ఐస్ టవర్: 100 అడుగుల ఎత్తయిన మంచు స్తంభాన్ని ఈ గ్రామస్థులు ఎందుకు నిర్మించారు?

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
ఆర్తి కుమార్ రావు పర్యావరణ ఫోటోగ్రాఫర్, రచయిత్రి. ఈమె అన్ని సీజన్లలోనూ దక్షిణాసియా అంతటా పర్యటిస్తుంటారు.
అక్కడి వాతావరణ మార్పులను కొన్నింటిని ఫోటోల రూపంలోనూ, మరికొన్నింటిని తన సొంత మాటల్లోనూ చెబుతారు.
హిమాలయ పర్వతాల కింద కరిగిపోతున్న హిమనీనదాల కారణంగా లద్దాఖ్ వాసుల భవిత అగమ్యగోచరంగా మారి, వారి జీవితాలకు, జీవనభృతికి పెరుగుతున్న ప్రమాదాన్ని తన ఫోటోలతో ఒడిసిపట్టుకుంటున్నారు.
ఈ ఏడాది బీబీసీ 100 మంది మహిళల జాబితాలో క్లైమెట్ పయనీర్స్ విభాగంలో ఈమెకూడా ఒకరు.

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
2010 ఆగస్టు 5వ తేదీ రాత్రి లద్దాఖ్ ప్రజల స్మృతులలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆరోజు రాత్రి లద్దాఖ్ రాజధాని లేహ్ చుట్టూ మేఘాలు బద్దలైనట్టు అనిపించింది.
ఈ చల్లని ఎడారిలో ఏడాదంతా కురవాల్సిన వాన కేవలం రెండుగంటలలో ముంచెత్తింది. పెద్ద ఎత్తున కొట్టుకొచ్చిన బురద అడ్డొచ్చిన ప్రతిదానినీ తనలో కలిపేసుకుంది.
చాలామంది ప్రజలు ఈ బురదలో సమాధి అయిపోయారు. ఈ కాళరాత్రి తరువాత కొన్నివందల మంది ప్రజల ఆచూకీ ఎప్పటికీ తెలియలేదు.

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
ఈ విపత్తులకు కారణమెవరు?
లద్ధాఖ్ ప్రాంతం భారతదేశ ఉత్తర దిశ కొసన ఉండే పీఠభూమి ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 3వేల మీటర్లు అంటే, 9,850 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమాలయ పర్వతాలు ఈ ప్రాంతాన్ని రుతుపవనాల నుంచి కవచంలా కాపాడుతుంటాయి. మిగిలినదేశమంతా వానల కోసం ఈ రుతుపవనాలపైనే ఆధారపడుతుంది.
ఇటీవల దాకా లద్దాఖ్ ఏడాదిలో 300 రోజులపాటు ఎండ ఉండేది. మహా అంటే కేవలం నాలుగు అంగుళాాల వర్షం కురిసే ఈ ప్రాంతానికి వరదలు అంటే ఏమిటో తెలియదు.
2010లో వచ్చిన వరదలు వరుసగా 2012, 2015తో పాటు 2018లోను ముంచెత్తాయి.
కొన్ని దశాబ్దాలుగా చూడని ప్రకృతి విపత్తును గడిచిన పదేళ్లలోనూ లద్దాఖ్ ప్రజలు చూశారు. ఇలాంటి విపత్తులకు కారణం వాతావరణ మార్పులేని నిపుణుల మాట.

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
15 ఏళ్ళ కిందట వరకు లద్ధాఖ్‌కు స్థిరమైన నీటి సరఫరా ఉండేది. శీతాకాలపు మంచు కరిగి కాలువగా జాలువారి గ్రామీణుల నీటి అవసరాలు తీర్చేవి. కేవలం హిమనీనదాల వద్ద కరిగిన నీరు కిందకు జారి వీరికి వసంతకాలంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేవి.
అయితే, వాతావరణ మార్పుల ఫలితంగా లద్ధాఖ్‌లో ఉష్ణోగ్రతలు గడిచిన నలభైఏళ్ళలో ఒక సెంటిగ్రేడ్ పెరిగాయి.
హిమపాతంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హిమనీనదాలు తరిగిపోతున్నాయి. కొన్ని పూర్తిగా అదృశ్యమైపోతున్నాయి.
నేను 2018లో మొదటిసారి లద్దాఖ్ కు వెళ్ళా. మరోసారి 2019లో వచ్చాను. మళ్ళీ ఈ ఏడాది వసంతకాలంలో మరోసారి. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇటు రాలేదు కానీ, తేడా మాత్రం స్పష్టంగా కనిపించింది.
ఇప్పుడు మంచు వేగంగా కరిగిపోతోంది. వసంతకాలంలో వారికి మంచినీరు లేకుండాపోతోంది. హిమనీనదాలు మంచుపర్వతాలలో చాలా ఎత్తులో ఉన్నాయి. అవి ఈ ఏడాది చివరలో కరుగుతాయి. ఒకప్పుడు వసంతకాలంలో లద్దాఖ్ సారవంతంగా కనిపించేది. ఇప్పుడు మాత్రం ఎండిపోయి నిశ్శబ్దంగా మారింది.
నీటి కొరతతో పచ్చికబయళ్ళు తగ్గిపోవడంతో పష్మినా మేకల గుంపులు కనిపించడంలేదు. దీంతో, సంప్రదాయంగా వస్తున్న తమ జీవనోపాధిని చాంగ్‌పా పశువుల కాపరులు వదులుకోవాల్సి వస్తోంది. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసపోవడమో, లేదంటే లేహ్‌లో మరో పనో వెదుక్కోవడం చేస్తున్నారు.
నీటి కొరత కారణంగా రైతులు బార్లీ, నేరేడుపండ్ల చెట్లను అలాగే వదిలేశారు. వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసాన్ని చవిచూస్తున్న ఈ ప్రాంతానికి ఓ ఆశ ఉంది.

