు

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్, గత ఏడాది కరాచీ యూనివర్సిటీలో కన్ఫ్యూషియస్ సెంటర్‌లోని అధ్యాపకులకుపై ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఆ దాడిలో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ పాల్గొంది.

అయితే, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఈ ఆత్మాహుతి దాడులను వ్యతిరేకిస్తోంది. మరి విలీనం సమయంలో ఈ వ్యూహం మార్చుకుంటుందా? దీనిపై స్పందించిన బీఎల్‌ఎఫ్ కమాండర్ అల్లా నాజర్, ప్రతి సంస్థలో భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఉంటారని, తమ సంస్థలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని, నియంతృత్వ ఆలోచన, నాయకత్వం ఉండవని చెప్పారు.

మరోవైపు ఫిదాయిన్ ( ఆత్మాహుతి దాడులు చేసేవారు)కు బలూచ్ ప్రాంతం రాజధానిలాంటిదని, ఈ ప్రాంత యువతీ, యువకులలో అనేక మంది మజీద్ బ్రిగేడ్‌లో భాగమవుతున్నారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ బషీర్ జైబ్ అన్నారు.

బలూచిస్తాన్‌కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆత్మాహుతి దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యత పెరిగితే పాకిస్తాన్‌కు ‌సవాలే

బీఏఎల్ఎఫ్, బీఎల్ఏ సహా అనేక సంస్థలు బ్రాస్‌లో చేరితే అది పెద్ద విషయమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక బ్రాండ్ నేమ్‌గా మారిందని అమీర్ రాణా అన్నారు.

బీఎల్ఏ, బీఎల్ఎఫ్ సంస్థలలో విద్యావంతులు అనేక మంది ఉన్నారని, ఈ రెండు సంస్థలు కలిస్తే దాని ప్రభావం భారీగా ఉండొచ్చని ఆయన విశ్లేషించారు.

సభ్యుల సంఖ్య పరంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్‌ దాదాపు పూర్తిగా గిరిజనేతర నాయకత్వం చేతిలో ఉన్నాయని విశ్లేషకుడు మాలిక్ సిరాజ్ అక్బర్ అన్నారు.

కొంత మంది విశ్లేషకులు బలూచ్ అతివాద సంస్థల విలీనాన్ని నిషేధిత సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌ ఏర్పాటుతో పోల్చుతున్నారు.

తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) అధికారికంగా డిసెంబర్, 2007లో ఏర్పడింది.

అంతకుముందు, అనేక తాలిబాన్ గ్రూపులు స్వాత్, దక్షిణ వజీరిస్తాన్, మహ్మండ్, బజౌర్, ఔరాక్జాయ్, దర్రా ఆడమ్ ఖేల్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలలో క్రియాశీలంగా ఉండేవి. ఇవన్నీ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి పని చేయడానికి అంగీకరించాయి.

టీటీపీ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడులతోపాటు, దేశంలో అనేక చోట్ల దాడులు జరిగాయి.

“గత రెండు సంవత్సరాల్లో బలూచ్ ఉద్యమం తీవ్రత పెరిగింది. వీరి ఐక్యత మరింత పెరిగితే, అది పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుంది’’ అని యునైటెడ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో సీనియర్ విశ్లేషకుడు అస్ఫంద్యార్ మీర్ అన్నారు.

ఇటీవలి కాలంలో స్టాక్ ఎక్స్ఛేంజ్, చైనీస్ ఎంబసీ, కరాచీ యూనివర్శిటీ, గ్వాదర్ పీసీ హోటల్, పంచగౌర్, నోష్కీ కంటోన్మెంట్లతోపాటు కరాచీలోని భద్రతా బలగాలపై బలూచ్ మిలిటెంట్లు దాడులు చేశారు.

‘‘గతంలో ఈ సంస్థలు సొంతంగా దాడులు చేసేవి. అవి అంత ప్రభావవంతంగా ఉండేవి కావు. కానీ, బ్రాస్ సంస్థను స్థాపించిన తర్వాత వారి చర్యల్లో సమన్వయం కనిపిస్తోంది’’ అని అమీర్ రాణా అన్నారు.

బలూచ్ వేర్పాటువాద గ్రూపులను ఏకం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పాకిస్తాన్ ప్రభుత్వం నిశితంగా గమనించాల్సి ఉందని రాణా అన్నారు.

బలూచ్ సంస్థల ప్రయత్నాలు ఫలిస్తే పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని యునైటెడ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో సీనియర్ విశ్లేషకుడు అస్ఫంద్యార్ మీర్ కూడా అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, నవాజ్ షరీఫ్ రాకతో పీఎంఎల్-ఎన్‌లో ఉత్సాహం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)