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
మంచును శంఖంలో పోశారు
లద్దాఖ్‌లో నా రెండో పర్యటన మార్చి 2019లో జరిగింది. నేను ఇంజనీర్ వాంగ్‌చుక్‌ను కలిశాను. 2013లో లోయలగుండా వెళుతున్నప్పుడు బ్రిడ్జిల కింద ఎండ సోకకపోవడంతో కరిగిపోని పెద్ద మంచుదిబ్బలను చూడటంతో తనకో ఆలోచన వచ్చినట్టు ఆయన చెప్పారు. హైస్కూల్ లెక్కల్లోని కోన్ (శంఖం) మా ఆలోచనకు సమాధానం చెప్పిందంటూ ఆయన నవ్వారు.
శీతాకాలంలో గడ్డకట్టిన నీటిని వసంతకాలానికి వినియోగించుకునేలా వాంగ్‌చుక్ గ్రామీణులకు సహాయపడాలనుకున్నారు. కోన్ ఆకారంలో నీటిని గడ్డకట్టించడంవలన సూర్యరశ్మి సోకే ఉపరితల వైశాల్యం చదరపు మీటరుకు మంచు పరిమాణాన్ని పెంచుతుందని, అది కరిగే సమయం కూడా పెరుగుతుందని భావించారు.
ఇంజనీర్ స్థానికులను ఓ బృందంగా చేసి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. కోన్ ఆకారంలో ఐస్‌ను రూపొందించడానికి ఉన్న చక్కని మార్గాల కోసం చూశారు. అంతిమంగా వారు ఒక చక్కని ఫార్మూలాను కనుగొన్నారు.
పర్వతాలలోని ప్రవాహాన్ని పైపుల్లోంచి లోయలోకి పంపడం, అక్కడున్నవారు ఆ నీటిని నిటారుగా ఉన్న పైపులోకి వెళ్ళేలా చేసేవారు. ఆ పైపు చివరన ఓ నాజిల్‌ను ఏర్పాటు చేశారు. దీంతో నీరు పైకి చేరుకుని అక్కడి నాజిల్ ద్వారా వెదజల్లేది.
హిమస్తూపాలు ఇప్పుడో ఆకర్షణ

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
రాత్రివేళల్లో మైనస్ 30 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నాజిల్ నుంచి బయటకు వెదజల్లే నీరు గడ్డకట్టేది. క్రమంగా ఇలా స్ప్రే నుంచి వచ్చి నీరు ఐస్‌గా ఓ పెద్ద కుప్పగా మారి శంఖం ఆకారంలోకి రావడం మొదలైంది.
వీటికి ఐస్‌స్థూపాలని పేరు పెట్టారు. లద్దాఖ్ లో బౌద్ధుల ధ్యానమందిరాల తరువాత ఈ ఐస్‌స్థూపాలు ఆకర్షణగా మారాయి. ఈ నిర్మాణాలలో కొన్ని వంద అడుగుల కోన్లు వాతావరణ మార్పుల కారణంగా తమ సహజ నీటివనరులను కోల్పోయిన కమ్యూనిటీలకు నీటిని సరఫరా చేస్తున్నాయి.
ఇవి ఆశ్చర్యకరంగా వినోదానికి కూడా కేంద్రంగా మారాయి. దీనికి కారణం ఏటా ఇక్కడ ఎత్తయిన మంచు స్థూపాల పోటీలు కూడా జరగడమే.

ఫొటో సోర్స్, ARATI KUMAR-RAO
కర్బన ఉద్గారాలకు కాలదోషం పట్టిద్దాం
అయితే, కొన్ని చోట్ల వెలువడే కర్బన ఉద్గారాలకు లద్దాఖ్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
‘‘ఇది సరిపోదు. సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలి, దానిని కొనసాగిస్తుండాలి. సమస్యలను పరిష్కరిస్తుండాలి’’ అని వాంగ్‌చుక్ చెప్పారు.
‘‘మేం దీనిని మా నీటి అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు పర్యావరణం విషయంలో మానవాళిలో రావాల్సిన చైతన్యానికి వీటిని ప్రతీకగా చూడాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.
దక్షిణ ఆసియా అంతటా విస్తారంగా తిరిగిన నాకు ఈ పోరాటంలో లద్దాక్ ఒంటరి కాదని నాకు తెలుసు.
చరిత్రలో తొలిసారిగా ఇండియా దాని పొరుగుదేశాలైనా చైనా, పాకిస్తాన్ వాతావరణ మార్పు అనే ఓ ఉమ్మడి శత్రువును ఎదుర్కొంటున్నాయి. దీనికి నదీ మాతృకలను ధ్వంసంచేసి, అధిక జనాభా ఉన్న ఈ ప్రాంతాలను భయపెట్టగల శక్తి ఉంది.
ఈ ముప్పును ఎదుర్కొని బతికి బట్టకట్టడానికి మనమందరం ఏకం కావడానికి బహుశా ఇదే సరైన సమయం కావచ్చు.
ఇవికూడా చదవండి:
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- చైనా: ‘మసీదులను మూసేస్తున్నారు, ముస్లిం ప్రార్థనా స్థలాల స్వరూపాన్నే మార్చేస్తున్నారు’ – హ్యూమన్ రైట్స్ వాచ్
- అమెరికాలో సిక్కు వేర్పాటువాది గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న వైట్ హౌస్... భారత్ స్పందన ఏంటి?
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- ఎవరీ సామ్ ఆల్ట్మాన్... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో ఆయన పాత్ర ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














